G Kishan Reddy

విధ్వంస రాజకీయాలకు చరమగీతం – వికసిత్ భారతానికి శ్రీకారం

స్వతంత్ర భారతదేశం 80వ పడిలో అడుగుపెట్టింది. అనేక వైరుధ్యాలకు నిలయమైన భారతదేశం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్న వాదనలను పటాపంచలు చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వానికి ఆదర్శంగా నిలిచాం. ఆకలి కేకల నుంచి ఆహార భద్రత వైపు పయనించాం. అప్పుల కోసం ఆరాటపడే దేశం నుంచి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగాం. వెనుకబడిన దేశం నుంచి ప్రపంచ వేదికపై ప్రభావం చూపుతున్న దేశంగా రూపాంతరం చెందాం. గత 80 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు భారత కిరీటంలో చేరాయి. ఎనిమిది దశాబ్దాల నిర్మాణాత్మక ప్రస్థానాన్ని గర్వంగా చాటుకోవాల్సిన వేళ.. విధ్వంస రాజకీయాల ఛాయలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికార యావలో పడి కొన్ని రాజకీయ పార్టీలు, వాటికి వంత పాడే శక్తులు దేశ నిర్మాణం కంటే విధ్వంసానికే ప్రాధాన్యం ఇవ్వడం ఆవేదన కలిగిస్తోంది.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రాధాన్యతను విస్మరించలేం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం, ప్రజా సమస్యలపై పోరాడటం ప్రతిపక్షం బాధ్యత. పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం ప్రతిపక్షానికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు. కానీ దేశంలో ప్రతిపక్షం స్థానంలో ఉన్న కాంగ్రెస్ తన బాధ్యతలను, హక్కులను గుర్తించడం లేదు. పార్లమెంట్ పనితీరును అడ్డుకోవడమే ఎజెండాగా పని చేస్తోంది. నిర్మాణాత్మక చర్చలకు ఆస్కారం కల్పించకుండా నిరసనలకు, ఆందోళనలకు కేంద్రంగా పార్లమెంటును వేదికగా మార్చుతోంది. ఇటీవలి పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో ఒక రకమైన ”disruptive mentality” కనిపిస్తోంది. ఈ ధోరణితోనే ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి పార్లమెంటు వ్యవస్థకే విఘాతం కలిగిస్తోంది.

పార్లమెంట్‌లో ఏదైనా అంశంపై చర్చ కావాలని ప్రతిపక్షం పట్టుబట్టడం ప్రజాస్వామ్యంలో సహజం. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంలో కూడా తప్పు లేదు. కానీ ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నా నిరసనలు కొనసాగిస్తే ఏమనుకోవాలి? ప్రతిపక్షం లేవనెత్తుతోన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, అన్ని సందేహాలను నివృత్తి చేయడానికి, అన్ని అనుమానాలను తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే సభ నడవాలి కదా! నినాదాలు, నిరసనలు, వాకౌట్లతో సభ సజావుగా నడవకుండా అంతరాయం కలిగిస్తే ప్రభుత్వం ఎలా చర్చను కొనసాగిస్తుంది, తమ ప్రశ్నలకు సమాధానాలు ఎలా వస్తాయి, సందేహాలు ఎలా నివృత్తి అవుతాయి, అనుమానాలకు ఎలా తెరపడుతుంది? ప్రతిపక్షం వాదన ప్రజలకు తెలియాలన్నా పార్లమెంటు నడవాలి కదా! ఈ మాత్రం ఇంగితం లేకుండా కాంగ్రెస్, ఇండీ కూటమి పార్లమెంటుకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా, సభను అడ్డుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటోంది. ఇది ముమ్మాటికి రాజ్యాంగకర్తలను అవమానించడమే అవుతుంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనూ విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అంశంపై చర్చ జరపాలని తొలుత కాంగ్రెస్ పట్టుబట్టింది, చర్చకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ వెంటనే స్వరం మార్చి, జంతర్ మంతర్ ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీకి ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలంటూ కొత్త పల్లవి అందుకుంది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం అందుకు సుముఖంగా లేదు. యూపీఏ-2 హయాంలో నాటి అధికార పక్షమైన కాంగ్రెస్ విపక్షం గొంతు ఎలా నొక్కిందో తెలియడానికి 2010 శీతాకాల సమావేశాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. రూ.1.76 లక్షల కోట్ల కుంభకోణమైన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరపాలని బిజెపి డిమాండ్ చేస్తే, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు సుప్రీంకోర్టు భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ ఆ కేటాయింపులను రద్దు చేసి, పారదర్శకగా మళ్లీ వేలం వేయాలని ఆదేశించిందంటే బిజెపి డిమాండ్ ఎంత సహేతుకమో అర్థమవుతుంది. ఆ సెషన్ లో లోక్ సభలో మొత్తం సమయంలో 6 శాతం, రాజ్యసభలో 2 శాతం మాత్రమే సద్వినియోగం అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం డిమాండ్లను పట్టించుకోని కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం పార్లమెంటరీ సంప్రదాయాలు, చర్చలు అంటూ గురివింద నీతులు వల్లిస్తోంది.

విచ్ఛిన్నకర శక్తులకు ఊతం‌‌

పార్లమెంటులోనే కాదు, బయటా కాంగ్రెస్ ధోరణి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇటీవలి జంతర్ మంతర్ నీట్ ఆందోళనల సమయంలోనూ కాంగ్రెస్ ”disruptive mentality” స్పష్టంగా బయటపడింది. నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థుల ఆవేదన అర్థం చేసుకోదగినదే! వారి ఆందోళనను తప్పుబట్టలేం. కానీ, విద్యార్థుల ముసుగులో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు, విచ్ఛిన్నకర శక్తులు ఆ ఆందోళనల్లో ప్రవేశించాయి. కాంగ్రెస్ ఆ అరాచక శక్తులను ఉసిగొల్పాయనడం సబబుగా ఉంటుందేమో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల, వారి మాతృమూర్తి పట్ల అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం, శ్రీరాముడిని, భారత సైన్యాన్ని తూలనాడడం, తుక్డే తుక్డే గ్యాంగ్ లను సమర్థిస్తూ మాట్లాడడం.. ఇవన్నీ కాంగ్రెస్ తరచుగా వాడే మాటలు, ఆ శైలి కూడా అచ్చం అలాగే ఉంది. అంటే, ఆ అరాచక శక్తులకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశ్యంతో ప్రజల మధ్య విద్వేషాలు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం దేశ సమగ్రతకే ప్రమాదం. ఇలాంటి చర్యలను ఈసడించుకుంటూ జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులు సైతం ఆందోళన వీడారు. ఇవి తమ నిరసన వెనకున్న అసలైన ఉద్దేశ్యాన్ని తప్పుదోవ పట్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనప్పటికీ, మోదీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఆందోళనలను అర్థం చేసుకొని, సంయమనంతో వ్యవహరించి, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించిందనడంలో సందేహం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం విద్వేషాలను వెదజల్లడానికి, విధ్వంసం సృష్టించడానికి, దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి వెనకాడదన్న విషయం మరోసారి స్పష్టమైంది.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య మార్గాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి రాజ్యాంగేతర పద్ధతులను ఆశ్రయించడం అరాచకానికి దారి తీస్తుందంటూ ”గ్రామర్ ఆఫ్ అనార్కీ”గా అభివర్ణించారు. నిరసన తెలపడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, ఆ నిరసన రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా ఉండాలి. కాంగ్రెస్ తీరు అందుకు విరుద్ధంగా ఉండడమే ఇక్కడే అందోళనకరం. ఇటీవలి కాలంలో రాజ్యాంగాన్ని చేతబట్టుకొని తిరుగుతూ, అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆయన ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

వరుసగా మూడు పర్యాయాలు పరాజయం పాలవడం, కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోవడం, ప్రాంతీయ పార్టీల ప్రాపకంతో ఉనికి చాటుకోవాల్సిన దుస్థితికి దిగజారడం కాంగ్రెస్ పతనావస్థకు నిదర్శనం. దీంతో విచక్షణ కోల్పోయి వ్యవస్థలను తప్పుబడుతోంది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల కమిషన్, పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం తదితర వ్యవస్థల విశ్వసనీయతపైనే సందేహాలు తలెత్తేలా వ్యవహరిస్తోంది. రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరుకు విఘాతం కలిగించేలా కాంగ్రెస్ ధోరణి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న మిషతో దేశంపైనే దాడి చేస్తోంది.

ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి విమర్శలకు అతీతుడేమీ కాదు. ప్రభుత్వం విమర్శలకు అతీతం కాదు. ఎన్నికల సంఘం నిర్ణయాలను కూడా ప్రశ్నించవచ్చు. న్యాయస్థాన తీర్పులపై న్యాయపరమైన, ప్రజాస్వామ్యపరమైన చర్చ జరగవచ్చు. కానీ విమర్శించడం వేరు.. వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా నిరంతరం అనుమానాలు నాటడం వేరు. ఎన్నికల సంఘంపై అభ్యంతరాలుంటే రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో సవాలు చేయవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుపై అసమ్మతి ఉంటే రివ్యూ పిటిషన్ వంటి న్యాయపరమైన మార్గాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయం తప్పని భావిస్తే పార్లమెంట్‌లో ఎండగట్టవచ్చు. ప్రజల్లోకి వెళ్లి రాజకీయంగా పోరాడవచ్చు. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్న మార్గాలు. కానీ వ్యవస్థకే విఘాతం కలిగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఎన్నికల్లో పార్టీలు గెలుస్తాయి.. ఓడిపోతాయి. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి. అధికారం శాశ్వతం కాదు. పార్టీలు శాశ్వతం కాదు. నాయకులు శాశ్వతం కాదు. కానీ దేశం మాత్రం శాశ్వతం. రాజ్యాంగాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, దేశ సమగ్రతను నిలబెట్టడం మనందరి బాధ్యత. రాజకీయ పోరాటం ఎంత తీవ్రమైనదైనా.. అది దేశ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు.

సంయమనం కోల్పోయి..‌‌

కాంగ్రెస్‌లో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు వారు ఉపయోగిస్తున్న భాష కూడా ఉదాహరణగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల, వారి మాతృమూర్తి పట్ల కాంగ్రెస్ నాయకుల అభ్యంతరకర అసభ్య పద ప్రయోగం వారి పతనానికి పరాకాష్ట. ప్రధానమంత్రిని విమర్శించవచ్చు. మంత్రులను విమర్శించవచ్చు. న్యాయవ్యవస్థ తీర్పులను విశ్లేషించవచ్చు. ఎన్నికల సంఘం నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. కానీ వ్యక్తిగత అవమానానికి, నిర్మాణాత్మక విమర్శకు మధ్య తేడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఘర్షణాత్మక రాజకీయ భాష తాత్కాలికంగా చప్పట్లు కొట్టించవచ్చు. సోషల్ మీడియాలో ట్రెండ్ కావచ్చు. కానీ అది ఆయా పార్టీలు, వ్యక్తులనే కాదు.. రాజకీయాలనే దిగజార్చే ప్రమాదం ఉంది. ప్రజలు కేవలం ప్రభుత్వ పనితీరునే కాదు.. ప్రతిపక్షం వ్యవహారశైలినీ గమనిస్తారు. తమ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతిపక్షం చేతుల్లోనే, చేతల్లోనే ఉంటుంది.

వికసిత్ భారతానికి అంకితమవుదాం!‌‌

2014 నుంచి భారతదేశం అధివృద్ధి పథంపై వేగంగా పరిగెడుతోంది. సంక్షేమంలో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది. నేడు భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. అంతర్జాతీయ దౌత్యంలో కొత్త పుంతలు తొక్కుతోంది. నేడు ప్రపంచంలో భారత ప్రతిష్ఠ పెరిగింది. మూడో ప్రపంచ దేశాలు భారత సారథ్యాన్ని ఆహ్వానిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి, అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న సంకల్పంతో నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిరసన ఉండాలి.. కానీ విధ్వంసం కాదు. విమర్శ ఉండాలి.. కానీ విద్వేషం కాదు. పోరాటం ఉండాలి.. కానీ వ్యవస్థను కూల్చే ప్రయత్నం కాదు. రాజకీయ పోటీ ఉండాలి.. కానీ దేశ ప్రయోజనాల పణంగా పెట్టడం సరైంది కాదు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. రాజకీయ ప్రయోజనాల కంటే ముందుగా దేశ ప్రయోజనాన్ని, రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని నిలబెట్టాలి. నాడు బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతవని విముక్తి కోసం పోరాడిన నాటి సమరయోధుల స్ఫూర్తితో వికసిత్ భారత నిర్మాణానికి 140 కోట్ల భారతీయులం ఒక్కటై పునరంకితం అవుదాం!

భారత్ మాతా కీ జై!

జి. కిషన్ రెడ్డి,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి