nrr

ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ తహతహ

ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. 42% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోందని, హిందువులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ కళ్ళు మూసుకుంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత చేసిన పోరాటాన్ని మరచిపోతున్నారన్నారు. నిజాం రాజు గొప్పోడు అని కేసీఆర్ పొగిడారని, తెలంగాణ ప్రజలపై నరమేధం చేసిన నిజాం ఎలా గొప్ప పాలకుడో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. సెప్టెంబర్ 2న నిజాం, రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా నిజాం, రజాకార్లపై పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన యోధులకు నివాళులు అర్పించి, అమరుల కుటుంబాలను సన్మానించారు. గుండ్రాంపల్లిలో నిర్వహించిన భారీ ర్యాలీలో  ఎన్. రాంచందర్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్, డా. మనోహర్ రెడ్డితో పాటు బిజెపి నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. 

ఈ సమావేశంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. ‘‘నిజాం పాలనలో జరిగిన అకృత్యాలు మరువలేనివి. రజాకార్లు గుండ్రాంపల్లిపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడేసి సామూహిక దహనం చేశారు. మహిళలను వివస్త్రులను చేసి బతుకమ్మ ఆడించారు. ఆ ఘటన మరిచిపోలేని విషాద ఘట్టం. గుండ్రాంపల్లి గ్రామం సాహస చరిత్రకు ప్రతీక. నిజాం వ్యతిరేక పోరాటంలో భైరాన్‌పల్లి బురుజు, పరకాల అమరధామం, నిజామాబాద్ జైలు, నిర్మల్ సహా అనేక ప్రదేశాలు కీలక ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయి. విమోచన దినోత్సవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ భయంతో పెట్టడం లేదు. 

సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలనే డిమాండ్ మొదట సీహెచ్. విద్యాసాగర్ రావు లేవనెత్తారు. ఆయన సూచనతోనే ఆనాడు కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, టీఆర్ఎస్ తదితర అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఈ చరిత్రను వివరించాను. నేడు ఆ కార్యాలయాల్లో మూడు రంగుల జెండా ఎగురవేసి “జనగణమన” పాడుతున్నారంటే అది విద్యాసాగర్ రావు కృషి ఫలితం. అందులో నేను భాగస్వామి కావడం గర్వకారణంగా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా విముక్తి దినోత్సవంగా జరుపుతున్నాయి. కానీ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు, తరువాత టీఆర్ఎస్–కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుతానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక వాగ్దానం నిలబెట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతోంది. తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగాలంటే.. 2028లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావాల్సిందే. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. సోనియమ్మ వందలాది యువకులను బలితీసుకుంది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చామని చెబుతోంది. కానీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వారి ఎంపీలు హాజరే కాలేదు. కాంగ్రెస్‌కి మెజారిటీ లేకపోయినా, బిల్లు ఆమోదం పొందింది బిజెపి మద్దతుతోనే. సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల కృషి వల్లే సాధ్యమైంది.’’ అని అన్నారు.