Critical Minerals

తెలంగాణకు మరో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

ప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు రక్షణ, వ్యవసాయ, బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ ఇకపై కీలకమైన క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు వేదిక కానుంది. క్రిటికల్ మినరల్స్‌పై పరిశోధలన కోసం దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా అందులో రెండు తెలంగాణకు కేటాయించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవ కారణంగానే తెలంగాణకు రెండు CoEలు మంజూరయ్యాయి.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వివిధ రంగాల్లో కీలకంగా ఉన్న క్రిటికల్ మినరల్స్ విషయంలో మునుపెన్నడూ లేనంత ప్రత్యేక కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. క్రిటికల్ మినరల్స్ సంపదను పెంచుకోవడం ద్వారా క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ ట్రాన్సిషన్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, స్పేస్ తదితర రంగాల్లో కీలకమైన ప్రగతిని సాధించేందుకు వీలుకలుగుతుంది. అందుకే ఈ ఏడాది జనవరిలో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ.16,300 కోట్ల బడ్జెట్‌ కేటాయించడంతో పాటు వివిధ పీఎస్యూల నుంచి మరో రూ.18 వేల కోట్లను సేకరించి ఈ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు.

ఈ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర గనుల శాఖ నిర్ణయించింది. ఇందులో 4 ఐఐటీలు, 3 ఆర్ అండ్ డీ D (రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్) కేంద్రాలున్నాయి. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే, ఐఐటీ-ఐఎస్ఎం ధన్‌బాద్, ఐఐటీ రూర్కీతో పాటు భువనేశ్వర్‌లోని సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ), జంషెడ్‌పూర్‌లోని సీఎస్ఐఆర్-ఎన్ఎంఎల్ (నేషనల్ మెటలర్జికల్ లేబొరేటరీ), కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే హైదరాబాద్‌లోని నాన్-ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (NFTDC) లలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఈ 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కేంద్ర ప్రభుత్వం పరిశోధనల కోసం ఇచ్చే పథకాల ద్వారా నిధులు అందించనున్నారు. ఇవి కాకుండా ఆర్ అండ్ డీ కోసం రూ.500 కోట్లు, అంతర్జాతీయ స్థాయి మానవ వనరుల అభివృద్ధి కోసం మరో రూ.500 కోట్లు ఇవ్వనున్నారు.

ఇటీవలి కాలంలో IIT హైదరాబాద్ శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనల విషయంలో విశేషమైన ప్రగతిని కనబరుస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుని పరిశోధనలను ముందుకు తీసుకెళ్తోంది. గత మార్చ్ 7న సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో (CLEANZ) ఏర్పాటు కోసం కోల్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. NFTDC కూడా ఎలక్ట్రానిక్స్ రంగం పరిశోధనల్లో విప్లవాత్మక సంస్కరణలతో ముందుకెళ్తోంది. చిన్న సైజులో ఉండి సమర్థవంతంగా పనిచేసే ఎలక్ట్రానిక్స్ పరికరాల అభివృద్ధి కోసం ఆల్టర్ మాగ్నెట్స్ను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఫిజిక్స్, మెడికల్ ఇమేజింగ్, నేవిగేషన్‌తో పాటు వివిధ రంగాల్లో అవసరమయ్యే సరికొత్త మ్యాగ్నెటోమెట్రీ విధానాన్ని కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర సాంకేతికతలకు అవసరమయ్యే రేర్ ఎర్త్ మాగ్నెట్స్ను కూడా ఈ కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఇకపై ఐఐటీ హైదరాబాద్, NFTDCల ద్వారా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విశేషమైన పరిశోధనలు జరగనున్నాయి.