Defence

దేశ ప్రజల భద్రతకు తిరుగులేని భరోసా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ‘సంకల్ప్ సే సిద్ధి’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మోదీ ప్రభుత్వ విజయాలను తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా పత్రికా సమావేశాలు, ఎగ్జిబిషన్లు, సెమినార్లు, బహిరంగ సభలు, గ్రామస్థాయి రచ్చబండ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి సమాచారం అందించడానికి, వివిధ పోటీలు నిర్వహించడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. గత 11 ఏళ్లలో పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్గత భద్రత, ఆర్థిక పురోగతి, సాంస్కృతిక అభ్యున్నతి, విదేశాల్లో భారత్ పట్ల పెరుగుతున్న గౌరవం వంటి రంగాల్లో చారిత్రాత్మక విజయాలు సాధించాం. ఈ విజయాలు భారత్ సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ చారిత్రాత్మక విజయాలను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు, ప్రముఖులు ప్రశంసించారు. రక్షణ రంగం కూడా ఇలాంటి చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది.

 ‘ఆయుధాలతో రక్షణ పొందే దేశంలోనే మత గ్రంథాలపై చర్చ మొదలవుతుంది’ అని చాణక్య నీతి చెబుతోంది. అంటే దేశం అన్ని విధాలా సురక్షితంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక విషయాలు గాని, మరే ఇతర గంభీరమైన అంశాలపై చర్చలు సాధ్యమవుతాయి. ఒక సిద్ధాంతం ఎంత ఉన్నతమైనదైనా, దానిని అనుసరించే వారి బలంపై దాని విజయం ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా, పండితులు బలాన్ని శాంతికి పునాదిగా భావించారు. భారతీయ జనసంఘ్ 1964 పాట్నా సదస్సులో అణుబాంబు తయారీకి భారత్ అన్ని ప్రయత్నాలు చేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘సిద్ధాంత్ ఔర్ నీతియాన్’ పేరుతో రూపొందించిన ఈ పత్రంలో అణ్వాయుధాల అభివృద్ధి గురించి చర్చించారు. ధర్మ స్థాపన కోసం మన ఆరాధ్య దేవతల వద్ద ఆయుధాలు ఉన్నాయని, అందువల్ల భరతమాత కూడా అణ్వాయుధాలను కలిగి ఉండాలని తీర్మానాన్ని ప్రవేశపెడుతూ పేర్కొన్నారు. ఈ విధానాన్ని అనుసరించి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 1999లో పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించింది, ఇది అంతర్జాతీయంగా భారత్ గౌరవాన్ని పెంచింది.

2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, దేశం తన ప్రయోజనాలను పరిరక్షించడానికి వీలు కల్పించే విధానాన్ని అవలంబించింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానమే ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులకు “జీ” వంటి గౌరవప్రదమైన పదాలను ఉపయోగించింది, బిర్యానీ ఇవ్వడం వంటి కార్యకలాపాలలో నిమగ్నమైంది. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి సైన్యానికి, భద్రతా దళాలకు స్వేచ్ఛను, అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చింది. 2013-14లో రక్షణ రంగ బడ్జెట్ రూ.2.53 లక్షల కోట్లు. 2025-26లో ఇది రూ.6.81 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మూడు రెట్లు అన్నమాట. 2015 కాగ్ నివేదిక ప్రకారం భారత సైన్యం వద్ద అప్పట్లో 20 రోజులకు సరిపడా మందుగుండు సామగ్రి మాత్రమే అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో చెప్పాలంటే సైనికులు ఇప్పుడు దేశీయంగా ఉత్పత్తి చేసిన అధిక-నాణ్యత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అధునాతన హెల్మెట్లు, కొత్త బ్యాటిల్ డ్రెస్ యూనిఫామ్స్ (NBDU), నైట్ విజన్ పరికరాలు (NVDలు), థర్మల్ ఇమేజర్లను కలిగి ఉన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) నియామకం కోసం చిరకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరింది. ఆపరేషన్ సిందూర్‌లో త్రివిధ దళాలను సమన్వయం చేయడంలో ఈ నిర్ణయం ఎంత కీలకమైనదో వెల్లడయింది.

ఆయుధ సేకరణకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నిర్ణయాలను మోదీ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించడం చూశాం. ఈ ప్రక్రియ ఫలితంగానే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు జరిగింది. S-400 వ్యవస్థలు, సుఖోయ్-30 విమానాలు, ఇజ్రాయెల్ కు చెందిన డ్రోన్లు, హామర్ క్షిపణులు, చినూక్ హెలికాప్టర్లు, లైట్ కాంబాట్ హెలికాప్టర్లు (LCH) ప్రచండ్, తేజస్ యుద్ధ విమానాలు (పూర్తిగా స్వదేశీ విమానాలు), పినాకా రాకెట్ వ్యవస్థలు (మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు), వరుణాస్త్ర (యాంటీ సబ్ మెరైన్ మిస్సైల్ ) అందుబాటులో ఉండటం వల్ల భారత్ సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యాల్లో ఒకటిగా నిలిచింది. ఆపరేషన్ సిందూర్‌లో నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేసి శత్రు డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేయగలిగాం. అత్యంత విజయవంతమైన ఈ 11 ఏళ్ల కాలంలో విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడమే కాకుండా రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. ఇప్పుడు భారత్ లో అధునాతన స్వదేశీ ఆయుధాలను కూడా తయారు చేస్తున్నాం. స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లక్నోలో డీఆర్డీవో తయారు చేస్తున్న రుస్తుం యూఏవీ డ్రోన్లు, రష్యాతో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, రాఫెల్ విమానాల ప్రధాన భాగాన్ని హైదరాబాద్‌లో తయారు చేయడానికి టాటా-డసాల్ట్ తో భాగస్వామ్యం వంటివన్నీ ఇందులో భాగమే. గత పదేళ్లలో రక్షణ ఉత్పత్తి 174 శాతం పెరిగింది. 2014-15లో రూ.46,529 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తి 2023-24 నాటికి రూ.1,27,265 కోట్లకు పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల రక్షణ తయారీలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం నిబద్ధతను నొక్కి చెబుతుంది.

ఈ స్వదేశీ వ్యవస్థల విజయవంతమైన అభివృద్ధి, మోహరింపు భారతదేశ రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచింది. రక్షణ సాంకేతికతలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ పరివర్తన ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయం సమృద్ధ భారతదేశం) దార్శనికతను, స్వదేశీ ఆవిష్కరణలు, ఉత్పత్తి ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. రక్షణ ఉత్పత్తిలో సాధించిన విజయాలు జాతీయ భద్రతను పెంపొందించడమే కాకుండా ఉద్యోగాలను సృష్టించడం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి.

మిత్ర దేశాలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యవస్థలను ఎగుమతి చేస్తూ ప్రపంచ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ రక్షణ రంగం సిద్ధమైంది. వ్యూహాత్మక సహకారంతో పాటు పరిశోధన, అభివృద్ధిలో నిరంతర పెట్టుబడులు రక్షణరంగ ఆవిష్కరణలు, స్వావలంబనలో భారత్ ముందంజలో ఉండేలా చేస్తున్నాయి. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా సాగే ఈ ప్రయాణం తన సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో భారత్ స్థితిస్థాపకత, చాతుర్యం, అచంచల నిబద్ధతకు నిదర్శనం. భారతదేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది దిశగా పురోగమిస్తున్న తరుణంలో, రక్షణ రంగం భారత్ శక్తి సామర్థ్యాలకు, పాటవానికి ప్రతీకగా నిలుస్తోంది, ఇది దేశానికి సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తుకు దోహదం చేస్తుంది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2021 నవంబర్ 17న ఝాన్సీలో జరిగిన రాష్ట్ర రక్షా సమర్పణ్ పర్వ్ లో ప్రసంగిస్తూ, “ఇతర దేశాలపై ఆధారపడటం ద్వారా భారతదేశం తన వ్యూహాత్మక, భద్రతా అవసరాలను తీర్చుకోలేదు… ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన విధానం వల్ల మనం ఇప్పుడు దిగుమతులే కాకుండా ఎగుమతులు చేసే దేశంగా మారాం. 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో రూ.4,312 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశాం. 2014 నుంచి 2024 వరకు రూ.88,319 కోట్లు ఎగుమతి చేశాం. 2024-25లో రూ.23,622 కోట్లు ఎగుమతి చేశాం. దిగుమతులను 21 శాతం తగ్గించడం ద్వారా 11 ఏళ్లలో ఎగుమతుల్లో 34 శాతం పెరుగుదల సాధించాం. ప్రస్తుతం 80 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్‌లో మన స్వదేశీ ఆయుధాల విజయాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా మన ఆయుధాలకు డిమాండ్ పెరిగింది.

దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పం సామాన్య పౌరుల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని నింపింది. నక్సల్స్ హింసాకాండలో పాల్గొన్న తీవ్రవాదులు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. 2014లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 126. 11 ఏళ్ల తర్వాత 2025 నాటికి ఆ సంఖ్య కేవలం 6. తలపై భారీ బహుమానాలు ఉన్న ప్రధాన నక్సలైట్ నాయకులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. నక్సల్స్ రహిత దేశం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండడంతో భవిష్యత్ తరాలు నక్సలిజం పేరును మరచిపోతారు. వామపక్ష తీవ్రవాదాన్ని (LWE) ఎదుర్కోవడంలో ప్రభుత్వ అచంచల అంకితభావం, వ్యూహాత్మక విధానానికి ఈ మార్పు నిదర్శనం. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గడం, నక్సల్ అగ్రనేతలను హతమార్చడం ఈ ప్రయత్నాల విజయానికి నిదర్శనం. దేశం మరింత సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తు దిశగా పురోగమిస్తున్నప్పుడు, నక్సలిజాన్ని నిర్మూలించడం ఒక కీలక విజయం.

2022 సెప్టెంబర్ 2న కొచ్చిలో భారత నావికాదళం కొత్త పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ వలస పాలన నాటి ‘సెయింట్ జార్జ్ క్రాస్’ను తొలగించి దాని స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర స్ఫూర్తితో అష్టభుజి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త చిహ్నంలో అశోక చక్రం, లంగరు, నౌకాదళ నినాదం ‘సాం నో వరుణ’ ఉన్నాయి. ఇది భారతదేశ నౌకాయన వారసత్వం, ఆత్మగౌరవాలకు ప్రతీక. ‘ఉగ్రవాదులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారిని అంతం చేస్తాం’ అనే నవభారత్ సంకల్పం కేవలం ప్రకటన మాత్రమే కాదు, సర్జికల్ దాడులు, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ ద్వారా దీన్ని చేతల్లో ప్రదర్శించాం. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన వైఖరిని ప్రపంచానికి స్పష్టం చేశాం. మాజీ సైనికుల సంక్షేమం, అగ్నివీర్ పథకం, విజయదశమి నాడు రఫేల్ వంటి ఆయుధాలను పూజించడం, దీపావళి సందర్భంగా సైనికుల మధ్య ప్రధాని గడపడం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సరిహద్దు పోస్టులను సందర్శించడం వంటి కార్యక్రమాలు సురక్షితమైన భారతదేశం పట్ల మన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాద నైజాన్ని బహిర్గతం చేయడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం చేసిన దౌత్య ప్రయత్నాలు దేశ ఐక్యతను, సంకల్పాన్ని చాటుతున్నాయి. దేశానికి ఒక భద్రతా కవచాన్ని అందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రయత్నాలు, మోదీ నాయకత్వంలో దేశం సురక్షితమైన చేతుల్లో ఉందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడంలో సఫలీకృతమయ్యాయి.

శివ్ ప్రకాష్,
బిజెపి జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి