GKR Yoga

యోగా సర్వరోగ నివారిణి

Yogaయోగానే మనకు ప్రథమ డాక్టర్ అని, సర్వరోగ నివారిణి అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని, ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రోజు జూన్ 20న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ యోగా సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ నటీనటులు సాయిధరమ్‌తేజ్, ఖుష్బూ, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి, ఆచరిస్తున్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘‘యోగా వల్ల యోగ్యులవుతారు. మానసికంగా, శారీరకంగా సమతుల్యం సాధించగలరు. నో అటెన్షన్.. నో రిటెన్షన్.. యోగా అన్నింటికి ప్రొటెక్షన్. యోగా ఒక థెరపీ, మెడిసిన్, అన్ని సమస్యలకు రెమిడీ.. యోగా అనేది వన్డే ఈవెంట్, ప్రోగ్రాం కాదు.. మన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరూ యోగాను అనుసరించాలి. మన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, మానసిక శక్తులను ఏకం చేయడం, ఏకాగ్రతను సాధించి, ఆత్మశక్తిని మేల్కొల్పడం.. యోగం అంటే సాధన చేయడం.. అంతిమంగా మానవత్వాన్ని సాధించడం. అది అంతిమలక్ష్యం. ఆదియోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనందరి ధర్మం. పతంజలి యోగా సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయం. భారతదేశం మీద విదేశీ దాడులు మన సంపదను హరించడమే కాకుండా మన కలలను, శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. దేశంలో అనేక దేవాలయాలు, మందిరాలను కూల్చివేశారు. అలాంటి పరిస్థితి నుంచి మనం తిరిగి తేరుకుని మళ్లీ శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం. యోగా మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేసి ప్రపంచ శాంతికి దారితీయడం గొప్ప విషయం. యోగాకు జాతి, మతం లేదు.. మన జీవనవిధానం. ఆదికాలం, వేదకాలం, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన శాస్త్రమే యోగా శాస్త్రం. మన ఇంట్లో పిల్లలు, స్త్రీ, పురుషులందరికీ యోగాభ్యాసం చేసేలా చేయాలి. యోగా సర్వధర్మాలకు సంబంధించిన ఆరోగ్య శాస్త్రం. యోగా విషయంలో అనవసరమైన వివాదాలు, రాజకీయాలు పనికిరావు. ఎవరు యోగా చేస్తే వారి ఆరోగ్యం బాగుపడుతుంది.’’ అని అన్నారు.