ఫిరాయింపు ఎమ్యెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా?
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశ్యాలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే అయినప్పటికీ, ఈ చట్టాన్ని అమలు చేయడంలో వివిధ రాజకీయ పార్టీలు చూపుతున్న నిర్లక్ష్య, అవకాశవాద ధోరణుల కారణంగా ఫిరాయింపులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఒక పార్టీ నుండి రాజీనామా చేసే సమయంలో ఆ పార్టీ ద్వారా లభించిన అధికార పదవులకు సైతం రాజీనామా చేయాలి అన్నది ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయంగా భావిస్తుంటాం. పైగా, గత ఏడాది ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుండి ఎవరైనా తమ పార్టీలో చేరాలి అనుకొంటే ముందుగా ఆ పార్టీ ద్వారా పదవులకు రాజీనామా చేయాల్సిందే అని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. ఈ విషయమై ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు సందర్భాలలో స్పష్టమైన ప్రకటనలు చేశారు. అయితే, తెలంగాణలో ఆ విధానానికి తూట్లు పొడిచి, బీఆర్ఎస్ నుండి ఎన్నికైన 10 మంది ఎమ్యెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్, వారిపై స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోకుండా కాపాడుతూ వస్తున్నది. పైగా, ఆ విధంగా ఫిరాయించిన మాజీ మంత్రి దానం నాగేందర్ ను ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయకుండానే గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సాంకేతికంగా, ఇంకా రాష్ట్ర శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
సుప్రీంకోర్టు సుదీర్ఘ వాదనల అనంతరం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో చిట్టచివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి ఆగస్టు 22న నోటీసులు పంపించారు. వీరి విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జులై 31న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ విధంగా నోటీసులు జారీచేయక తప్పలేదు. ఈ నేపథ్యంలో దానిపై అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే, వారంతా దానం నాగేందర్ మినహాయించి ఇంకా సాంకేతికంగా తాము బీఆర్ఎస్ సభ్యులమే అని వాదించి, ఫిరాయింపు చట్టం కింద చర్యలు లేకుండా తప్పించుకునే అవకాశం లేకపోలేదు. కాగా, తనకు నోటీసులు అందాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారని చెప్పారు. నోటీసుపై న్యాయనిపుణులతో మాట్లాడి వివరణ ఇస్తానని తెలిపారు. తాను అసలు పార్టీ మారలేదని, సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని వెల్లడించారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, ఇప్పటికీ తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేయడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సమయం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపుల చట్టాన్ని తుంగలోకి తొక్కి అడ్డదిడ్డంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉండటం జరుగుతూ వస్తున్నది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం ఇదేవిధంగా ఫిరాయింపులను ప్రోత్సహించి, అసెంబ్లీ ఐదేళ్ల గడువు పూర్తయ్యే వరకు స్పీకర్ చర్య తీసుకోకుండా చేయగలిగారు. గడువు పూర్తయ్యే ముందు స్పీకర్ పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అయితే టీడీపీ, కాంగ్రెస్ శాసనసభ పక్షాన్నే తమ పార్టీలో విలీనం చేసుకోవడం, పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 24 మంది వైసీపీ ఎమ్యెల్యేలను చేర్చుకొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నలుగురు టీడీపీ ఎమ్యెల్యేలను తమలో చేర్చుకున్నారు. ఒక విధంగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులు ఆ చట్టాన్ని దుర్వినియోగం, నిరర్ధకం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవకాశవాద ధోరణులు అందుకు తోడ్పడుతున్నాయి. అసెంబ్లీ లోపల స్పీకర్ ను నిర్ధేశింపలేమంటూ ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేక పోతున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ చట్టం పట్ల అనుసరిస్తున్న అవకాశవాద వైఖరులు ఈ సందర్భంగా స్పష్టం అవుతున్నాయి.
కృష్ణ చైతన్య

