ఆరోగ్య విజ్ఞానమే మన ‘మృదుశక్తి’
డిసెంబర్ 17 నుండి 19 వరకు దిల్లీ వేదికగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘సంప్రదాయ ఔషధాలపై రెండవ అంతర్జాతీయ సదస్సు’కు భారత్ సహ ఆతిథ్యం ఇచ్చింది. ఇది కేవలం విధానపరమైన నిర్ణయం మాత్రమే కాదు.. మన నాగరికతకు దక్కిన గౌరవం. సంప్రదాయ వైద్యం ఎప్పుడూ సంస్కృతులకు, విజ్ఞాన వ్యవస్థలకు, సమాజాలకు మధ్య వారధిలా నిలుస్తుంది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్ తన వారసత్వ సంపదను ప్రపంచ స్థాయి సుహృద్భావం, సహకారం, ‘వెల్నెస్ డిప్లొమసీ’ (ఆరోగ్య దౌత్యం) కోసం ఒక సాధనంగా మలిచింది. భారతదేశపు ‘సాఫ్ట్ పవర్’ (మృదు శక్తి) కేవలం సంస్కృతి, ఆధ్యాత్మికతపైనే కాకుండా విశ్వవ్యాప్తమైన మన ఆరోగ్య విజ్ఞానంపై ఆధారపడి ఉందని నేడు ప్రపంచం గుర్తిస్తోంది.
గత దశాబ్ద కాలంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోంది: ఆధారాలతో కూడిన సంప్రదాయ వైద్యాన్ని ప్రపంచీకరించడం, దాన్ని ప్రజలకు చేరువ చేయడం. ఈ క్రమంలో 25 దేశాలతో పరస్పర అవగాహన ఒప్పందాలు, 52 సంస్థాగత స్థాయి ఒప్పందాలు, 15 ఆయుష్ చైర్లు, 39 దేశాల్లో 43 ఆయుష్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇది భారత ప్రభుత్వ రంగాల్లో అత్యంత క్రియాశీలక విభాగంగా ఆయుష్‌ను నిలిపింది.
దౌత్య రంగానికే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఆయుష్ ఒక కీలక మూలస్తంభంగా మారింది. 92,600 పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు), 43.4 బిలియన్ డాలర్ల దేశీయ మార్కెట్, 1.54 బిలియన్ డాలర్ల ఎగుమతులతో ఆయుష్ పరిశ్రమ ఆధునిక వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. ఆయుష్ ఉత్పత్తులు నేడు 150కి పైగా దేశాలకు చేరుతున్నాయి. 2022లో ప్రధాని ప్రారంభించిన ‘ఆయుష్ ఎక్స్‌సిల్’ ద్వారా మార్కెట్ సమాచారం, నియంత్రణలు సంబంధించిన మద్దతు వంటి సౌకర్యాలు కల్పిస్తూ ఎగుమతులను మరింత వేగవంతం చేస్తున్నాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో కలిసి భారత్ అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టింది. జామ్ నగర్, దిల్లీ, హైదరాబాద్‌లలోని WHO సహకార కేంద్రాల నుండి ఎం-యోగ యాప్ వరకు భారత్ కీలక పాత్ర పోషించింది. ICD-11(అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ) లో ఆయుర్వేద, సిద్ధ, యునాని వ్యాధి కోడ్‌లను చేర్చడం ఒక చారిత్రక మైలురాయి. సంప్రదాయ వైద్యంలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై WHO ఇటీవలి నివేదికలో భారత్ అగ్రగామి పాత్రను కొనియాడటం విశేషం.
2023లో ‘ఆయుష్ వీసా’ ప్రవేశపెట్టడం ద్వారా భారత్ ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించింది. 27 ఇన్సూరెన్స్ కంపెనీల కవరేజ్, ప్రత్యేక పోర్టల్, అంతర్జాతీయ ప్రమాణాల (ISO) అమలు ద్వారా విదేశీయులను భారత్ ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందించే గమ్యస్థానంగా భారత్ ఎదిగింది. ఇది దౌత్యానికి అత్యంత స్వచ్ఛమైన రూపం — ఇక్కడ ‘వైద్యం’ అంతర్జాతీయ సంబంధాలను బలపరుస్తుంది.
‘వసుధైక కుటుంబకం’ అనే నినాదంతో గుజరాత్‌లో ఏర్పాటు చేసిన ‘WHO అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య చికిత్సా కేంద్రం’ (GTMC) ప్రపంచానికి భారత్ అందిస్తున్న కానుక. పర్యావరణ ఆందోళనలు, జీవనశైలి వ్యాధులు ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వేళ భారత సంప్రదాయ విజ్ఞానం ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా ఒక సమగ్ర పరిష్కారంగా మారుతోంది. దిల్లీ సదస్సు 2025–2034 నాటి WHO అంతర్జాతీయ వ్యూహాన్ని అమలు చేయడానికి ఒక వేదికగా మారింది. ఈ సదస్సు ద్వారా భారత్ తన అనుభవాలను వినమ్రతతో పంచుకుని భాగస్వామ్య దేశాల నుంచి నేర్చుకుంటూ ‘ప్రపంచ కుటుంబం’ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. చివరగా, సంప్రదాయ వైద్యం ద్వారా లభించే ఈ శక్తి ఆధిపత్యం కోసం కాదు, స్ఫూర్తి కోసం. ఇది భవిష్యత్తు తరాలకు మనం అందించే నిరంతర ఆరోగ్య హక్కు.
ప్రతాప్‌రావు జాదవ్,
కేంద్ర ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి

