వికసిత భారత్ నిర్మాణంలో కీలకం వ్యవసాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో నిరంతర సంస్కరణలు, రైతు-కేంద్రిత కార్యక్రమాల వల్ల గణనీయమైన వృద్ధి నమోదైంది. దీని ఫలితంగా వరి, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్ వంటి పంటల ఉత్పత్తిలో రికార్డులు సృష్టించాం. వ్యవసాయ సంవత్సరం 2024-25కు సంబంధించిన మూడవ ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 35,39,60,000 కోట్ల టన్నులకు చేరింది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యధికం. 2014-15తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ.
1960లలో స్తబ్దత, ఆహార కొరతల నుంచి భారత వ్యవసాయ రంగం ఇప్పుడు భారీ మిగులు స్థాయికి చేరుకుంది. జనాభా పెరుగుదల ఆహార ఉత్పత్తికి మించి ఉంటుందని మాల్థస్ సిద్ధాంతం చెప్పింది. కానీ మన దేశం దాన్ని తప్పు అని నిరూపించింది. 1967లో విలియం, పాల్ పాడక్ అనే నిపుణులు భారతదేశంలో కరువు వస్తుందని అంచనా వేశారు. జనాభాకు సరిపడా ఆహారాన్ని భారత్ పండించలేదని, ఆహార సహాయం చేస్తే భవిష్యత్తులో మరింత కరువు వస్తుందని వాదించారు. కానీ, అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో హరిత విప్లవం (గ్రీన్ రివల్యూషన్) మొదలైంది. ఇది పాడక్ అంచనాలను తప్పు అని నిరూపించింది. 1966-67లో 7.4 కోట్ల టన్నులు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 1979-80 నాటికి 13 కోట్ల టన్నులకు పెరిగింది. 2014-2025 మధ్య కాలంలో వార్షిక పెరుగుదల 81 లక్షల టన్నులుగా ఉంది. అలాగే, ఉద్యాన పంటల ఉత్పత్తి కూడా 1960లలో 4 కోట్ల టన్నుల నుంచి 2024-25 నాటికి 33.4 కోట్ల టన్నులకు పెరిగింది. ఇటీవలి కాలంలో ఏటా 75 లక్షల టన్నుల పెరుగుదల నమోదైంది. ఒత్తిడిని తట్టుకునే వంగడాల అభివృద్ధి, సాగు పద్ధతుల్లో మార్పుల వల్ల పంటల ఉత్పత్తి మరింత స్థిరంగా మారింది.
భారతదేశంలో పాడి, కోళ్ల పెంపకం, మత్స్య రంగాల్లో కూడా అద్భుతమైన వృద్ధి కనిపించింది. 1970లలో ప్రారంభమైన శ్వేత విప్లవం(వైట్ రివల్యూషన్) వల్ల పాల ఉత్పత్తి 2 కోట్ల టన్నుల నుంచి 2023-24 నాటికి 23.9 కోట్ల టన్నులకు పెరిగింది. ఇది యూరప్ దేశాలకు దీటుగా ఉంది. 1980లలో మొదలైన నీలి విప్లవం (బ్లూ రివల్యూషన్) వల్ల చేపల ఉత్పత్తి 24 లక్షల టన్నుల నుంచి 2024-25 నాటికి 1.95 కోట్ల టన్నులకు చేరింది. దీంతో సముద్ర ఉత్పత్తుల ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. కోళ్ల పెంపకం కేవలం దేశ అవసరాలకే కాకుండా ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందింది. కోడిగుడ్ల ఉత్పత్తి 1,000 కోట్ల నుంచి 14,300 కోట్లకు, కోడి మాంసం ఉత్పత్తి 1,13,000 టన్నుల నుంచి 50 లక్షల టన్నులకు పెరిగాయి. 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో జంతువుల నుంచి లభించే ఆహార ఉత్పత్తిలో అపూర్వమైన వృద్ధి కనిపించింది. పాల ఉత్పత్తి ఏటా 1.02 కోట్ల టన్నులు, కోడిగుడ్లు 680 కోట్లు, బ్రాయిలర్ మాంసం 2,17,000 టన్నులు, చేపల ఉత్పత్తి (ప్రధానంగా ఆక్వా రంగం నుంచి) 7.8 లక్షల టన్నులు పెరిగాయి.
సంతానోత్పత్తి, వనరుల నిర్వహణ, నైపుణ్యం ఉన్న మానవ వనరుల వంటి వాటిలో సాంకేతిక పురోగతి ఈ వృద్ధికి ప్రధాన కారణం. పండ్లు, కూరగాయలు, జంతు ఉత్పత్తుల వంటి అధిక విలువ గల ఆహార పదార్థాల ఉత్పత్తి ఆహార ధాన్యాల ఉత్పత్తిని మించిపోయింది. ఇది వ్యవసాయంలో వైవిధ్యాన్ని, మెరుగైన పోషకాహారాన్ని, రైతు ఆదాయాన్ని, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని పెంచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని నిరూపిస్తోంది. భారతదేశం ఆహార ఉత్పత్తిలో సాధించిన విజయం, సాంకేతికత, విధానాల వల్ల పోషకాహారం, రైతు ఆదాయాలు, వాతావరణాన్ని తట్టుకునే శక్తి, ఎగుమతులు ఎలా పెరుగుతాయో చూపిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్) అధ్యయనాల ప్రకారం వ్యవసాయ పరిశోధనపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రూ.13.85, విస్తరణపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రూ.7.40 రాబడి లభిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (సాగునీటి పథకం), పీఎం-కిసాన్ (రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం), జాతీయ పాడి పశువుల కార్యక్రమ (నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్), నీలి విప్లవం వంటి కార్యక్రమాలు వ్యవసాయ వృద్ధిని మరింత బలోపేతం చేశాయి.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆర్థిక వ్యవస్థ ఏటా 7.8 శాతం వృద్ధి చెందాలి. అప్పటికి జనాభా 160 కోట్లకు చేరుతుందని, అందులో సగం మంది పట్టణాల్లో ఉంటారని అంచనా. ఈ మార్పు వల్ల మొత్తం ఆహార డిమాండ్ రెట్టింపవుతుంది. పండ్లు, కూరగాయలు, జంతు ఆధారిత ఆహార పదార్థాల డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుంది, కానీ ఆహార ధాన్యాల డిమాండ్ స్థిరంగా ఉంటుంది. ఇది ఆహార ధాన్యాల మిగులుకు దారితీస్తుంది. అయితే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల వ్యవసాయ భూమి 18 కోట్ల హెక్టార్ల నుంచి 17.6 కోట్ల హెక్టార్లకు తగ్గుతుంది. సగటు భూకమతం విస్తీర్ణం ఒక హెక్టార్ నుంచి 0.6 హెక్టార్లకు తగ్గుతుంది. ఇది నీరు, ఎరువులపై ఒత్తిడిని పెంచుతుంది. వాతావరణ మార్పులు మరింత పెద్ద ముప్పుగా మారాయి. ఇది సుస్థిర (భూమి, ప్రకృతి వనరుల క్షయాన్ని నివారించే) వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రజల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తుంది.
భారతదేశం ఎదుర్కొంటున్న కొత్త వ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ఉత్పత్తి వ్యూహాలను మార్చాల్సిన అవసరం ఉంది. మనం ఏటా 2 కోట్ల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాం. వరి పండించడానికి నీరు చాలా అవసరం అవుతుంది. కానీ భూగర్భ జలాల లభ్యత ప్రమాదకరంగా తయారైంది. అదే సమయంలో వంట నూనెలు, పప్పు ధాన్యాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఆహార భద్రతను కాపాడటానికి, రైతుల ప్రయోజనాలను రక్షించడానికి, వనరులను సంరక్షించడానికి, పంటల ప్రణాళికలో నీటిని తక్కువగా ఉపయోగించే నూనెగింజలు, పప్పుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అనేక కారణాల వల్ల ఉపయోగించకుండా ఉన్న సుమారు 1.2 కోట్ల హెక్టార్ల వర్షాధార వరి సాగు భూముల్లో పప్పు ధాన్యాలు, నూనెగింజల సాగును పెంచవచ్చు. కానీ, నూనెగింజల దిగుబడిలో 18-40 శాతం వరకు, పప్పుధాన్యాల్లో 31-37 శాతం లోటు ఉంది. ఇది సాంకేతిక అభివృద్ధి ఎంత అవసరమో చూపిస్తోంది.
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ (వికెఎస్ఏ) కార్యక్రమం కింద 728 జిల్లాల్లో 1.35 కోట్ల మంది రైతులకు మార్గదర్శకత్వం, శిక్షణ లభిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తల మధ్య ప్రత్యక్ష సంబంధాల ద్వారా మంచి సాగు పద్ధతులను ప్రోత్సహించారు. ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం నూనెగింజలు, పప్పు ధాన్యాలు, పత్తి కోసం అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై దృష్టి పెట్టింది. ఉత్పాదకత, వాతావరణాన్ని తట్టుకునే శక్తి, వనరుల సామర్థ్యాన్ని పెంచడానికి వ్యవసాయ పరిశోధన ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఖర్చులను తగ్గించి, నష్టాలను నివారిస్తుంది. సమాచారం కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ, సమాచార విశ్లేషణ (డేటా అనలిటిక్స్) వంటి ఆధునిక సాధనాలు ప్రపంచ వ్యవసాయ పరిశోధనలో మార్పులు తెస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశం జీడీపీలో 0.5 శాతం, అంటే ఏటా రూ 11,600 కోట్లు వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం ఈ నిధులను పెంచి, డిమాండ్ ఆధారిత విధానాన్ని అనుసరించాలని యోచిస్తోంది. కృషి విజ్ఞాన కేంద్రాలు, రాష్ట్రాల్లో విస్తరణ వ్యవస్థలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం వల్ల పరిశోధనను రైతులకు మరింత చేరువ చేయవచ్చు. ‘ఒకే దేశం-ఒకే వ్యవసాయం, ఒకే బృందం’ అనే నినాదంతో ఐసిఏఆర్ నోడల్ అధికారులు వికసిత భారత్ నిర్మాణానికి రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళికలకు మార్గదర్శనం చేస్తున్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్,
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

