Maoist free

త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ!

2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించి, ఆ దిశలో ఆపరేషన్ కగార్ వంటి చర్యలు చేపట్టడం ద్వారా దశాబ్దాలుగా పాతుకుపోయిన మావోయిస్టుల అభేద్యమైన కోటలను బద్దలు చేస్తూ వస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. దానితో వారి కార్యకలాపాలను దాదాపు అడ్డుకట్ట వేయగలిగారు. వారి ప్రభావం ఇప్పుడు కొద్ది జిల్లాలకే పరిమితమయింది. మావోయిస్టులకు కంచుకోటలుగా ఉంటూ వస్తున్న దట్టమైన అటవీ ప్రాంతాలలో వారికి నిలువనీడ లేకుండా పోయింది. దాంతో వేలసంఖ్యలో మావోయిస్టులు, వారి మద్దతుదారులు లొంగిపోతుండగా, వందల సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాలతో జరిగిన కాల్పులలో మరణిస్తూ వస్తున్నారు. 

కేంద్ర కమిటీ కార్యదర్శి నుండి, కేంద్ర కమిటీ సభ్యులు పలువురు మొదటిసారిగా పోలీసులతో జరిపిన కాల్పులలో చనిపోవడంతో లేదా లొంగిపోవడమో జరుగుతూ వస్తోంది. ఇటువంటి పరిస్థితులలో మొదటగా బిజెపి నేతృత్వంలోని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తమది ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’ అని ప్రకటించింది. డిసెంబర్ 11న మధ్యప్రదేశ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. సీపీఐ (మావోయిస్టు) ముప్పుపై పొరుగు రాష్ట్రాలు ఇంకా అప్రమత్తంగా ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. బాలాఘాట్, మాండ్లా, డిండోరి జిల్లాల్లో కేంద్రీకృతమైన మావోయిస్టు కేడర్లు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో తమపై ఒత్తిడి పెరగడంతో సురక్షితమైన ఆశ్రయం కోసం మొదట మధ్యప్రదేశ్‌కు వచ్చారు. కానీ వారు పోలీసుల నుండి దొంగిలించిన ఏకే-47లు, INSAS, SLR రైఫిల్స్‌తో సహా ఆయుధాలను సేకరించడం, అగ్రశ్రేణి కమాండర్లు తమ బృందాలకు నాయకత్వం వహించడానికి రావడం వంటివి వారిని ప్రభుత్వం దృష్టిలో పడేలా చేశాయి. దాంతో 2024 మధ్య నాటికి మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు వేగవంతం కావడంతో, నాలుగైదు నెలలపాటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ భద్రతాదళాలు రాష్ట్రంలో ఇప్పుడు వారి ఉనికి లేకుండా చేయగలిగాయి.

‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గుతుండగా, తెలంగాణ ఇప్పుడు ‘మావోయిస్టు రహిత’ రాష్ట్రంగా అవతరించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో, ఇప్పుడు శాంతిభద్రతలు మెరుగుపడటం అభివృద్ధికి కొత్త బాటలు వేస్తోంది. పోలీసుల నిరంతర నిఘా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వల్ల మావోయిస్టుల భావజాలం పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 509 మంది మావోయిస్టులు ప్రధాన స్రవంతిలోకి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పోలీసు రికార్డుల ప్రకారం రాష్ట్రంలో కేవలం 21 మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

గతంతో పోలిస్తే ఇది అత్యంత కనిష్ట సంఖ్య. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర కూంబింగ్ నిర్వహించడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి మావోయిస్టులు చొరబడకుండా పోలీసులు అడ్డుకోగలుగుతున్నారు. ఇప్పటికే భద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పట్టు సాధించడంతో, రాష్ట్రంలోకి కొత్త రిక్రూట్‌మెంట్లు ఆగిపోయాయి. తాజాగా, తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత బలహీనత, నాయకత్వంపై నమ్మకం తగ్గడం, అడవుల్లో తీవ్ర జీవన కష్టాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగానే తాము జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. ప్రాణాలు కాపాడుకోడానికి తెలియని ప్రదేశాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ ఒత్తిడి చేసిందని.. ఇలాంటి పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా భావించి మావోయిస్టులంతా లొంగిపోయినట్లు తెలిపారు.

నేపాల్ లోని పశుపతినాథ్ నుండి తిరుపతి వరకు రెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కలలు కన్న మావోయిస్టులు ఇప్పుడు భారతదేశంలో కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చెప్పారు. గత 5 సంవత్సరాలలో CRPF నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో 400కు పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను ఏర్పాటు చేసిందని, దాని ఫలితంగా 10 సంవత్సరాలలో నక్సల్ హింస 80 శాతానికి పైగా తగ్గిందని ఆయన తెలిపారు.

ప్రవీణ్