కేరళ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి
కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకునేందుకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేరళ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, చదువు కోసం, ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిపోతున్నారన్నారు. కేరళలో అవకాశాలు లేక ప్రతిభ గల యువత వలస పోతుందన్నారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలపై కార్ల్ మార్క్స్, నెహ్రూ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దాలని చూస్తోందని, మారుతున్న వాస్తవాలను గుర్తించడం లేదని విమర్శించారు. నిరుద్యోగం, ఆహార ద్రవ్యోల్బణం దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని వెల్లడించారు. బిజెపిపై సృష్టించిన మతతత్వ పార్టీ అపోహను తొలగించుకునేందుకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తున్నామని, ముస్లింల ఇంటికి కూడా వెళ్తున్నామని అన్నారు. కేరళలోని ఆర్థిక, రాజకీయ సవాళ్లు, మారుతున్న రాజకీయ సమీకరణలు, క్షేత్రస్థాయిలో బిజెపి పటిష్టత గురించి పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఒక జాతీయ దినపత్రికతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:
ప్ర: తిరువనంతపురం మునిసిపల్ కార్పొరేషన్‌లో విజయం మీ విజయయాత్రలో పెద్ద ముందడుగు. కానీ ఇది త్రిపునితుర, పాలక్కాడ్ వంటి కొన్ని మున్సిపాలిటీలకే పరిమితమైంది కదా? జిల్లా పంచాయతీల్లో మీకు పెద్దగా ఫలితాలు దక్కలేదు?
జ: మేం తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిపునితురలపై దృష్టి పెట్టిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు కేరళ అంతటా బిజెపి-ఎన్డీయే జెండా రెపరెపలాడుతోంది. మొదటిసారి పోటీ చేస్తున్నందున మేం 3,000 నుంచి 3,500 వార్డుల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం 2,000 వార్డుల్లో ప్రథమ స్థానంలో, మరో 500 పైగా వార్డుల్లో రెండో స్థానంలో నిలిచాం. 2020తో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా మా ఓట్ల శాతం, గెలిచిన వార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ నాయకులు ‘బిజెపి మా అంతగా గెలవలేదు’ అని చెప్పుకోవచ్చు, అది నిజమే కావచ్చు. కానీ మేం ఇప్పుడు ఒక ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామన్నది కాదనలేని సత్యం. మెజారిటీ స్థానిక సంస్థల్లో మేం రెండో అతిపెద్ద ప్రతిపక్షంగా ఉన్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ప్రజలు ఎల్డీఎఫ్‌ను తిరస్కరించడం ఖాయం. వారు మూడోసారి వారికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు.
ప్ర: దేశవ్యాప్తంగా బిజెపి పుంజుకుంటున్నా, త్రిస్సూర్ విజయం మినహా కేరళలో పార్టీ అంతగా సఫలం కాలేకపోతోంది?
జ: దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, బిజెపి ఒక మతతత్వ పార్టీ అనే అపోహను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కలిసి ప్రజల్లో బలంగా నాటాయి. కేరళ జనాభాలో హిందూయేతర మైనారిటీలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇది మాకు అడ్డంకిగా మారింది. రెండోది, బిజెపి ఎదగకుండా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య రహస్య ఒప్పందం ఉంది. 2019తో పోలిస్తే 2024లో సీపీఎం ఓటు బ్యాంకు తగ్గడం గమనిస్తే, వారు తమ ఓట్లను కాంగ్రెస్‌కు బదిలీ చేసినట్లు స్పష్టమవుతోంది. త్రిస్సూర్ సౌత్, కొడంగల్లూర్ వంటి చోట్ల కాంగ్రెస్‌కు గతంలో వచ్చే 300-400 ఓట్లు ఇప్పుడు కేవలం 20కి పడిపోయాయి. అంటే ఆ ఓట్లన్నీ ఎల్డీఎఫ్‌కు వెళ్లాయి. దేశంలో మరెక్కడా ఇలాంటి వింతైన రాజకీయ భాగస్వామ్యం కనిపించదు.
ప్ర: అంటే కేరళ సంస్కృతి వల్ల బిజెపి ఎదగలేకపోతోందని మీరు భావించడం లేదా?
జ: ఇది సంస్కృతికి సంబంధించినది కాదు. సీపీఎం ప్రచారం చేసే ‘కేరళ మోడల్’ వల్ల కూడా కాదు. కేవలం రెండు ప్రత్యర్థి పార్టీలు కలిసి బిజెపిని అడ్డుకోవడమే దీనికి కారణం. అందుకే మా ఎదుగుదల నెమ్మదిగా ఉంది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మార్పు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన మొదటి ప్రకటన ‘బిజెపిని అడ్డుకోవడానికి లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలి’ అని. అంటే వారు మమ్మల్ని చూసి భయపడుతున్నారని అర్థం.
ప్ర: బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియామకం ప్రాధాన్యం ఏమిటి?
జ: ఇది పార్టీలో ఒక ముఖ్యమైన మార్పు. 45 ఏళ్ల వ్యక్తి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండటం అంటే, పార్టీ ‘వికసిత్ భారత్’ కోసం యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని అర్థం. ఇకపై రాజకీయాలు కులం, మతం చుట్టూ కాకుండా ఉద్యోగాలు, విద్య, పారిశ్రామికాభివృద్ధి చుట్టూ తిరుగుతాయి.
ప్ర: ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన కొత్త బిల్లుల పేర్లు ‘హిందీ రుద్దుడు’ అని దక్షిణాది ఎంపీలు విమర్శిస్తున్నారు కదా?
జ: చర్చ అనేది పేర్ల మీద కాకుండా, ఆ పథకాల్లో చేస్తున్న సంస్కరణల మీద జరగాలి. హిందీ పేరు పెట్టగానే అది మలయాళం లేదా తమిళంపై దాడి అని ప్రచారం చేయడం సోమరితనపు రాజకీయం. దేశవ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్ ఎక్కువగా వాడతారు. ప్రతి భాషలోనూ పేరు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం హిందీని ఎంచుకుంది.
ప్ర: కేరళలో పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు?
జ: కేరళ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలోని 30 శాతం కాలేజీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. చదువు కోసం, ఉద్యోగాల కోసం యువత బయటకు వెళ్లిపోతున్నారు. మేం డిజిటల్ మాధ్యమాలు, క్షేత్రస్థాయి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈసారి స్థానిక ఎన్నికల్లో చాలా మంది యువకులు మా తరపున పోటీ చేశారు.
ప్ర: కేరళలో పశుమాంస వినియోగం, హిందుత్వం వంటి అంశాలను సమన్వయం చేసుకోవడం బిజెపికి కష్టమని భావిస్తున్నారా?
జ: ఇది చాలా సవాలుతో కూడుకున్న పని. 2023లో హమాస్ ప్రతినిధి కోజికోడ్‌లో ప్రసంగించడాన్ని నేను వ్యతిరేకిస్తే, ముఖ్యమంత్రి నన్ను మతతత్వవాది అని విమర్శించారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తే మతతత్వవాది అనడం విచిత్రం. కర్ణాటక లేదా యూపీలో పనిచేయడం కంటే కేరళలో పనిచేయడం క్లిష్టమైనదే.
ప్ర: క్రైస్తవ, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కేరళలో మీ వ్యూహం ఏమిటి?
జ: మేం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి) అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ముస్లింలు అధికంగా ఉన్న మలప్పురంలో కూడా మా ప్రచారం సాగుతోంది. మాపై ఉన్న అపోహలను తొలగిస్తున్నాం. రెండున్నర కోట్ల ఇళ్లకు చేరుకోవడమే మా లక్ష్యం.
ప్ర: 2026లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఎదుర్కోబోయే ఆర్థిక సవాళ్లు ఏమిటి?
జ: కేరళలో అభివృద్ధి శూన్యం. తమిళనాడులో 24 లక్షల మంది పారిశ్రామిక కార్మికులు ఉంటే, కేరళలో లక్ష మంది కూడా లేరు. ఇక్కడ నిరుద్యోగం, ఆహార ద్రవ్యోల్బణం దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. కేరళ మోడల్ అనేది కేవలం ఒక భ్రమ. 2026లో రాజకీయ చర్చ కేవలం అభివృద్ధి, ఆర్థిక భవిష్యత్తు చుట్టూనే సాగుతుంది.
ప్ర: సెమీకండక్టర్లు వంటి పెట్టుబడులు కేరళకు రావడం లేదు కదా?
జ: పెట్టుబడులు ప్రతిభ ఉన్న చోటుకు వస్తాయి. ప్రతిభ ఉన్న యువత కేరళలో అవకాశాలు లేక వలస పోతున్నారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలపై కార్ల్ మార్క్స్, నెహ్రూ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దాలని చూస్తోంది తప్ప, మారుతున్న వాస్తవాలను గుర్తించడం లేదు.

