Nirmala Sitaraman

డిగ్రీలు స్వయం ఉపాధి సాధనాలుగా ఉపయోగపడాలి

Nirmala Sitaramanనిర్దిష్టమైన ఉద్యోగాల కోసం నిర్ధిష్ట నైపుణ్యాలున్న వ్యక్తులకు డిమాండ్ ఏర్పడితే తప్ప ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టదనిచ అందుకే అటువంటి అనుకూల వాతావరణాన్ని కల్పించడంతో పాటు తగిన వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందని అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల నేపథ్యంలో ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ పరీక్షల పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, విద్య-ఉపాధి మధ్య ఉన్న అంతరం, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, ఉద్యోగ కల్పనలో ప్రైవేట్ రంగ పాత్ర, జెన్ జీ (ఈనాటి యువత) ఎదుర్కొంటున్న అవకాశాలు, సవాళ్లపై భారత్‌లోని యువతను వేధిస్తున్న పలు ఆందోళనకర అంశాల గురించి మాట్లాడారు. 

ప్ర: జంతర్ మంతర్ వద్ద నిరసన చూసినప్పుడు మీకు ముందు ఏమనిపించింది? ఇది కేవలం నీట్ (NEET) పేపర్ లీకేజీకి మాత్రమే సంబంధించినదని భావిస్తున్నారా? అక్కడ కేవలం నీట్ అభ్యర్థులే కాకుండా ఉపాధి అవకాశాల లేమిపై ఆందోళన చెందుతున్న యువత కూడా ఉన్నారు కదా?

జ: అంత పెద్దయెత్తున యువత ఒకే చోటికి వచ్చి నిరసన తెలిపినప్పుడు, వారి సమస్యలు కేవలం ఒక్క అంశానికే పరిమితం కావు. 16 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు అనేది చాలా చురుకైన వయస్సు. ఉద్యోగాలా? అవును, ఎందుకు కాకూడదు… పేపర్ లీకేజీలా? అవును, దానిపై పోరాడాలి… ఎందుకంటే ఆ వయస్సులో ఇంకా ఆదర్శభావాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వయస్సులో ప్రపంచంలో ఎక్కడో ఒక మూల తప్పు జరుగుతున్నా, దానిని తమ సొంత సమస్యగా భావిస్తారు. ‘అవును, మేం దీని కోసం కూడా పోరాడతాం’ అనుకుంటారు. కాబట్టి నీట్ పేపర్ లీకేజీ నిరసన ఇతర అంశాలకు కూడా వ్యాపించడం ఆ వయస్సు వారికి చాలా సహజమైన లక్షణం.

ప్ర: అంటే వారిని అనేక రకాల సమస్యలు వేధించాయంటారా?

జ: అక్కడ ఒక స్పష్టమైన ప్రతిపాదన లేదా అందరి ఆందోళనలను కలిపి వినిపించే ఒకే రకమైన నాయకత్వం అనేది లేదు. అవును, ఆ సమూహంలో కొందరు నాయకులుగా ఉండి పేపర్ లీకేజీలపై గళమెత్తారు. కానీ ఇతర ప్రయోజనాలు, అంశాలు ఉన్న మరికొన్ని సమూహాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ వేర్వేరు అంశాలు ప్రధాన నాయకత్వం వద్దకు చేరలేదు… ఇతర సమస్యలతో ఉన్న ప్రజలు అక్కడికి వచ్చిన కొందరు విలేకరులతో వేర్వేరుగా మాట్లాడారు. చాలా గ్రూపులు తమ సొంత సమస్యల గురించి మాట్లాడాయి. ఇది చాలా సాధారణమైన విషయం… అందరికీ అర్థమయ్యేదే.

ప్ర: పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఉద్యోగాల్లో గానీ, పైచదువుల్లో గానీ లేదా నైపుణ్య శిక్షణలో గానీ లేకపోవడం వ్యవస్థాగతమైన లోపానికి సంకేతం. ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువగా ఆధారపడటం ఉన్నప్పటికీ అవి మొత్తం ఉపాధిలో కేవలం 1-2 శాతం మాత్రమే ఉన్నాయి. పట్టభద్రుల సంఖ్యతో పోలిస్తే నాణ్యమైన ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువగా ఉండటం, అలాగే కొద్దిమందికి మాత్రమే క్రమబద్ధమైన ఒప్పందాలతో కూడిన వేతన ఉద్యోగాలు లభిస్తున్న నేపథ్యంలో ఎటువంటి వ్యవస్థాగత మార్పులు అవసరం?

జ: మనమందరం పూర్తి చేసే కోర్సులు ఉద్యోగాలకు తగినట్లుగా మనల్ని సిద్ధం చేయడం లేదు. విడ్డూరమేమిటంటే, అవి స్వయం ఉపాధి పొందేలా (వ్యాపారం) కూడా తీర్చిదిద్దడం లేదు. మీరు వేరొకరి వద్ద పనిచేయాల్సిన అవసరం లేదు, సొంతంగా కూడా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ కోర్సులు దానికి తగిన జ్ఞానాన్ని ఇవ్వడం లేదు. ఉదాహరణకు, ఒక అభివృద్ధి చెందిన దేశంలో అయితే యువతకు రెండు రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటి- తమకు ఇష్టమైన సబ్జెక్టులో ఉన్నత చదువులకు వెళ్లడం; లేదా నిర్దిష్ట నైపుణ్యాన్ని నేర్పించే స్థానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి వెళ్లడం. అక్కడ ఆ నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించాలి, దానితో ఏం చేయవచ్చనేది నేర్పిస్తారు. అంతేకాకుండా ఆ నైపుణ్యం మేనేజ్‌మెంట్ పరంగా మిమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్తుందో కూడా చెబుతారు. మీ వ్యవహారాలను మీరే నిర్వహించుకోవాలా లేదా వేరొకరు నిర్వహిస్తారా అనేది స్పష్టం చేస్తారు. అది మిమ్మల్ని మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా- ఒకరి వద్ద ఉద్యోగిగా చేరడానికి లేదా సొంత వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధం చేస్తుంది. మన యూనివర్సిటీ కోర్సుల్లో అది లేదు. అవి కేవలం బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తాయి. ఆర్ధిక శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం చేసిన తర్వాత ఏం చేస్తారు? బీఏ తర్వాత ఎంఏ చేస్తారు. కానీ ఎంఏ తర్వాత కూడా ఏదో ఒకటి కావాలి… యూజీసీ ప్రవేశ పరీక్షలు రాస్తారు. మా కాలంలో యూజీసీ పరీక్ష జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఉండేది. అంటే పరిశోధనలు చేయవచ్చు. కానీ నాతో పాటు చదివిన వారందరూ జేఆర్ఎఫ్ లు, ఎస్ఆర్ఎఫ్ లు చేయలేదు. మరి మిగిలిన వారు ఏం చేశారు? కాబట్టి మన వ్యవస్థ డిగ్రీలు ఉన్న యువతను తయారుచేసింది తప్ప, వారిని సొంతంగా ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం ప్రారంభించడానికి లేదా కనీసం తమ తల్లిదండ్రుల వ్యాపారంలో చేరడానికి కూడా సిద్ధం చేయలేకపోయింది. మనం సరిదిద్దాల్సిన ప్రధాన లోపం ఇది. 

ప్ర: ప్రభుత్వ పాఠశాలలను కేవలం తక్కువ ఖర్చు కోసం ఎంచుకునేవిగా కాకుండా ప్రజలు ఇష్టపడి ఎంచుకునేవిగా ఎలా మార్చగలం? దీనికి వ్యవస్థాగత ప్రక్షాళన అవసరమా?

జ: అలా తల్లిదండ్రులు ఇష్టపడి ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకోవడం అత్యంత ఆదర్శవంతమైన పరిస్థితి అవుతుంది. దానికి నిధుల కంటే ముందుగా ప్రజల మనస్తత్వంలో పెద్ద మార్పు రావాలి. తగినన్ని నిధులు ఉన్నాయి, మరింతగా నిధులు అందుతున్నాయి, ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా ఎక్కువ నిధులు వెళ్లాలి. మనకు అటువంటి పాఠశాలలు మరిన్ని కావాలి. కానీ అక్కడ జరుగుతున్న బోధన, విద్యార్జన నాణ్యత ఎలా ఉందో చూడాలి. ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి? కేవలం తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తే సరిపోదు. నేటి అవసరాలకు తగినట్లుగా నిలబడగలిగే తరగతి గదులు కావాలి. ఆ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండే ఉపాధ్యాయులు కావాలి… వీలైతే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడూ అలాగే ఉండాలి. అయితే నేను ఉపాధ్యాయులను తప్పుపట్టను. ఎందుకంటే వారు ఏదైనా గ్రామీణ పాఠశాలకు వెళ్లి అక్కడ నివసిస్తున్నప్పుడు, ప్రాథమిక విద్య దాటి కళాశాల దశకు వచ్చే వారి సొంత పిల్లల చదువుకు అక్కడ కళాశాలలు ఉండవు. కాబట్టి ఆదర్శవంతమైన ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ ఏర్పడటానికి ముందు ఇతర అంశాలు కూడా అక్కడ ఉండాలి… అక్కడికి వెళ్లే ఉపాధ్యాయులకు సురక్షితంగా నివసించడానికి గ్రామంలో వసతి ఉందా? ఉపాధ్యాయుడి కుటుంబం మొత్తం అక్కడ నివసించగలదా, లేదా కేవలం పాఠశాలకు హాజరు కావడానికి మాత్రమే ఆమె లేదా అతను అక్కడ బలవంతంగా ఉంటున్నారా? ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి.

ప్ర: జంతర్ మంతర్ నిరసనల సమయంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వెనక్కి తిరిగి చూస్తే ప్రభుత్వం ఎక్కడ పొరపాటు చేసిందని మీరు భావిస్తున్నారు?

జ: ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆలోచన ఏదైనా ఉందా? అంటే నేను చెప్పలేను. జరగాల్సింది జరిగిపోయింది. జరిగిన దాని గురించి ‘నేను ఇలా చేసి ఉంటే బాగుండేది’ లేదా ‘మేం ఈ విషయంలో ఈ విధంగా చేసి ఉండాల్సింది’ అని ఇప్పుడు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. అది అసలు సాధ్యం కాదు.

ప్ర: ఉద్యోగ మార్కెట్ రోజురోజుకూ విభిన్న రకాలుగా విభజితమవుతోంది. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత నుంచి మధ్యతరగతికి స్థిరమైన వేతనాలు, పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగ భద్రత, మారుతున్న నైపుణ్య అవసరాల వరకు వేర్వేరు వర్గాలు విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ విభిన్న అవసరాలను తీరుస్తూనే ప్రైవేట్ రంగం తగినన్ని నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించేలా ప్రభుత్వం విధానాలను ఎలా రూపొందించగలదు?

జ: ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం తప్ప ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేదు. అది పూర్తిగా ప్రైవేట్ రంగంపైనే ఆధారపడి ఉంటుంది. వారు పెట్టుబడి పెట్టేది వారి సొంత డబ్బు. ఒక పరిమితి దాటిన తర్వాత వారికి మార్గదర్శనం చేయడం ప్రభుత్వ పని కాదు. కానీ మార్కెట్‌కు అవసరమైతే, అంటే ఏదైనా ఒకదానికి డిమాండ్ ఉండి, పెట్టుబడి పెడితే తమకు ప్రతిఫలం లభిస్తుందని ప్రైవేట్ రంగం భావిస్తే, వారు కచ్చితంగా ముందుకు వస్తారు… కాబట్టి ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగం ఎక్కడ డబ్బు పెట్టాలనేది మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయి. అందువల్ల నిర్దిష్ట ఉద్యోగాల కోసం నిర్దిష్ట నైపుణ్యాలున్న వ్యక్తులకు డిమాండ్ ఏర్పడితే తప్ప పెట్టుబడులు రావు. అందుకే అటువంటి పరిస్థితులను సృష్టించడం, వాటికి తగిన వ్యక్తులను గుర్తించడం మనం చేయాల్సిన పని.

ప్ర: పశ్చిమాసియా సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపడం ప్రారంభించింది. సరఫరా గొలుసులకు విఘాతం కలగడం, నిర్మాణ వ్యయం పెరగడం, ఎల్‌పీజీ కొరత ఏర్పడటం వంటి సమస్యలు వచ్చాయి. ఒక మంత్రిగా కోవిడ్-19 సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్న అనుభవంతో ఈ సంక్షోభం దాని కంటే ఎలా భిన్నమైనదో చెప్పగలరా?

జ: ఆ పరిస్థితి కొద్దికాలం మాత్రమే ఉంది. గ్యాస్ లభ్యత తగ్గడంతో పరిశ్రమలను 100 శాతం నుంచి 70 శాతానికి వినియోగం తగ్గించమని చెప్పాల్సి వచ్చింది. గృహ వినియోగదారుల అవసరాలను తీర్చాం. ఈలోగా వివిధ శాఖలు ఏకమయ్యాయి. వాస్తవానికి, ఒక సీనియర్ మంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రతిరోజు పరిస్థితిని సమీక్షిస్తూ సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలి, ఎవరూ తీవ్రంగా నష్టపోకుండా ఎలా చూడాలి అని పర్యవేక్షించింది. మేమందరం ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పని చేయడం వల్లనే అత్యంత తక్కువ సమయంలో దానిని ఎదుర్కోవడం, పరిస్థితిని అదుపు చేయడం సాధ్యమైంది.

ప్ర: ఈ సంక్షోభాల నుంచి మనం ఏదైనా నేర్చుకున్నామా? భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే నష్టాలను తగ్గించడానికి ఏదైనా వ్యవస్థను లేదా ప్రణాళికను రూపొందించుకున్నామా?

జ: అవును, ఇప్పుడు సంస్థాగత ఏర్పాట్లు చాలా స్పష్టంగా, పటిష్టంగా ఉన్నాయని భావిస్తున్నాను. కనుక సంస్థలు ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్ముందు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటాయి. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి పరిస్థితి ఎదురైతే, మనం దీనిని మరింత మెరుగ్గా ఎదుర్కోగలుగుతాం.

ప్ర: ఇటీవలి పెట్టుబడుల సమాచారం ప్రకారం, దేశీయ కార్పొరేట్ పెట్టుబడులలో ఎక్కువ భాగం ఏఐ (కృత్రిమ మేధ) వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోకి వెళ్తున్నాయి. సాంకేతికత ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జెన్ జీకి మీరిచ్చే సలహా ఏమిటి?

జ: కచ్చితంగా వారు ఏఐ నేర్చుకోవాలి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ, దాని గురించి తెలిసి ఉండాల్సిందే. దానిని తెలుసుకోవడం వల్ల మీ పనితనం, సామర్థ్యం ఏ విధంగా పెరుగుతుందో మీరు స్వయంగా గ్రహించగలరు. ఏ తరం వారైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏదీ అడ్డంకి కాకూడదు.

ప్ర: మీ దృష్టిలో జెన్ జీ అంటే ఏమిటి? మీ వ్యక్తిగత అనుభవంతో పోలిస్తే ఈ తరం ఏ విధంగా భిన్నంగా ఉందని మీరు భావిస్తున్నారు? సాంకేతికత, సమాచార మార్పిడి విధానాలా, లేక ఆకాంక్షలా?

జ: మునుపటి తరాల కంటే ఈ తరానికి ఒక పెద్ద సానుకూలమైన అంశం ఉందని నేను భావిస్తున్నాను. అతిపెద్ద సానుకూల అంశం ఏమిటంటే ప్రతీదీ మీ చేతుల్లోనే – మీ మొబైల్ ఫోన్‌లోనే ఉంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం దాని నుంచే వస్తుంది. ఇది మంచిదే. కానీ దీనితో పాటు ‘నేను ఎంతవరకు ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించకూడదు? ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు?’ అనే విచక్షణా జ్ఞానం కూడా ఉండాలి. ఆ విచక్షణ అలవడితే, మీరు ఎదిగే కొద్దీ అది ఒక గొప్ప మార్పుగా మారుతుంది. ప్రస్తుతానికి మీ వద్ద సాంకేతికత ఉంది కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు.