మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో దశ మారిన సహకార రంగం
2021 జూలైలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం కేవలం పరిపాలనాపరమైన చర్య మాత్రమే కాదు. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ, గృహ నిర్మాణం, రుణ వితరణ వంటి రంగాలలో విస్తరించి ఉన్న 8 లక్షలకు పైగా సహకార సంఘాలతో కూడిన భారతదేశ విశాలమైన సహకార రంగానికి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం, వృద్ధి, సంస్కరణలకు ఒక వేదిక లభిస్తుందన్న దానికి ఇది స్పష్టమైన సంకేతం. గత నాలుగేళ్లలో దాని పనితీరును సమీక్షించుకుంటే ఈ మంత్రిత్వ శాఖ దీర్ఘకాలిక దిశానిర్దేశాన్ని అందించే సూచికల సమూహంగా, తక్షణ అవసరాలు, మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా స్పందించే దిక్సూచిగా పని చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. సహకార రంగం దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చాలా కాలంగా కీలకమైన, నిశ్శబ్దమైన వెన్నెముకగా ఉంది.
పాడి పరిశ్రమ సహకార సంఘాల నుండి చిన్న తరహా వ్యాపారాలకు తోడ్పడే క్రెడిట్ సొసైటీల వరకు, సహకార సంస్థలు దేశవ్యాప్తంగా జీవనోపాధిని విస్తరించాయి. మార్కెట్ అందుబాటును పెంచాయి. ఆర్థిక సమ్మిళితత్వానికి మద్దతు ఇచ్చాయి. అయితే, దశాబ్దాలుగా ఈ రంగానికి సంబంధించిన విధానాలకు ఒక దిశ లేదు. తరచుగా అవి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే పరిమితమై, జాతీయ ప్రాధాన్యతలకు దూరంగా ఉన్నాయి. మంత్రిత్వ శాఖ ఏర్పాటు ఈ పరిస్థితిని మార్చింది. వ్యవస్థాగత లక్ష్యాలు, నిర్వహణలో క్రియాశీలత రెండింటినీ తీసుకువచ్చింది. మొదటి నాలుగు సంవత్సరాలలో మంత్రిత్వ శాఖ ఉద్దేశాల నుంచి ఆచరణ దిశగా ముందుకు సాగింది. ఈ నాలుగేళ్లలో మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన 60 ప్రధాన కార్యక్రమాలు, మార్గదర్శక శక్తిగా, పరిస్థితులకు అనుగుణంగా సహకార సంఘాలకు దిశా నిర్దేశం చేసే సంస్థగా దాని పాత్రను బలోపేతం చేశాయి.
అవి చేపట్టిన అత్యంత ముఖ్యమైన సంస్కరణలో ఒకటి, 63,000 పైగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (PACSలు) కంప్యూటరీకరించడానికి ఉద్దేశించిన రూ.2,516 కోట్ల కార్యక్రమం. ఈ క్షేత్రస్థాయి క్రెడిట్ సంస్థలు గ్రామీణ జీవనోపాధికి చాలా ముఖ్యమైనవి. వాటి డిజిటలీకరణ పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యం, సేవల పంపిణీని మెరుగుపరుస్తుంది. రాష్ట్రాలలో కంప్యూటరీకరణ స్థిరంగా అమలు జరుగుతోంది. ఇది క్షేత్రస్థాయి అవసరాలకు స్పందించే వ్యవస్థాగత సంస్కరణలకు ఒక స్పష్టమైన ఉదాహరణ.
మరొక మైలురాయి 2023లో PACSల కోసం నమూనా ఉప నిబంధనలను విడుదల చేయడం. ఈ ఉప నిబంధనలు ఈ సంస్థలు రుణ కార్యకలాపాలను దాటి వేరే రంగాల్లోకి ప్రవేశించడానికి వీలు కల్పించాయి. కొత్త విధానం ప్రకారం, PACS పెట్రోల్ పంపులను నిర్వహించవచ్చు, ధాన్యం నిల్వను నిర్వహించవచ్చు, జన్ ఔషధి దుకాణాల ద్వారా సరసమైన మందులను పంపిణీ చేయవచ్చు. అనేక రకాల ముఖ్యమైన గ్రామీణ సేవలను అందించవచ్చు. గుజరాత్‌లోని పంచమహల్, బనస్కాంత జిల్లాలలో జరిగిన ప్రయోగాలు ఒక విధానం ఆచరణాత్మకంగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఎంత త్వరగా రూపాంతరం చెందుతుందో ఇప్పటికే నిరూపించాయి. ఇది లక్ష్యాలు, వాటి సాధనల ఆదర్శవంతమైన కలయికను సూచిస్తుంది.
సహకార మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిన మరొక రంగం చట్టపరమైన సంస్కరణలు. బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) చట్టం, 2023, పారదర్శక ఎన్నికల ప్రక్రియలు, స్వతంత్ర పాలనా యంత్రాంగాలు, సహకార అంబుడ్స్‌మన్ వ్యవస్థ, బలహీనపడిన సహకార సంస్థలను పునరుద్ధరించడానికి క్రమబద్ధమైన మార్గాలను ఆవిష్కరించింది. ఈ చర్యలు చాలా కాలంగా ఉన్న పాలనాపరమైన సమస్యలను పరిష్కరించాయి. సహకార సంస్థలు స్వయంప్రతిపత్తితో పాటు జవాబుదారీతనంతో పనిచేసేలా చూశాయి.
మంత్రిత్వ శాఖ సహకార రంగం స్థాయిని, మార్కెట్ అవకాశాలను, రంగంలో అంతర్గత పోటీతత్వాన్ని బలోపేతం చేయడానికి కూడా చర్యలు తీసుకుంది. నాణ్యమైన విత్తనాల పంపిణీ కోసం భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్, సేంద్రీయ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, దేశ గ్రామీణ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడానికి జాతీయ సహకార ఎగుమతుల సంస్థ వంటి జాతీయ గొడుగు సహకార సంస్థల ఏర్పాటు ఉత్పత్తిదారుల సమూహాలను ఏకీకృతం చేయడానికి, మార్కెట్ అనుసంధానాలను మెరుగుపరచడానికి, భారతదేశ గ్రామీణ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడానికి చేసిన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. ఒక రూపాయి నుంచి రూ.10 కోట్ల ఆదాయ పరిధిలోని సహకార ఆదాయాలపై గతంలో 12 శాతం ఉన్న సర్ ఛార్జీలను 7 శాతానికి తగ్గించడం వంటి పన్ను ప్రోత్సాహకాలు, ఈ రంగం ఆర్థిక అవసరాలకు మంత్రిత్వ శాఖ ప్రతిస్పందనను స్పష్టం చేస్తాయి. అలాగే మానవ వనరులు, సంస్థాగత సామర్థ్యంపై పెట్టుబడికి సహకార శాఖ ఇచ్చిన ప్రాధాన్యం కూడా అత్యంత ముఖ్యమైనది. సహకార విద్య, శిక్షణ, పరిశోధనలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతదేశపు మొదటి విశ్వవిద్యాలయం త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం (TSU) స్థాపన, ఈ రంగం భవిష్యత్తుకు ఒక సూచిక. TSUను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించారు. వృత్తిపరమైన నాయకత్వాన్ని పెంపొందించడానికి, ఆధునిక పాలనా పద్ధతులను అమలు చేయడానికి, ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించడానికి సహకార పరిశోధనను, అభివృద్ధిని ప్రోత్సహించడానికి దీనిని రూపొందించారు.
ఈ కార్యక్రమాలు మంత్రిత్వ శాఖ ఒక నిష్క్రియాపరమైన సంస్థ కాదని రుజువు చేస్తున్నాయి. ఇది వ్యవస్థాగత సంస్కరణలు, చట్టపరమైన స్పష్టత, సహకార సంస్థల నిర్వహణలో సాంకేతికతను ప్రోత్సహించడం వంటి అంశాలలో సహకార రంగానికి అన్ని రకాల మద్దతు అందించింది. అదే సమయంలో మారుతున్న అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా సహకార సంస్థలకు దిశా నిర్దేశం చేసింది. భవిష్యత్తు విషయానికి వస్తే, విలువ జోడింపు, వ్యవసాయ-మార్కెటింగ్, గ్రామీణ వ్యాపారం, సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో సహకార సంస్థల పాత్ర శ్వేత విప్లవం 2.0 వంటి కార్యక్రమాలతో పాటు విస్తరించనుంది. రాబోయే సంవత్సరాలలో బలమైన సంస్థలతో పాటు సాధికారత కలిగిన నాయకత్వం, ఆధునికీకరించిన వ్యవస్థలు, లక్షలాది సహకార సభ్యుల అవసరాలకు నిరంతర ప్రతిస్పందన అవసరం. ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సహకార మంత్రిత్వ శాఖ, ఈ ప్రారంభ విజయాలను సంఘటితం చేసుకుని వాటి ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తోంది.
సహకార సంస్థలను సభ్యుల సంక్షేమం, దేశ అభివృద్ధికి దోహదం చేసే సంస్థలుగా మార్చేందుకు సహకార మంత్రిత్వ శాఖ వేసిన పునాదులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. PACSల కంప్యూటరీకరణ, చట్టపరమైన సంస్కరణలు, గొడుగు సహకార సంస్థలు, పన్ను ప్రోత్సాహకాలు, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం స్థాపన సహకార రంగంలో వ్యవస్థాగత మార్పులకు, దాని దిశకు స్పష్టమైన సూచికలుగా నిలుస్తున్నాయి. అదే సమయంలో, మారుతున్న గ్రామీణ పరిస్థితులు, ఆర్థిక డిమాండ్లు, సభ్యుల ఆకాంక్షలకు అనుగుణంగా దిక్సూచి వలె పనిచేసే సామర్థ్యం మంత్రిత్వ శాఖ అసలు బలం. ఐదవ సంవత్సరం మంత్రిత్వ శాఖకు కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు; గ్రామీణ సంక్షేమం, క్షేత్రస్థాయి భాగస్వామ్యం, సమ్మిళిత వృద్ధికి సహకార ఆధారిత అభివృద్ధిని చోదక శక్తిగా మార్చడానికి ఒక అవకాశం. ముందుకు సాగే దిశకు, పరిస్థితులకు అనుగుణంగా స్పందించే తత్వానికి మధ్య సహకారం మంత్రిత్వ శాఖ ప్రస్తుత సమతుల్యతను కొనసాగించగలిగితే, భారతదేశ సహకార ఉద్యమం దేశ ఆర్థిక, సామాజిక ప్రగతిలో మరింత గొప్ప పాత్ర పోషిస్తుంది.
రాకేష్ అరావతియా, సత్యేంద్ర పాండే

