కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ఎండగట్టాలి
‘‘మసిపూసి మారేడుకాయ చేయడం’’ అనేది రేవంత్ రెడ్డి పాలనలో పరిపాటిగా మారింది. ఆగస్ట్ 30, 31న రెండు రోజులు తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు విషయమై జరిపిన చర్చ “కొండను తవ్వి ఎలుకను పట్టిన” చందంగా ఉంది. అధికారంలోకి వచ్చిన 22 మాసాల తర్వాత కనువిప్పు అయిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కుంభకోణం సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గుర్తించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “కాళేశ్వరం అవినీతి దేశంలోనే అతి పెద్ద స్కామ్” అని, అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో మెక్కిన సొమ్మంతా కక్కిస్తామన్నారు. 22 నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా కక్కించలేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక స్వరం మార్చారు. రేవంత్ రెడ్డి అధిష్టానం ఒత్తిళ్లకు తలొగ్గారా, లేక కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందా, లేక ఇంకేం రహస్య ఎజెండా ఉందో తెలియదు కానీ, సీబీఐ దర్యాప్తు కోరితే బీఆర్ఎస్కు బిజెపి మేలు చేస్తుందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. సీబీఐ దర్యాప్తుపై వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి కాలయాపనకు మార్గం సుగమం చేశారు.
రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ప్రాజెక్టును అనూహ్యంగా అంచనాలు పెంచి లక్ష కోట్ల వరకు నిధులు వెచ్చించడమే కుంభకోణానికి ప్రబల నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక కుటుంబం వేల కోట్లకు పడగలెత్తిన విషయం తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కూడా కాళేశ్వరం నిర్మాణం నాసిరకమని, నిర్లక్ష్యం–అవినీతి కారణంగానే ప్రాజెక్టు ధ్వంసం అంచున ఉందని నివేదిక ఇచ్చింది. విజిలెన్స్, కాగ్ లాంటి సంస్థలు కూడా అవినీతికి సంబంధించిన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. అయినా సీబీఐ దర్యాప్తునకు ఇవ్వకుండా చోద్యం చూశారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అవినీతి ఆధారాలను నీరుగార్చేందుకే పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కాలయాపన చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి.
చివరకు విధిలేని పరిస్థితిలో సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానించారు. నిజాయితీ ఉండి ఉంటే ఈ నిర్ణయం 22 నెలల క్రితమే తీసుకోవాల్సింది, కానీ కమిషన్ల పేరుతో కాలం గడిపారు. సీబీఐ విచారణకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు కాలయాపన చేసిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ సంపదను దోచుకున్నవారికి శిక్ష పడాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఆధారాలను సీబీఐకి సమర్పించాలి. సీబీఐపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహావేశాలకు లోనుకాక తప్పదు. బీఆర్ఎస్కు పట్టిన గతే, కాంగ్రెస్కు–సీఎం రేవంత్ రెడ్డికి పడుతుంది.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 20 నెలలు గడిచినా కాంగ్రెస్ చిత్తశుద్ధి చూపలేదు. 22 మాసాలు మీనమేషాలు లెక్కిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసే చట్టసవరణను చేయలేదు. ఒకసారి “కులగణన సర్వే” అన్నారు; తర్వాత “డెడికేషన్ కమిటీ రిపోర్ట్” అన్నారు; ఇంకోసారి “బూసాని వెంకటేశ్వరరావు కమిషన్” ద్వారా శాస్త్రీయంగా విచారణ చేస్తామని అన్నారు. ఇలా కమిషన్ల పేరుతో జాప్యం చేశారు తప్పితే బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన చేయలేదు. ఆ తర్వాత “ఆర్డినెన్స్ తీసుకొచ్చాం” అన్నారు. దిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)లో సవరణ చేస్తూ, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న నిర్ణయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ నిర్ణయం కూడా గత 22 మాసాలకే తీసుకోవాల్సింది. ఎందుకు ఆలస్యం చేసినట్లు..? న్యాయపరమైన చిక్కులు, అవరోధాలను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే బీసీలను మోసం చేయడం. కాకా కలేల్కర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు బీసీలకు మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. సంచార జాతుల కోసం 16 కమిషన్లు/కమిటీలు వేసి సిఫార్సులు చేసినా ఒక్కటీ అమలు చేయని ఘనత కాంగ్రెస్ సొంతం.
ఎన్నికల ముందు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, కాళేశ్వరం అవినీతి సొమ్ము కక్కిస్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయమైనా, కాళేశ్వరం అవినీతి అయినా కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల మధ్య ఎండగట్టాలి. బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించాలి. ఇందుకు ప్రతి బిజెపి కార్యకర్తా చొరవ చూపాలి.

