రాంచందర్ రావు తొలి దిల్లీ పర్యటన విజయవంతం
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్. రాంచందర్ రావు చేపట్టిన తొలి దిల్లీ పర్యటన విజయవంతమైంది. జూలై 21, 22న రెండు రోజుల పాటు కొనసాగిన ఈ పర్యటనలో బిజెపి జాతీయ నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ పర్యటనలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ, జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్ లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే దిశగా జాతీయ నాయకులు కీలక సూచనలు ఇచ్చారు.
ఈ పర్యటనలో రాంచందర్ రావు కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్లను కలిసి.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర పథకాల అమలు తదితర విషయాలపై చర్చించారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయడం, కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ప్రజాసమస్యలపై పోరాటాలు చేసేలా రాంచందర్ రావుకు జాతీయ నాయకత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శనం లభించింది. జూలై 24న మరోసారి దిల్లీకి వెళ్లిన రాంచందర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు.

