దేశ భవిష్యత్‌కు బాటలు వేసిన మోదీ ఎర్రకోట ప్రసంగాలు
వరుసగా 13 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కొక్క ప్రసంగంలో దేశానికి ఒక్కొక్క గమ్యాన్ని నిర్దేశించారు. ఈ 13 ఏళ్ళలో ఆయన సందేశం రూపురేఖలు గణనీయంగా మారాయి. ప్రారంభంలో జవాబుదారీతనం కలిగిన ప్రభుత్వం, సుపరిపాలనపై దృష్టి సారించిన ప్రధాని, తదనంతరం ఆర్థిక పరివర్తన, జాతీయ భద్రత, ఆత్మనిర్భరత అనే బృహత్తర లక్ష్యాల దిశగా ప్రసంగాల సరళిని మళ్లించారు. సంక్షేమం, సాంకేతికత, ఉపాధి, ఇంధన రంగం, భద్రత, పాలన అనే విభిన్న అంశాలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ‘వికసిత్ భారత్ – 2047’ ప్రతిపాదనను ఒక సమగ్ర భావనగా మలిచారు.
2014: ‘ప్రధాన్ సేవక్’ – కొత్త పాలనా శైలికి శ్రీకారం
మూడు దశాబ్దాల తర్వాత బిజెపి సొంతంగా లోక్‌సభలో మెజారిటీ సాధించిన కేవలం మూడు నెలలకే ప్రధానిగా మోదీ చేసిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఆయన రాబోయే రోజుల్లో ఎలా పరిపాలించబోతున్నారో స్పష్టం చేసింది. తనను తాను ‘ప్రధాన్ సేవక్’గా అభివర్ణించుకుంటూ, ప్రజలకు సేవ చేసే, అధికార యంత్రాంగంలో అలసత్వాన్ని వదిలించి, అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పెంచే ప్రభుత్వాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్యం, ఆర్థిక సమ్మిళితత్వం, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాలు కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ప్రకటించారు. జన్ ధన్, స్వచ్ఛ భారత్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన, ‘మేక్ ఇన్ ఇండియా’ పథకాలను ఆయన ప్రకటించారు. స్పష్టంగా కనిపించే మార్పులు, ఆర్థిక అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రజలకు చేరువగా ఉండే ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం, తయారీ రంగ ఆధారిత వృద్ధి , అలసత్వంతో కూడిన పాత పరిపాలనా సంస్కృతికి స్వస్తి చెప్పడం వంటి అంశాలతో తొలి మోదీ ప్రభుత్వ దిశానిర్దేశం జరిగింది.
2015: అభివృద్ధి కూటమి విస్తరణ
పదవిలోకి వచ్చిన ఏడాది పూర్తయ్యాక, మోదీ తన అభివృద్ధి నినాదాన్ని మరింత విస్తరించారు. సామాజిక ఉద్రిక్తతలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, సామాజిక సామరస్యం, సర్వసమ్మతిపై అధిక ప్రాధాన్యమిచ్చారు. ”భారతదేశ బలం భారతీయుల నిరాడంబరతలో, దేశంలోని నలుమూలలా ఉన్న ఐక్యతలో ఉంది” అని ఆయన పేర్కొన్నారు. అవినీతిని, సంక్షేమ ఫలాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సాంకేతికత, పారదర్శకత, సత్వర సేవలను సాధనాలుగా చూపారు. స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా పథకాలు ప్రధాన ప్రకటనలుగా నిలిచాయి. స్టాండ్ అప్ ఇండియా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది. వీటితో పాటు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ అమలు ప్రకటించారు. గ్రామీణ విద్యుదీకరణ, సాయిల్ హెల్త్ కార్డ్, బీమా, సాగునీటి సౌకర్యాలు వంటి చర్యలతో ప్రభుత్వం తన అభివృద్ధి ఎజెండాను కేవలం పాలన, తయారీ రంగాలకే పరిమితం చేయకుండా విస్తరించింది.
2016: జాతీయ భద్రతకు ప్రాధాన్యం
తన మూడో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ కొత్త పాలనా శైలిని వివరించడం నుంచి, సాధించిన ఫలితాలను చూపించే దిశగా పయనించారు. ఈ ప్రయాణాన్ని ‘స్వరాజ్ నుంచి సురాజ్య’గా అభివర్ణిస్తూ, వేగవంతమైన సేవలు, అధికార యంత్రాంగంలో సరళీకరణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సమ్మిళితత్వం, మరింత జవాబుదారీతనానికి నిదర్శనాలుగా పేర్కొన్నారు. ”ఒకనాడు ప్రభుత్వాలు ఆరోపణలతో చుట్టుముట్టి ఉండేవి. నేడు అవి ప్రజల ఆకాంక్షలతో చుట్టుముట్టి ఉన్నాయి” అని తెలిపారు. అయితే, ఉగ్రవాది బుర్హాన్ వానీని హతమార్చిన తర్వాత కాశ్మీర్లో చెలరేగిన అశాంతి నేపథ్యంలో చేసిన ఈ ప్రసంగంలో జాతీయ భద్రతకు ప్రాధాన్యం పెరిగింది. కాశ్మీర్ ప్రజలను ఉద్దేశించి — ”తుపాకులు లేదా దూషణలతో కాదు, కాశ్మీర్ ప్రజలను ఆలింగనం చేసుకోవడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారమవుతుంది” అని చెబుతూనే, బలూచిస్తాన్, గిల్గిత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రస్తావనలు తెచ్చారు. ఈ ప్రసంగం ద్వారా సంక్షేమ పథకాల అమలే కాకుండా, కఠినమైన భద్రతా విధానం, సామాజిక క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు.
2017: 2022 నాటికి ‘నవభారతం’
మూడేళ్ల పాలన పూర్తయ్యాక మోదీ అభివృద్ధి ఎజెండాను ఐదేళ్ల జాతీయ లక్ష్యంగా మలిచారు. 2022 నాటికి ‘నవభారతం’ నిర్మాణం జరగాలన్నారు. జీఎస్టీ అమలు తర్వాత, అలాగే నోట్ల రద్దు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, సామాజిక ఉద్రిక్తతలపై విమర్శలు వస్తున్న తరుణంలో చేసిన ఈ ప్రసంగంలో ”చల్తా హై” (ఏదోలా సాగిపోతుందిలే) అనే ధోరణికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ”మనం ఈ ‘చల్తా హై’ వైఖరిని వదిలేయాలి. ‘బదల్ సక్తా హై’ (మారగలదు) అని ఆలోచించాలి” అని అన్నారు. అవినీతి నిరోధక చర్యలు, ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడంతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, తూర్పు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ భద్రత పరిధిని విస్తరించి ఉగ్రవాదం, కాశ్మీర్, మావోయిజం, సైబర్ స్పేస్, అంతరిక్ష రంగాలను దానిలో చేర్చారు. జాతీయ మనస్తత్వాన్ని మార్చడం, నిరాశను ఆశగా మార్చడం, పౌరులను ”నవ భారత” నిర్మాతలుగా మార్చడం ప్రధాన రాజకీయ సందేశంగా మారింది.
2018: సంక్షేమం, మహిళా సాధికారత, బలమైన భారత్
2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ ప్రసంగం ప్రధానంగా నాలుగేళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టుగా సాగింది. పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, డిజిటలైజేషన్‌ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సరికొత్త సంక్షేమ హామీగా ప్రకటించారు. ప్రసూతి ప్రయోజనాలు, సైన్యంలో మహిళల భాగస్వామ్యం, త్రిపుల్ తలాక్ రద్దుకు ప్రభుత్వం చేసిన కృషి ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. జాతీయ భద్రతకు రాజకీయంగా సమాన ప్రాధాన్యం లభించింది. ఉరీ ఉగ్రదాడికి సమాధానంగా చేసిన మెరుపుదాడులను ప్రస్తావిస్తూ, సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ ఇకపై మౌనంగా ఉండదని స్పష్టం చేశారు. అలాగే ‘గగన్‌యాన్’ మానవ సహిత అంతరిక్ష నింగి ప్రయోగం సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది.
2019: నిర్ణయాత్మక చర్యలు, కొత్త జాతీయ ఎజెండా
పెద్ద మెజారిటీతో బిజెపి తిరిగి అధికారంలోకి రావడం, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగ హోదాను తొలగించిన తర్వాత చేసిన 2019 ప్రసంగం, సరికొత్త ప్రజల తీర్పుతో వచ్చిన ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది. అధికరణం 370, అధికరణం 35ఎ రద్దు రాజకీయ సందేశంలో ప్రధానాంశాలుగా నిలిచాయి. వీటి రద్దును జాతీయ సమగ్రత సంపూర్ణం కావడంగా మోదీ అభివర్ణించారు: ”గత 70 ఏళ్లలో చేయలేని పనిని కేవలం 70 రోజుల్లో పూర్తి చేశాం.” భవిష్యత్ ఎజెండాగా నీటి సంరక్షణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల్ జీవన్ మిషన్లను ప్రకటించారు.
2020: సంక్షోభానికి సమాధానంగా ఆత్మనిర్భర భారత్
కోవిడ్-19 మహమ్మారి, ఆర్థిక మందగమనం, లడఖ్‌లో చైనాతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య చేసిన ఈ ప్రసంగంలో అభద్రతా భావం నుంచి బయటపడటానికి ‘ఆత్మనిర్భర్ భారత్’ను ఏకైక మార్గంగా మోదీ వివరించారు. ”130 కోట్ల మంది భారతీయులకు ఆత్మనిర్భర భారత్ ఒక మంత్రంగా మారింది” అని పేర్కొంటూ ఆరోగ్యం, తయారీ రంగం, రక్షణ, సాంకేతికత, సరఫరా గొలుసులను అనుసంధానించడంపై దృష్టి సారించారు. ”వోకల్ ఫర్ లోకల్” నినాదం ఆర్థికంగానే కాక దేశభక్తిపూరిత కర్తవ్యంగా మారింది. డిజిటల్ హెల్త్ ఐడీలు, ఏకీకృత రికార్డులతో కూడిన ‘నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్’ ప్రధాన ప్రకటనగా నిలిచింది. టీకాలు, బలమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ, సరిహద్దు మౌలిక సదుపాయాలు, వ్యవసాయ సంస్కరణల గురించి ప్రస్తావించారు.
2021: సంక్షోభ నిర్వహణ నుంచి 2047 లక్ష్యం వైపు..
తీవ్రమైన రెండో కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ కోలుకుంటున్న తరుణంలో, మోదీ దృష్టి తక్షణ సంక్షోభ నిర్వహణ నుంచి దీర్ఘకాలిక జాతీయ లక్ష్యం వైపు మళ్లింది. ”సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” నినాదానికి ”సబ్కా ప్రయాస్” జతచేశారు. భారత్ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల సంవత్సరమైన 2047 లక్ష్యంగా దిశానిర్దేశం జరిగింది. నేషనల్ హైడ్రోజన్ మిషన్, గతి శక్తి ప్రాజెక్టులతో పాటు చిన్న రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు, డిజిటల్ అనుసంధానత, సెమీకండక్టర్లు, 5జి సాంకేతికత ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఆత్మనిర్భర భారత్‌ను ఒక ”ప్రజా ఉద్యమం”గా పునర్నిర్మించారు. ఇది కేవలం సంక్షోభానికి ప్రతిస్పందన మాత్రమే కాకుండా, భారతదేశ సుదీర్ఘ ఆర్థిక, సాంకేతిక, ఇంధన ఆకాంక్షలకు ఒక చట్రంగా మారింది.
2022: నాగరికత పునాదులపై అభివృద్ధి
2022 ప్రసంగంలో 2047 ప్రాజెక్ట్‌కు స్పష్టమైన భావజాల, సాంస్కృతిక చట్రాన్ని మోదీ అందించారు. ప్రధాని ”పంచ ప్రాణ్” (ఐదు ప్రతిజ్ఞలు) ను ప్రకటించారు: వికసిత్ భారత్, బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి, భారతీయ మూలాల పట్ల గర్వం, ఐక్యత, పౌర విధులు. దీనితో ‘వికసిత్ భారత్’ కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాకుండా జాతీయ అస్తిత్వంతో, సాంస్కృతిక ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్నదిగా మారింది.
2023: వికసిత్ భారత్
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి ఏడాది కావడంతో గత తొమ్మిదేళ్ల కాలాన్ని జాతీయ పరివర్తన, అంతర్జాతీయంగా భారత ప్రాభవం పెరిగిన కాలంగా మోదీ అభివర్ణించారు. అవినీతి, వారసత్వ రాజకీయం, సంతుష్టీకరణలను పురోగతికి ప్రధాన ఆటంకాలుగా పేర్కొన్నారు. నెలల తరబడి కొనసాగిన హింస, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో మణిపూర్ ప్రస్తావన వచ్చింది. ఈ ప్రసంగం ముఖ్యంగా మహిళలు, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ హామీలను విస్తరించింది. స్వయం సహాయక బృందాలలోని రెండు కోట్ల మంది మహిళల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ‘లఖ్పతి దీదీ’ పథకాన్ని తెచ్చారు. డ్రోన్ల వినియోగం ద్వారా మహిళా సాధికారతను సాంకేతికత, వ్యవసాయంతో అనుసంధానించారు. గృహ నిర్మాణ మద్దతు, సెమీకండక్టర్లు, హరిత ఇంధనం, రక్షణ, సరిహద్దు మౌలిక సదుపాయాలు ఈ ఎజెండాను పరిపూర్ణం చేశాయి. 2047 నాటి పరివర్తన పూర్తి కావాలంటే పాలనలో కొనసాగింపు అత్యవసరమని స్పష్టం చేశారు.
2024: మూడో విడత ప్రభుత్వం – సంస్కరణలు, పునరుజ్జీవనం
బిజెపి సొంత మెజారిటీ కోల్పోయినప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ తన మూడో విడత పాలనలో చేసిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఉద్యోగాలు, సుపరిపాలన, రాజకీయ పునరుజ్జీవనం గురించి నెలకొన్న ఆందోళనలకు తొలగించే ప్రయత్నం చేసింది. వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ, దృష్టి ‘జీవన సౌలభ్యం’, సాంకేతికత, విద్య వైపు మళ్లింది. రెండు ప్రతిపాదనలు ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’, ‘ఉమ్మడి పౌర స్మృతి’. దీన్ని మోదీ ‘లౌకిక పౌర స్మ్రుతి’గా అభివర్ణించారు. రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. ఆర్థిక రంగానికి సంబంధించి ‘మేక్ ఇన్ ఇండియా’ను దాటి ‘డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ది వరల్డ్’, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, గేమింగ్ రంగాలపై దృష్టి పెట్టారు.
2025: వికసిత్ భారత్‌కు పునాదిగా ఆత్మనిర్భరత
2025 ప్రసంగంలో ఆత్మనిర్భరతకు అత్యంత విస్తృతమైన అర్థాన్ని ఇస్తూ దాన్ని జాతీయ భద్రత, ఇంధనం, సాంకేతికత, ఉపాధి, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో నేరుగా అనుసంధానించారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత చేసిన ఈ ప్రసంగంలో భద్రతా అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను భారత్ మరింత ఘాటుగా సమాధానమివ్వగలదనడానికి నిదర్శనంగా చూపుతూ, ”ఎలాంటి అణు బెదిరింపులను” సహించేది లేదని ప్రధాని ప్రకటించారు. ఈ ప్రసంగం తక్షణ ఆర్థిక ఆందోళనలకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ ద్వారా యువత ఉపాధికి పెద్దపీట వేశారు. జీఎస్టీ సంస్కరణలు, అణుశక్తి విస్తరణ, సెమీకండక్టర్ ఉత్పత్తులు, సుదర్శన్ చక్ర మిషన్ ద్వారా ఆత్మనిర్భరత ఎజెండాను పన్నులు, ఇంధన, అత్యాధునిక సాంకేతిక రంగాలకు విస్తరించారు.

