పరిశుభ్రతకు, సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యత
అక్టోబర్ 26న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమంలో
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడంపై ఒక ప్రత్యేకమైన చొరవ ప్రారంభమైంది. అంబికాపూర్‌లో గార్బేజ్ కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చే వారికి కడుపునిండా పూర్తి భోజనం అందించే కేఫ్ ఇది. ఒక కిలో ప్లాస్టిక్ తీసుకువచ్చే వారికి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం అందిస్తారు. అర కిలోగ్రాము తీసుకువచ్చే వారికి అల్పాహారం ఇస్తారు. ఈ కేఫ్‌ను అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఇలాంటి ఘనతనే బెంగళూరులో ఇంజనీర్ కపిల్ శర్మ సాధించారు. ఇక్కడి సరస్సులను పునరుద్ధరించడానికి కపిల్ ఒక చొరవను ప్రారంభించారు. కపిల్ బృందం బెంగళూరు నగరంలోనూ పరిసర ప్రాంతాలలోనూ 40 బావులు, ఆరు సరస్సులను పునరుద్ధరించింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కార్పొరేట్‌లను, స్థానిక ప్రజలను కపిల్ తన మిషన్‌లో చేర్చుకున్నారు. ఆయన సంస్థ చెట్ల పెంపకం ప్రచారాలలో కూడా పాల్గొంటుంది. అంబికాపూర్, బెంగళూరులోని ఈ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు సంకల్పం దృఢంగా ఉంటే పరివర్తన అనివార్యమని నిరూపిస్తున్నాయి.
విపత్తు సమయాల్లో సహాయకారి
పర్వతాలు, మైదానాలలోని మట్టితో కూడుకుని ఉన్న అడవులు ఉన్నట్టుగానే సముద్ర తీరంలో మడ అడవులు కూడా ఉంటాయని మీ అందరికీ తెలుసు. మడ అడవులు ఉప్పునీటి సముద్రపు నీరు, చిత్తడి నేలలలో పెరుగుతాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఇవి కీలకమైన భాగం. సునామీ లేదా తుఫాను వంటి విపత్తు సమయాల్లో ఈ మడ అడవులు చాలా సహాయకారిగా ఉంటాయని నిరూపితమైంది. మడ అడవుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గుజరాత్ అటవీ శాఖ ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఐదు సంవత్సరాల కిందట అహ్మదాబాద్ సమీపంలోని ధోలేరాలో అటవీ శాఖ బృందాలు మడ అడవులను నాటడం ప్రారంభించాయి. నేడు ధోలేరా తీరం వెంబడి మూడున్నర వేల హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవుల ప్రభావం ఈ ప్రాంతం అంతటా కనిపిస్తుంది. అక్కడి పర్యావరణ వ్యవస్థలో డాల్ఫిన్ల సంఖ్య పెరిగింది. పీతలు, ఇతర జలచరాలు కూడా పెరిగాయి. అంతే కాదు- వలస పక్షులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఇది పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, ధోలేరా చేపల పెంపకందారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది. ధోలేరాతో పాటు గుజరాత్‌లోని కచ్‌లో కూడా మడ అడవుల పెంపకం పూర్తి స్థాయిలో జరుగుతోంది. అక్కడి కోరి క్రీక్‌లో ‘మడ అడవుల అధ్యయన కేంద్రం’ కూడా ప్రారంభమైంది. మొక్కలు, చెట్ల ప్రత్యేక లక్షణమిదే. ఏ ప్రాంతంలో అయినా అవి సమస్త జీవుల శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.
ఐదు సంవత్సరాల కిందట ప్రజలతో పాటు భద్రతా దళాలు భారతీయ జాతి కుక్కలను దత్తత తీసుకోవాలని కోరాను. ఎందుకంటే అవి మన పర్యావరణానికి, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ఈ దిశలో మన భద్రతా సంస్థలు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశాయి. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ తమ బృందాలలో భారతీయ జాతి శునకాల సంఖ్యను పెంచాయి. గత ఏడాది అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లక్నోలో జరిగింది. ఆ సమయంలో రియా అనే కుక్క ప్రజల దృష్టిని ఆకర్షించింది. బీఎస్ఎఫ్ ద్వారా శిక్షణ పొందిన ముధోల్ హౌండ్ జాతి శునకమది. రియా ఆ పోలీస్ డ్యూటీ మీట్ లో అనేక విదేశీ జాతుల శునకాలను ఓడించి, మొదటి బహుమతిని గెలుచుకుంది. గత సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అక్కడి సీఆర్ఫీఎఫ్ దళానికి చెందిన శునకం 8 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను కనుగొంది. ఈ దిశలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు చేసిన కృషిని అభినందిస్తున్నాను.
సర్దార్ పటేల్ 150వ జయంతి మొత్తం దేశానికి చాలా ప్రత్యేకమైన సందర్భం. సర్దార్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు. ఆయన గొప్ప వ్యక్తిత్వంలో అనేక లక్షణాలు సమ్మిళితమై ఉన్నాయి. ఆయన చదువుకునే రోజుల్లో చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి. భారతదేశం, బ్రిటన్ రెండింటిలోనూ ఆయన చదువులో రాణించారు. ఆయన అత్యంత విజయవంతమైన న్యాయవాదులలో ఒకరు. ఆయన న్యాయవాద వృత్తిలో మరింత గుర్తింపు పొందగలిగేవారు. కానీ గాంధీజీ ప్రేరణతో స్వాతంత్ర్య ఉద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. ఖేడా సత్యాగ్రహం నుండి బోర్సద్ సత్యాగ్రహం వరకు అనేక ఉద్యమాల్లో ఆయన చేసిన కృషి నేటికీ గుర్తు చేసుకుంటాం. అహ్మదాబాద్ మునిసిపాలిటీ అధిపతిగా ఆయన పదవీకాలం కూడా చారిత్రాత్మకం. ఆయన పరిశుభ్రతకు, సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఆయన చేసిన సేవలకు మనం ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాం.
‘వందే మాతరం’.. ఐక్యతా శక్తి
భారతదేశ జాతీయ గేయం ‘వందే మాతరం’ మొదటి పదం సైతం మన హృదయాలలో భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తుంది. ‘వందేమాతరం’ – ఈ ఒక్క పదంలో చాలా భావోద్వేగాలు, శక్తులు మిళితమై ఉంటాయి. ఈ గేయం సహజంగానే భరతమాత వాత్సల్యాన్ని మనం అనుభూతి చెందేలా చేస్తుంది. ఆమె పిల్లలుగా మన బాధ్యతలను కూడా మనకు గుర్తు చేస్తుంది. క్లిష్ట సమయాల్లో ‘వందేమాతరం’ జపించడం 140 కోట్ల మంది భారతీయులను ఐక్యతా శక్తితో నింపుతుంది. దేశభక్తి, భరతమాత పట్ల ప్రేమ మాటలకు అతీతమైన ఒక భావన అయితే, ‘వందేమాతరం’ ఆ అవ్యక్త భావనకు నిర్దిష్ట స్వరాన్ని ఇచ్చే పాట. శతాబ్దాల బానిసత్వంతో శిథిలమైన భారతదేశానికి కొత్త జీవితాన్ని, కొత్త ఊపిరిని అందించేందుకు బంకిం చంద్ర ఛటర్జీ దీన్ని స్వరపరిచారు. వందేమాతర గేయాన్ని 19వ శతాబ్దంలో రాసి ఉండవచ్చు. కానీ దాని ఆత్మ భారతదేశానికి చెందిన వేల సంవత్సరాల ప్రాచీన, అమర చైతన్యంతో ముడిపడి ఉంది. ‘మాతా భూమిః పుత్రో అహం పృథ్వీయః’ అంటే ‘భూమి తల్లి, నేను ఆమె బిడ్డను’ అని చెప్పడం ద్వారా వేదాలు భారతీయ నాగరికతకు పునాది వేశాయి. బంకిం చంద్రజీ మాతృభూమికి, ఆమె పిల్లలకు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని భావోద్వేగాల ప్రపంచంలో ‘వందేమాతరం’ రాయడం ద్వారా ఒక మంత్రం రూపంలో బంధించారు. ‘వందేమాతరం’ 150వ సంవత్సరాన్ని మనం చిరస్మరణీయంగా మార్చుకోవాలి. రాబోయే తరాల కోసం ఈ విలువల ప్రవాహాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. రాబోయే కాలంలో ‘వందేమాతరం’ గేయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ‘వందేమాతరం’ గేయాన్ని పాడేందుకు మనమందరం దేశస్థులం స్వీయ ప్రేరణతో ప్రయత్నాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీ సూచనలను #vandemataram150 అనే హ్యాష్ ట్యాగ్ తో నాకు పంపండి. మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఈ సందర్భాన్ని చారిత్రాత్మకంగా మార్చడానికి మనమందరం కృషి చేద్దాం.
సంస్కృతం అనే పేరు వినగానే మన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, ప్రాచీన జ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం మన మనస్సులోకి వస్తాయి. కానీ ఒకప్పుడు వీటన్నిటితో పాటు సంస్కృతం కూడా సంభాషణ భాష. ఆ యుగంలో అధ్యయనాలు, పరిశోధనలు సంస్కృతంలో జరిగాయి. సంస్కృతంలో నాటకాలను కూడా ప్రదర్శించారు. కానీ దురదృష్టవశాత్తు బానిసత్వ కాలంలో, స్వాతంత్ర్యం తర్వాత కూడా సంస్కృతాన్ని నిరంతరం నిర్లక్ష్యం చేశారు. దీని కారణంగా యువ తరాలలో సంస్కృతం పట్ల ఆకర్షణ తగ్గడం ప్రారంభమైంది. సంస్కృతం విషయంలో కూడా కాలం మారుతోంది. సంస్కృతి, సామాజిక మాధ్యమాల ప్రపంచం సంస్కృతానికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. ఈ రోజుల్లో చాలా మంది యువకులు సంస్కృతానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన పనులను చేస్తున్నారు. మీరు సామాజిక మాధ్యమాలు చూస్తే చాలా మంది యువకులు సంస్కృతంలో మాట్లాడడం, సంస్కృతం గురించి వివరించడం మీరు అనేక రీళ్లలో చూస్తారు. చాలా మంది తమ సామాజిక మాధ్యమ ఛానళ్ల ద్వారా సంస్కృతాన్ని కూడా బోధిస్తున్నారు. అలాంటి యువ కంటెంట్ సృష్టికర్తలలో ఒకరు యష్ సాలుండ్కే. యష్ ప్రత్యేక ప్రతిభ ఏమిటంటే ఆయన కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, క్రికెటర్ కూడా. సంస్కృతంలో మాట్లాడుతూ క్రికెట్ ఆడే ఆయన రీల్‌కు మంచి ఆదరణ లభించింది. ఏ భాష అయినా నాగరికత విలువలు, సంప్రదాయాలతో కూడుకుని ఉంటుంది. వేల సంవత్సరాలుగా సంస్కృతం ఈ విధిని నెరవేర్చింది. కొంతమంది యువకులు ఇప్పుడు సంస్కృతం విషయంలో తమ విధిని నిర్వర్తిస్తున్నారని చూడటం సంతోషంగా ఉంది.
ఆదివాసీలపై చెరగని ముద్ర
20వ శతాబ్ద ప్రారంభాన్ని ఊహించుకోండి! అప్పుడు స్వాతంత్ర్యం వస్తుందనే ఆశ కనుచూపు మేరలో లేదు. బ్రిటిష్ వారు భారతదేశం అంతటా దోపిడీకి సంబంధించిన అన్ని పరిమితులనూ దాటారు. హైదరాబాద్ లోని దేశభక్తులైన ప్రజలకు అణచివేత కాలం మరింత భయంకరం. క్రూరమైన, నిర్దయుడైన నిజాం దురాగతాలను కూడా వారు భరించవలసి వచ్చింది. పేదలు, అణగారిన వర్గాలు, ఆదివాసీ వర్గాలపై దౌర్జన్యాలకు పరిమితి లేదు. వారి భూములను లాక్కున్నారు. భారీ పన్నులు కూడా విధించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారి చేతులను కూడా నరికివేశారు. అలాంటి క్లిష్ట సమయాల్లో ఇరవై ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం కూడా నేరంగా పరిగణించే ఆ రోజుల్లో ఆ యువకుడు సిద్ధిఖీ అనే నిజాం అధికారిని బహిరంగంగా సవాలు చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి సిద్ధిఖీని నిజాం పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని చంపాడు. అతను అరెస్టు నుండి కూడా తప్పించుకోగలిగాడు. నిజాం ప్రభుత్వ పోలీసుల నుండి తప్పించుకుని ఆ యువకుడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాంకు చేరుకున్నాడు. నేను మాట్లాడుతున్న గొప్ప వ్యక్తి పేరు కొమురం భీమ్. ఆయన జయంతోత్సవం అక్టోబర్ 22న జరుపుకున్నాం. కొమురం భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ తన జీవితకాలంలో అసంఖ్యాక ప్రజల హృదయాలపై- ముఖ్యంగా ఆదివాసీ సమాజంపై చెరగని ముద్ర వేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో ఆయన కొత్త శక్తిని నింపారు. వ్యూహాత్మక నైపుణ్యాలకు కూడా ప్రఖ్యాతి చెందారు. నిజాం ప్రభుత్వానికి సవాలు విసిరారు. 1940లో ఆయనను నిజాం మనుషులు హత్య చేశారు. ఆయన గురించి వీలైనంత ఎక్కువ తెలుసుకోవాలని నేను యువతను కోరుతున్నాను.
నవంబర్ 15న మనం ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ జరుపుకుంటాం. ఇది భగవాన్ బిర్సా ముండా జయంతి శుభ సందర్భం. దేశ స్వాతంత్ర్యం కోసం, ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆయన చేసిన కృషి సాటిలేనిది. జార్ఖండ్‌లోని భగవాన్ బిర్సా ముండా గ్రామం ఉలిహాతును సందర్శించే అవకాశం నాకు లభించింది. అక్కడి మట్టిని నా నుదిటిపై పూసుకుని నివాళులర్పించాను. భగవాన్ బిర్సా ముండా, కొమురం భీమ్ లా మన ఆదివాసీ సమాజాల నుండి ఇంకా చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారి గురించి చదవవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.

