Modi Mann Ki Baat

ఆకట్టుకున్న జమ్మూ – కాశ్మీర్ క్రీడోత్సవాలు

Modi Mann Ki Baatఆగస్ట్ 31న ప్రసారమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ప్రసంగంలోని ముఖ్యాంశాలు

ఈ వర్షాకాలంలో, ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయి. గత కొన్ని వారాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి భారీ విధ్వంసాలను మనం చూశాం. కొన్ని చోట్ల ఇళ్ళు ధ్వంసమయ్యాయి. మరి కొన్ని చోట్ల పొలాలు మునిగిపోయాయి, ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. బలమైన నీటి ప్రవాహంలో కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజల జీవితాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ సంఘటనలు ప్రతి భారతీయుడిని బాధపెట్టాయి. సంక్షోభం ఎక్కడ వచ్చినా మన NDRF-SDRF సిబ్బంది, ఇతర భద్రతా దళాలు అక్కడి ప్రజలను రక్షించడానికి రాత్రింబగళ్ళు పనిచేశాయి. సైనికులు సాంకేతిక పరిజ్ఞానం సహాయం కూడా తీసుకున్నారు. థర్మల్ కెమెరాలు, లైవ్ డిటెక్టర్లు, స్నిఫర్ డాగ్‌లు, డ్రోన్ నిఘా వంటి అనేక ఆధునిక వనరుల సహాయంతో సహాయ చర్యలను వేగవంతం చేయడానికి కృషి జరిగింది. ఈ సమయంలో హెలికాప్టర్ ద్వారా సహాయ సామగ్రిని పంపిణీ చేశారు.  గాయపడిన వారిని విమానంలో తరలించారు. విపత్తు సమయంలో సైన్యం సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులు, పరిపాలనా యంత్రాంగంలోని ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభ సమయంలో సాధ్యమైనంత కృషి చేశారు.

వరదలు, వర్షాల విధ్వంసం మధ్య జమ్మూ- కాశ్మీర్ కూడా రెండు ప్రత్యేకమైన విజయాలను సాధించింది. జమ్మూ – కాశ్మీర్‌లోని పుల్వామాలోని ఒక స్టేడియంలో రికార్డు సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. పుల్వామా మొదటి డే-నైట్ క్రికెట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది. గతంలో ఇది అసాధ్యం. కానీ ఇప్పుడు నా దేశం మారుతోంది. ఈ మ్యాచ్ ‘రాయల్ ప్రీమియర్ లీగ్’లో భాగం. దీనిలో జమ్మూ – కాశ్మీర్‌లోని వివిధ జట్లు ఆడుతున్నాయి. పుల్వామాలో రాత్రిపూట వేలాది మంది క్రికెట్ ఆస్వాదిస్తోంది. మన దృష్టిని ఆకర్షించిన రెండవ కార్యక్రమం దేశంలో జరిగిన మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. అది కూడా శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో జల క్రీడలను మరింత ప్రాచుర్యం పొందేలా చేయడమే దీని లక్ష్యం. భారతదేశం నలుమూలల నుండి 800 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. మహిళా అథ్లెట్లు కూడా ఇందులో వెనుకబడి లేరు. వారి భాగస్వామ్యం కూడా పురుషుల భాగస్వామ్యంతో దాదాపు సమానంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, అక్కడి ప్రజల ఆప్యాయత, ఆతిథ్యాన్ని అభినందిస్తున్నాను.

చాలా సమర్థులైన వేలాది మంది అభ్యర్థులు స్వల్ప తేడాతో కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో తుది జాబితాను చేరుకోలేకపోతున్నారు. ఈ అభ్యర్థులు ఇతర పరీక్షలకు కొత్తగా సిద్ధం కావాలి. దీనికి సమయం, డబ్బు రెండూ ఖర్చవుతాయి. అలాంటి ఆశావహ విద్యార్థుల కోసం ఒక డిజిటల్ వేదిక రూపకల్పన జరిగింది. దాని పేరు ‘ప్రతిభా సేతు’. ‘ప్రతిభా సేతు’లో వివిధ యూపీఎస్సీ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణులై,  తుది మెరిట్ జాబితాలో స్థానం పొందలేని అభ్యర్థుల డేటా ఉంటుంది. ఈ పోర్టల్‌లో పదివేల మందికి పైగా ఆశావహులైన యువత డేటాబ్యాంక్ ఉంది. ప్రైవేట్ కంపెనీలు ఈ ఆశావహ విద్యార్థుల సమాచారాన్ని ఈ పోర్టల్ నుండి తీసుకొని వారికి ఉపాధి కల్పించవచ్చు. ఈ పోర్టల్ సహాయంతో వందలాది మంది అభ్యర్థులు తక్షణ ఉద్యోగాలు పొందారు. స్వల్ప తేడాతో ఆగిపోయిన యువత ఇప్పుడు కొత్త విశ్వాసంతో ముందుకు సాగుతోంది.

పాడ్‌కాస్ట్‌లో మధ్యప్రదేశ్‌లోని షాడోల్ లో ఫుట్‌బాల్ క్రేజ్‌కు సంబంధించిన ఒక గ్రామాన్ని ప్రస్తావించాను. షాడోల్ యువ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జీవిత ప్రయాణం జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కోచ్ డైట్‌మార్ బీర్స్‌డోర్ఫర్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ జర్మన్ కోచ్ షాడోల్ లోని కొంతమంది క్రీడాకారులకు జర్మనీలోని ఒక అకాడమీలో శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనను సంప్రదించింది. త్వరలో షాడోల్ నుండి మా యువ స్నేహితులు కొందరు శిక్షణ కోసం జర్మనీకి వెళతారు. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ప్రజాదరణ నిరంతరం పెరుగుతుండటం చూసి చాలా సంతోషంగా ఉన్నాను. ఫుట్‌బాల్ ప్రేమికులు సమయం దొరికినప్పుడల్లా షాడోల్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న క్రీడా విప్లవాన్ని దగ్గరగా చూడాలని కోరుతున్నాను.

సూరత్‌లో నివసించే జితేంద్ర సింగ్ రాథోడ్ ఒక సెక్యూరిటీ గార్డు. గత కొన్ని సంవత్సరాలుగా భారతమాత రక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులందరి సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఇప్పటివరకు అమరులైన వేలాది మంది సైనికుల సమాచారం ఆయన వద్ద ఉంది. అమరవీరుల వేలాది ఛాయాచిత్రాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఒకప్పుడు ఒక అమరవీరుడి తండ్రి మాటలు అతని హృదయాన్ని తాకాయి. “నా కొడుకు పోతేనేం. యావద్దేశం సురక్షితంగా ఉంటుంది, కాదా?” అని అమరవీరుడి తండ్రి అతనితో అన్నారు. ఇది జితేంద్ర సింగ్ హృదయాన్ని దేశభక్తి పట్ల అద్భుతమైన మక్కువతో నింపింది. దాదాపు రెండున్నర వేల మంది అమరవీరుల తల్లిదండ్రుల పాదాల నుండి మట్టిని కూడా ఆయన తీసుకువచ్చారు. సాయుధ దళాల పట్ల ఆయనకున్న లోతైన ప్రేమ, అనుబంధాలకు ఇది ఒక సజీవ ఉదాహరణ. 

సౌరశక్తి కారణంగా రైతుల జీవితాలు మారుతున్నాయి. ఈ మార్పు సోలార్ పంపులు, సోలార్ రైస్ మిల్లుల నుండి వస్తోంది. నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వందలాది సోలార్ రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. ఈ సోలార్ రైస్ మిల్లులు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వారి ముఖాల్లో మెరుపును కూడా పెంచాయి. 

బీహార్‌కు చెందిన దేవకి సోలార్ పంపుతో గ్రామం స్వరూపాన్ని మార్చారు. ఇప్పుడు ఆమెను ప్రేమగా “సోలార్ దీదీ” అని పిలుస్తారు. దేవకి జీవితం అంత సాఫీగా సాగలేదు. చిన్న వయసులోనే వివాహం, చిన్న పొలం, నలుగురు పిల్లల బాధ్యత.  భవిష్యత్తు గురించి స్పష్టమైన చిత్రం లేదు. కానీ ఆమె స్ఫూర్తికి ఎప్పుడూ విఘాతం కలగలేదు. ఆమె ఒక స్వయం సహాయక బృందంలో చేరారు. అక్కడ ఆమెకు సోలార్ పంప్ గురించి సమాచారం అందింది. ఆమె సోలార్ పంప్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో విజయం సాధించారు. తర్వాత సోలార్ దీదీ సోలార్ పంప్ గ్రామ ముఖచిత్రాన్ని మార్చేసింది. గతంలో కొన్ని ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందించే అవకాశం ఉన్న చోట ఇప్పుడు 40 ఎకరాలకు పైగా భూమికి సోలార్ దీదీ  సోలార్ పంప్ నుండి నీరు అందుతోంది. గ్రామంలోని ఇతర రైతులు కూడా సోలార్ దీదీ ప్రచారంలో చేరారు. వారి పంటలు పచ్చగా మారడం ప్రారంభించాయి. ఆదాయం పెరగడం ప్రారంభమైంది.

సెప్టెంబర్‌లో మనం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం.  ‘ఆపరేషన్ పోలో’లో పాల్గొన్న వారందరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకునే నెల ఇది. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాద్ వేరే పరిస్థితిలో ఉంది. నిజాం, రజాకార్ల దురాగతాలు రోజురోజుకూ పెరుగుతున్న కాలమది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు, ‘వందేమాతరం’ చెప్పినందుకు కూడా ప్రజలను చంపేశారు. మహిళలు, పేదలను హింసించారు. సర్దార్ పటేల్ ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ పోలో’ ప్రారంభించమని ప్రభుత్వాన్ని ఒప్పించారు.  రికార్డు సమయంలో మన దళాలు హైదరాబాద్‌ను నిజాం నియంతృత్వం నుండి విముక్తి చేసి భారతదేశంలో భాగం చేశాయి. యావత్ దేశం ఈ విజయాన్ని ఉత్సవంగా జరుపుకొంది.

రామాయణం, భారతీయ సంస్కృతిల పట్ల ప్రేమ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుంటోంది. రష్యా వ్లాడివోస్టాక్‌లో ఒక ప్రత్యేకమైన ప్రదర్శన జరిగింది. రామాయణంలోని వివిధ ఇతివృత్తాలపై రష్యన్ పిల్లలు వేసిన చిత్రాలను ఇందులో ప్రదర్శించారు. ఇక్కడ ఒక పోటీ కూడా జరిగింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారతీయ సంస్కృతిపై అవగాహన పెరుగుతున్నట్లు చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది.