కేసీఆర్ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ఇక అంతే సంగతులా?

కోట్లు ఖర్చు పెట్టినా రజతోత్సవ సభ విజయవంతం కాకపోవడంతో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత రాసిందంటూ వెలుగుచూసిన లేఖపై మీడియాలో జరిగిన హాట్ హాట్ చర్చలు, కామెంట్లు దీనికి మరింత ఆజ్యం పోసాయి. కేసీఆర్‌కు కవిత రాసినట్లుగా చెప్తున్న లేఖతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని అనుకుంటుండగా అమెరికా నుంచి విమానం దిగిన కవిత ఎయిర్ పోర్టులోనే ఆ లేఖను నేనే రాసాను, ఎలా లీకైందో నాకు తెలీదు, నేను ఎన్నో సార్లు మా నాన్నకు చెప్పాను, ఆయనలో మార్పు రాలేదు, గతంలో లేఖలు కూడా రాసాను, ఇప్పుడు అదే తీరుగా రాసాను, అని చెప్పడంతో కల్వకుంట్ల ఇంట్లో జరుగుతున్న తీవ్ర రాజకీయ పోరు స్పష్టంగా బయటపడింది.

తన ఎత్తులు జిత్తులతో, మాటల గారడీతో, తెలంగాణ భాష, యాసల మిళిత ఉపన్యాసాలతో మలిదశ ఉద్యమంలో కొంత పాత్ర వహించిన కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రమాద మరణానంతరం సత్యాగ్రహంతో మరోసారి ఉద్యమాన్ని కొంత పైకి లేపారు. మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా, సమర్థవంతంగా పని చేస్తున్న బిజెపి, ముఖ్యంగా తెలంగాణ చిన్నమ్మగా పేరు గాంచిన సుష్మా స్వరాజ్ నాయకత్వంలో పార్లమెంటులో బిజెపి చేసిన ఒత్తిడులతో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణ బిల్లు పెట్టడం, తదనంతరం అనేక డ్రామాలతో తెలంగాణను తానే తెచ్చానని కేసీఆర్ ప్రజలను నమ్మించడం, ఉచిత హామీలు గుప్పించడం తదితర కారణాలరీత్యా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.

మాటల గారడీ, ఎత్తులుజిత్తులే కానీ కేసీఆర్ దగ్గర పరిపాలన స్వభావం ఏమాత్రం లేదు. గతంలో ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో, 2004లో యూపీఏ ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనకు కేసీఆర్ ఏమాత్రం సమర్థుడు కాదని రుజువైంది. రాష్ట్రాన్ని దోచుకునేందుకు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రతిపక్షం లేకుండా చేసే కుట్ర చేసేందుకు కేసీఆర్ తొలి నాలుగున్నర సంవత్సరాల సమయం సరిపోయింది. మొదటి నుంచీ ముఠా తగాదాలకు నిలయమైన కాంగ్రెస్ కేసీఆర్ ఎత్తుల వల్ల 2018 చివరి వరకు బలహీనపడింది. అవసరాల కోసమే అన్నట్టు ఎన్నికల సమయంలో టీడీపీతో కాంగ్రెస్ జత కట్టడంతో కేసీఆర్ కూడా ఊహించని స్థాయిలో టీఆర్ఎస్‌కు 88 స్థానాలు వచ్చాయి. దీంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

టీఆర్ఎస్‌లో కేటీఆర్‌కు ఎదురులేకుండా చేసేందుకు 2018 అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ మొదటి ఆరు నెలలు హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆర్టీసీలో ఉన్న టీఆర్ఎస్ యూనియన్ హరీష్ చేతిలో ఉండడంతో ఆర్టీసీనీ దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. కేసీఆర్‌ను ఎప్పటికైనా హరీష్ రావు అణగదొక్కుతాడని ఈ పరిణామాలను చూసిన రాజకీయ పండితులకు అర్థమైంది. తర్వాత కాలంలో బిజెపి బలంగా ఎదుగుతుండడంతో, బిజెపిని అడ్డుకునేందుకు హరీష్ రావు మీద చర్యలు ఆపి, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్‌ను లేపే ప్రయత్నించి, రేవంత్ రెడ్డిపై కేసును నానబెట్టారు. విపరీత వ్యతిరేకతతో ఎదుర్కొన్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. బిజెపిని దెబ్బతీసే కుట్రలో కేసీఆర్ తన అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారు.

హరీష్ రావును దెబ్బతీయడానికే కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మైనంపల్లి హన్మంతరావుతో ఆయన దోపిడీని బయటపెట్టించారు. ఫలితాలు వచ్చిన మరునాడే కేసీఆర్ తొంటి విరిగి ఆసుపత్రిపాలు కావడంలో కేటీఆర్, హరీష్ రావు తగవు కారణమని తెలంగాణ అంతటా ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఫలితాలతో కేసీఆర్ బలహీనపడడం.. కేటీఆర్, హరీష్ రావు తగవు పెరగడం.. బిజెపి బలంగా పుంజుకోవడంతో బీఆర్ఎస్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌కు గాడిదగుడ్డే మిగిలింది.

బిజెపి బీఆర్ఎస్ ఒక్కటే అన్న అబద్ధపు భయంకర విష ప్రచారంతో, బూటకపు హామీలతో, రేవంత్ గారడీ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంవత్సరం కాకముందే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఆరంభించింది. కేసీఆర్ మీద ఉన్న తీవ్ర ఆగ్రహం ప్రజల్లో ఇంకా పోలేదు, కాంగ్రెస్‌పై వ్యతిరేకత బలపడుతూ ఉండడంతో తెలంగాణ ప్రజలు బిజెపివైపు చూడడం మరింత పెరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 స్థానాలు సాధించిన బిజెపి విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గణనీయమైన విజయాలు సాధించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూరుకుపోవడం, ఒక్క సీటుకు పోటీ చేసిన కాంగ్రెస్ అందులోనూ ఓడిపోవడం, బిజెపికి మూడు ఎమ్మెల్సీ స్థానాలు రావడంతో తెలంగాణ ప్రజల నాడి బిజెపి వైపు ఉందని స్పష్టమైంది.

హరీష్ రావును ప్రణాళికబద్ధంగా పక్కకు పెడుతున్నారన్నదానికి రజతోత్సవ సభలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అద్దం పడుతుంది. హరీష్ – కేటీఆర్ తగవు తారాస్థాయికి చేరుకుంది. నేనేమీ తక్కువ కాదన్నట్టు కవిత వ్యవహారశైలి ఉంది. జైలుకు పోయొచ్చినవారు ముఖ్యమంత్రులు అవుతారన్న వాదాన్ని తన మద్దతుదారుల నినాదాలతో వినిపిస్తూ, కేసీఆర్‌కు రాసిన ప్రత్యేక లేఖను లీక్ చేయించి, తాను కూడా సొంత పార్టీకి సిద్ధమన్న సంకేతాలు పంపించింది. ఏడాదిన్నరగా అసెంబ్లీకి కూడా రాకుండా ఫాంహౌజ్ లోనే ఉంటున్న కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమే కాదు, పార్టీపై పట్టు కూడా కోల్పోయాడని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయన్న కవిత కామెంటుతో ప్రజలు బీఆర్ఎస్‌ను దెయ్యాల పార్టీగానే చూస్తున్నారు. కాంగ్రెస్ బలహీనపడుతుందని కాంగ్రెస్ క్యాడర్ చెప్తోందని, తెలంగాణ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారని కవిత లేఖలో పేర్కొన్న విషయం చూస్తే.. ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని స్పష్టమవుతుంది. అది ముక్కలవుతుందా, మునిగిపోతుందా అనేది త్వరలో తేలనుంది.