Hardip Singh Puri

మోదీకి ముందు పాక్‌పై భారత్ వైఖరి హాస్యాస్పదంగా ఉండేది

Hardip Singh Puriరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన మూడవ పదవీ కాలంలో మొదటి ఏడాది, మొత్తంగా 11వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో కేంద్రం సాధించిన అతిపెద్ద విజయాలు, ఆపరేషన్ సిందూర్ తదితర అంశాల గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన మూడు అతిపెద్ద విజయాలు ఏమిటి?

జ: మొదటిది, అభివృద్ధి ఫలాలను, వస్తు, సేవలను దేశమంతటా శరవేగంగా వ్యాప్తి చేయడం. నా దృష్టిలో ఇదే అతి పెద్ద విజయం. రెండవది మహిళా-కేంద్రిత అభివృద్ధి నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి మారడం. మహిళలు కీలకంగా ఉన్నప్పుడు అభివృద్ధి మరింత స్థిరంగా ఉంటుందని, పురోగతి వేగంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది, కాని సులభంగా అర్థం చేసుకోలేనిది, మన నాగరికత, సాంస్కృతిక గతం పట్ల ప్రజల్లో ఆత్మగౌరవాన్ని విజయవంతంగా పునరుద్ధరించడం.

భారతదేశంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించే వరకు, ఆంగ్లం రాని వారు వచ్చీరాని ఆంగ్లంలో ప్రసంగించారు. ఎందువల్ల? మీ భాష మాట్లాడండి. ఐరాసలో ఐదు భాషలు ఉన్నాయి. ఇంగ్లిష్ అవసరం లేదు. నేను ఇంగ్లిష్ లో చదువుకున్నాను గనుక ఇంగ్లీషు కొనసాగాలని కోరుకోవచ్చు.. కానీ కానీ మాతృభాషలో, ప్రాంతీయ మాధ్యమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆత్మగౌరవం ఉంది.

ప్రశ్న: ఆపరేషన్ సింధూర్, పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ను దౌత్యపరంగా ఏకాకిని చేయడానికి భారతదేశం చేసిన ప్రయత్నం, భారత్ కఠిన వైఖరిని ‘కొత్త సాధారణ స్థితి’గా ప్రధాని నిర్వచించడాన్ని ఐక్యరాజ్యసమితిలో పని చేసిన దౌత్యవేత్తగా మీరు ఎలా చూస్తారు?

జ: ఇప్పుడు ఆట నియమాలు మారిపోయాయి. దాదాపు ప్రపంచం మొత్తం దీన్ని అర్ధం చేసుకున్నా మనదేశంలో విద్యావంతులు ఎందుకు ఇది చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఇంతకుముందు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగించడానికి పాకిస్తాన్ ను అనుమతించారు… వారు ఏం చెప్పినా నమ్మి వారితో సంప్రదింపులు జరిపారు.. మోదీకి ముందు పాకిస్థాన్ తో వ్వ్యవహరించే విధానం అసంబద్ధంగా, హాస్యాస్పదంగా ఉండేది. 26/11 (ముంబై దాడుల) తర్వాత ఎదురుదాడి చేశారా? ఏం చేశారు? ఈసారి బాలాకోట్ మాదిరిగా ఒక్క దాడి మాత్రమే కాదు. ఉగ్రవాద స్థావరాలను, మురిడ్కే, బహవల్పూర్, నూర్‌యార్ ఖాన్ వైమానిక స్థావరం వంటి ప్రాంతాల్లోని సైనిక మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేశాం. ప్రస్తుత పరిస్థితి గొప్పదనం మనం ఇచ్చిన సందేశంలో ఉందని నేను అనుకుంటున్నాను. కేవలం 22 నిమిషాల్లోనే తగిన సమాధానం ఇచ్చాం, జరిగిన విధ్వంసాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా అనుభవపూర్వకంగా ధృవీకరించగలం, ఇది బహిరంగంగా అందరికీ తెలిసే విధంగానే ఉంది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని సందేశం స్పష్టం చేయగా, వ్యూహాత్మక సంయమనం పాటించాలని నా మాజీ సీనియర్ సహచరుడు ఒకరు అన్నారు. కానీ ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఇది మునుపటి పరిస్థితికి పూర్తి భిన్నం.

ప్రశ్న: కాల్పుల విరమణ సమయంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి?

జ: ఆపరేషన్ సిందూర్ నిర్వహణలో పరిపక్వత కనిపిస్తోంది. లక్ష్యాల ఎంపిక పూర్తిగా సైనిక నిర్ణయం; దాడులను ఎప్పుడు ఆపివేయాలనే దానిపై కూడా సైన్యమే నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటినీ రాజకీయ నాయకత్వం ఆమోదించింది. విమర్శకులు కూర్చొని “నహీ, అభి తోడా ఔర్” (లేదు, ఇంకా కావాలి) అని అనగలరని నేను అనుకోను. రాజకీయ నాయకత్వాన్ని నిర్ణయాలు తీసుకోనివ్వండి. భారత్ పరిణతి చెందిన రాజనీతిజ్ఞతను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసిస్తున్నారు. మేం ఏం చేశామో చూడండి. కేవలం 22 నిమిషాల్లోనే తొమ్మిది పాక్ స్థావరాలను ధ్వంసం చేశాం. వాళ్లు ఏమైనా చేశారా? అన్ని రకాల డ్రోన్లు వచ్చినా వాటిని కూల్చి వేశాం. ప్రస్తుతం భారత్ 4.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది. మన దేశీయ రక్షణ తయారీ పెరుగుతోంది. బ్రహ్మోస్ కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. అందులో కొంత భాగాన్ని భారత్ లోనే తయారు చేస్తున్నాం. 11 ఏళ్ల సుపరిపాలన, ఆర్థిక, సంక్షేమ పథకాలకు సంబంధించిన కళ్ళు చెదిరే గణాంకాలు, బహుముఖ పేదరికం నుంచి బయటపడిన వారి సంఖ్య… వీటన్నిటి కారణంగా దేశం సంబరాలలో ఉంది. పేదరికం రేటు 24 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. నిరుద్యోగ రేటు కూడా తగ్గింది – వాస్తవానికి, వృద్ధి రేటు 8 శాతం సాధించడం వంటి మరెన్నో విజయాలను మనం సాధించాల్సి ఉంది. ప్రతిపక్ష నేత (రాహుల్ గాంధీ) మాట్లాడుతున్న విషయాలు కాక ఇలాంటివి చర్చించాలి.

ప్ర: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేయడంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ తో పాటు పలువురు సీనియర్ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు? 

జ: ప్రపంచ నాయకులు చేసే ప్రకటనలకు చాలా మంది భాష్యాలు చెబుతారు. దానికి నా వ్యాఖ్యలను జోడించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందని అనుకోను. పాకిస్థాన్ తో ద్వైపాక్షికంగా వ్యవహరించడానికి మనకు స్థిరమైన విధానం ఉంది. వారి హయాంలో ప్రతిపక్షాలు ఏం చేశాయి? 26/11 దాడి జరిగినప్పుడు నేను ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ అధిపతి వాల్టర్ చాప్ మన్ కు స్వాగత విందు కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అక్కడ ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ఫామ్ హౌస్ లో పార్టీకి వెళ్లినట్లు తెలిసింది. ముంబై దాడుల తర్వాత చర్యలు తీసుకున్నారా? తమకు గుణపాఠం చెప్పే మార్గాలున్నా సంయమనం పాటించాల్సి వచ్చిందని మాజీ విదేశాంగ కార్యదర్శి ఒకరు తెలిపారు. 

 నేటి భారత్ వేరు. ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. ఇందులో సందేహం లేదు. వ్యూహాత్మక సందిగ్ధత అసలు లేదు. ఏం జరుగుతోందో పూర్తిగా అర్థం చేసుకోకుండా చాలా మంది ప్రకటనలు చేస్తుంటారు. ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద వ్యతిరేక కమిటీ ఉపాధ్యక్ష పదవికి పాకిస్తాన్ ఎన్నికైందని, భారత్ దీన్ని అడ్డుకోలేక పోయిందని విమర్శలు చేస్తున్నారు. అయితే 10 మంది కొత్త సభ్యులు వచ్చి మొత్తం 15 మంది (ఐదుగురు శాశ్వత సభ్యులతో సహా) మండలిలో ఉంటే కమిటీల విభజన జరుగుతుంది. ఈ ప్యానెల్ కు అధ్యక్షత వహించేందుకు పాక్ చాలా తాపత్రయపడినా మిగతా దేశాలు అంగీకరించకపోవడంతో ఉపాధ్యక్ష పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వారికి ఇది దెబ్బే… దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా వివరణ ఇచ్చింది.

ప్ర: ప్రతిపక్షాల విమర్శలపై మీ అభిప్రాయం? ఉదాహరణకు ఎన్నికల సంఘం (ఈసీ), ఇతర సంస్థలను తప్పు పడుతూ రాహుల్ గాంధీ రాసిన వ్యాసాలు. 

జ: ఇవన్నీ అపోహలు, అపార్థాలు అని చెప్పి సరిపెట్టవచ్చు. కానీ ఈ ఆరోపణలు చేసే వ్యక్తి గురించి విశ్లేషణ అవసరం ఉందని అనుకుంటున్నాను. అలాంటి కొడుకు ఉంటే దిగులు పడాలి. మీకు అలాంటి స్నేహితుడు ఉంటే, మీరు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏదేమైనా, స్వాతంత్య్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన ఒక పార్టీ నాయకుడిగా ఆయన ఆ పార్టీని బలహీనపరచడమే కాకుండా సొంతంగా ఎంపిక చేసుకున్న తెరచాటు సలహాదారుతో దేశాన్ని కూడా బలహీనపరుస్తున్నారు.

ప్రశ్న: ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ సభ్యులతో కూడిన అఖిలపక్ష ప్రతినిధుల బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి?

జ: ప్రతినిధుల బృందాల ఏర్పాటును ఎవరైనా తప్పుబట్టారని నేను అనుకోవడం లేదు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ప్రతినిధి బృందంలోని ప్రతిపక్ష సభ్యులు కూడా భారత్ వైఖరిని చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కువ కాలం ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బిజెపి సభ్యులు దేశానికి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో సహా ప్రతినిధుల బృందం సభ్యులంటే నాకు అమితమైన గౌరవం తప్ప మరేమీ లేదు. మేం వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లం, కానీ బలమైన ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండవచ్చు, కానీ దేశానికి సంబంధించిన అంశాలపై అందరం ఒక్కటే.

ప్రశ్న: పంజాబ్ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. బిజెపి సంప్రదాయ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ గందరగోళంలో ఉంది. త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారా?

జ: గందరగోళం అనేమాట సరిపోదు. పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. పంజాబ్లో త్రిముఖ పోటీ కాకుండా చతుర్ముఖ పోటీ ఉండనుంది. మా ఓటు వాటా (పంజాబ్ లో) 6 శాతం నుంచి 19 శాతానికి పెరిగింది. బిజెపి కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అది కచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాను. 2027 ఎన్నికలపై ఆశాభావంతో ఉన్నాను, ఎందుకంటే ఆప్ ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఇటీవల కాంగ్రెస్ ఏమి చేసిందో ప్రజలు చూశారు.