Manoj Sinha

ఉగ్రవాద బాధితులకు న్యాయం, సాయం అందిస్తున్నాం

Manoj Sinha 2మే నెలలో జరిగిన డ్రోన్ దాడుల తర్వాత ఆకాశం ప్రశాంతంగా ఉన్నప్పటికీ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉన్నాయి. యూనిఫారం ధరించిన సైనికులు పెద్దగా కనిపించక పోయినా పుల్వామా, త్రాల్, షోపియాన్, బారాముల్లా ప్రాంతాల్లో భద్రతా దళాలు తెరవెనుక చురుగ్గా ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ అనంతరం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యలను ఉద్దేశిస్తూ ‘ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంద’ని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. కేంద్రపాలిత ప్రాంతంలో కీలకమైన శాంతిభద్రతల బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిన్హా ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ఒక ఆంగ్ల వార్తాపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. కళ్ళముందు కొనసాగుతున్న భద్రతా చర్యలు అటుంచి దశాబ్దాల ఉగ్రవాద ప్రభావాన్ని అనుభవించిన కాశ్మీరీ ఇళ్లలో మరో యుద్ధం నిశ్శబ్దంగా జరుగుతోందని, ఉగ్రవాదంపై పోరాటంలో బాధితులకు న్యాయం, ఉపశమనం కూడా లభించాలని, గత మూడు దశాబ్దాలుగా బాధితులకు మద్దతు అందించడం క్లిష్టమైన సవాలుగా మారిందని సిన్హా అన్నారు. ఇంటర్వ్యూలోని ప్రధానాంశాలు:

 

ప్ర: ఏప్రిల్ 22న పహల్గాం దాడికి ముందు జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ప్రధాన భద్రతా సవాళ్లు ఏమిటి?

జ: ఉగ్రవాద సంస్థల్లో స్థానికులు చేరడం గణనీయంగా తగ్గింది. గతంలో ఏటా 100 నుంచి 150 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరేవారు. ఈ ఏడాది ఒకే ఒక్క రిక్రూట్ మెంట్ జరిగింది. గత ఏడాది కేవలం ఆరేడు మంది మాత్రమే చేరారు. ప్రజలు శాంతిని, అభివృద్ధిని విశ్వసించడం ప్రారంభించారని ఇది సూచిస్తుంది. శాంతిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. సంక్షేమం జీవితాలను మార్చింది. గత ఐదారేళ్లలో ఇదొక చారిత్రాత్మక మార్పు అని నమ్ముతున్నాను. మన పొరుగు దేశం చొరబాటుదారులను పంపుతూనే ఉందని ఉగ్రవాద ఘటనల సంఖ్య తెలియజేస్తోంది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనేక ఆపరేషన్లు విజయవంతమయ్యాయి, కొన్ని కొనసాగుతున్నాయి. సైన్యం, పోలీస్, కేంద్ర సాయుధ దళాల మధ్య సమన్వయం బలంగా ఉంది.

ప్ర: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాల పనితీరులో ఏం మార్పు వచ్చింది?

జ: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. ఉగ్రవాదం, పర్యాటకం కలిసి మనలేవని, ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి పోలేవని, నీరు, ఉగ్రవాదం కలిసి ప్రవహించవని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తారు. సాయుధ బలగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే (ఆపరేషన్ సిందూర్ సందర్భంగా) ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు. పాక్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనం నేరుగా స్పందించాం. సందేశం స్పష్టంగా ఉంది: పాకిస్తాన్‌లో ప్రతిదీ మనకు అందుబాటులో ఉంది. దీన్ని దేశం, ప్రపంచం చూసింది. పాక్ వాదనలు అవాస్తవమని రుజువయ్యాయి. మన స్వదేశీ రక్షణ వ్యవస్థలు తమ సామర్థ్యాన్ని చాటుకున్నాయి.

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా అనుసరిస్తోంది. తమ పౌరులకు కనీస జీవన స్థితిగతులు కల్పించలేక, ఇతర దేశాల నుంచి రుణాలు తీసుకుని బతుకుతున్నా వారికి ఆ బాధలేదు. మరోవైపు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. కాబట్టి, రెండు దేశాల మధ్య పోలిక లేదు, రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన పాకిస్తాన్‌ను మనం ఊహించలేం.

ప్ర: మీరు ‘నయా కాశ్మీర్’ గురించి మాట్లాడారు, కానీ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఇంకా కాలక్రమాన్ని కేంద్రం ప్రకటించలేదు.

జ: ఇది నవ కాశ్మీర్. సినిమా హాళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. 33 ఏళ్ల తర్వాత వరుసగా మూడేళ్ల పాటు మొహర్రం ఊరేగింపులు జరిగాయి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ తమ పండుగలను సగర్వంగా జరుపుకొంటారు. అమర్‌నాథ్ యాత్ర విజయవంతమైంది. యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ రెట్టింపైంది. జమ్ముకశ్మీర్ యువత ఇప్పుడు అభివృద్ధి చెందిన భారత్ ఆకాంక్షలను పంచుకుంటోంది. రాష్ట్ర హోదా విషయానికి వస్తే, అధికరణం 370 రద్దు బిల్లు ఆమోదం పొందినప్పుడు, ప్రభుత్వం మూడు దశలను అనుసరిస్తానని చెప్పింది: మొదట నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, తరువాత ఎన్నికలు, ఆ తర్వాత తగిన సమయంలో రాష్ట్ర హోదా. పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు చివరి దశ, రాష్ట్ర హోదా, అది కూడా జరుగుతుంది. పార్లమెంటులో చెప్పిన మాటను ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ వాడిన పదం ‘తగిన సమయం’. గత ఏడాది శ్రీనగర్‌లో ప్రధాని ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. సరైన సమయం కోసం ఎదురుచూడాలి.

 ప్ర: ఉగ్రవాదూదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అధికరణం 311 కింద తొలగిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపిస్తున్నారు?

జ : అంతర్గత ముప్పుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు మన రాజ్యాంగ నిర్మాతలు అధికరణం 311ని చేర్చారు. ప్రతి తొలగింపును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై అధికరణం 311 కింద తీసుకుంటున్న చర్యలు సామాజిక, మత ఆధారితమైనవి కావు. ఫలానా సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపించవచ్చు కానీ, ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురిని కూడా చర్యల నుంచి మినహాయించారు. ఇందులో మతపరమైన కోణం లేదు. తొలగించిన వారిలో చాలా మందికి గత లేదా క్రియాశీల ఉగ్రవాద చరిత్ర ఉంది. చాలా మంది జైల్లో ఉన్నారు. అమాయకుడిపై మేం ఎప్పటికీ చర్యలు తీసుకోం. రాష్ట్రానికి హాని కలిగించేవారిపై మాత్రమే చట్టాన్ని ప్రయోగించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ప్ర: జమ్ముకశ్మీర్‌లో అసమ్మతి స్వరాలను అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది?

జ: ఎవరి గొంతునూ నొక్కుతున్నారని నేను అనుకోవడం లేదు. రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు స్వేచ్ఛగా పాల్గొన్నాయి. అర్థరాత్రి వరకు రాజకీయ ప్రచారం చేసుకున్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేలు యథావిధిగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని అనుకుంటున్నాను. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది. ఎవరిపైనా ఆంక్షలు లేవు. జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూసుకోవడమే మేం చేస్తున్న ప్రయత్నం. అవి ప్రభుత్వం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. రాజకీయ కార్యకలాపాలు లేదా ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్నారని దీని అర్థం కాదు.

ప్ర: పహల్గాం దాడి తర్వాత పర్యాటక ప్రాంతాల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జ: ఘటన అనంతరం హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. గుల్మార్గ్, పహల్గాం, సోనామార్గ్ వంటి అన్ని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో తప్పనిసరిగా భద్రతను పెంచాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. సమీక్ష అనంతరం 15-16 ప్రదేశాలను తిరిగి తెరిచారు. మరికొన్నింటిని పూర్తి భద్రతా ఏర్పాట్లతో క్రమంగా తెరుస్తారు.

ప్ర: దశాబ్దాలుగా జరిగిన ఉగ్రవాద ఘటనల్లో అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. వారి జీవితాలను పునర్నిర్మించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది?

జ: ఇటీవల నేను బారాముల్లాలో ఉగ్రవాద బాధిత కుటుంబాలను కలిశాను. అదొక లోతైన భావోద్వేగ అనుభవం. కొందరికి ఆర్థిక సాయం అందలేదు. ఇంకొందరు డిపెండెంట్ సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అవి లేకపోతే ఉద్యోగాలు దొరకడం లేదు. కొందరికి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు, మరికొందరు ఇళ్లు, భూములు కోల్పోయారు. వెంటనే నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్థిక సహాయం లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన వారికి వీటిని అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన 15 రోజుల్లోనే 40 మందికి పైగా ఉద్యోగాలు కల్పించారు. ఆర్థిక సాయం అందని మరికొందరిని విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్లు లేని వారికి పోలీసులు హెల్ప్ లైన్ ద్వారా దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. కొన్ని సందర్భాల్లో వారి భూములను ఉగ్రవాదులు కబ్జా చేశారు. వారి ఆస్తులను రికవరీ చేసేందుకు సహకరిస్తున్నాం. స్వయం ఉపాధిని కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద బాధితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా ఆర్థిక సహాయం, ఇతరత్రా మద్దతు అందిస్తారు. దీనిని పూర్తిగా ప్రభుత్వ విధానంతో నిర్వహిస్తున్నారు. ఏనాడూ తమ బాధలు చెప్పుకోలేక పోయిన వారికి న్యాయం, ఉద్యోగాలు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం.

ప్ర: ఇన్నేళ్ల తర్వాత ఉగ్రవాద బాధితులను ప్రభుత్వం ఎలా గుర్తిస్తోంది?

జ: జిల్లాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్లను డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లు నిర్వహిస్తున్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ లైన్ ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. ఇందులో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నోడల్ అధికారిగా ఉంటారు. ఈ హెల్ప్ లైన్‌లకు వస్తున్న కాల్స్‌ను మేం విశ్లేషించాం. ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన కేసులను ప్రాధాన్యతా క్రమంలో తిరిగి తెరవాలని డిప్యూటీ కమిషనర్లను, ఎస్ఎస్పీలను కోరాలని నిర్ణయం తీసుకున్నాం- ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయండి, ఉగ్రవాద బాధిత కుటుంబాల బంధువులందరికీ ఉద్యోగాలు కల్పించండి అని ఆదేశాలిచ్చాం. ఉగ్రవాద బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించడం, బాధితులకు ఆర్థిక సహాయం అందించడం ఈ ప్రత్యేక విభాగం పని. సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం బాధిత కుటుంబాలకు సహాయం చేసేటప్పుడు క్లెయింలను నిరంతరం పరిశీలిస్తోంది. ఇది నిరంతర ప్రక్రియ. గత 25-30 ఏళ్లలో నష్టపోయిన వారికి చివరికి ఉపశమనం లభించేలా చూడాలని మేం కృషి చేస్తున్నాం.

ప్ర: పాత కేసుల్లో చాలా వరకు 1990వ దశకంలో తీవ్రవాదం తారస్థాయికి చేరిన నాటివి. మూడు దశాబ్దాల తర్వాత వారికి న్యాయం చేయడానికి తీవ్రమైన చట్టపరమైన అడ్డంకులు ఉండవా?

జ: ఇలాంటి కేసులు చాలా ఉన్నమాట వాస్తవం. పోలీసులు గరిష్ట సహాయం అందించడానికి ప్రతి కేసును విశ్లేషించే పనిలో ఉన్నారు. 1998 జనవరిలో గండేర్బల్లోని వాండ్హామాలో 23 మంది కశ్మీరీ పండిట్లను కిరాతకంగా ఊచకోత కోయడం, పట్టపగలే అమాయకులను హతమార్చడం సహా 23 కేసులను తిరిగి తెరవాలని నిర్ణయించాం. అసంపూర్తిగా ఉన్న ఈ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు పోలీసులు తమ వంతు కృషి చేయనున్నారు.

ప్ర: యువతలో దీర్ఘకాలంగా నెలకొని ఉన్న నిర్లిప్తత, ఉగ్రవాద వర్గాల నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా వారిని ప్రధాన స్రవంతిలోకి ఎలా తీసుకురాగలం?

జ: ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించడం యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో పెద్ద పాత్ర పోషించవచ్చని నేను భావిస్తున్నాను. గత ఐదేళ్లలో యువత సాధికారత కోసం అనేక పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి 9.5 లక్షల మందికి పైగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు పనిచేయడమే కాకుండా విద్యను ప్రోత్సహిస్తూ, వారి భవిష్యత్తుకు కొత్త ప్రణాళికలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రతి పంచాయతీ నుంచి బాలికలతో సహా కనీసం 15 మంది యువతను ఆకర్షించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సృష్టించేందుకు చేపట్టిన ‘బ్యాక్ టు విలేజ్’ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. సమర్థులకు, అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇటీవలి సంవత్సరాలలో 40,000 పైగా ప్రభుత్వ పోస్టులను భర్తీ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలను వేగంగా ప్రకటించిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి నమ్మకం పెరిగింది. మా విధానం స్పష్టంగా ఉంది: ‘అమాయకులను ఇబ్బంది పెట్టవద్దు, కాని దోషులను విడిచిపెట్టవద్దు.’

ప్ర: జమ్ముకశ్మీర్ యువత స్టార్టప్‌లు, ఆవిష్కరణలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తోంది?

జ: జమ్ముకశ్మీర్‌లో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ పట్ల యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ శాఖలో 1,000కు పైగా స్టార్టప్‌లు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో నమోదైన స్టార్టప్‌ల సంఖ్యను నేను చేర్చడం లేదు. ఇది సానుకూల ధోరణి. గమనించదగిన విషయం ఏమిటంటే ఈ స్టార్టప్ లలో మూడింట ఒక వంతుకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిభకు కొదవలేదు. అనేక విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థలు కేంద్రపాలిత ప్రాంతంలో ఆవిష్కరణలకు నాయకత్వం వహించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో అవకాశాల అన్వేషణకు యువతను ప్రోత్సహిస్తున్నాయి.