upadhi hami kooli

విబి-జి రామ్ జి: సంస్కరణల దిశగా ముందడుగు!

కొత్త ఉపాధి చట్టం సామాజిక భద్రత నుంచి తిరోగమనం కాదు. దీని ప్రధాన ఉద్దేశం వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడమే. ఉపాధి కంటే ఆస్తుల సృష్టికే ఈ సంస్కరణ ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శ ఉంది. అయితే ఈ బిల్లు ఒకవైపు ఉత్పాదక, శాశ్వత ప్రజా ఆస్తుల సృష్టికి ఉపాధిని అనుసంధానిస్తూనే మరోవైపు చట్టబద్ధమైన జీవనోపాధికి కూడా హామీ ఇస్తోంది. సంక్షేమ సంస్కరణలపై బహిరంగ చర్చ జరగడం ఎంతో అవసరం. అది ఆరోగ్యకరమైన పరిణామం కూడా. ‘వికసిత భారత్ – రోజ్‌గార్, ఆజీవిక మిషన్ (గ్రామీణ్ )’ (విబి-జి రామ్ జి) పై కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు ఒక సహేతుకమైన సందేహం నుంచి పుట్టినవే. పూర్వపు ఉపాధి హామీ పథకంలో ఏవైనా మార్పులు చేస్తే, కార్మికులు ఎంతో కష్టపడి సాధించుకున్న హక్కులు నీరుగారిపోతాయేమోనన్న భయం అందులో ఉంది. ఆ ఆందోళనను గౌరవించాల్సిందే. అయితే, కేవలం ఊహల ఆధారంగా కాకుండా, వికసిత భారత్ జి రామ్ జి బిల్లు అసలు ఏమి అందిస్తుందో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఈ బిల్లులోని అత్యంత ప్రముఖమైన అంశం ఏమిటంటే ఇది ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని కల్పిస్తుంది. గతంలో ఉన్న ఉపాధి హామీ (మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కాలం నాటి అనర్హత నిబంధనలను తొలగించి, దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి కల్పించే నిబంధనను ఈ బిల్లు పునరుద్ధరించింది. భారతదేశ గ్రామీణ ఉపాధి చట్రంలో లోపం దాని ఉద్దేశంలో కాక రూపొందించిన తీరులో ఉంది. విబి-జి రామ్ జి పథకాన్ని ఈ వాస్తవం ఆధారంగానే అంచనా వేయాలి. హక్కులను బలహీనపరచడానికి బదులుగా ఈ కొత్త చట్రం ఉపాధి హామీలోని లోపాలను నేరుగా పరిష్కరిస్తుంది. కార్మికులకు దక్కాల్సిన ఫలాలను నిరాకరించే పాత నిబంధనలను తొలగించడం ద్వారా, పారదర్శకత, సామాజిక తనిఖీ, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన చట్టబద్ధమైన బాధ్యతలను బలోపేతం చేయడం ద్వారా ఈ బిల్లు ఉపాధి హామీపై విశ్వసనీయతను పునరుద్ధరిస్తోంది. జవాబుదారీతనం పెంచడం, నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదుల పరిష్కారం వంటివి కేవలం అదనపు అంశాలు కావు; క్షేత్రస్థాయిలో హక్కులను అర్థవంతంగా అమలు చేయడానికి ఇవి చాలా కీలకం. ఈ కోణంలో చూస్తే విబి-జి రామ్ జి సామాజిక భద్రత నుంచి వెనక్కి తగ్గడం లేదు. తరచుగా ఆటంకాలకు గురయ్యే ఒక హక్కును, నిజమైన, అమలు చేయదగిన హామీగా మార్చేందుకు ఇది ప్రయత్నిస్తోంది.

డిమాండ్ ఆధారిత ఉపాధి

విబి-జి రామ్ జి గ్రామీణ ఉపాధి ‘డిమాండ్ ఆధారిత’ స్వభావాన్ని దెబ్బతీస్తుందనేది అత్యంత సాధారణ విమర్శ. అయితే, బిల్లును పైపైన చదివినా ఈ వాదన నిలబడదని అర్థమవుతుంది. నిబంధన 5(1) ప్రకారం.. నైపుణ్యం లేని పనులు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రతి గ్రామీణ కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల గ్యారెంటీ వేతన ఉపాధిని కల్పించాల్సిన స్పష్టమైన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పని అడిగే హక్కును బలహీనపరచడానికి బదులుగా, గ్యారెంటీ ఉపాధిని 125 రోజులకు పెంచడం, మునుపటి ఆంక్షలను తొలగించడం ద్వారా ఈ బిల్లు ఆ హక్కును మరింత బలోపేతం చేస్తోంది. చట్టబద్ధమైన గ్యారెంటీలు, జవాబుదారీతనంలో ఇమిడి ఉన్న హక్కు సహజంగానే బలంగా ఉంటుంది—విబి-జి రామ్ జి వాస్తవ రూపంలో సరిగ్గా అదే చేస్తోంది.

ఆస్తుల సృష్టి – ఉపాధి అనుసంధానం

ఈ సంస్కరణ ఉపాధి కంటే ఆస్తుల సృష్టికే ప్రాధాన్యం ఇస్తోందనేది మరో విమర్శ. ఈ బిల్లు ఒకవైపు చట్టబద్ధమైన జీవనోపాధికి హామీ ఇస్తూనే మరోవైపు ఆ ఉపాధిని ఉత్పాదక, శాశ్వత ప్రజా ఆస్తుల సృష్టితో అనుసంధానిస్తోంది. నిబంధన 4(2), షెడ్యూల్ I ప్రకారం నాలుగు ప్రధాన రంగాలను గుర్తించారు: నీటి భద్రత, కీలకమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, విపత్కర వాతావరణ పరిస్థితులను తట్టుకునే పనులు. దీనివల్ల వేతన ఉపాధి కేవలం తక్షణ ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలిక ఉత్పాదకతకు కూడా దోహదపడుతుంది. ఉపాధి, ఆస్తుల సృష్టి అనేవి ఒకదానికొకటి వ్యతిరేకం కావు; అవి ఒకదానికొకటి బలాన్ని ఇస్తూ, సంపన్నమైన, స్థితిస్థాపకత కలిగిన గ్రామీణ భారత్‌కు పునాది వేస్తాయి.

వికేంద్రీకరణ, పారదర్శకత

ఇది పథకం అమలును కేంద్రీకృతం చేస్తుందన్న ఆరోపణల్లో కూడా నిజంలేదు. నిబంధన 4(1) నుంచి 4(3) వరకు ఉన్న అంశాలు అన్ని పనులను ‘వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల’ (VGPPల) ద్వారానే చేపట్టాలని నిర్దేశిస్తున్నాయి. ఇవి స్థానిక అవసరాల ఆధారంగా గ్రామ స్థాయిలో తయారై, గ్రామసభ ఆమోదం పొందుతాయి. గతంలో ఉన్న ‘విభజనలు’ అనే లోపాన్ని సరిదిద్దుతూ, అన్ని పనులను ‘వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల వ్యవస్థ’ (స్ట్యాక్) పరిధిలోకి తీసుకురావడం ద్వారా సమగ్ర ప్రణాళికకు, పర్యవేక్షణకు ఇది అవకాశం కల్పిస్తోంది. ఇది కేవలం ఆదేశాలతో కూడిన కేంద్రీకరణ కాదు. నిబంధన 16, 17, 18, 19 ప్రకారం ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అధికారాలు పంచాయతీలు, కార్యక్రమం అధికారులు, జిల్లా అధికారులకే ఉంటాయి. ఈ బిల్లు కేవలం సమన్వయాన్ని, స్పష్టతను పెంచుతుందే తప్ప నిర్ణయాధికారాలను కేంద్రీకరించదు. స్థానిక ప్రాధాన్యాల ఆధారంగా గ్రామసభలే ప్రణాళికలను నడిపిస్తాయి.

వ్యవసాయ రంగంతో సమతుల్యత

పంట సీజన్ సమయాల్లో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడుతుందనే ఆందోళనలను కూడా ఈ బిల్లు పరిష్కరించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో విత్తనాలు నాటే, కోతలు కోసే కీలక సమయాల్లో గరిష్టంగా 60 రోజుల పాటు ఈ పథకం కింద పనులు చేపట్టకుండా ముందస్తుగా నోటిఫై చేసే అధికారాన్ని నిబంధన 6 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ముఖ్యాంశం ఏమిటంటే నిబంధన 6(3) ప్రకారం రాష్ట్రాలు జిల్లా, బ్లాక్ లేదా గ్రామ పంచాయతీ స్థాయిలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయవచ్చు. ఈ వెసులుబాటు వల్ల ఉపాధి హామీ వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించకుండా దానికి తోడ్పాటుగా నిలుస్తుంది.

ఆర్థిక, సాంకేతిక అంశాలు

నిధుల కోత విధిస్తారనే భయాలపై కూడా బిల్లులో స్పష్టత ఉంది. నిబంధన 4(5), 22(4) ప్రకారం రాష్ట్రాల వారీగా కేటాయింపులు నిబంధనలలో పేర్కొన్న నిష్పాక్షిక ప్రమాణాల ఆధారంగానే జరుగుతాయి. అదే సమయంలో రాష్ట్రాలను కేవలం అమలు చేసే ఏజెన్సీలుగా కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా ఈ కొత్త నిబంధనావళి పరిగణిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలను రూపొందించుకుని అమలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది ‘సహకారాత్మక సమాఖ్య’ స్ఫూర్తికి నిదర్శనం.

సాంకేతికత వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని భయపడే వారు బిల్లులో దీనికి సంబంధించి పొందుపరిచిన రక్షణలను పట్టించుకోవడం లేదు. నిబంధన 23 , 24 ప్రకారం బయోమెట్రిక్ ధ్రువీకరణ, జియో-ట్యాగింగ్, రియల్ టైమ్ (తక్షణ) డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా పారదర్శకతను పెంచుతున్నారు. దీనివల్ల నకిలీ హాజరు, దొంగ మస్టర్లు, ధృవీకరించలేని రికార్డుల సమస్య పరిష్కారమవుతుంది. సాంకేతికత అనేది కేవలం నియంత్రణ సాధనం కాదు, అది పనులను సులభతరం చేసే సాధనం. నిబంధన 20 ద్వారా గ్రామసభ నిర్వహించే సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్‌)ని బలోపేతం చేయడం ద్వారా సామాజిక పర్యవేక్షణను పెంచారు.

 ఉపాధి హామీని పెంచడం, స్థానిక ప్రణాళికలను ప్రోత్సహించడం, కార్మికుల భద్రతను వ్యవసాయ ఉత్పాదకతతో సమతుల్యం చేయడం, నిర్వహణను ఆధునికీకరించడం ద్వారా ఆచరణలో విఫలమవుతున్న హామీలకు ఈ బిల్లు కొత్త జీవం పోయనుంది. ఇక్కడ మన ఎంపిక సంస్కరణలు లేదా మానవతావాదం కాదు. ఆశించిన ఫలితాలు ఇవ్వడంలో విఫలమయ్యే పాత పద్ధతికి, గౌరవప్రదంగా ఫలాలను అందించే ఆధునిక వ్యవస్థకు మధ్య. విబి- జి రామ్ జి అనేది సామాజిక భద్రత నుంచి వెనకడుగు కాదు — అది సామాజిక భద్రత నవీకరణ!

శివరాజ్ సింగ్ చౌహన్,
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి