స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరేద్దాం
సమిష్టి కృషితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని బిజెపి తెలంగాణ నిర్ణయించింది. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా సంకల్పంతో పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల సన్నాహాలను బిజెపి తెలంగాణ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే. అరుణ, బిజెపి శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఏ.వీ.ఎన్. రెడ్డి, బిజెపి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. వీలైనన్ని ఎక్కువ జడ్పీటీసీలు కైవసం చేసుకునేలా ప్రత్యేక వ్యూహాలు రూపొందించారు. నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల ఎంపిక, కమిటీల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు పలు సూచనలు ఇచ్చారు. మాజీ పార్లమెంట్, అసెంబ్లీ, శాసన మండలి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ పదాధికారులు ప్రతి ఒక్కరిని జడ్పీటీసి, జిల్లా ఇంఛార్జ్ లుగా నియమించాలని నిర్ణయించారు. అటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికపైనా చర్చించారు. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని, నాయకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఈ సమావేశం స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో గత 22 నెలలుగా కాంగ్రెస్ సర్కారు చేసిన కుట్రలు, నాటకాలను… అదేవిధంగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా గ్రామీణ పాలనను నిర్వీర్యం చేసిన విషయాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన అంశాలను, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను, మోసాలను ప్రజలకు తెలియజెప్పేలా ప్రచారం చేయాలని చెప్పారు. పాత, కొత్త అనే భేదం లేకుండా పార్టీ కోసం పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి పార్టీ శ్రేణులను మోటివేట్ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారం సాధించేలా సంస్థాగతంగా ఎన్నికల సన్నద్ధతపైనా దృష్టి పెట్టాలన్నారు. అభ్యర్థుల ఎంపిక, కమిటీల ఏర్పాటు, ప్రచారం మొదలైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలే జిల్లా ఇంఛార్జ్ లు చొరవ తీసుకోవాలని రాంచందర్ రావు అన్నారు.

