భారతీయ యువత ఆకాంక్షలకు రెక్కలు
భారతదేశం వృద్ధి గాథను రచించింది దాని శ్రమశక్తే. గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అసాధారణ ఆర్థిక ప్రగతి సాధించింది. 2014లో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం, ఈరోజు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచ వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ప్రయాణంలో భారతదేశ మానవ వనరులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ విజయానికి ప్రధాన కారణం భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడు ఉద్యోగ కల్పనలోనూ అపూర్వమైన పురోగతి సాధించడమే. RBI-KLEMS నివేదిక ప్రకారం, 2004-2014 మధ్య ఉద్యోగ సృష్టి కేవలం 2.9 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత దశాబ్దంలో ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) సమాచారం ప్రకారం, ఆర్థిక వ్యవస్థలో అధికారిక ఆర్థిక కార్యకలాపాల పరిధి కూడా వేగంగా విస్తరించింది.
సామాజిక భద్రతా విస్తరణ
అసలైన మార్పు సామాజిక భద్రతా పథకాల వర్తింపులో వచ్చింది. 2015లో కేవలం 19 శాతం మంది భారతీయులు మాత్రమే కనీసం ఒక సామాజిక భద్రతా పథకం కింద ఉన్నారు. 2025 నాటికి ఆ సంఖ్య 64.3 శాతానికి పెరిగి, 94 కోట్ల మంది లబ్ధిదారులకు చేరుకుంది. దీంతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సామాజిక భద్రతా వ్యవస్థగా నిలిచింది. ఈ విజయాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విస్తరణలలో ఒకటిగా గుర్తించింది. ఇకముందు దేశ భవిష్యత్తు స్థూల జాతీయోత్పత్తి (GDP) వృద్ధి రేటుపై మాత్రమే కాకుండా మనం సృష్టించే ఉద్యోగాల నాణ్యత, కార్మికులకు మనం అందించే భద్రత, యువతకు మనం కల్పించే అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా యాంత్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో, కృత్రిమ మేధ వల్ల కలిగే అనిశ్చితులు, సరఫరా గొలుసులో మార్పులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశం ఒక కీలకమైన జనాభా పరివర్తన దశలో ఉంది. భారతదేశ జనాభాలో సుమారు 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. పశ్చిమ దేశాల జనాభాలో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఈ కీలకమైన జనాభా ప్రయోజనం మన ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశం.
చాలా సంవత్సరాలుగా భారతదేశ జనాభా – అంటే యువ శక్తి – గొప్ప బలంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ సామర్థ్యాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యం దిశగా మనం కృషి చేస్తున్న తరుణంలో మన ముందున్న కర్తవ్యం సుస్పష్టం: మనం ‘సంభావ్యత’ నుండి ‘సుసంపన్నత’ వైపు మరలాలి. ఈ నేపథ్యంలో ఉద్యోగం అనేది కేవలం ఒక ఆర్థిక సూచి మాత్రమే కాదు; అది గౌరవం, సమానత్వం, జాతీయ బలానికి పునాది. మన యువతను ఉద్యోగానికి అర్హులుగా మార్చడం, వారిని అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం, వారికి ఆర్థిక అక్షరాస్యతను నేర్పడం, వారికి బలమైన సామాజిక భద్రతా వ్యవస్థను అందించడం అవసరం. అప్పుడే మన జనాభా ప్రయోజనం నిజమైన జాతీయ ప్రయోజనంగా మారుతుంది.
ప్రతిష్టాత్మక కార్యక్రమం
ఈ సవాలును పరిష్కరించడానికి, ఆకాంక్ష అవకాశాల మధ్య ఉన్న అంతరాన్ని పూరించడానికి, ప్రభుత్వం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించింది. దీన్ని మొదట కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటించారు. ప్రధానమంత్రి తన 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దీని గురించి మాట్లాడారు. ఇది పరిమాణంలోనూ రూపకల్పన విషయంలోనూ గతంలోని పథకాలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. రూ.21 లక్షల కోట్లతో ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది రెండు సంవత్సరాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ప్రత్యేకత దాని నిర్మాణం. ఉద్యోగ కల్పనకు మద్దతు ఇచ్చే మునుపటి కార్యక్రమాల మాదిరిగా కాకుండా ఈ పథకం యువత ఉద్యోగ సామర్థ్యం, సంస్థల స్తోమత అనే రెండు సవాళ్లను ఏకకాలంలో పరిష్కరిస్తుంది.
పార్ట్ A కింద మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి ప్రత్యక్ష ఆర్థిక ప్రోత్సాహకాలను (రెండు విడతలుగా రూ.15,000 వరకు), పార్ట్ B కింద యజమానులకు (ఒక్కో కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు) అందించడం ద్వారా, ఇది కార్మికులకు ఉద్యోగాల్లో చేరడంలో ఇబ్బందులు తగ్గించగా, వ్యాపారాలకు ఉద్యోగుల నియామకంలో ఎదురయ్యే నష్టాలను తగ్గిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే ఇది అధికారిక ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ కల్పనను పెంచడం, ఆ ఉద్యోగాలకు సామాజిక భద్రతతో అనుసంధానం కల్పించడంపై దృష్టి పెడుతుంది. లబ్ధిదారులకు నిధులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ద్వారా నేరుగా అందడం వల్ల ఇది పారదర్శకంగా అమలవుతుంది. కొత్త కార్మికులు మొదటి రోజు నుండే సామాజిక భద్రతా వ్యవస్థతో అనుసంధానం అవుతారు. ఈ పథకం అధికారిక, సురక్షిత, ఉత్పాదక శ్రమ మార్కెట్ ఏర్పాటు దిశలో ఒక నిర్మాణాత్మక ప్రేరణగా పనిచేస్తుంది. ఇంకా, తయారీ రంగంలోని యజమానులకు ప్రోత్సాహకాలపై అదనపు దృష్టి పెట్టడం వల్ల భారత్ ఆత్మనిర్భర్ (స్వయంసమృద్ధి)గా మారడానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాల-ఆధారిత చర్యల నుంచి సమగ్ర ఉపాధి వ్యవస్థ దిశగా చోటు చేసుకుంటున్న మార్పును సూచిస్తుంది. ఇది మునుపటి ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకం (PLI), జాతీయ తయారీ కార్యక్రమం, మేక్ ఇన్ ఇండియా వంటి వాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పోటీతో కూడిన ప్రపంచ వాతావరణంలో మారుతున్న పని స్వభావాన్ని గుర్తిస్తుంది. కార్మికులకు, యజమానులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉద్యోగ కల్పన ఒక సమష్టి బాధ్యత అని ఈ పథకం తెలియజేస్తుంది. భారతదేశం ఒక ప్రపంచ తయారీ కేంద్రంగా మారడానికి ప్రయత్నిస్తూ డిజిటల్ ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్న తరుణంలో, ఎవరూ వెనుకబడిపోకుండా ఈ పథకం చూస్తుంది. అతి చిన్న సంస్థ, శ్రామిక శక్తిలోకి కొత్తగా ప్రవేశించే వారు కూడా జాతీయ అభివృద్ధి ప్రయాణంలో భాగం అవుతారు.
నవ భారత నిర్మాణం
ఈ పథకం కేవలం ఒక విధాన ప్రకటన మాత్రమే కాదు. ఈ కార్యక్రమం జనాభా ప్రయోజనాన్ని దేశ ప్రజలందరినీ సుసంపన్నం చేసే ఒక నిర్దిష్టమైన ముందడుగు. ఇది వికసిత్ భారత్ కలను సాకారం చేయడానికి నిర్మించే పునాదుల్లో భాగం. ఇందులో ప్రతి యువతికి, యువకుడికి అర్థవంతమైన పని లభిస్తుంది, ప్రతి పనికి గౌరవం ఉంటుంది, ప్రతి యువతి, యువకుడు తన కలలను సాకారం చేసుకునే అవకాశం పొందుతారు. ఉద్యోగం దానికి నిజమైన అర్థం దేశ నిర్మాణం. ఈ కార్యక్రమం ద్వారా మోదీ ప్రభుత్వం, ఏ ఆకాంక్ష కూడా మద్దతు లేకుండా మిగిలిపోరాదని, ఏ యువతి లేదా యువకుడు కూడా అవకాశాలు లేని పరిస్థితి ఎదుర్కోకుండా చూడాలన్న తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
మన్సుఖ్ మాండవీయ,
కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి

