మౌలిక వసతులపై పెట్టుబడులతోప్రతి కుటుంబానికి ప్రయోజనం
‘‘మౌలిక వసతులను నిర్మించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ము ఉద్యోగాలను సృష్టిస్తుంది, వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడుల వల్ల కార్మికులకు లబ్ధి చేకూరుతోంది. అలాగే దుకాణదారులకు, దుకాణాలు-కర్మాగారాల్లో పనిచేసేవారికి కూడా ప్రయోజనం కలుగుతోంది. ఇసుక-కంకర-సిమెంట్ రవాణా చేసే ట్రక్కులను, టెంపోలను నడిపే డ్రైవర్లకు సైతం లబ్ధి చేకూరుతోంది.’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక వసతులపై పెట్టిన పెట్టుబడి నుంచి ప్రతి కుటుంబం ముఖ్యంగా యువత ఎక్కువ ప్రయోజనం పొందుతుందన్నారు. ఈ మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధమైతే ఎన్నో లాభాలు కలుగుతాయన్నారు. రైతులు పండించిన పంటలు తక్కువ ఖర్చుతో మార్కెట్‌కు చేరతాయని, వృథా తగ్గుతుందని, కొత్త రైళ్లు వస్తాయని, కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని, పర్యాటకానికి ప్రోత్సాహం దక్కుతుందని తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో అభివృద్ధి చేసిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను మే 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రాంతీయ వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తూ, ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరుస్తూ దేశవ్యాప్తంగా 1,300కు పైగా స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా 103 అమృత్ స్టేషన్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.1100 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. ‘‘అభివృద్ది చెందిన భారత్‌ను తయారు చేయడానికి దేశంలో ఆధునిక మౌలిక వసతుల కల్పన అనే మహాయజ్ఞం జరుగుతోంది. మన రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు, రైల్వే స్టేషన్లను ఆధునికంగా మార్చడానికి గత 11 ఏళ్లలో మునుపెన్నడూ లేని వేగంతో పనులు జరిగాయి. మౌలిక వసతుల నిర్మాణానికి గతంలో కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. ప్రపంచం మొత్తం భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆశ్చర్యపోతుంది. ఉత్తరానికి వెళితే చీనాబ్ వంతెన లాంటి నిర్మాణాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. తూర్పునకు వెళితే అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగం, అస్సాంలో బోగీబీల్ వంతెన మీకు స్వాగతం పలుకుతాయి. పశ్చిమ భారతానికి వస్తే.. ముంబయిలో సముద్రం మీద నిర్మించిన అటల్ బ్రిడ్జిని, దక్షిణాన.. పంబన్ బ్రిడ్జిని చూడొచ్చు.
ప్రస్తుతం భారత్ తన రైల్వే వ్యవస్థలను ఆధునికీకరిస్తోంది. వందేభారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లు, నమో భారత్ రైళ్లు అన్నీ.. దేశం అందిపుచ్చుకున్న సరికొత్త వేగాన్ని, సాధిస్తున్న ప్రగతిని ప్రతిబింబిస్తాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు దేశంలో 70 మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి మారుమూల ప్రాంతాలకు సైతం అత్యాధునిక రైలు ప్రయాణాన్ని తీసుకొచ్చాయి. గడచిన 11 ఏళ్లలో వందల సంఖ్యలో రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించాం. 34వేల కిలోమీటర్లకు పైగా కొత్త రైల్వే ట్రాకులు వేశాం. బ్రాడ్ గేజ్ లైన్ల వద్ద మానవ రహిత క్రాసింగ్‌లు ఇప్పుడు చరిత్రలో కలిసిపోయాయి. వాటిని పూర్తిగా తొలగించాం. సరకు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైల్వే ట్రాకు పనులను సైతం మేం వేగంగా పూర్తిచేస్తున్నాం. దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. వీటన్నింటితో పాటుగా, దేశవ్యాప్తంగా 1300 రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. ఈ ఆధునిక రైల్వే స్టేషన్లకు దేశం అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అని పేరు పెట్టింది. వీటిలో 100కి పైగా అమృత్ భారత్ స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఈ స్టేషన్లు గతంలో ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా మారాయి అని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు తెలుసుకుంటున్నారు. అభివృద్ధి, వారసత్వం – ఈ మంత్రం అన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి స్థానిక కళలకు, సంస్కృతికి సరికొత్త చిహ్నాలు. ప్రతి అమృత్ స్టేషన్‌లో వేల ఏళ్ల నాటి భారతీయ వారసత్వాన్ని చూస్తారు. ఈ స్టేషన్లు ప్రతి రాష్ట్రంలోనూ పర్యాటకాన్ని ప్రోత్సహించి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ’’ అని అన్నారు.
తెలంగాణలో విప్లవాత్మకంగా రైల్వే అభివృద్ధి

అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా బేగంపేట్ రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ‘‘అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునర్మించుకున్న బేగంపేట రైల్వేస్టేషన్‌లో మహిళా ఉద్యోగులే సేవలందించనుండటం గర్వకారణం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనివిధంగా భారత్‌లో ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం జరుగుతోంది. తెలంగాణలో కూడా ఒకే సమయంలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోంది. 2026 నాటికి ఈ స్టేషన్లను స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతాం. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ. 720 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది ఈ రెండు స్టేషన్లను పునఃప్రారంభించనున్నాం. తెలంగాణలో మొత్తం రూ.5,337 కోట్లతో రైల్వే అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటివరకు రూ.42,219 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. వచ్చే దసరా సందర్భంగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు స్టేషన్‌ను అంకితంగా అందించనున్నాం. ఎంఎంటీఎస్ ఫేజ్–2 కోసం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6–7 ఏళ్ల ఆలస్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోయినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో ఎంఎంటీఎస్ ఫేజ్–2 నిర్మాణ పనులు ప్రారంభించాం. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ మంజూరైంది, రూ.400 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తాం. రైల్వే ప్రమాదాల నివారణ కోసం తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు కింద కేంద్రం 617 కిలోమీటర్ల మేర ‘కవచ్’ టెక్నాలజీని తీసుకొచ్చింది. 121 అన్‌మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్‌లను తొలగించాం. కొత్తగా 203 రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు, 43 ఆర్వోబీలు, 45 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించాం. అభివృద్ధి పనులను తక్కువ చేస్తూ ట్విట్టర్‌లో విమర్శలు చేసే మాజీ మంత్రి నిజాలను గ్రహించాలి. 174 స్టేషన్లలో హైస్పీడ్ వైఫై, 88 స్టాల్స్ ఏర్పాటు చేశాం. కాజీపేటలో రూ.580 కోట్లతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. ఈ యూనిట్‌పై గత ముఖ్యమంత్రి కుమారుడు విమర్శలు చేసినప్పటికీ, భూమిపూజ కార్యక్రమానికి హాజరుకాలేదు. అభివృద్ధికి మద్దతు చెప్పకుండా విమర్శలకే పరిమితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రానున్న నాలుగేళ్లలో తెలంగాణలో విప్లవాత్మక రీతిలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు ఎదురవుతున్నాయి, దీని వల్ల పనుల ప్రగతి మందగిస్తోంది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు అప్రోచ్ రోడ్డు అభివృద్ధికి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విస్తరణకు సంబంధించి భూసేకరణ పెండింగ్‌లో ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలి. భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి చేస్తోంది.’’ అని అన్నారు.
ఎయిర్ పోర్టును తలపిస్తోన్న కరీంనగర్ స్టేషన్

‘‘గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు రాసి చేతులు దులుపుకొన్నరు. ఇప్పుడు ఇంత అభివృద్ది జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నరు. మాటలు కాదు… బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందాయో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమన్నారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు. కరీంనగర్ నుండి హసన్‌పర్తి వరకు 61 కి.మీల నూతన రైల్వే లైన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేశామన్నారు. ఈ నూతన లైన్ నిర్మాణానికి రూ.1480 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారని, దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ ‘‘ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడతుంది. ఈ మూడు రంగాల అభివృద్ధి తరువాతే అమెరికా అగ్రరాజ్యమైంది. ఇది గమనించే రోడ్లు, రైల్వే, ఏవియేషన్ రంగాలపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు… మోదీ పట్టుదల, అకుంఠిత దీక్షవల్లే ఇవాళ రైల్వే స్టేషన్ల రూపురేఖలన్నీ మారిపోతున్నయ్.. మోదీ పాలనలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. గత 11 ఏళ్లలో తెలంగాణలో 20కి పైగా ప్రాజెక్టులు.. 2,298 కిలోమీటర్ల మేర పనులు చేపట్టినం. ఒక్క తెలంగాణలోనే రూ.42,119 కోట్ల విలువైన రైల్వే పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్లులకు రూ.5,337 కోట్ల రూపాయలు కేటాయించినం.
రూ.27 కోట్లకుపైగా వెచ్చించి ఆధునీకరణ పనులు పూర్తి చేసినంక కరీంనగర్ స్టేషన్ రూపురేఖలే మారిపోయిన్. ఎయిర్ పోర్టును తలపిస్తోంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, టాయిలెట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, సోలార్ పవర్ ప్లాంట్, రోడ్డు అభివృద్ధి, ప్లాట్‌ఫారం షెల్టర్‌ల ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. రాత్రిపూట ఇంకా అందంగా కన్పిస్తోంది. వాస్తవానికి కరీంనగర్ తోపాటు జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చాలని గతంలో రైల్వే మంత్రిని కోరాం. తొలుత కరీంనగర్‌కు ఒప్పుకున్నారు. వచ్చేసారి జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ పథకంలో చేర్చుతామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే నెలాఖరులోగా ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో ఒక లైన్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. హసన్ పర్తి కరీంనగర్ రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి సర్వే నిర్వహించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించాం. 61 కి.మీల మేరకు ఈ రైల్వే లైన్‌ను నిర్మించడానికి రూ.1480 కోట్లు వ్యయమవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోబోతోంది.’’ అని అన్నారు.
అమృత్ భారత్ సరికొత్త అధ్యాయానికి నాంది

భారతీయ రైల్వే ప్రయాణ ప్రమాణాలలో అమృత్ భారత్ స్టేషన్ పథకం సరికొత్త అధ్యాయానికి నాంది అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో 25.41 కోట్లతో ఆధునికరించిన వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభించడం, కాకతీయుల కళలు ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యత స్వీకరించినప్పటి నుంచి ఇతర దేశాలతో పోటీపడే విధంగా పెద్ద ఎత్తున అమృత్ భారత్ పథకం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే శాఖలో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు కూడా తీసుకురావడానికి భారత్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతదేశంలోని 1300 రైల్వే స్టేషన్‌లను లక్ష కోట్లతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఉండగా ప్రస్తుతం మూడు రైల్వేస్టేషన్‌లు ప్రారంభించుకున్నాం. మిగతా రైల్వే స్టేషన్లను త్వరలో పనులు పూర్తి చేసే ప్రారంభిస్తామన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా పాతిక కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, వరంగల్‌లో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.

