GST

జీఎస్టీ: దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మలుపు

జూలై 2017లో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మలుపు చోటుచేసుకుంది. స్వాతంత్య్రం అనంతరం దేశం మొత్తం ఒకే విస్తృత మార్కెట్‌గా మారడం ఇదే మొదటిసారి. జీఎస్టీ ఆలోచన వాజ్‌పేయి ప్రభుత్వం కాలంలో 2000లోనే మొదలైంది. దాని అమలుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. మోదీ ప్రభుత్వం 2014 డిసెంబరులో జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేవలం రెండు సంవత్సరాల్లో 101వ రాజ్యాంగ సవరణను పార్లమెంటులోని అత్యధిక సభ్యులు ఆమోదించారు. సగానికి పైగా రాష్ట్రాలు ఈ చట్టాన్ని ధృవీకరించాయి. జీఎస్టీ కౌన్సిల్ 55 సమావేశాలు నిర్వహించి, ఒక్కటి తప్ప మిగిలిన అన్నీ నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకుంది. ఇది చట్టపరమైన విజయం మాత్రమే కాక, సహకారాత్మక సమాఖ్య వ్యవస్థకు ఉదాహరణగా నిలిచింది.

జీఎస్టీతో 17 పన్నులు, 13 సెస్‌లు రద్దయ్యాయి. పన్నుల మీద పన్నుల ధోరణి (క్యాస్కేడింగ్ ఎఫెక్ట్)కి ఇది ముగింపు పలికింది. రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్‌పోస్టుల వ్యవస్థ తొలగిపోయింది. దేశంలో పారదర్శకత, ప్రామాణికత పెరిగాయి. లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి — ట్రక్కులు రోజుకు 44 శాతం ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నాయి. రాష్ట్రాల మధ్య వ్యాపారం ఆర్థిక సంవత్సరం 2018 జీడీపీలో 23.5 శాతం నుంచి 2022లో 35 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 1.4 కోట్లకు పైగా నమోదైన పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. జీఎస్టీకి ముందు సగటు పరోక్ష పన్ను రేటు 15 శాతం ఉండగా 2023 మార్చిలో అది 12.2 శాతానికి పడిపోయింది. ప్రధాని ఆర్థిక సలహాదారుల మండలి అధ్యయనం ప్రకారం జీఎస్టీ వల్ల ఒక్క ఏడాదిలో రూ.4.3 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. వినియోగ వస్తువులలో దాదాపు 60 శాతంపై 5 శాతం లేదా తక్కువ పన్నే ఉండగా, అత్యధికమైన 28 శాతం పన్ను రేటు కింద వస్తువులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నాయి.

జీఎస్టీ ‘కేంద్ర పన్ను’ కాదు, కేంద్ర-రాష్ట్రాల సమన్వయానికి ప్రతీక. రాష్ట్రాలు SGST మొత్తం, IGSTలో సగం, సెంట్రల్ జీఎస్టీలో 42 శాతం వాటా పొందుతున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రాలకు వచ్చిన జీఎస్టీ ఆదాయం రూ 46.56 లక్షల కోట్లు. మునుపటి విధానంలో వచ్చే ఆదాయం కేవలం రూ 37.5 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో పన్ను భారం తక్కువగా ఉన్నా ఆదాయ వృద్ధి కొనసాగింది.

జీఎస్టీ రూపకల్పన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడమే కాకుండా దాని డిజిటల్ మౌలిక సదుపాయాలతో ప్రపంచంలోని అత్యాధునిక పన్ను వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. ఇ-వే బిల్, ఇ-ఇన్వాయిసింగ్, వ్యక్తుల ప్రమేయం లేని నిబంధనల అమలు (ఫేస్‌లెస్ కంప్లయన్స్) వంటివి దీన్ని విశేషంగా ఆధునీకరించాయి. 12.2 శాతం సగటు జీఎస్టీ రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యల్ప పన్ను వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలిచింది. దీని వల్ల పెట్టుబడిదారులకు భారత్ మరింత ఆకర్షణీయ దేశంగా మారింది.

జీఎస్టీ సాధించిన చిన్న చిన్న విజయాల ప్రభావం మాత్రం భారీగా ఉంది. చెక్ పోస్టులు కనుమరుగైనప్పటి నుంచి ట్రక్కుల ఉత్పాదకత 44 శాతం పెరిగిందని, అంతర్రాష్ట్ర వాణిజ్యం జీడీపీలో 23.5 శాతం నుంచి 35 శాతానికి పెరిగిందని, వార్షిక జీఎస్టీ ప్రేరిత పొదుపు రూ.4.3 లక్షల కోట్లుగా పీఎంఈఏసీ అధ్యయనం అంచనా వేసింది. దాదాపు 60 శాతం వినియోగ వస్తువులు ఇప్పుడు 5 శాతం శ్లాబులో ఉన్నాయి. 17 పన్నులు, 13 సెస్‌లను ఒకే డిజిటల్ వ్యవస్థతో భర్తీ చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం స్పష్టమైన పారదర్శకత, క్రియాశీలతను తీసుకువచ్చింది. భారతదేశం అతిపెద్ద పన్నుల వ్యవస్థను నిశ్శబ్దంగా సమ్మిళిత వృద్ధి డివిడెండ్ గా మార్చింది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ విషయంలో మోదీ ప్రభుత్వ రాజకీయ సంకల్పానికి, పరిపాలనా సామర్థ్యానికి, నిబద్ధతకు జీఎస్టీ ఒక ప్రబల నిదర్శనం.

షెహజాద్ పూనావాలా,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి