Malegaon Blast

కాంగ్రెస్ హిందూ వ్యతిరేకతను బయటపెట్టిన తీర్పు

మాలేగావ్ పేలుళ్ళ కేసులో ఇటీవలి తీర్పు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞా వంటి వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించడమే కాదు, హిందూ సమాజం పట్ల కాంగ్రెస్ పార్టీలో లోతుగా పాతుకుపోయిన వివక్షను బహిర్గతం చేసింది. న్యాయం, రాజ్యాంగ నైతికత, భారతదేశ సమ్మిళిత స్ఫూర్తిని విశ్వసించే వారంతా కాంగ్రెస్ పార్టీలోని ఈ సైద్ధాంతిక విషాన్ని గుర్తించాలి. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను తమ లక్ష్యాలకు అనుగుణంగా అడ్డగోలుగా వాడుకున్న, తప్పుడు కథనాలను ప్రచారం చేసిన, కొన్ని వర్గాలను నేరస్తులుగా చిత్రీకరించచూసిన రాజకీయ వ్యవస్థకు గుణపాఠం. సహేతుకమైన సందేహాలకు తావులేకుండా సాక్ష్యాలను అందించడంలో ప్రాసిక్యూషన్ ఎలా విఫలమైందో, సాక్షులు ఎలా ప్రతికూలంగా మారారో, రాజకీయ ఉద్దేశంతో కేసు స్వరూపాన్ని ఎలా మార్చేశారో కోర్టు వివరించింది.

ఉగ్రవాద నెట్ వర్క్ లలో చొరబడే బాధ్యత అప్పగించిన ఒక ఆర్మీ అధికారినే ఉగ్రవాది అని ముద్రవేశారు. ఆయన తొమ్మిదేళ్ల జైలు జీవితం కేవలం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు – ఇస్లామిక్ ఉగ్రవాదానికి సమానంగా ప్రజల దృష్టిలో “హిందూ ఉగ్రవాదాన్ని” సృష్టించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన ఫలితం. ఈ వికృత కథనాన్ని ముగ్గురు కీలక కాంగ్రెస్ నేతలు క్రమపద్ధతిలో నిర్మించారు. బాంబు పేలుళ్లలో అతివాద హిందూ సంస్థల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ 2010 ఆగస్టులో అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ‘కాషాయ ఉగ్రవాదం’ అనే కొత్త అంశం గురించి బహిరంగంగా హెచ్చరించారు. అప్పుడు ఆయన సహచరుడు దిగ్విజయ్ సింగ్ ఈ పదాన్ని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రాచుర్యంలోకి తెచ్చారు. “హిందువులలో ఉగ్రవాదం” అని పదేపదే ఆరోపణలు చేస్తూనే మరోవైపు ఉగ్రవాదానికి మతం లేదని ఉద్ఘాటించేవారు. 2013 జనవరిలో జరిగిన పార్టీ సమావేశంలో అప్పటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ‘కాషాయ ఉగ్రవాదాన్ని’ సమర్థించడంతో ప్రచారం తారస్థాయికి చేరింది. చాలా సంవత్సరాల తరువాత ఈ పదాన్ని సృష్టించడం తప్పు అని షిండే అంగీకరించారు. కానీ అప్పటికే అమాయకుల జీవితాలకు, భారతదేశ సామాజిక నిర్మాణానికి కోలుకోలేని నష్టం జరిగింది. ఈ వికృత కథనం దౌత్య సందేశాల్లోకి కూడా ప్రవేశించింది. లష్కరే తోయిబా కంటే హిందూ తీవ్రవాదం భారత్ కు పెద్ద ముప్పు అని 2009 నాటి అమెరికా రాయబారి తిమోతి రోమర్‌తో రాహుల్ గాంధీ చెప్పినట్లు వికీలీక్స్ కేబుల్ (దౌత్య సందేశం)లో పేర్కొన్నారు. ఇది పొరపాటున చేసిన వ్యాఖ్య కాదు. కాంగ్రెస్ సిద్ధాంతాల దిశకు ఇది ఒక సూచిక. ఆ పార్టీ దృష్టిలో హిందువు ఎప్పుడూ సమస్యే. మైనారిటీ ఓటు బ్యాంకు మాత్రం ఎల్లప్పుడూ విలువైనదే. సత్యాన్ని పణంగా పెట్టయినా దాన్ని కాపాడుకోవాలి. 

ఓటుబ్యాంకు సంతుష్టీకరణ 

1951కి వెళ్తే… శతాబ్దాల విధ్వంసం తరువాత సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించినప్పుడు, భారతదేశపు మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. కానీ జవహర్ లాల్ నెహ్రూ అది ‘హిందూ పునరుజ్జీవనవాదం’గా కనిపిస్తుందనే భయంతో తిరస్కరించారు. ఇక 1985లో భరణం కోరుతున్న షా బానో అనే ముస్లిం మహిళకు అనుకూలంగా సుప్రీంకోర్టు ప్రగతిశీల తీర్పు వెలువరించింది. కానీ రాజీవ్ గాంధీ సంప్రదాయవాద ముస్లిం మతపెద్దల ఒత్తిడికి తలొగ్గి చట్టం ద్వారా ఈ తీర్పును పరిహసించారు. 1988లో కాంగ్రెస్ ప్రభుత్వం సల్మాన్ రష్దీ రాసిన ‘ది సాటానిక్ వర్సెస్’ను నిషేధించింది. నిజానికి ఈ పుస్తకం గురించి అప్పటికీ దేశంలో ఏ నిరసనలూ జరగలేదు. ప్రభుత్వ నిషేధ నిర్ణయం శాంతి భద్రతల గురించి కానేకాదు. ఇది ముందుగానే ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి ఉద్దేశించింది. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఈ ప్రకటన “అభివృద్ధి ఫలాలలో మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు సమానంగా భాగస్వాములు అయ్యేలా చూడటానికి మేం వినూత్న ప్రణాళికలను రూపొందించాలి. వనరులపై వారికి మొదటి హక్కు ఉండాలి.” బహుశా అన్నిటికంటే దిగ్భ్రాంతికరమైనది. జాతీయాభివృద్ధిని మతం అనే జల్లెడతో వడకట్టాలని అంటే పేద హిందువు, దళిత విద్యార్థి, గిరిజన బిడ్డ సంగతేంటి? వారి పోరాటానికి విలువ లేదా?

రాహుల్ గాంధీ ‘సామాజిక న్యాయం’ గురించి, దళిత హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏఎంయూ, జామియా వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు నిరాకరించడం సామాజిక న్యాయానికి ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించాలి. ఇది కపటత్వానికి పరాకాష్ట – ఓట్ల కోసం దళిత చిహ్నాలను ఉపయోగించడం, విధానాల్లో దళిత ప్రయోజనాలను క్రమపద్ధతిలో బలహీనపరచడం. ఇది కేవలం కాంగ్రెస్ గురించే కాదు. ఇది భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించినది. సైద్ధాంతిక విద్వేషం, చారిత్రక పక్షపాతం కొనసాగితే ఒక దేశం ముందుకు సాగదు. హిందూ అస్తిత్వం అతివాదమైనది కాదు. ఇది నాగరికత. దాన్ని ఉగ్రవాదంతో పోల్చేవారు భారతదేశ చరిత్రను అవమానించడమే కాదు- దాని భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. తప్పుడు ఆరోపణలతో ఎవరినైతే వేధించిందో ఆ వ్యక్తులకు, చట్టాలను పక్కనపెట్టి ఏ సంస్థలనైతే తన ప్రయోజనాలకు వాడుకుందో ఆ సంస్థలకు, ‘లౌకికవాదం’ పేరుతో అవమానాలు భరించిన నిశ్శబ్ద హిందూ మెజారిటీకి ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి.

గురు ప్రకాశ్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి