పదేళ్ళలో పట్టణవాసుల జీవితాలను మెరుగుపరిచిన ‘అమృత్’
పట్టణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఓ ప్రధాన కార్యక్రమం ‘అటల్ మిషన్ ఫర్ రిజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (ఏఎంఆర్‌యూటీ-‘అమృత్’). 2015 జూన్ 25న ప్రారంభించిన ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నీటి సరఫరా, మురుగు పారుదలకు ఒక సమర్థమైన వ్యవస్థ, పట్టణ ప్రాంత రవాణా, వీటితో పాటు పార్కుల వంటి మౌలిక సేవలను అందించడం దీని లక్ష్యం. ఇది ప్రజలకు, ముఖ్యంగా పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి కేంద్రీకరించింది. నీటి సరఫరాకు, మురుగునీటి పారుదలకు అగ్రప్రాధాన్యాన్ని ఇచ్చారు. బాలలు, వయోవృద్ధులు ఉపయోగించుకొనే పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు వ్యయంలో 2.5 శాతం వరకు కేటాయించారు. ఎంపిక చేసిన 500 నగరాలు, పట్టణాలను ఈ అమృత్ పరిధిలోకి తీసుకువచ్చారు. (వీటిలో 485 నగరాలే కాకుండా విలీనం చేసిన నగరాలు 15 కూడా ఉన్నాయి.) ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. దీని నిధులను పట్టణ జనాభా, పట్టణాల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమకూరుస్తాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.77,640 కోట్లు ఖర్చయ్యే రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలను (ఎస్ఏఏపీస్) ఆమోదించారు. ఈ మొత్తంలో కేంద్ర సాయం రూ.35,990 కోట్లు కూడా కలిసి ఉంది. ఇంతవరకు రూ.79,401 కోట్ల పనులు పూర్తి అయ్యాయి.
అటల్ పట్టణ ప్రాంతాల పునరుజ్జీవన, పరివర్తన కార్యక్రమం (‘అమృత్’) లక్ష్యాల్లో ఇవి:
- ప్రతి కుటుంబానికి నల్లా నీరు పక్కాగా అందుబాటులో ఉండేటట్టు చూడటంతో పాటు మురుగు నీటి పారుదల సదుపాయాన్ని కల్పించడం.
- పచ్చదనంతో కళకళలాడే ప్రదేశాలను తీర్చిదిద్ది, ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించిన బహిరంగ స్థలాలను (పార్కులు వంటివి) అంతే చక్కగా నిర్వహిస్తూ, నగరాల్లో వసతి సౌకర్యాల విలువను పెంచడం,
- ప్రజా రవాణాకు మళ్లించడంతో పాటు మోటార్ల అవసరం ఉండని రవాణా సాధనాలకు (ఉదాహరణకు కాలి నడక, సైక్లింగ్ వంటి వాటికి) అనువుగా తగిన సదుపాయాల నిర్మాణం చేపట్టి కాలుష్యాన్ని తగ్గించడం.
‘అమృత్’ ప్రణాళికలో సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలతోపాటు సంస్కరణలను అమలుచేయడం, నీటి సరఫరా, మురుగు, సెప్టిక్ ట్యాంకుల్లో పోగుపడే ఘన వ్యర్థాలు, ద్రవరూప వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాన నీటి పారుదల, పట్టణ రవాణాతో పాటు పచ్చదనంతో నిండి ఉండే ప్రదేశాలను, పార్కులను అభివృద్ధి పరచడం మొదలైనవి భాగంగా ఉన్నాయి. ప్రణాళిక రచన, అమలు- ఈ రెండు ప్రక్రియల్లోనూ భౌతిక మౌలిక సదుపాయాల కల్పనలో స్మార్ట్ ఫీచర్లను అనుసంధానించడానికి పట్టణ స్థానిక సంస్థలు గత 10 సంవత్సరాల్లోనూ నిరంతరం కృషి చేస్తూ వచ్చాయి.
అమృత్ కార్యక్రమంలో వివిధ భాగాలు
నీటి సరఫరా
- నీటి సరఫరా వ్యవస్థలు. ఇప్పుడున్న నీటి సరఫరా సదుపాయాలను పెంచడం, నీటి శుద్ధి ప్లాంటులతో పాటు అన్ని చోట్లా మీటర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం వీటిలో భాగంగా ఉంటాయి.
- ప్రత్యేకించి తాగునీటి సరఫరాను, భూగర్భ జలాలను తిరిగి భర్తీ చేసేందుకు అప్పటికే ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని పునరుద్ధరించడం.
- దుర్గమ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంత నగరాలతో పాటు నీటి నాణ్యత పరంగా సమస్యలు (ప్రాణాపాయకర విషతుల్య జలాలు, ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండే నీరు వంటివి) ఎదురవుతున్న నగరాలకు ప్రత్యేకంగా నీటి సరఫరా ఏర్పాట్లు చేపట్టడం.
మురుగు పారుదల
- వికేంద్రీకరించిన, ఒక నెట్‌వర్క్‌తో కలిపిన భూగర్భ మురుగు పారుదల వ్యవస్థల ఏర్పాటు (వీటిలో ప్రస్తుత మురుగునీటి పారుదల వ్యవస్థలు, మురుగునీటి శుద్ధి ప్లాంటుల సంఖ్యను పెంచడం కూడా భాగంగా ఉంది.)
- పాత మురుగు పారుదల వ్యవస్థను, శుద్ధి ప్లాంటులను వేరే చోట్లకు మార్చడం.
- ఒకసారి వాడిన నీటిని ఇతర ప్రయోజనాలకు మళ్లీ ఉపయోగించడం (రీసైక్లింగ్), వ్యర్థ జలాలను సైతం పునరుపయోగించడం.
సెప్టిక్ ట్యాంకుల్లో పోగుపడే ఘన, ద్రవరూప వ్యర్థాలు
- మానవ విసర్జితాలు, బురద, వీటి నిర్వహణ: రవాణా, శుద్ధి ప్రక్రియలను తక్కువ ఖర్చులతో పూర్తి చేయడం.
- మురుగునీటి కాలువలు, సెప్టిక్ ట్యాంకులను యంత్రాల సహాయంతోనూ, బయలాజికల్ పద్ధతిలోనూ శుభ్రం చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులను పూర్తిగా వసూలు చేయడం.
వరద నీటి పారుదల కాలువలు
- వరదల వల్ల లోతట్టు ప్రదేశాలు మునిగిపోవడాన్ని తగ్గించేందుకు, క్రమంగా ఈ స్థితిని నిర్మూలించేందుకు కాలువలు, వాన నీటి పారుదల కోసం డ్రెయిన్ల నిర్మాణం తో పాటు ఇప్పటికే ఉన్న ఇలాంటి వాటిని మెరుగుపరచడం.
పట్టణ రవాణా
- అంతర్గత జలమార్గాల కోసం (ఓడరేవు, బే మౌలిక వసతులు మినహా) నౌకలు, పెద్ద నౌకలతో పాటు బస్సులు
- ఫుట్‌పాత్‌లు, నడకదారులు, పక్కన నిర్మించే బాటలు, ఫుట్ ఓవర్-బ్రిడ్జిలతో పాటు మోటారుతో నడవని వాహనాలు కాకుండా ఇతర వాహనాల (ఉదాహరణకు సైకిళ్లు) వంటి వాటి కోసం అవసరమైన సౌకర్యాలు.
- వాహనాలను నిలిపి ఉంచడానికి బహుళ అంచెల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం.
- బస్ ర్యాపిడ్ ట్రాన్జిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్).
హరిత ప్రదేశాలు, పార్కులు
బాలబాలికలకు అనుకూలంగా ఉండే ప్రత్యేక ఏర్పాట్లతో పచ్చదనంతో కళకళలాడే ఆరుబయలు ప్రదేశాలు, పార్కులను అభివృద్ధి చేయడం.
సామర్థ్యం పెంపు
దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. అవి: ఒకటి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచడం, రెండోది: సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడం.
సామర్థ్య పెంపు కార్యక్రమాలను మిషన్ పరిధిలోని నగరాలకు మాత్రమే పరిమితం చేయబోరు. ఈ కార్యక్రమాలను పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీస్)కు కూడా వర్తింపచేస్తారు.
నూతన మిషన్ల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని (సీసీబీపీ)ని కొనసాగిస్తారు.
‘అమృత్’ సాధించిన విజయాలు
- నీటి సరఫరా
- మొత్తం 139 లక్షల నల్లా కనెక్షన్ల లక్ష్యం కాగా దాన్ని అధిగమించి 189 లక్షల కనెక్షన్లు ఇచ్చారు
- 64,463 కిమీ నీటి సరఫరా నెట్‌వర్క్ నిర్మాణం
- రోజుకు 4,734 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం ఏర్పాటు
- 2011లో 49 శాతం నుంచి 2025 నాటికి 70 శాతానికి పెరిగిన మంచినీటి నల్లాల కవరేజి
- మురుగు, సెప్టిక్ వ్యర్థాల నిర్వహణ
- డ్రైనేజి కనెక్షన్ల లక్ష్యం 145 లక్షలు కాగా 149 లక్షల కనెక్షన్లు ఇచ్చారు
- 10,598 కిమీ డ్రైనేజి వ్యవస్థ నిర్మాణం
- 4,447 MLD (మిలియన్ లీటర్స్ పర్ డే) సామర్థ్య నిర్మాణం
- ఇందులో 1,437 MLD నీటిని తిరిగి ఉపయోగించవచ్చు
- వాననీటి డ్రైన్లు
- 1,457 కిమీ పొడవైన డ్రైన్ల నిర్మాణం
- 3,766 నీరు నిలిచిపోయే ప్రదేశాలను గుర్తించి సమస్యను పరిష్కరించారు
- హరిత ప్రదేశాలు, పార్కులు
- 6,869 ఎకరాల హరిత ప్రదేశాల అభివృద్ధి
- 2,994 పార్కుల ఏర్పాటు
‘అమృత్ 2.0’
‘అమృత్ 2.0’ను 2021 అక్టోబరు 1న ప్రారంభించారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలూ దీని పరిధిలోకి వస్తాయి. నగరాలకు నీటి విషయంలో కొరత ఎదురవకుండా, స్వయంసమృద్ధంగా తయారు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. 500 అమృత్ నగరాల్లో సీవరేజీ, సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణ సేవలను అన్ని ప్రాంతాలకూ అందేటట్టు చూడడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘అమృత్ 2.0’కు మొత్తం రూ.2,99,000 కోట్లు ఖర్చు కావచ్చని భావిస్తున్నారు. దీనిలో అయిదు సంవత్సరాల కాలానికి గాను రూ.76,760 కోట్ల కేంద్ర వాటా కూడా కలిసి ఉంది. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ ‘అమృత్ 2.0’లో భాగంగా ‘జల్ హీ అమృత్’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. మురుగు పారుదలకు సంబంధించిన ప్లాంటులను సమర్థంగా నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రోత్సహించే కార్యక్రమం ఇది. జల లభ్యతను మెరుగుపరచడానికి, నీటి భద్రతకు దన్నుగా నిలిచేందుకు నీటిని శుద్ధి చేయడంతో పాటు పునర్వినియోగించడం ఈ కార్యక్రమం ఉద్దేశాలు.
‘అమృత్ 2.0’లో భాగంగా సాధించిన విజయాలు
నీటి సరఫరా
- రూ.1,14,220.62 కోట్లు ఖర్చయ్యే 3,568 నీటి సరఫరా ప్రాజెక్టులకు ఆమోదం
- 181 లక్షల కొత్త నల్లా కనెక్షన్లకు ఆమోదముద్ర
- 10,647 MLD సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంటు (డబ్ల్యూటీపీ)కి ఆమోదం
- సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (SCADA) సాంకేతికతతో 1,487 నీటి సరఫరా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం
మురుగు నీరు, సెప్టిక్ వ్యర్థాల నిర్వహణ
- రూ.67,607.67 ఖర్చయ్యే (నిర్వహణ ఖర్చులు కూడా కలుపుకొని) 592 సీవరేజి, సెప్టేజి నిర్వహణ పథకాలకు ఆమోదం
- కొత్తగా 67.11 లక్షల మురుగు పారుదల సదుపాయాల ఏర్పాటుకు ఆమోదముద్ర
- 6,739 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగి ఉండే మురుగు జలాల శుద్ధి ప్లాంటు (ఎస్‌టీపీ)లకు ఆమోదం
- ఎస్‌సీఏడీఏ సాంకేతికతతో 235 సీవరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఆమోదం
నవకల్పనలకు మద్దతు
సాంకేతికత ఉప కార్యక్రమం: ఇది అంకుర సంస్థ (స్టార్ట్-అప్)లకు సంబంధించిన ఆలోచనలను, ప్రైవేటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ‘అమృత్ 2.0’ లో చేర్చిన మరో భాగం ఇది.
120 అంకుర సంస్థలను తుది పరిశీలన కోసం ఎంపిక చేశారు
ప్రయోగాత్మక ప్రాజెక్టుల కోసం 82 అమృత్ నగరాలను గుర్తించారు
పదేళ్ళలో ‘అమృత్’, ‘అమృత్ 2.0’ సమగ్ర విజయాలు
క్షేత్ర స్థాయి ప్రగతి
- రూ.2,73,649 కోట్లు ఖర్చయ్యే 14,828 ప్రాజెక్టులను ‘అమృత్’తో పాటు ‘అమృత్ 2.0’లో భాగంగా మంజూరు చేశారు.
- మొత్తం కలిపి సుమారు రూ.1,12,368 కోట్లతో వివిధ పనులను పూర్తి చేశారు.
ఆర్థిక ప్రగతి
- మొత్తం వ్యయం రూ.3,77,000 కోట్లు
- ప్రాజెక్టుల కోసం రూ.1,02,786 కోట్ల కేంద్రీయ సహాయాన్ని కేటాయించారు.
- కేంద్రం, రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థలు ప్రాజెక్టులపై రూ.97,963 కోట్లను ఖర్చు చేశాయి.
- ప్రాజెక్టుల కోసం రూ. 47,625 కోట్ల కేంద్ర నిధుల్ని విడుదల చేశారు.
- 2.03 కోట్ల నీటి కనెక్షన్లతో పాటు 1.5 కోట్ల మురుగుకాలవ కనెక్షన్లను ఇచ్చారు.
- 9,511 ఎకరాల పరిధిలో 544 జలాశయాలను పునరుద్ధరించారు.
ఇతర కార్యక్రమాలు
- ‘అమృత్ మిత్ర’లో 10,000కు పైగా మహిళా స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీస్) సభ్యులు చేరారు. రూ.147 కోట్ల ఖర్చుతో 1,762 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
- డ్రింక్ ఫ్రం ట్యాప్’: డీఎఫ్‌టీ (కుళాయి నీటినే తాగండి)ని అమలు చేయడానికి రూ.23,490 కోట్లు ఖర్చు చేసి 381 ప్రాజెక్టులను చేపడుతున్నారు. వీటి వల్ల 8 లక్షల కుటుంబాలకు ప్రయోజనం అందే అవకాశం ఉంది. 3,630 మంది కాంట్రాక్టర్లకు, అధికారులకు శిక్షణ ఇచ్చారు.
- 1.09 లక్షల ఎకరాల పరిధిలో 3,032 జలాశయాల పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు.
- కాంట్రాక్టర్లు, ప్లాంటు ఆపరేటర్లు, కుళాయిలు, పైపులు బాగు చేసే వారు, మహిళలు, యువతీయువకులు, అధికారులు సహా మొత్తం 90,000 మందికి పైగా శిక్షణను ఇచ్చి రాష్ట్రాల సామర్థ్యాలను పెంచారు.
‘అమృత్’ అమల్లోకి వచ్చి పదేళ్ల కాలం పూర్తి అయింది. ఇది భారత్ అనుసరిస్తున్న పట్టణాభివృద్ధి విధానంలో ఒక కీలకమైన మార్పును సూచిస్తోంది. దీనిలో సమగ్ర పథకరచన, సమర్థ సేవలు, స్థిరమైన వృద్ధిపై దృష్టిని కేంద్రీకరించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా, నీరు-పారిశుద్ధ్యం, పచ్చదనంతో కళకళలాడే ప్రదేశాల వంటి కీలక సేవలను ఈ కార్యక్రమం మెరుగుపరుస్తూ దేశవ్యాప్తంగా నగరాలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుతోంది.

