సీఎం రేవంత్ రెడ్డి శాఖలో ఫేక్ ఎన్‌వోసీల ప్రకంపనలు
తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుమతి కోసం దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. రెండేండ్లుగా ఈ తతంగం నడుస్తున్నా అధికారులు గుర్తించలేకపోయారు. ఇంటర్‌బోర్డుకు విద్యాశాఖ మంత్రి చైర్మన్. పైగా, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఇంటర్‌బోర్డులో ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 52 కాలేజీలు ఫేక్ ఎన్‌వోసీలు సమర్పించడం ఇంటర్‌బోర్డులో కలకలం రేపింది. గ్రేటర్ పరిధిలో 142 కాలేజీల్లో 52 కాలేజీలు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు హైడ్రా తేల్చింది. వీటిపై తగు చర్యలు తీసుకోవాలని హైడ్రా సిఫార్సు చేసినా ఫేక్ ఎన్‌వోసీలు సమర్పించిన కాలేజీలపై చర్యలు తీసుకొనేందుకు ఇంటర్‌బోర్డు మీనమేషాలు లెక్కిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు రాజకీయ ఒత్తిడులా? ముఖ్యమంత్రి సన్నిహితుల ప్రభావమా? అనే విమర్శలు ఎదురవుతున్నాయి. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే రాజకీయ నాయకుడి కళాశాల (హైందవీ జూనియర్ కళాశాల)కు చెందిన ఫేక్ ఎన్వోసీపై వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. తీగ లాగితే డొంక కదిలినట్టు చాలా కళాశాలలు ఫేక్ ఫైర్ ఎన్వోసీలతో ఇంటర్ బోర్డు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్టు తేలింది. దీంతో ఓఆర్ఆర్ పరిధిలోని కళాశాలల ఫైర్ ఎన్‌వోసీలన్నిటినీ పరిశీలించడం ప్రారంభించింది. ప్రాథమికంగా కొన్నిటిని పరిశీలించగా 8 కళాశాలల ఫైర్ ఎన్‌వోసీలు నకిలీవని తేలింది. వెనువెంటనే జులై 4న నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత మరో 44 కళాశాలల ఫైర్ ఎన్వోసీలు ఫేక్ అని తేలింది. ఈ జాబితాను కూడా లేక్ పోలీసులకు అందజేసింది. ఇలా కళాశాలలన్నీ సమర్పించిన ఫైర్ ఎన్వోసీలను ఇంటర్ బోర్డుతో కలిసి హైడ్రా పరిశీలిస్తోంది.
నకిలీ ఫైర్ ఎన్‌వోసీలకు సంబంధించి హైడ్రా దృష్టికి రాగానే విచారణ చేపట్టడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇంటర్ బోర్డుకు లేఖ రాయడం.. ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తూ వచ్చింది. ఇందులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. అలాగే ఇంటర్మీడియట్ లో ఒక అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఆ అధికారి హైడ్రాతో కలసి, నకిలీ సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, బాధ్యులపై తగు చర్యలు తీసుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ముందుకు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్‌ను పెండింగ్‌లో పెట్టిన ఇంటర్‌బోర్డు ఒరిజినల్ ఫైర్ ఎన్‌వోసీ తెస్తే గుర్తింపునిస్తామంటున్నది.
తప్పు చేసిన కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్లీ పైర్ ఎన్‌వోసీ తెస్తే అనుమతినిస్తామానడం ద్వారా వారి క్రిమినల్ నేరాలను పట్టించుబోమనే స్ఫష్టంగా సంకేతాలు ఇస్తున్నది. ఫేక్ ఎన్‌వోసీల వ్యవహారంలో కంచె చేను మేసిన చందంగా కొందరు వ్యవహరించినట్టు తెలిసింది. దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం గతంలో వివాదాలకు దారితీసిన గ్లోబరినా కంటే మించిన కుంభకోణం జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా ఈ వ్యవహారంపై సీబీసీఐడీ, విజిలెన్స్ చేత విచారణ జరిపించకుండా, వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే అందుకు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలే అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది. కాసులకు కక్కుర్తిపడిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన కొందరు అధికారుల పాత్రపై విచారణ జరుపాలని అధ్యాపక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. అనుమతి ఒక పేరుతో, క్లాసులు మరో పేరుతో నడుస్తున్న కాలేజీకి ఓ అధికారి పరోక్షంగా అండదండలందిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా రెండు హాస్టళ్లను అధికారి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ జిల్లాల్లోని ఓ కాలేజీలో 90 మంది విద్యార్థులే ఉండగా, ఈ కాలేజీకి అనుమతినిచ్చేందుకు రూ.2 లక్షలు అడిగినట్టు ఆరోపణలున్నాయి. ఓ అధికారి కాలేజీ నిర్వాహకులను హోటళ్లకు పిలిపించుకొని ముడుపులు స్వీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నెల రోజుల ముందే లేక్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ, ఫైర్ డిపార్టుమెంట్ పేరు మీద రకరకాల స్టాంపులతో, వేర్వేరు కార్యాలయాల పేరిట ఫైర్ ఎన్వోసీలు జారీ అయిన విషయం ఒకటొకటిగా బయటపడుతున్నాయని హైడ్రా తెలిపింది. హైందవి, రిసోనెన్స్, ప్రియాంక, మథర్స్ గర్ల్, శ్రీచంద్ర, న్యూ ఎరా, షాహీన్, వశిష్ఠలతో సహా పలు జూనియర్ కళాశాలలపై హైడ్రా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ప్రైవేట్ జూనియర్ కళాశాలల భవనాలన్నీ కూడా కమర్షియల్ భవనాలే. ఇవి భవన నిర్మాణ నియమాలను ఉల్లంఘించి నిర్మించినవే. దాదాపు 95శాతం భవనాలన్నీ అక్రమ నిర్మాణాలు కావడంతో వీటికి ఫైర్ ఎన్‌ఓసీ మంజూరు చేయడానికి నియమ నిబంధనలు ససేమిరా అంటాయి. కళాశాలను నడవాలంటే విద్యాశాఖ అనుమతికోసం ఫైర్ ఎన్‌ఓసీ తప్పనిసరి. అందుకనే, ఓ ప్రైవేట్ కళాశాల యజమాని ఓ కన్సల్టెన్సీని కలవడంతో నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ సమర్పించే సలహా ఇవ్వడంతో అప్పటి నుండి పలువురు అనుసరించడం ప్రారంభించినట్లు తెలుస్తున్నది. 15 మీటర్ల ఎత్తు లోపు ఉన్న భవనాలకే హైడ్రా ఫైర్ ఎన్వోసీలు జారీ చేస్తుంది. 15 మీటర్ల ఎత్తుకంటే ఎత్తైన భవనాలకు రాష్ట్ర ఫైర్ శాఖ ఎన్వోసీలను ఇస్తుంది. హైడ్రా రాక ముందు జీహెచ్ఎంసీ ఫైర్ ఎన్వోసీలను జారీ చేసేది. ఇప్పటికీ జీహెచ్ ఎంసీ పేరిట ఫేక్ ఫైర్ ఎన్వోసీలు జారీ అవుతుండడం గమనార్హం.
ప్రవీణ్

