GKR

మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధం

Sant Ravidas Programహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంటే, ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంత్ రవిదాస్ ఆశయాలకు అనుగుణంగా ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ స్ఫూర్తితోనే పాలన సాగిస్తోందని తెలిపారు. సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకల్లో భాగంగా ఆగస్ట్ 23న బిజెపి ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘కలశ వందన్ అభియాన్’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ కలశ యాత్ర సాగింది. అనంతరం నిర్వహించిన సభలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు బిజెపి ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సంత్ రవిదాస్ భక్తి ఉద్యమం ద్వారా సమాజంలో చైతన్యం, సామాజిక సమానత్వం తెచ్చేందుకు కృషి చేసిన మహోన్నత ఆదర్శమూర్తి అని కొనియాడారు. 650 ఏళ్ల క్రితం ఆయన అందించిన సమసమాజ సందేశం నేటికీ భగవద్గీతలా మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు. మనిషికి గొప్పతనం పుట్టుకతోనో, కులంతోనో, ఆర్థిక స్థోమతతోనో రాదని… ఆలోచన, ఆచరణ, సమాజ సేవ ద్వారానే లభిస్తుందని స్పష్టం చేశారు. గత పదకొండేళ్లలో దేశవ్యాప్తంగా చేపట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాల ద్వారా సుమారు 25 కోట్ల మంది పేదరిక నిర్మూలన జరిగిందని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పేద, దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని, ‘హర్ ఘర్ జల్’ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇప్పటికే 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అధిక శాతం దళిత కుటుంబాలకే అందించామని, దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది పేదలకు 5 కేజీల ఉచిత బియ్యం, ఆయుష్మాన్ భారత్ ద్వారా నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. నేడు దేశంలోని అన్ని గ్రామాలు, తండాలు, దళితవాడలకు విద్యుద్దీకరణ, రహదారి కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి వెనుకబడిన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. బిజెపి శ్రేణులు ప్రతి దళితవాడ, బీసీ బస్తీ, గ్రామ గ్రామానికి చేరుకుని సంత్ రవిదాస్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పేద వర్గాలకు మరింత అంకితభావంతో సేవలందించి ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, గౌతమ్‌రావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.