Revanth Reddy

6 గ్యారంటీలు మోసం.. 420 హామీలు దగా

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ ఈ వెయ్యి రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించుకుంటే.. రేవంత్ ప్రభుత్వం ఆడుతున్న అబద్ధాలు, అనవసర ఆర్భాటాలు, ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమల్లో మోసం, రోజుకో కొత్త సాకు వెతుక్కోవడం మాత్రమే కనిపించింది. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చి హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారింది. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోవడం, ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ కొత్త హామీలు ఇవ్వడం.. ఇదే కాంగ్రెస్ మార్కు పాలన అని మరోసారి తెలంగాణ వేదికగా సుస్పష్టమైంది. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ఒకే రకమైన ఆలోచనతో 12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వెయ్యిరోజులు పూర్తిచేసుకున్న సందర్భంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రోడ్డెక్కడం అత్యంత బాధాకరమైన విషయం. రాష్ట ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పొట్ట కొడుతోంది. ఉద్యోగస్తులకు చాలాకాలంగా ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇస్తామన్న PRCకి దిక్కులేదు.. ఏకంగా 6 DAలను పెండింగ్‌లో పెట్టి.. వారిని నిట్టనిలువునా మోసం చేస్తోంది. పూర్తి స్థాయిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలు చేయకపోగా.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కోత విధిస్తోంది. హెల్త్ కార్డులు, ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోకముందే పూర్తి స్థాయి క్యాష్‌లెస్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకముందే EHS పేరుతో ఉద్యోగుల నుంచి మోసపూరితంగా ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం దారుణం. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉంది. సంపాదించిన మొత్తంలో కొంత ప్రభుత్వం వద్ద దాచుకొని, రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి తీసుకోవచ్చనే ఆశతో ఉన్న ఉద్యోగస్తులకు.. రిటైర్ అయిన తర్వాత కూడా ఆ డబ్బులు రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగి తిరిగి మనోవేదనకు గురవుతున్నారు. వ్యక్తిగత, ఆరోగ్య అవసరాలకు, పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వెయ్యి రోజులు పూర్తయినా ఆ హామీ ఏమైందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఎన్నికలు వచ్చినపుడు మహిళలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవడం తప్ప.. వాళ్లకు ఇచ్చిన ఏ మాటనైనా నిలబెట్టుకోలేదు. అందుకే ఒక్కో మహిళకు రూ. 80 వేలకు పైగా బాకీ పడిన చీటింగ్ సర్కార్ గా చరిత్రలో నిలిచిపోతుంది. కాలేజీకి వెళ్లే ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మోసం చేశారు. ‌వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారు.

యువతకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, రూ.4,000 నిరుద్యోగ భృతి అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఊదరగొట్టింది. వెయ్యి రోజుల్లో ఎన్ని జాబ్ క్యాలెండర్‌లు ఇచ్చారు? నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు? ఏటా 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్నా.. అందులో నిజమెంతో ఈ చీటింగ్ సర్కార్ చెప్పగలదా? చేయని పనులను చేసినట్లు చెప్పుకోవడం ద్వారా తెలంగాణ యువతను ఇంకెంతకాలం మభ్యపెడదామని అనుకుంటున్నారు. ఒక్కో నిరుద్యోగికి దాదాపుగా రూ. లక్ష 28వేల బకాయి పడటమే కాకుండా.. ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని విమర్శించిన సర్కారు ఇది. యూపీఎస్సీ తరహాలో TSPSCని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వెయ్యి రోజులు గడిచినా ఆ దిశగా గణనీయమైన చర్య ఎక్కడ?

పేద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామన్నారు. కానీ ఉన్న పాఠశాలలనే సక్రమంగా నిర్వహించలేక మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. గురుకులాల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా.. ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దీనికితోడు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.14వేల కోట్లకు పేరుకుపోయినా.. పట్టించుకోవడం లేదు.

రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి, కిస్తీలు ఎగ్గొట్టి, గుర్తొచ్చినప్పుడల్లా కొంత డబ్బు విడుదల చేసి రైతులకు ఏదో గొప్ప ఉపకారం చేసినట్లు ప్రచారం చేసుకుంటోంది. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వరికే అన్నారు. ఇప్పుడు సన్నబియ్యానికే అని చెప్పినా అది కూడా ఇవ్వకుండా నిట్టనిలువునా రైతులను ముంచేశారు. భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఒక ఎకరానికి రూ.15వేలు ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పారు. ఈ పెండింగ్ బకాయిలే దాదాపు రూ.57వేల కోట్లున్నాయి. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను తమ భూములపైనే హక్కుల కోసం తిరిగే పరిస్థితికి నెట్టారు. భూమి సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. కొత్త సమస్యలు సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టడం.. చీటింగ్ కాదా?

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లిదండ్రులు లేదా భార్యకు నెలకు రూ.25 వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. వెయ్యి రోజుల్లో ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి పింఛన్లు ఇచ్చారు? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. అమరవీరులను చీటింగ్ చేయడం నిజం కాదా? తెలంగాణ ఉద్యమకారులకు అధికారిక గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. గుర్తింపు కమిటీలు, సమావేశాల పేరుతో కాలయాపన చేయడం తప్ప ఇప్పటివరకు ఏం చేశారు?

బీసీ సంక్షేమం కోసం ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లకు సంబంధించిన రూ.60 వేల కోట్లు ఏమయ్యాయి? ఇప్పటివరకు కనీసం రూ.10 వేల కోట్లు కూడా కేటాయించలేదు. బీసీ యువతకు వ్యాపారం చేసుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో ‘జయశంకర్ బీసీ ఐక్యత భవనాల’ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని జిల్లాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయో రేవంత్ రెడ్డి సమాధానం చెబుతారా? ఇదంతా ఒక ఎత్తయితే.. తెలంగాణలో కుల గణన పేరుతో నానా హంగామా చేసి.. ముస్లింలను వర్గాలను బీసీల్లో చేర్చి.. బీసీలను నిట్టనిలువునా మోసం చేశారు.

‘విద్యాజ్యోతులు’ పథకంతో పదో తరగతి పూర్తి చేసుకున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు, ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి రూ.15 వేలు, డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి రూ.25 వేలు, పీజీ పూర్తి చేసుకున్న వారికి రూ.లక్ష, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి.. వారిని కూడా చీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి రూ.12లక్షలు ఇస్తామన్న ‘అంబేడ్కర్ అభయహస్తం’ విషయంలోనూ పూర్తిగా మోసం చేశారు. ప్రతి మండలానికి ఎస్సీ, ఎస్టీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఈ ఊసే ఎత్తడంలేదు. గిరిజన తండాలు, గూడెం పంచాయతీలకు ‘సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం’ కింద ఏటా రూ.25 లక్షల గ్రాంటు విడుదల చేస్తామని చెప్పి ఓట్లేయించుకుని.. వారిని మోసం చేశారు.

ఎన్నికలొస్తే హామీలు.. ఎన్నికలు ముగిస్తే మౌనం!

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలు ఉన్నప్పుడే హామీలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు దగ్గరపడితే ‘రేపటి నుంచే అమలు’ అంటూ ప్రకటనలు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ అదే సాకులు, అదే కాలయాపన. ఈ వెయ్యి రోజుల్లో తెలంగాణలోని ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇది కేవలం హామీల వైఫల్యం మాత్రమే కాదు. ప్రజలకు చేసిన నమ్మకద్రోహం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ప్రచారాలు, ప్రకటనలు, సాకులు పక్కనపెట్టి వెయ్యి రోజుల్లో ఎన్ని హామీలు పూర్తిగా అమలు చేశారో, ఎన్ని హామీలు పెండింగ్‌లో ఉన్నాయో, ఎన్ని హామీలను వదిలేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది ‘ప్రజా ప్రభుత్వం’ కాదు, తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిన ‘420 ప్రభుత్వం’. హామీలను నెరవేర్చకుండానే రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయడంలో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ఒకేలా ఉంది.

జి.కిషన్ రెడ్డి,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి