అసమాన రాజకీయ వారసత్వం
విదేశీ వ్యవహారాలు నుంచి ఆర్థిక సంస్కరణల వరకు మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి భారత రాజకీయ రంగంపై శాశ్వత ముద్ర వేశారు. స్వతంత్ర భారత చరిత్రలో అసమానమైన రాజకీయ వారసత్వాన్ని అందించారు. 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి అద్భుతమైన ప్రసంగాలతో కోట్లాది మంది ప్రజలను ఆకట్టుకొని, గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు. కేవలం ప్రముఖ రాజకీయవేత్తయే కాకుండా కవి, రచయిత, సామాజిక సేవకుడు. వాజ్‌పేయి బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులయ్యారు. ఏ పని చేసినా జాతిహితాన్ని మనసులో పెట్టుకునేవారు. స్వతంత్ర పోరాటంలోనే ఆయన రాజకీయాలలో ప్రవేశించారు. మొదటగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో బాలుడిగా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.
1957లో మూడు చోట్ల నుండి లోక్‌సభకు పోటీ చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్ నుండి ఎన్నికయ్యారు. అప్పటి నుండి చివరి వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. పార్లమెంట్‌లో ఆయన వాగ్దాటికి ముగ్ధుడైన నాటి ప్రధాని నెహ్రు ఏనాటికైనా వాజ్‌పేయి ప్రధాని అవుతారని అప్పట్లోనే జోస్యం చెప్పారు. 1968లో దీనదయాళ్ ఉపాధ్యాయ మృతి తర్వాత జనసంఘ్ అధ్యక్ష పదవి చేపట్టారు. అప్పట్లో భారత రాజకీయాలలో బలమైన ప్రతిపక్షంగా జనసంఘ్ ఉండేది. జూన్ 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు అరెస్ట్ అయిన వాజ్‌పేయి జైలు జీవితం గడిపారు. తర్వాత 1977లో జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. ఆ సందర్భంగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొరార్జీ దేశాయి మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించారు.
1980లో ఏర్పడిన బిజెపి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగారు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 ఎన్నికలలో బిజెపి కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకున్నా తిరిగి పార్టీని ప్రబలమైన రాజకీయ శక్తిగా రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత జరిగిన 1989 ఎన్నికలలో బిజెపి 88 సీట్లను గెల్చుకొంది. ఐదు దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యునిగా వాజ్‌పేయి కొనసాగారు. పది సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా పని చేసారు. 1996లో తొలిసారి కేవలం 13 రోజులకే ఆయన పదవి పరిమితమైన, 1998-99 వరకు 13 నెలల పాటు కొనసాగారు. 1999 నుండి 2004 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు 1992లో పద్మ విభూషణ్, 2015లో భారత్ రత్న లభించాయి. 1994లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ 1998 మే 11న భారత్ అధికారికంగా మొదటి అణు పరీక్ష జరిపింది వాజ్‌పేయి హయాంలోనే. పోఖ్రాన్ అణు పరీక్ష ద్వారా దేశ రక్షణకు ఏ విధంగా బలమైన పునాది వేసారో, కార్గిల్ యుద్ధం ద్వారా అవసరమైనప్పుడు భారత్ పరాక్రమాన్ని ప్రపంచానికి చాటారో, అదే స్థాయిలో శాంతిస్థాపన కోసం పాకిస్థాన్, చైనా, ఇతర దేశాలతో అనూహ్యమైన చొరవను ప్రదర్శించారు.
చురుకుగా ఆర్థిక సంస్కరణలు
భారత్‌ను ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం కోసం ఆర్థిక సంస్కరణలను చురుకుగా అమలు జరిపిన ఘనత వాజ్‌పేయి ప్రభుత్వానికి దక్కుతుంది. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను 1999లో ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రారంభించారు. 1999 నుండి 2004 వరకు 30 వ్యూహాత్మక అమ్మకాలు జరిగాయి. అయినా ఒక్క ఆరోపణ రాకపోవడం గమనార్హం. ఒక ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలంటే మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం కీలకం అని గుర్తించిన మొదటి ప్రధాని వాజ్‌పేయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించి, విశేష కృషి చేశారు. ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేందుకు ఆయన చేపట్టిన రహదారుల ప్రణాళిక అంతర్జాతీయ ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారత ఆర్థికాభివృద్దిలో కీలకంగా మారింది. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా గ్రామాలను రహదారులతో అనుసంధానం చేసే కార్యక్రమం సైతం విశేష ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాతి ప్రభుత్వాలకు ఈ రెండు కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలిచాయి. దేశంలో గృహనిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం వాజ్‌పేయి ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చు. గృహనిర్మాణాలకు చౌకగా బ్యాంకు రుణాలు లభించేటట్లు చేయగలిగారు. నేడు విశేష ప్రాచుర్యం పొందిన ఆధార్ కార్డుల జారీ ప్రతిపాదన మొదటిసారిగా కార్గిల్ యుద్ధం అనంతరం వాజ్‌పేయి హయాంలో తెరపైకి వచ్చింది. ఈ విధంగా పలు రకాల పరిపాలన సంస్కరణలకు వాజ్‌పేయి ఆద్యులని చెప్పవచ్చు. టెలిఫోన్ చార్జీలను గణనీయంగా తగ్గించి, అందరికి అందుబాటులోకి వచ్చే విధంగా చేశారు. మొబైల్ ఫోన్లు దేశంలో గణనీయంగా పెరగడానికి బలమైన పునాదులు వేశారు.
వినూత్న విదేశాంగ విధానం
ప్రధానిగా విదేశాంగ విధానాల్లో అనేక వినూత్న విధానాలకు వాజ్‌పేయి శ్రీకారం చుట్టారు. భారత్-అమెరికా సంబంధాలకు బలమైన పునాది వేయడంతో పాటు అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకి చేసేందుకు బలమైన ప్రాతిపదికలు ఏర్పాటు చేశారు. కార్గిల్ యుద్ధం సందర్భంగా చైనాతో సహా ఏ ఒక్క దేశం కూడా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వక పోవడం, భారత్‌కు బాసటగా నిలబడటం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం అని చెప్పవచ్చు. పాకిస్థాన్‌తో సంబంధాల పునరుద్దరణకు స్వయంగా లాహోర్‌కు బస్సు ప్రయాణం చేసి చరిత్ర సృష్టించారు. అయితే కార్గిల్‌లో దొంగదెబ్బ తీసి, భారత్‌పై దాడికి పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటించి చావు దెబ్బ కొట్టారు. ఎత్తైన పర్వత ప్రాంతాల నుండి పోరాడుతున్న పాక్ సేనలను భారత్ సేనలు తరిమి కొట్టిన విధానం ప్రపంచ చరిత్రలోనే అసామాన్యమైన సాహస పరాక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుంది. భారత్ పార్లమెంట్‌పై దాడి వంటి పలు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడులను వాజ్‌పేయి పాలనలో ఎదుర్కోవలసి వచ్చినా ప్రభుత్వం ఎంతో నిబ్బరంగా గట్టి సమాధానం చెబుతూ వచ్చింది. మరోవంక చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి రెండు దేశాలు ఉమ్మడిగా ప్రయత్నాలు ప్రారంభించే విధంగా చేయగలిగారు. టిబెట్ చైనాలో అంతర్భాగమని భారత్ గుర్తించగా, భారత్‌లో సిక్కిం అంతర్భాగమని చైనా గుర్తించింది. తద్వారా రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు గట్టి ప్రాతిపదికను ఏర్పరిచారు.
నెహ్రు కాలం నుండి భారత్ సోవియట్ శిబిరంలో ఉండడంతో పాకిస్థాన్‌కు అమెరికా మద్దతుగా ఉంటూ వచ్చింది. భారత్‌తో అమెరికా సంబంధాలు నామమాత్రంగానే ఉంటూ వచ్చాయి. అయితే నేడు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు పెంపొందడానికి వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకున్న చొరవ, చేసిన కృషి కారణం. వాస్తవానికి 1998లో భారత్ జరిపిన అణు పరీక్షలు రెండు దేశాల మధ్య సంబంధాలు అధ్వాన స్థితికి చేరుకోవడంతో వాజ్‌పేయి ప్రభుత్వం ప్రారంభం కాగా, భారత్ అణు సామర్థ్యాన్ని తునాతునకలు చేయాలని అమెరికా విశ్వ ప్రయత్నాలు చేసింది. భారత్‌పై అంతర్జాతీయంగా ఆంక్షలు పెట్టే విధంగా చేసింది. అటువంటి పరిస్థితి నుండి భారత్‌తో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకొనే విధంగా అమెరికాను ఒప్పించడం వాజ్‌పేయి రాజనీతిజ్ఞతకు నిదర్శనం అని చెప్పవచ్చు.

