NNS

సామాన్య కార్యకర్తకు దక్కిన సముచిత గౌరవం

Nitin Nabinభారతీయ జనతా పార్టీ కీలక నియామకాల విషయంలో రాజకీయ పండితులను, విశ్లేషకులను ఆశ్చర్యపరచడం కొత్తేమీ కాదు. రాజకీయాల్లో, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో నెలకొన్న పాత సంప్రదాయాలను సవాలు చేస్తూ బిజెపి ఎప్పుడూ వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా నితిన్ నబీన్‌ను బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం పార్టీ చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఇది యువ నాయకత్వానికి, క్రమశిక్షణతో కూడిన సంస్థాగత అనుభవానికి, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెబుతోంది.

అనూహ్య ఎంపిక.. అసాధారణ ప్రస్థానం

ముఖ్యంగా బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ పార్టీ అత్యున్నత సంస్థాగత పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్షేత్రస్థాయి అవగాహనతో పాటు జాతీయ స్థాయి దృక్పథం ఉన్న నాయకులను సాధికారీకరించాలనే బిజెపి నిబద్ధతకు ఈ నియామకమే నిదర్శనం. విద్యార్థి రాజకీయాల నుంచి బిజెపి, భారతీయ జనతా యువ మోర్చాలో కీలక బాధ్యతల వరకు నితిన్ నబీన్ ప్రస్థానం నిరంతర శ్రమతో కూడుకొని ఉంది. క్రమశిక్షణ, వినయం, వ్యూహాత్మక స్పష్టత, పార్టీ సిద్ధాంతం పట్ల అచంచలమైన నిబద్ధత వంటి లక్షణాలే ఆయనను ఈ స్థాయికి చేర్చాయి.

వ్యూహాత్మక అడుగులు

పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి అత్యంత దూరదృష్టితో ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉంటుంది. అక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి నితిన్ నబీన్ వంటి సంస్థాగత నిపుణుల అవసరం ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇంచార్జ్‌గా ఆయన పనితీరు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వాన్ని ఓడించి బిజెపిని గెలుపు తీరాలకు చేర్చడంలో ఆయన చూపిన చొరవ ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. పార్టీ తన ప్రాబల్యాన్ని విస్తరిస్తున్న, దాని శ్రేణులను బలోపేతం చేస్తున్న, రాష్ట్ర స్థాయి వ్యూహాలకు పదునుపెడుతున్న నేపథ్యంలో నబీన్ నియామకం జరిగింది.

వారసత్వ రాజకీవారసత్వం కాదు… నైపుణ్యమే ప్రామాణికం

వారసత్వాలకు అతీతంగా, కేవలం కష్టపడి పనిచేసే తత్వంతో నాయకత్వ స్థానానికి చేరుకోవచ్చని నితిన్ నబీన్ నిరూపించారు. “నిబద్ధతతో పనిచేసే ఏ కార్యకర్త అయినా అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు” అనే బలమైన సందేశాన్ని ఈ నియామకం దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది బిజెపి కార్యకర్తలకు పంపింది. బూత్ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడం సాధ్యమేనని ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తినిస్తోంది.

భవిష్యత్ భారతం – పార్టీ లక్ష్యం

అనుభవజ్ఞులైన అగ్ర నాయకత్వానికి, భవిష్యత్తుపై ఆకాంక్షలతో ఉన్న యువతరానికి మధ్య నితిన్ నబీన్ ఒక వారధిలా నిలవనున్నారు. కేవలం ఎన్నికల గెలుపోటములే కాకుండా, దేశ నిర్మాణం, సమగ్ర అభివృద్ధిలో పాలుపంచుకునే సమర్థమైన నాయకులను తయారు చేయాలనే బిజెపి దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగానే ఈ మార్పు జరిగింది. నితిన్ నబీన్ ముందు ఇప్పుడు బృహత్తరమైన బాధ్యతలు ఉన్నాయి. కోట్లాది కార్యకర్తల నమ్మకాన్ని, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ తనదైన యువ ఉత్సాహం, సంస్థాగత పరిణతితో రాబోయే రోజుల్లో భారత రాజకీయ యవనికపై ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

మృత్యుంజయ్ శర్మ