ఎమర్జెన్సీ విధించే ధైర్యం ఇక మరెవ్వరూ చేయరు
విద్యార్థి నిరసనల సమయంలో అంతర్గత భద్రతా చట్టం (మీసా) కింద అరెస్టయి, అనేక నెలలు నిర్బంధంలో ఉన్న సీనియర్ బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, 50 సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీ, అది మళ్లీ జరగకుండా చూసే వ్యవస్థాగత రక్షణలు, అలాగే రాబోయే బీహార్ ఎన్నికల గురించి ఒక జాతీయ ఆంగ్ల వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు:
ప్ర: 50 సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీని ఎలా చూస్తారు?
జ: ఎమర్జెన్సీ అనేది భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. దేశం మొత్తం జైలుగా మారింది. జేపీ (జయప్రకాష్ నారాయణ్) ఉద్యమం మొదలైనప్పుడు నేను ఇంటర్మీడియట్ విద్యార్థిని, బీహార్ విద్యార్థి ఉద్యమంలో మేం పెద్ద నాయకులుగా మారాం. ఇందిరా గాంధీ తన ప్రజాధరణను కోల్పోతున్నారు, ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదల, అవినీతి తీవ్రమయ్యాయి. ఈ సమయంలోనే ఉద్యమం ఊపందుకుంది. బీహార్‌లో ఎమర్జెన్సీకి ముందే హింస మొదలైంది. నేను నా ఇంటి ముందు మీసా కింద అరెస్టయ్యాను. నేను భాబూవా పర్యటనకు వెళ్తుండగా, అర్ధరాత్రి పది మంది పోలీసులు నాపైకి దూకారు. నాకు గాయం అయింది, నన్ను జైల్లో పెట్టారు.
ఇందిరా గాంధీ నిరంకుశంగా మారుతున్నారు. ఆ తర్వాత ఆమె ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఏనాడూ వెలుగులోకి రాని ధైర్యవంతుడైన న్యాయమూర్తి జగ్‌మోహన్‌లాల్ సిన్హా, కొలీజియం వ్యవస్థ అమల్లోకి రాకముందు నియమితులయ్యారు. ఆ తర్వాత, అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ సమయంలో నేను అజ్ఞాతంలో ఉన్నాను, హింసను దగ్గర నుంచి చూశాను. మొరార్జీ దేశాయ్ తోటలో నడుస్తున్నప్పుడు, జేపీని హర్యానాలోని అదే గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేశారని జేపీ ఒకసారి మాతో చెప్పారు. జేపీ మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, ఆయన్ను జస్లోక్ ఆసుపత్రికి మార్చారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో పాట్నాకు వచ్చారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దేవుడు ఆయన్ను కాపాడాడు.
దేవ్ కాంత్ బరూవా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ‘ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిర’ అనే నినాదాన్ని సృష్టించారు. పొగడ్తలు పరాకాష్టకు చేరుకున్నాయి. సుప్రీంకోర్టు మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. భారతదేశంలోని తొమ్మిది హైకోర్టులు నిర్బంధ ఉత్తర్వును ‘ఏకపక్షం’గా పేర్కొన్నాయి. ఆ విషయం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, అది అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. ఒక ధైర్యవంతుడైన న్యాయమూర్తి, హన్స్‌రాజ్ ఖన్నా, అసమ్మతి వ్యక్తం చేశారు. రెండు నెలల పాటు ఆయనకు కీలక న్యాయమూర్తి పదవి నిరాకరించి ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవి విషయంలో ఆయనను పక్కన పెట్టారు.
జేపీ కింద పనిచేయడం నా జీవితంలో అత్యంత అసాధారణ అనుభవాలలో ఒకటి. ఆయన గొప్ప నాయకుడు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన హజారీబాగ్ జైలు 30 అడుగుల గోడను దూకి పారిపోయారు. ఆయన పోరాడారు, హింసకు గురయ్యారు, నేపాల్ సరిహద్దులో అరెస్టు అయ్యారు. నెహ్రూ ఆయన్ను ఇష్టపడ్డారు. ప్రభుత్వంలో చేరి ఉప ప్రధానమంత్రి కావాలని ఆయనకు ప్రతిపాదించారు. ఆయన వద్దని, సర్వోదయం, భూదాన్ కోసం పనిచేస్తానని అన్నారు. 1977లో జనతా పార్టీ గెలిచినప్పుడు, అదంతా ఆయన ఘనతే. ఆయన ప్రధాని కావచ్చు, కానీ వద్దని అన్నారు.
ప్ర: జైలులో మీ సమయం గురించి ఏం గుర్తు ఉంది?
జ: రాజకీయ ఖైదీలను విభిన్నంగా చూశారు, మిగిలిన వారిని భయంకరంగా చూశారు. నేను పాట్నా హైకోర్టులో న్యాయవాది అయినప్పుడు ఇది నాపై గొప్ప ప్రభావాన్ని చూపింది. నేను ఈ ఖైదీల కేసులను తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఎమర్జెన్సీ సమయంలో, చాలా మంది — సోషలిస్ట్ నాయకులు, సర్వోదయ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను అరెస్టు చేసి హింసించారు. కానీ చాలా మంది యువ ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుల గోళ్లను బలవంతంగా లాగి వాంగ్మూలాలు రాబట్టారని నాకు గుర్తుంది. అది హింస, అది చాలా తీవ్రమైనది. జైలులో నేను నేర్చుకున్న పాఠం అవసరమైన వారికి, అండర్‌ట్రయల్స్‌కు సహాయం చేయాలి.
ప్ర: ఎమర్జెన్సీ తర్వాత ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఎంతో ఆశావాదంతో ప్రతిపక్ష పార్టీలు ఏకమై 1977లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దానికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు?
జ: అది కేవలం అధికారం కోసం ఆరాటం. జేపీ నిరాశ చెందారు, మేం కూడా. చరణ్ సింగ్, రాజ్ నారాయణ్ తదితరుల మధ్య జరిగిన ఈ పోరాటం చాలా దురదృష్టకరం, ప్రతిపక్షం ఓడిపోయింది. కానీ ఎమర్జెన్సీ నేర్పిన అతి పెద్ద పాఠం ఏమిటి? భారతదేశ ప్రజలకు తామెవరో, తమకు ఏం దక్కాలో తెలుసు. తమ ఓటు శక్తితో ఏ రాజకీయ పార్టీనైనా ఓడించగలమని వారికి కచ్చితంగా తెలుసు. ఇందిరా గాంధీ ఓడిపోయారు. సంజయ్ గాంధీ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశంలో తుడిచిపెట్టుకుపోయింది, కమల్ నాథ్ ఒకే ఒక్క సీటు గెలిచారు.. న్యాయమూర్తులను పక్కన పెట్టడంపై, జర్నలిస్టులపై, ప్రజానాయకులపై జరిగిన అన్ని అకృత్యాలకు రాహుల్ గాంధీ లేదా ఆయన పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పి ఉంటే నేను అభినందించేవాడిని. కానీ అది జరగడం లేదు.
ప్ర: 2024 ఎన్నికలకు ముందు వివిధ పార్టీలు ఏకమయ్యాయి. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
జ: వారికి ప్రశ్నలు అడిగే హక్కు ఉంది. అంతకుమించి ఇంకేమీ చెప్పగలరు? ఏదేమైనా, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ఎన్నికల్లో గెలుస్తోంది. విషయం ఏమిటంటే, మీకు ఓటు రాకపోతే మేం ఏం చేయగలం? మీరు గెలవండి. ఓట్లు పొందండి. ప్రతిరోజూ వారు పత్రికా సమావేశం నిర్వహిస్తారు, ప్రతిరోజూ నరేంద్ర మోదీపై రోజు చేసే ఆరోపణలే చేస్తూ ఉంటారు. వారు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. అదే ప్రజాస్వామ్యం అంటే.
ప్ర: మీసా ఎమర్జెన్సీ అణచివేతకు చిహ్నంగా మారింది. ముందస్తు నిర్బంధాన్ని ఏ ప్రభుత్వమూ ఎందుకు వదిలిపెట్టలేక పోతోందని మీరు అనుకుంటున్నారు?
స: ఉగ్రవాద బాధితులకు మానవ హక్కులు ఉన్నాయా, లేదా? పహల్గాంలో క్రూరంగా హత్యకు గురైన కమాండర్ నర్వాల్ భార్యకు మానవ హక్కు ఉందా లేదా? అదేవిధంగా, భారతదేశానికి మావోయిస్టులు, ఉగ్రవాదులు, వారి నెట్‌వర్క్ నుండి ముప్పులు ఉన్నాయా లేదా? అందువల్ల, అనేక సందర్భాలలో, సవాలు స్వభావం కారణంగా మీరు ముందస్తు నిర్బంధాన్ని ఆశ్రయించాలి. పెద్ద ప్రశ్న ఏమిటంటే, భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, దానిని ఎందుకు ఉంచారు? రాజ్యాంగంలో తగిన రక్షణ ఉంది. మీరు ముందస్తు నిర్బంధం కింద అరెస్టు అయితే, మీరు సలహా బోర్డు ముందు హాజరవుతారు, అది అరెస్టు సబబో కాదో పరిశీలించి ధృవీకరిస్తుంది, ఆ తర్వాత, మీరు దానిని కోర్టులో సవాలు చేయవచ్చు. అనేక సందర్భాలలో, నిర్బంధానికి సంబంధించిన కారణాలు సంతృప్తికరంగా లేకపోతే కోర్టులు నిర్బంధ ఉత్తర్వును రద్దు చేశాయి. అది ఒక రక్షణ.
ప్ర: జేపీ ఉద్యమానికి ప్రతినిధి అయినప్పటికీ, తెర వెనుక కష్టపడి పని చేసిన ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఎవరు అని మీరు అనుకుంటున్నారు?
స: లాలూ ప్రసాద్ యాదవ్ నాతో పాటు జైలులో ఉన్నారు, అయితే నాకు చాలా సీనియర్. నితీష్ కుమార్ ఉన్నారు. వ్యూహం విషయంలో, రామ్ బహదూర్ రాయ్, కె.ఎన్. గోవిందాచార్య, నానాజీ దేశ్‌ముఖ్ అని నేను అనుకుంటున్నాను. నానాజీ దేశ్‌ముఖ్ తన ఫియట్‌లో దేశం మొత్తం తిరుగుతూ, కారు స్టెప్నీలో సాహిత్యాన్ని ఉంచేవారని నాకు గుర్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ఏ నాయకుడూ సాహసించడు. అదే ఆ పోరాటం తెచ్చిన అతి పెద్ద సానుకూల పరిణామం.
ప్ర: ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ఎందుకు రద్దు చేశారు లేదా ఎన్నికలకు ఎందుకు వెళ్లారని మీరు అనుకుంటున్నారు?
స: అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న. నాకు కనిపించే ఏకైక కారణం ఏమిటంటే, ఆమెకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా ఉద్యమాలు జరిగాయి. అమెరికాలో ముఖ్యంగా బ్రిటన్‌లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. ఆర్థికంగా భారత్ అప్పుడు ఒక బలమైన దేశం కాదు. ఆనాడు మనం గర్వించదగిన ఒకే ఒక అంశం మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కావడం. ఈ ఎమర్జెన్సీ ఆ సానుకూల అంశాన్ని కూడా మనకు లేకుండా చేసింది. విదేశాలలో నిరసనలు జరిగాయి. జేపీ ఒక సోషలిస్ట్ నాయకుడు అని గుర్తుంచుకోండి. అన్ని సోషలిస్ట్ అంతర్జాతీయ సంస్థలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చాయి. బహుశా వారు ఆమెపై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు. ఆమె తప్పుగా అంచనా వేసింది. ఆమె నిఘా యంత్రాంగం ఆమె ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆమెకు సమాచారం ఇచ్చింది.
ప్ర: నిజమైన ఎమర్జెన్సీని విధించి 50 సంవత్సరాల తర్వాత, ఏ నాయకుడూ ఎమర్జెన్సీ విధించడం గురించి ఆలోచించకుండా చూసేందుకు మనం ఎలాంటి వ్యవస్థాగత రక్షణలను ఏర్పాటు చేశాం?
జ: మొదట వార్తాపత్రికలు, జర్నలిస్టులు, టీవీ మీడియా, సోషల్ మీడియా; రెండవది న్యాయవ్యవస్థ: ప్రజాహిత వ్యాజ్యం, ప్రజాభిప్రాయం; మూడవది అన్ని రాజకీయ బృందాలకు ఎమర్జెన్సీ విధించినట్లయితే ప్రజలు వారిని పక్కన పెడతారని తెలుసు.
ప్ర: 42వ సవరణను రద్దు చేయడానికి ఎందుకు మరింత చురుకైన ప్రయత్నాలు జరగలేదు?
జ: దానిలోని కొన్ని భాగాలను సవాలు చేశారు. ఒక్కదాన్నే కోర్టులు ఆమోదించాయి. ప్రవేశికలో లౌకికవాదాన్ని ప్రవేశపెట్టారు, కానీ దానికి గల కారణాలు స్పష్టమైనందువల్ల దాని జోలికి వెళ్లలేదు. ప్రాథమిక విధులు అలాగే ఉన్నాయి. ప్రజలు, రాజకీయ పార్టీలు నన్ను తప్పుగా అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఒక మాట చెప్పాలి, భారతదేశం ఒక పెద్ద క్రీడా శక్తిగా మారాలి. క్రీడలు ఉమ్మడి జాబితా కిందకు రావాలా వద్దా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమ వనరులను సమీకృతం చేయవచ్చు.
ప్ర: కానీ 42వ సవరణకు అభ్యంతరాలు అందులోని అంశాల కంటే దాన్ని తీసుకు వచ్చిన ప్రక్రియ గురించి కూడా కదా?
జ: 42వ సవరణ ప్రక్రియ మొత్తం పాపంలో పుట్టింది. ఇందిరా గాంధీకి అధ్యక్ష వ్యవస్థ ద్వారా విస్తృతాధికారాలు కట్టబెట్టడం దీని అసలు ఉద్దేశం. నిరంకుశత్వం లేదా సౌమ్య నిరంకుశత్వం ఏర్పాటు చేయాలనుకున్నారు. మిగిలినది చరిత్ర. ఆమె సాధించేటట్లు చూడటానికి ఎన్నికల చట్టాన్ని గడచిన కాలానికి వర్తించే విధంగా మార్చారు.
ప్ర: తరచుగా జర్నలిస్టులపై అరెస్టు వారెంట్లు లేదా ఎఫ్‌ఐఆర్‌లు చూస్తున్నాం. యూట్యూబర్‌లపై కఠినమైన చట్టాలు ప్రయోగిస్తున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు?
జ: పత్రికా స్వేచ్ఛ పవిత్రమైనది. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం పవిత్రమైనది. భారత ప్రజాస్వామ్యం 75 సంవత్సరాలలో ఈ రోజు ఉన్న స్థితికి చేరుకుంటే, రాజకీయ క్రియాశీలత, ప్రజలతో పాటు న్యాయవ్యవస్థ, మీడియా కీలక పాత్ర పోషించడమే కారణం. తూర్పు ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి ఒక కార్టూన్ గురించి ఎవరినైనా అరెస్టు చేస్తే.. రాజకీయాల్లో ఉన్నవారు ఒక విషయం అర్థం చేసుకోవాలి: వినోదం, సరదా, వ్యంగ్యం, కార్టూన్లు ప్రజాస్వామ్యంలో భాగం. దానిని అంగీకరించడం నేర్చుకుందాం. కానీ యూట్యూబర్ల కంటెంట్ అంతా సరైనదేనా? కొందరు యూట్యూబర్లు విదేశాల నుంచి దుష్ప్రచారాలు చేయడం లేదా? మనం అందరినీ ఒకే గాట కట్టలేం. అధికరణం 19.1 వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. అదే రాజ్యాంగంలోని అధికరణం 19.2 ఈ స్వేచ్ఛలపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చని చెబుతుంది.
ప్ర: ప్రపంచంలో ఒకదాని తర్వాత ఒకటిగా సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కానీ భారత్ ఏ విషయంలోనూ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు కనిపించడం లేదు
స: ప్రపంచ దృశ్యం ఆందోళనకరమైన రీతిలో సంక్లిష్టంగా మారుతోంది. బహుళపక్షవాదం సంగతి ఏమిటి? ప్రపంచ సంస్థల సంగతి ఏమిటి? నేను ఊహించేది ఇది: ఐక్యరాజ్యసమితితో పాటు, జీ7, జీ20, క్వాడ్ వంటి అనేక ఇతర సంస్థలు ఉద్భవిస్తున్నాయి. ఈ అన్నింటిలో భారతదేశ పాత్ర చాలా శక్తిమంతమైనదని నేను అనుకుంటున్నాను. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ విషయానికొస్తే, భారతదేశానికి ఇద్దరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల, కాల్పుల విరమణను మనం స్వాగతిస్తున్నాం. కానీ ఇరాన్, ఇజ్రాయెల్‌లలో భారతదేశం తన పౌరులను రక్షించిన తీరు ప్రశంసనీయం.
ప్ర: డొనాల్డ్ ట్రంప్ యుగంలో టారిఫ్‌లను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో భారతదేశం ఒక సందిగ్ధంలో ఉందని మీరు అనుకుంటున్నారా?
స: ఒక మంచి ఒప్పందాన్ని సాధించగల అనుభవం, సామర్థ్యం వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న భారతీయ ప్రతినిధులకు ఉన్నాయని విశ్వసిద్దాం. వాణిజ్యం అనేది అనేక అనుబంధ విషయాల చేత ప్రభావితమయ్యే ఒక అంశం. ఇది మంచిది ఇది మంచిది కాదు అని ఇప్పుడే నిర్ణయించలేం. చాలా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి.
ప్ర: న్యాయ సంస్కరణల విషయంలో, కొలీజియం వర్సెస్ ఎన్‌జేఏసీ (జాతీయ న్యాయ నియామకాల కమిషన్) పై చర్చ కాకుండా ప్రాధాన్యం ఇవ్వవలసిన అంశాలు ఇంకా ఏమి ఉన్నాయి?
జ: ఇప్పుడు అందుబాటులో ఉన్న చాలా మంచి న్యాయ సమాచార గ్రిడ్ ద్వారా జిల్లా కోర్టులలో కేసులు ఎంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయో మనకు తెలుస్తోంది. ఐదు నుండి పది సంవత్సరాలకు పైగా విచారణ పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసులు, అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్, సివిల్ అపీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ అన్ని పెండింగ్ కేసులను పరిష్కరించడానికి ఒక స్పష్టమైన ప్రయత్నం జరగాలి. న్యాయశాఖ మంత్రిగా ఎన్‌జేఏసీని నేను తీసుకువచ్చాను. రాజ్యాంగ సమీక్షా సంఘం, న్యాయ కమిషన్ కూడా దీనికి అనుకూలంగా చాలా సిఫార్సులు చేశాయి. ప్రతి అంశం పైన విభేదాలు తలెత్తే మన రాజకీయ వాతావరణంలో కూడా, ప్రతి పార్టీ దీనికి మద్దతు ఇచ్చింది. రాజ్యసభలో, రాం జెఠ్మలానీ మాత్రమే వ్యతిరేక స్వరం వినిపించారు. సుప్రీంకోర్టు దాన్ని కొట్టి వేసింది. మేం తీర్పును అంగీకరించాం. ప్రధానమంత్రి, తన మంత్రివర్గం సహాయంతో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముగ్గురు సైనిక దళాల అధిపతులు, సీవీసీ, సీఏజీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలలో కీలక పాత్ర పోషిస్తారు. ఆయన అణు మీటను నొక్కే అధికారం కలిగి ఉన్నారు. కానీ తన న్యాయశాఖ మంత్రి సహాయంతో, ఆయన ఒక నిష్పక్షపాత న్యాయమూర్తిని నియమించడానికి ఆయనకు అర్హత లేదు అనడం విచిత్రం.
ప్ర: నితీష్ కుమార్ 20 సంవత్సరాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా కూటమికి నాయకత్వం వహిస్తారు. బీహార్‌లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయడంలో బిజెపి విఫలమైందని మీరు అనుకుంటున్నారా?
జ: నితీష్ కుమార్‌కు, మాకు అనుబంధం ఎంతో కాలంగా కొనసాగుతోంది. ఆయన సమతా పార్టీ ద్వారా బిజెపి కూటమిలో చేరిన మొదటి వ్యక్తి. దాణా కుంభకోణంలో ఆయన లాలూ ప్రసాద్‌ను వ్యతిరేకించి మాకు మద్దతు ఇచ్చారు. ఆయన 1996, 1998, 1999లలో వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉన్నారు. వాజ్‌పేయి జీ, అద్వానీ జీ ఆయనను 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రోత్సహించారు. 2005 నుండి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మా కూటమి నాయకుడిగా కొనసాగే విషయంలో ఆయన సొంత శిబిరంలోనే కొంత సంశయం ఉంది.
బీహార్ ఎలా మారింది? నేను మీకు ఒకే ఒక్క ఉదాహరణ ఇస్తాను. లాలూ ప్రసాద్ చివరి బడ్జెట్ పరిమాణం రూ.23,000 కోట్లు. ఇప్పుడు అది రూ.3,07,000 కోట్లు. రోడ్లు వస్తున్నాయి, విమానాశ్రయాలు వస్తున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా చాలా చేయాల్సిన అవకాశం ఉంది, కానీ మనం మార్పును చూడవచ్చు. మేం ఆ కూటమిని గౌరవిస్తాం. మేం ఒక కూటమిని ప్రారంభిస్తే, మేం మా సంబంధాన్ని కొనసాగిస్తాం. మేం మా కూటమి భాగస్వాములను బయటకు పంపం. ఎవరైనా వెళ్ళిపోతే, అది వేరే విషయం; మేం వదిలిపెట్టం. నితీష్ కుమార్‌ను నాయకుడిగా కొనసాగిస్తున్నామంటే, సామర్థ్యం గల వ్యక్తులు లేరని అర్థం కాదు. మేం బీహార్‌లో మళ్లీ కచ్చితంగా గెలుస్తాం.

