ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ కోరాలి
రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం వావి వరసలు కూడా మర్చిపోయి ఫోన్ ట్యాప్ చేసిందని, తన ఫోన్లతో పాటు స్టాఫ్, ఫ్యామిలీ, పని వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆగస్ట్ 8న బండి సంజయ్ కుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు బయలుదేరిన బండి సంజయ్ మార్గ మధ్యలో ఖైరతాబాద్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. బండి సంజయ్ కు మద్దతుగా ప్రజలు, బిజెపి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యకర్తలతో కలిసి విచారణ జరగనున్న దిల్ ఖుష గెస్ట్ హౌస్ కు ర్యాలీగా బయలుదేరారు. బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది పసునూరు మధు, బోయినిపల్లి ప్రవీణ్ రావు, పోగుల తిరుపతిలను కూడా సిట్ పోలీసులు వేర్వేరుగా విచారించారు.
విచారణ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్లను ట్యాప్ చేశారని, తన ఫోన్ ట్యాపింగ్ విషయం తెలుసుకొని షాక్ గురయ్యానని బండి సంజయ్ అన్నారు. తనతోపాటు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు. ‘‘ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి నా దగ్గరున్న సమాచారం, ఆధారాలన్నీ సిట్‌కు అందించాను. సిట్ పోలీసులు ఫోన్ ట్యాప్ వివరాలు వెల్లడిస్తూ చెప్పిన విషయాలను చూసి షాక్ అయ్యాను. నేను పార్టీ పరంగా ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏం చేయాలని భావించినా ముందే పోలీసులకు తెలిసిపోయేది. మా స్టాఫ్ కు ఫోన్ చేసి మీరు ఫలానా ప్రోగ్రాం పెట్టుకున్నారట కదా? అని పోలీసులు అడిగేవాళ్లు. ఫోన్ ట్యాపింగ్ వల్లే ఇదంతా జరిగిందని ఇప్పుడు అర్థమైంది. అందుకే కేసీఆర్ పాలనలో అందరూ వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడుకునే వాళ్లు. చివరకు బిచ్చమెత్తుకునే వాళ్లు కూడా మామూలు కాల్ మాట్లాడే వారు కాదంటే.. బీఆర్ఎస్ పాలనలో ఎంతటి ఘోరాలు జరిగాయో అర్థం చేసుకోవాలి. ఎస్ఐబీ అంటే మావోయిస్టు, టెర్రరిస్టుల కార్యకలాపాలను తెలుసుకుని నియంత్రించడానికి ఏర్పడ్డ వ్యవస్థ. దానిని అడ్డం పెట్టుకుని కేసీఆర్, ఆయన కొడుకు కలిసి పోలీసులను అడ్డుపెట్టుకుని మాలాంటి రాజకీయ నాయకులందరి ఫోన్లను ట్యాప్ చేశారు. ఆశ్చర్యమేంటంటే ఆనాటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఆఖరికి కేసీఆర్ సొంత బిడ్డ కవిత ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో పోలీసులు చెప్పారు. ఎస్ఐబీని అడ్డాగా మార్చి రాజకీయ నాయకులు, వ్యాపారుల, సినిమావాళ్లు సహా ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. వాటికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.
గ్రూప్ 1 పేపర్ లీక్‌కు సంబంధించి ఆందోళన కార్యక్రమం గురించి ఫోన్లో మాట్లాడుకుంటే ట్యాప్ చేసి ముందే పోలీసులు మా ఇంటికి వచ్చి అడ్డుకున్నారు. ఇంకా షాక్ గురైన విషయం ఏందంటే… గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించిన కేసును విచారించిన జడ్జి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారంటే కేసీఆర్ ఎంతటి నీచానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులవే కాదు, వ్యాపారస్తుల ఫోన్లను ట్యాప్ చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈడీ విచారణ కోసం లేఖ ఎందుకు రాయలేదు? రేవంత్ రెడ్డిపై అనేక అనుమానాలున్నాయి. అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా కేసీఆర్, ఆయన కొడుకుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్లను పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిచి విచారణ చేసే అధికారం, దమ్ము సిట్‌కు ఉందా? సిట్ విచారణలో భాగంగా పోలీసులు పిలిస్తే మళ్లీ విచారణకు హాజరవుతా. ’’ అని బండి సంజయ్ అన్నారు.
