బీసీ రిజర్వేషన్లపై చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ గత ఆరు నెలలుగా ఎంతగానో హడావుడి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ మంత్రులు ఆగస్టు 6న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన తీరు చూస్తుంటే ఇక వారు చేతులెత్తేసిన్నట్లు స్పష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా చేసిన వాఖ్యలే అందుకు నిదర్శనం. వారి మాటలను గమనిస్తే రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదనేది స్వయంగా వారే చెప్పినట్లు వెల్లడవుతుంది. ఒకరేమో కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తే, మరొకరు రాహుల్‌గాంధీ ప్రధాని పదవికి, బీసీ రిజర్వేషన్లను ముడిపెట్టారు. 2019లో రాహుల్ ప్రధాని అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు వస్తాయంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాహుల్ ప్రధాని కావడం ఏమోగానీ అప్పటి వరకు రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అని కాంగ్రెస్ వారే ప్రశ్నిస్తున్నారు. ఈ రెండూ ఇప్పట్లో జరిగేవి కావనేది కాంగ్రెస్ వారికీ కూడా స్పష్టంగా తెలిసిన విషయాలే. కాబట్టి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ సర్కారు ఆరు నెలలుగా ఆడుతున్నదంతా ఉత్త డ్రామానే అనే భావించాల్సి వస్తుంది. ఇన్నాళ్లుగా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నమే చేసారని అర్థం అవుతుంది. వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి కనిపించడం లేదని, ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడం లేదని మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి.
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో వేదికపై ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఈ సందర్భంగా సలహా అడిగి, ఎదురవుతున్న న్యాయపరమైన, రాజ్యాంగపరమైన సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో అనే ఆలోచనలు రేవంత్ రెడ్డి చేయడం లేదు. తాము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటుంటే ఎవరో వచ్చి అడ్డుపడుతున్నారని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వీలైనంత మేరకు మోసం చేసుకుంటూ, మభ్యపెట్టుకుంటూ కాలం గడుపుతున్నదని ఆ పార్టీలోని బీసీ నాయకులే వాపోతున్నారు. చివరికి దిల్లీ వేదికగా కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం చేయాల్సిన చట్టబద్ధమైన పనులు పూర్తిచేశాం. పార్లమెంట్‌లో చర్చ కోసం మన ఎంపీలు పోరాడుతున్నారు. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం తన పని పూర్తిచేసింది. ఇక కేంద్రమే ఆమోద ముద్రవేయాలి’ అని స్పష్టం చేశారు. అంటే ఈ విషయంలో తాము ఇక మరేమీ చేయలేమని స్పష్టంగా చేతులెత్తేశారు. మరోవంక, రాహుల్ గాంధీని ప్రధానిని చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ సమయంలోనే ఆ మాట చెప్పి ఉండవచ్చు గదా. దిల్లీ ధర్నాలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ‘నువ్వు చేయి లేదంటే.. రాహుల్‌ను ప్రధానిని చేసి మేమే చేసుకుంటాం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను చూసి కాంగ్రెస్ వారే నవ్వుకొంటున్నారు. ‘2029లో మోదీని గద్దె దించి, రాహుల్‌ను ప్రధానిని చేసి రిజర్వేషన్లు పెంచుతాం’ అనడమే కాకుండా, రిజర్వేషన్ల కోసం మళ్లీ దిల్లీకి రామని స్పష్టం చేశారు. రేవంత్ బీసీ రిజర్వేషన్ల పెంపు ఇక తనవల్ల కాదని బహిరంగంగా అంగీకరించినట్లయింది.
రేవంత్ వ్యాఖ్యల ప్రకారం 2029 వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ మాత్రం దానికి హడావిడి ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దిల్లీ సాక్షిగా బీసీలపై కాంగ్రెస్ కపటప్రేమ మరోసారి బయటపడింది. రాహుల్‌గాంధీ నుంచి మొదలుకొని సీఎం రేవంత్ రెడ్డి వరకు చెప్పే మాటలన్నీ ప్రగల్భాలేనని తేలిపోయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం దిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నా వేదికే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకొన్న బీసీల ధర్నాకు అగ్రనేత రాహుల్ తో పాటు ఆ పార్టీ కీలక నేతలు ఎవరూ హాజరు కాలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వచ్చి ధర్నా ప్రారంభిస్తారని ప్రకటించారు. ఆయన ముఖం చాటేశారు. కేవలం మొక్కుబడిగా ప్రియాంక గాంధీ వాద్రా మాతం వచ్చి వెళ్లారు. రేవంత్ రెడ్డి తన 31 నిముషాల ప్రసంగంలో ఎక్కువగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల తన భక్తి శ్రద్ధలను చాటుకొనేందుకే కేటాయించారు. గత ఏడాది కాలంగా వ్యక్తిగతంగా తనకు కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా దూరంగా నెట్టివేస్తున్న రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారా? అని చాలామంది కాంగ్రెస్ వారే వాపోతున్నారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించినట్లు కనిపించడం లేదు. దీంతో బీసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపై కాంగ్రెస్ చూపిస్తున్న కపట ప్రేమకు ఇది నిదర్శనమని మండిపడుతున్నారు. హడావుడి తప్ప, రిజర్వేషన్లు సాధించాలనే తపన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీలు అందరూ వచ్చి సంఘీభావం తెలిపి ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కొంత భరోసా లభించి ఉండేది.
రాహుల్, సోనియా జపం చేయడానికే రేవంత్ ధర్నా
దిల్లీ జంతర్‌మంతర్ కాంగ్రెస్ సభ గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి దిల్లీ సభ పెట్టుకున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50 శాతానికంటే ఎక్కువ సమయం, రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ ‘‘బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టి సారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప.. అది చేయలేక, బట్టకాల్చి బిజెపి మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోం. చట్టపరమైన, న్యాయపరమైన ప్రణాళిక లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ ను ప్రకటించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. 18 నెలలుగా ఆ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాల అమలు ఊసెత్తడం లేదు. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని చెప్పారు. దీని ప్రకారం ఇప్పటికే కనీసం 40వేల కోట్లు ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. కానీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప మీకు బీసీలకు సాధికారత కల్పించే విషయంలో చిత్తశుద్ధి లేదనేది తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైంది. అక్కడ ధర్నా చేస్తే ఎవరూ పట్టించుకోరని దిల్లీకి వచ్చి పగటివేషాలు వేస్తున్నారు. పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, ఆర్థిక పరంగా వైఫల్యం ఇలా వరుసగా మీ చేతకానితనం బయటపడుతుండటంతోనే దిల్లీలో ధర్నా చేసి, వాటి నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా మజ్లిస్ చెప్పినట్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు రాజ్యాధికారం కష్టమేననేది తెలంగాణ సమాజానికి అర్థమైంది. ముందుగా అశాస్త్రీయమైన సర్వే చేసి బీసీల సంఖ్యను తగ్గించారు. ఆ తర్వాత దీనికి 10% ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పులనే నేడు కాంగ్రెస్ కొనసాగిస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టే మతపరమైన రిజర్వేషన్లను బిజెపి అడ్డుకుని తీరుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బిజెపి అంగీకరించదు. 1955లో బీసీలకు రిజర్వేషన్లకు కల్పించాలన్న కాకా కాలేల్కర్ కమిషన్ రిపోర్టును నెహ్రూ పక్కన పెట్టారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ రిపోర్టును ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ప్రతి సందర్భంలోనూ నెహ్రూ కుటుంబం బీసీలకు అన్యాయం చేసింది. వరుసగా మూడు ఎన్నికల్లో దారుణ ఓటమి. కనీసం వంద సీట్లు కూడా దాటని పరిస్థితి. ఈ మధ్య అధికారం గురించి కాంగ్రెస్ పగటి కలలు కంటోంది. నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి విమర్శిస్తే అది ఆకాశం మీద ఉమ్మేయడమే.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రవీణ్

