KRR

రాజగోపాల్ రెడ్డి ధిక్కారం కాంగ్రెస్‌కు ఇరకాటం

మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని ధీమాతో ఎదురుచూసి, తీరా రాకపోయేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుక 20 మంది ఆంధ్రా పెట్టుబడిదారులు ఉన్నారని, వారంతా తెలంగాణ సంపదను దోచుకొంటున్నారని సంచలన ఆరోపణలు చేసినా పార్టీ అధిష్టానం ఆయనను వారించే సాహసం చేయడం లేదు. పైగా, ప్రతిపక్షాల పట్ల రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషను వేలెత్తి చూపడం, ప్రతిపక్షాలపై అభాండాలు వేయడం కాకుండా పరిపాలన చక్కబెట్టుకోవాలటూ హితవు చెప్పడం సైతం మింగుడు పడటం లేదు. నేరుగా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నా వెంటనే క్రమశిక్షణా చర్యలకు పూనుకోకుండా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండటం కాంగ్రెస్ వారికి విస్మయం కలిగిస్తోంది.

రేవంత్ రెడ్డి మాటతీరు, పనితీరుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు. నాకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసింది. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.” అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మరో సందర్భంలో “సీఎం రేవంత్ తన భాష, హావభావాలు మార్చుకోవాలి. ఆయన గంటల తరబడి మాట్లాడకుండా, ఆ శ్రద్ధను పని మీద చూపించాలి. ఆవేశం పని చేయదు, కూల్ మైండ్‌తో పనిచేయాలి” అని సూచించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేస్తున్నాయి. గత నెల హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అసమ్మతి నేతలను విడిగా కలిసి, నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా రాజగోపాల్ రెడ్డిని వచ్చి కలవమని పిలిచినా ఆయన మొఖం చాటేశారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని పదే పదే చెబుతూ తనను పార్టీ అధిష్టానం మోసం చేసిందనే సంకేతం ఇస్తుండటం కూడా పార్టీ నేతలను అయోమయానికి గురిచేస్తున్నది. నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాలపై నిఘా అన్నట్లుగా ఉంటోన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసమ్మతి నేతల విషయంలో మాత్రం అంటీ ముట్టన్నట్లు వ్యవహరిస్తూ మొత్తం నెపాన్ని ముఖ్యమంత్రిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయడంలో జాప్యం చేస్తుండటం ముఖ్యమంత్రి మద్దతుదారులకు విస్మయం కలిగిస్తోంది. తన కంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శలు గుప్పిస్తూ మంత్రివర్గ విస్తరణపై సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కి నష్టం కలుగుతోందని పార్టీ నేతలు భావిస్తున్నా కట్టడి చేసే ప్రయత్నాలు జరగడం లేదు. పరోక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న మంత్రులు ఆయనను రెచ్చగొడుతున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పార్టీలో ముఖ్యమంత్రి ధోరణుల పట్ల ఆగ్రహంతో ఉంటున్న పలువురు కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎటు దారి తీస్తుందో అని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నది.

గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం, నల్గొండ, ఖమ్మం జిల్లాకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఉండటం కాంగ్రెస్‌లో అంతర్గతంగా అసమ్మతికి దారితీస్తుంది. ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత కారణంగా స్థానిక సంస్థలను ఎదుర్కోవడానికి ఒక వంక పార్టీ నాయకత్వం వెనుకడుగు వేస్తుండగా, మరోవంక పార్టీలో కుమ్ములాటలు అగమ్యగోచరంగా మారాయి.

కృష్ణ చైతన్య