culture

మోదీ సాంస్కృతిక ‘స్వరాజ్’పై అర్థంలేని విమర్శలు

రామనాథ్ గోయెంకా స్మారక ఉపన్యాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వలసవాదం నుంచి విముక్తి ఎజెండాను బలంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన మెకాలే సిద్ధాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. స్వాతంత్య్రం తరువాత కూడా ఈ సిద్ధాంతం కొనసాగడం వలన మన మేధో వారసత్వానికి, నేడు ఉత్పత్తవుతున్న ఆలోచనలకీ మధ్య తీవ్రమైన అంతరం ఏర్పడింది. వలస పాలన వల్ల భారతదేశం ప్రయోజనం పొందిందని వాదించే రాజకీయ, మేధావి వర్గాలకు మోదీ వ్యతిరేకంగా నిలిచారు. మార్పుతో కూడిన కొనసాగింపుపై వారి నమ్మకం వలసవాద మనస్తత్వపు అవశేషమే.

మోదీ ప్రసంగం మరొక కారణంగా కూడా చారిత్రకమైంది. ఒక దశాబ్దంలోపే సాంస్కృతిక, విద్యా, భాషా విధానాలలో సమూల సంస్కరణలు చేపట్టడానికి కొత్త బోధనా పద్ధతులు, పరిశోధనలు అవసరం. అంతేకాక ఈ విధానాలు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలి. మోదీకి ఒక కలిసివచ్చే అంశం ఉంది: ప్రజలు స్థానిక వివేకానికి గౌరవం ఇస్తారు, విద్య మన సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందాలని ఆశిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయి క్రియాశీలత కూడా తరచుగా పశ్చిమ దేశాల మేధో అండదండలు పొందే, విద్యాపరంగా ప్రభావశీలురైన సంస్కరణల వ్యతిరేకులను ప్రభుత్వ సంస్థలు ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

దేశ నిర్మాణంపై దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాని మోదీల దృక్పథాల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ లోపల కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ, నెహ్రూ ఆలోచనా ధోరణి సంప్రదాయాలకు, సంస్కృతికి తక్కువ ప్రాధాన్యమిచ్చి, ఆధునికత అంటే పాశ్చాత్యీకరణ అనే దృష్టితో వ్యవహరించింది. చరిత్ర, సంస్కృతిపై పరిశోధన, ప్రచురణలను ప్రోత్సహించడానికి నెహ్రూ క్యాబినెట్ సహచరుడు కె ఎం మున్షీ స్థాపించిన విద్యా భవన్ పతనానికి ఇది దారితీసింది. మోదీ, నెహ్రూల వైఖరుల మధ్య వ్యత్యాసాన్ని కొన్ని ఉదాహరణలు స్పష్టం చేస్తాయి. 1955లో గోవా విముక్తి ఉద్యమంలో స్వాతంత్య్ర సమరయోధుడు మోహన్ రనడేను పోర్చుగీసు వారు అరెస్టు చేసి, పోర్చుగల్ రాజధాని లిస్బన్ కు పంపారు. అక్కడ ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 1961లో గోవా విముక్తి తరువాత సుమారు 3,500 మంది పోర్చుగీస్ ఖైదీలను, రనడేను తిరిగి పంపాలని నెహ్రూ డిమాండ్ చేయలేదు. రనడే తల్లి రామబాయి ఆప్టే కంటి చూపు కోల్పోతున్నప్పటికీ, తన కుమారుడిని చూడాలన్న ఆమె కోరికను నిరాకరించారు. రాజ్యసభలో అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ విషాద గాథను లేవనెత్తినప్పుడు, విదేశాంగ మంత్రి ఎం. సి. చాగ్లా క్షమాపణలు చెప్పారు. దీనికి భిన్నంగా మోదీ తీసుకున్న చర్యను గమనించండి. లండన్‌లో ఇండియా హౌస్‌ను స్థాపించి, ‘ఇండియన్ సోషియాలజిస్ట్’ పత్రికకు సంపాదకత్వం వహించిన విప్లవ జాతీయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మను సామ్రాజ్యవాదులు వెంటాడగా ఆయన 1930లో జెనీవాలో మరణించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్మ అస్థికలను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు. దేశంలో ఇప్పటికీ బ్రిటిష్ పాలకుల విగ్రహాలు ఎందుకు ఉన్నాయని 1965లో గాంధేయవాది, రాజ్యసభ సభ్యుడు జి. రామచంద్రన్ ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం వద్ద సంతృప్తికరమైన సమాధానం లేదు. బ్రిటిష్ పాలన అకృత్యాలను ప్రజలకు గుర్తుచేసే బహిరంగ ప్రదేశాలకు మోదీ పేరు మార్చారు. ఇది ఫ్రెంచ్ మేధావి ఫ్రాంజ్ ఫానన్ వలసవాద చిహ్నాలపై చేసిన విమర్శకు అనుగుణంగా ఉంది. 

భారతదేశ సామాజిక శాస్త్రవేత్తలు పాశ్చాత్య ఆలోచనలకు లొంగిపోయిన ఫలితంగా మనం కేవలం వ్యాఖ్యాతలుగా, పాఠ్యపుస్తక రచయితలుగా మిగిలిపోయాం; ప్రపంచ సాహిత్యం, సామాజిక శాస్త్రాలలో మన పాత్ర పరిమితంగా ఉంది. నేడు భారతీయ జ్ఞాన వ్యవస్థ ప్రాచుర్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం గొప్ప ఉత్సాహంతో కృషి చేస్తున్నప్పుడు సంస్కరణల వ్యతిరేకులు ఈ ప్రాజెక్టును సంకుచిత జాతీయవాదంగా ప్రచారం చేస్తున్నారు. ఆలోచనలు, సంస్కృతిలో స్వరాజ్యాన్ని సాధించకుండా ఏ దేశమూ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోజాలదని 1931లో ఒక ఉపన్యాసంలో తత్వవేత్త కె సి భట్టాచార్య నొక్కి చెప్పారు. అట్టడుగు వర్గాల చరిత్రకారులు (సబాల్టర్న్) మోదీని వ్యతిరేకిస్తారు. అయితే వలసానంతర సిద్ధాంతకర్తలు వలసవాదం అవశేషాలపై తీవ్ర అసంతృప్తి కలిగి ఉంటారు. అందువల్ల మోదీ వలస విముక్తి లక్ష్యం వారి దృక్పథానికి భిన్నం కాదు.

“విస్మృత వర్గాలను (సబాల్టర్న్స్)” చాలా కాలంగా ప్రశంసించిన భారతీయ పండితులు ఆ ఆలోచన వాస్తవంగా మారుతున్నప్పుడు మాత్రం దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక వాస్తవాన్ని తెలియజేస్తుంది. అధికారం కల్పించే సౌకర్యాలు మేధావులలో కూడా వారి సైద్ధాంతిక ప్రత్యర్థులతో మేధోపరంగా తలపడటానికి బదులుగా కేవలం నినాదాలు చేసేందుకే పరిమితం చేస్తాయి. నెహ్రూవాద పాలనతో విభేదించే ఏ అంశాన్నైనా కాషాయంగా ముద్ర వేయకూడదు. ప్రతి విమర్శనాత్మక ఆలోచనను వామపక్షంగా కొట్టిపారేయకూడదు. భారతీయ జ్ఞాన వ్యవస్థ లక్ష్యం ప్రపంచ సాహిత్యం, సామాజిక శాస్త్రాలపై ప్రభావం చూపడం కావాలి.

రాకేష్ సిన్హా,
మాజీ రాజ్యసభ సభ్యుడు