భారత్‌కు గుదిబండగా మారిన నెహ్రూ సోషలిజం
దిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలను ఎలా పట్టించుకోలేదో ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వెలిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన నిరంతరం గుప్పిస్తున్న విమర్శలు, ఆ కార్పొరేట్ దిగ్గజాలపై చేస్తున్న బురదజల్లుడు నిత్యం వార్తల్లో వస్తున్నాయి. ఇవి మనకు స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాలను గుర్తుచేస్తున్నాయి. నాటి పాలకులకు సోషలిజం ఒక వ్యామోహంగా మారి, లాభాలు ఆర్జించే వారిపై, సంపద సృష్టికర్తలపై ద్వేషం వహించడమే అప్పటి ప్రధాన ధోరణిగా ఉండేది. సోషలిస్టు మనస్తత్వం వల్ల కలిగిన పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన ఒక సినిమా ఈ అంశాన్ని స్పృశించింది. 1991 ప్రారంభంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు ఒక బిలియన్ డాలర్ల కంటే దిగువకు పడిపోయి, తీవ్రమైన చెల్లింపుల సంక్షోభాన్ని ఎలా సృష్టించాయో ఆ చిత్రం చూపిస్తుంది. పి.వి. నరసింహారావు, మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సంస్కరణలే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కారణమని ప్రజలు భావిస్తారు. అయితే, 1990-91లో పూర్తిగా చచ్చుబడిన ప్రభుత్వాన్ని నడిపిన ప్రధానమంత్రి చంద్రశేఖర్ పోషించిన కీలక పాత్రను ఈ సినిమా ప్రముఖంగా వెలుగులోకి తెచ్చింది.
ఆనాటి సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ వద్ద భారత బంగారం నిల్వలను తాకట్టు పెట్టి డాలర్లను రుణంగా తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకిటరమణన్ చెప్పారు. ఆచార్య నరేంద్ర దేవ్, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టు దిగ్గజాల మార్గదర్శకత్వంలో రాజకీయం ప్రారంభించిన చంద్రశేఖర్ తీవ్ర సైద్ధాంతిక సందిగ్ధాన్ని ఎదుర్కొన్నారు. కానీ, వెంకిటరమణన్ ఆయనకు నచ్చజెబుతూ, ”మీ సోషలిజం కంటే దేశమే అత్యంత ముఖ్యం” అని ఒప్పించారు. ఇటీవలే మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొన్నాం. ఇప్పుడు మనవద్ద 880 టన్నుల స్వర్ణ నిల్వలతో సహా 700 బిలియన్ డాలర్ల సౌకర్యవంతమైన విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో మన విదేశీమారక నిల్వలు రెండింతలకు పైగా పెరిగాయి. అయితే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోషలిజం అనే వ్యామోహంలో నాలుగు దశాబ్దాల కాలాన్ని మనం వృథా చేసుకోకుండా ఉండి ఉంటే, ఇంకా ఎంతో మెరుగైన పురోగతి సాధించి ఉండేవాళ్లమని 1991 సంఘటనలు మనకు గుర్తుచేస్తున్నాయి.
ఇదంతా 1927లో అక్టోబర్ విప్లవం పదవ వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి జవాహర్‌లాల్ నెహ్రూ మాస్కో సందర్శించడంతో ప్రారంభమైంది. తిరిగి వచ్చిన తర్వాత ఆయన తనను తాను సోషలిస్టుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ”భారతదేశం సోషలిస్టు మార్గంలోనే పయనించాల్సి ఉంటుంది” అని ప్రకటించారు. ఈ ధోరణిని ఆయన కొనసాగించడంతో, 1936లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తిరుగుబాటు వచ్చింది. సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, సి రాజగోపాలాచారి, జె బి కృపలానీ, జమ్నాలాల్ బజాజ్‌లతో సహా ఏడుగురు సీనియర్ నాయకులు రాజీనామా చేశారు. సోషలిజాన్ని కాంగ్రెస్ అధికారిక విధానంగా చేయనని నెహ్రూ నుంచి గాంధీజీ హామీ తీసుకోవాల్సి వచ్చింది. గాంధీ, పటేల్ బతికి ఉన్నంత కాలం నెహ్రూ ఆ హామీకి కట్టుబడి ఉండక తప్పలేదు. కానీ 1950 తర్వాత, ఆయన మళ్లీ తన ఇష్టమైన అంశానికే మళ్లారు.
1955లో తమిళనాడులోని ఆవడిలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో ఆయన ప్రభుత్వం ”సామ్యవాద తరహా సమాజం” (సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ)ని లక్ష్యంగా ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించింది. లైసెన్స్-పర్మిట్-కోటా వ్యవస్థ ద్వారా ప్రభుత్వ నేతృత్వంలోని వృద్ధికి ప్రాధాన్యమిస్తూ, పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరిచే విధానాలను ఐదేళ్ల ప్రణాళికల ద్వారా అమలు చేశారు. దీని ఫలితాలు త్వరలోనే స్పష్టమయ్యాయి. 1965 నాటి దశాబ్దపు గణాంకాల ప్రకారం దేశంలో పేదరికం రేటు 52.66 శాతం నుంచి 58.60 శాతానికి పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆహార రేషనింగ్‌ను కొనసాగించిన ఏకైక దేశం భారత్ మాత్రమే. వ్యవసాయ ఉత్పాదకత ప్రపంచంలోనే అతి తక్కువగా ఉండిపోయింది. నెహ్రూ పెంపుడు కుక్క నిర్వహణకు రోజుకు దాదాపు మూడు రూపాయలు ఖర్చవుతుండగా, 27 కోట్ల మంది భారతీయులు రోజుకు కేవలం మూడు ఆణాల (19 పైసలు) అత్యంత అల్పమైన ఆదాయంతో జీవిస్తున్నారని 1963లో లోహియా పార్లమెంటులో ఘాటుగా నిలదీసి సంచలనం సృష్టించారు.
ఈ ఘోరమైన అనుభవం ఎదురైనప్పటికీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ విధానాలనే కొనసాగించారు. దురదృష్టకరమైన 42వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి రాజ్యాంగ పీఠికలో ‘సోషలిజం’ అనే పదాన్ని చేర్చారు. చైనా 1978లోనే డెంగ్ జియావోపింగ్ ‘నాలుగు ఆధునికీకరణలు’ ప్రవేశపెట్టినప్పుడు సోషలిజం అనే భ్రమను వదిలించుకుంది. సోవియట్ యూనియన్ 1990ల ప్రారంభంలో కుప్పకూలిపోయింది. ఎట్టకేలకు మనం 1991లో సోషలిస్టు గుదిబండను వదిలించుకుని, ఆర్థిక ఉదారవాదం, మార్కెట్ సంస్కరణల దిశగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. అయితే ముఖ్యంగా కొందరు ప్రతిపక్ష నాయకులు మన వేగవంతమైన ఆర్థిక వ్యవస్థను ఇప్పటికీ అవహేళన చేస్తున్న వేళ ఆ కోల్పోయిన దశాబ్దాలను మనం మర్చిపోకూడదు.
రామ్ మాధవ్,
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు

