Mohan Bhagawat

భరతమాత సేవలో తరిస్తున్న భాగవత్‌

సెప్టెంబరు 11 రెండు పరస్పర విరుద్ధ స్మృతులను మనోఫలకంపైకి తెస్తుంది. 1893 సెప్టెంబరు 11న స్వామీ వివేకానంద షికాగోలో ‘నా అమెరికన్‌ సోదర సోదరీమణులారా!’ అంటూ చేసిన ప్రసంగం వేల హృదయాలను కదిలించింది. వివేకానందుడు భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసి, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటారు. ఈ తేదీతో చిరస్థాయిగా నిలిచిపోయిన మొదటి జ్ఞాపకం అదే. ఇదే సెప్టెంబరు 11న వివేకానందుడి సందేశానికి పూర్తి భిన్నంగా అమెరికాపై ఉగ్రదాడి జరిగి చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. సెప్టెంబరు 11ను మరో కారణంతోనూ గుర్తుంచుకోవాలి. లక్షలమంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కార్యకర్తలకు పరమ పూజ్యనీయుడైన సర్‌ సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ 75వ జన్మదినం సెప్టెంబర్ 11. మరొక విశేషమేమంటే.. ఇది ఆరెస్సెస్‌ శతజయంతి సంవత్సరం. ఈ రెండు శుభ సందర్భాలను పురస్కరించుకుని నేను భాగవత్‌ జీకి శుభాభివందనలు చెబుతున్నాను.

మోహన్‌ భాగవత్‌ జీ ఆరెస్సెస్‌లో చేరిన కొత్తల్లో దేశంలో ఎమర్జెన్సీ అంధకార యుగం నడుస్తోంది. ప్రజాస్వామ్యం కోసం, దేశ ప్రగతి కోసం కట్టుబడిన వ్యక్తులందరూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. మోహన్‌ జీతోపాటు వేలమంది సంఘ్‌ కార్యకర్తలు ఈ పోరాటంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. మహారాష్ట్రలో అత్యంత వెనుకబడిన విదర్భ ప్రాంతంలోని పల్లెల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల వల్ల పేద, బడుగు వర్గాల కష్టనష్టాలను మోహన్‌ జీ పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. తర్వాత ఆయన తన అకుంఠిత దీక్ష, నిరంతర కృషి ద్వారా ఆరెస్సెస్‌లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. బిహార్‌ పల్లెల్లో చేపట్టిన సేవాకార్యక్రమాలు ఆయనకు ప్రజల మౌలిక సమస్యలపై లోతైన అవగాహనను ఏర్పరిచాయి. 2000 సంవత్సరంలో సర్‌ కార్యవాహ్‌ పదవి చేపట్టి జటిలమైన కార్యాలను నేర్పుగా నిర్వహించారు. 2009లో సర్‌ సంఘ్‌ చాలక్‌గా ఆరెస్సెస్‌ అగ్రపదవి చేపట్టారు. సర్‌ సంఘ్‌ చాలక్‌ అంటే కేవలం సంస్థాగత కార్యక్రమాలను చక్కబెట్టే నాయకుడు మాత్రమే కాదు.. వ్యక్తిగత సుఖదుఃఖాలను పక్కనబెట్టి లక్ష్యశుద్ధితో భరతమాత కోసం మొక్కవోని దీక్షతో అహర్నిశలు శ్రమించే వ్యక్తులే ఈ పదవిని నిర్వహిస్తారు. అత్యంత బరువు బాధ్యతలతో కూడిన ఈ పదవికి మోహన్‌ జీ పూర్తి న్యాయం చేస్తున్నారు. తన బలాబలాలను, మేధా పటిమను, సహానుభూతితో కూడిన నాయకత్వాన్ని అంకితం చేస్తున్నారు. దేశం కన్నా మరేదీ మిన్న కాదని చాటుతున్నారు.

ఆరెస్సెస్‌ ఆదర్శాలు, సిద్ధాంతాల విషయంలో భాగవత్‌ ఎన్నడూ రాజీపడకుండా అత్యంత జటిలమైన పరిణామాల మధ్య కూడా సంస్థను సమర్థంగా ముందుకు నడిపారు. యువజనులను పెద్దసంఖ్యలో ఆరెస్సెస్‌ వైపు ఆకర్షించారు. ఈ డిజిటల్‌ యుగంలోనూ తరచూ మాటామంతీ జరుపుతూ ప్రజలకు బాగా దగ్గరవుతున్నారు. యూనిఫాం మొదలుకొని శిక్షణ శిబిరాల వరకు సంస్థాగతంగా పలు మార్పులు తీసుకొచ్చి వందేళ్ల ఆరెస్సెస్‌ యాత్రలో రూపాంతరీకరణకు సారథి అయ్యారు. కొవిడ్‌ కాలంలో ఆరెస్సెస్‌ తరఫున సంప్రదాయ సేవా కార్యక్రమాల నిర్వహణ కష్టం కావడంతో ఆధునిక సాంకేతికతతో అడ్డంకులను అధిగమించారు. అనేక వైద్య శిబిరాలను నిర్వహించారు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజలను కాపాడటానికి వేలమంది కార్యకర్తలు బరిలో దిగారు. వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా. అయినా స్వయంసేవకుల దృఢ సంకల్పం చెక్కుచెదరలేదంటే కారణం మోహన్‌ జీ ఇచ్చిన స్ఫూర్తి, ఉత్సాహాలే. 

మోహన్‌ భాగవత్‌ కుటుంబంతో నాకు ప్రగాఢ అనుబంధం ఉంది. ఆయన తండ్రి దివంగత మధుకర్‌ రావు భాగవత్‌తో కలసి పనిచేశాను. నా రచన జ్యోతి పుంజ్‌లో ఆయన గురించి రాశాను. న్యాయవాదిగా కూడా ఆయన జాతి నిర్మాణానికి తన శక్తియుక్తులను ధారపోశారు. గుజరాత్‌లో ఆరెస్సెస్‌ను బలోపేతం చేశారు. తన కుమారుడు మోహన్‌ భాగవత్‌ భారతదేశ పునరుజ్జీవనానికి అంకితమయ్యేలా స్పూర్తినిచ్చారు. మోహన్‌ జీ 1970లలో ప్రచారక్‌ అయ్యారు. ఇక్కడ ప్రచారక్‌ అంటే సంఘ్‌ ఆదర్శాలను ప్రచారం చేసే కార్యకర్త మాత్రమే కాదు.. భారతదేశ అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన దీక్షాపరుడని అర్థం. గడచిన నూరేళ్లలో వేలాది యువత తమ కుటుంబాలను వదలి ఆరెస్సెస్‌ ఛత్రం కింద దేశం కోసమే అహరహం శ్రమిస్తూ వచ్చారు.

భారత సంస్కృతినీ, జాతి ఆత్మనూ జవజీవాలతో తొణికిసలాడేట్లు చేసే వటవృక్షం ఆరెస్సెస్‌. ఈ విలువలను ముందుకు తీసుకుపోవడానికి మోహన్‌ జీ నిత్యం, నిబద్ధతతో కృషి చేస్తున్నారు. మోహన్‌ జీ వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చే లక్షణం ఆయన మృదుభాషిత్వం. అవతలివారు చెప్పేది శ్రద్ధగా ఆలకించే లక్షణం ఆయనకుంది. ఇవి ఆయన వ్యక్తిత్వానికీ, నాయకత్వ పటిమకూ బలమైన పునాదినిస్తున్నాయి. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పఢావో వంటి ఉద్యమాలలో యావత్‌ ఆరెస్సెస్‌ కుటుంబం పూర్తి అంకిత భావంతో మమేకమయ్యేట్లు మోహన్‌ జీ శ్రద్ధ తీసుకోవడం ప్రశంసనీయం. సమాజ శ్రేయస్సు కోసం పంచ పరివర్తనలు సాధించాలని ఆయన పిలుపు ఇచ్చారు. సామాజిక సామరస్యం, కుటుంబ విలువల పరిరక్షణ, పర్యావరణ స్పృహ, జాతి గౌరవం, పౌర విధుల పాటింపు అనేవి పంచ పరివర్తనలు. ఇవి భారతీయులందరికీ అనుసరణీయ విలువలు. భారతదేశాన్ని బలీయంగా, సుసంపన్నంగా నిలపడానికి కావలసిన స్పష్టమైన దార్శనికత, నిర్ణయాత్మక కార్యాచరణలు మోహన్‌ జీలో మూర్తీభవించాయి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ఆయన విశ్వసిస్తారు కాబట్టి ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌ అనే నినాదాన్ని మనసావాచా కర్మణా పాటిస్తారు. విధినిర్వహణలో ఎంతగా తీరిక లేకుండా ఉన్నా కూడా సంగీతగానాలపై అనురక్తిని కొనసాగిస్తారు. మోహన్‌ జీకి అనేక వాయిద్యాలలో అభినివేశం ఉంది. ప్రసంగాల్లో, ఇతరులతో సంభాషణలలో ఆయన పఠనాసక్తి ప్రతిబింబిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఆరెస్సెస్‌ వందవ పడిలో ప్రవేశిస్తుంది. విజయ దశమి, గాంధీ జయంతి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి, ఆరెస్సెస్‌ శతజయంత్యుత్సవం ఒకేరోజు జరగడం ఆనందదాయకం. వసుధైవ కుటుంబకం స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం భాగవత్‌ జీ. దీర్ఘాయుష్షుతో, చెదరని శక్తి-ఉత్సాహాలతో భరతమాత సేవలో ఆయన తరించాలని మనసారా కోరుకుంటున్నా.

నరేంద్ర మోదీ,
భారత ప్రధాని