కొండా సురేఖ మంత్రి పదవి నుండి తొలగింపుపై కాంగ్రెస్‌లో మౌనం!
ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించడంలో విజయం సాధించారు. ఓ బీసీ మహిళకు అన్యాయం చేశారనే అపవాదును తొలగించుకోటం కోసం ఆమెతో పాటు సీనియర్ పార్టీ నాయకుడు జి చిన్నారెడ్డిని సైతం ప్రణాళిక సంఘం చైర్మన్ పదవి నుండి తొలగించారు. బీసీలలో అసమ్మతి రాకుండా చూసేందుకు సురేఖ స్థానంలో ఏకంగా ముగ్గురు బీసీ మహిళలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అయితే, తొలగింపునకు ముందు దిల్లీ నుండే పార్టీ అధిష్టానం పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిన సురేఖ ఆ తర్వాత కొంచెం మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందరూ ఊహించినట్టు ఆమె వెంటనే పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామాలు చేయలేదు. అయితే, గుంభనంగా ఉంటూనే ముఖ్యమంత్రిని రాజకీయంగా దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
ఆమెను మంత్రివర్గం నుండి తొలగించేందుకు తనవంతు పాత్ర వహించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఆమెను కాపాడేందుకు తాను చివరి వరకు ప్రయత్నించానని, కానీ పార్టీ అధిష్టానం వినిపించుకోలేదంటూ కొంతమేర ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయమై ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా స్పందించకపోవడం గమనార్హం. ఆమెను తొలగించడం ద్వారా మిగిలిన మంత్రులకు, అసమ్మతి నాయకులకు ఓ హెచ్చరిక ఇవ్వగలిగానని భావిస్తున్నప్పటికీ ఆయన శిబిరం సైతం అంత సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మంత్రులు చాలావరకు మౌనంగానే ఉండిపోయారు. కేవలం మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఫీజ్ రీయింబర్స్మెంట్, 22ఏ నిషేధ భూముల జాబితాలపై బిజెపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ, మరోవంక 1000 రోజుల్లో హామీల అమలు గురించి బీఆర్ఎస్ నిరసనలు ఉధృతం చేసినప్పటికీ ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన వారంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు కనిపిస్తున్నది. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించగానే కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వర్గం సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఈ విషయమై చెప్పుకోదగిన కదలికలు కనిపించడం లేదు. పైగా ఈ విషయమై దిల్లీలో ఎటువంటి చర్చలు జరగలేదని అంటూ మంత్రి పదవులు ఆశిస్తున్న వారిని పీసీసీ అధ్యక్షుడు నిరాశకు గురిచేశారు.
కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి తనపై కుట్రలు చేసి కక్షసాధింపుగా మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసారని మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కూతురు మాట్లాడిన మాటలను ఆయుధంగా మార్చుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, తనను తొలగించడం అధిష్ఠానానికి కూడా ఇష్టం లేదని, అయితే రేవంత్ రెడ్డి పట్టుబట్టి తనని బర్తరఫ్ చేయించారని, ‘బర్తరఫ్ చేస్తారా? నన్ను వెళ్లిపోమ్మంటారా’ అని అధిష్ఠానాన్ని బ్లాక్మెయిల్ చేశారని ఆమె ఆరోపించారు. అయితే ఆమె చేసిన ఆరోపణలను అటు ముఖ్యమంత్రి గాని, ఇటు పీసీసీ అధ్యక్షుడు గాని, పార్టీ అధిష్టానంలో పెద్దలు గానీ ఎవ్వరూ ఖండించక పోవడం గమనార్హం. ఆ ఆరోపణలను ఖండించడం ద్వారా ఆమెకు మరింతగా సానుభూతి లభించేటట్లు చేయడం అవుతుందా? అనే అనుమానమే అందుకు కారణం కావచ్చు. ”నన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడాన్ని ఖండిస్తున్నా. రాజీనామా చేయమని నన్నెవరూ అడగలేదు. నా వివరణ వినకుండా నేరుగా తొలగించటం సరికాదు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సింది. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? నేను తప్పు చేయలేదు. నాకు పశ్చాత్తాపం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నా” అని ఆమె పార్టీ నాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు. అంతటితో ఆగకుండా, పోలీసులపై ఒత్తిడి తెచ్చి తన మాజీ ఓఎస్డీ సుమంత్ అనుచరులను అరెస్ట్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. సుమంత్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసినా పార్టీ పరంగా లేదా ప్రభుత్వ పరంగా కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేదు.
మరోవంక, ఆమెను మంత్రివర్గం నుండి తొలగించడానికి ముందు రోజు రాజధాని వేదికగా మీడియా చిట్‌చాట్‌లో ఆమె తన కూతురు మాట్లాడిన దాంట్లో అక్షరం పొల్లు పోలేదని, అక్కడ జరుగుతున్న వాస్తవాలనే నిర్భయంగా చెప్పిందని సురేఖ బాహాటంగానే కూతురి మాటలను సమర్థించుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వంలో మంత్రుల కమీషన్ల దందా, నిధుల మళ్లింపులు, కొందరు మంత్రులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉన్నదని ఆమె సూటిగా ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిపై చిన్న మాటకు కూడా క్రమశిక్షణా అస్త్రాలు ఝుళిపించే నాయకులు, కోట్లాది రూపాయల ఆరోపణలు ఎదురొంటున్న ఇతర మంత్రుల వద్దకు వచ్చేసరికి ఎందుకు కళ్లు మూసుకుంటారని నిలదీశారు. బీసీలకో న్యాయం, బడా వర్గాలకో న్యాయమా? అంటూ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు లేఖల ద్వారా సమగ్ర విషయాలను చేరవేసినట్లు ఆమె వెల్లడించారు. తీవమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. అయినా, ఆయా మంత్రులు కూడా వాటిని ఖండించే ప్రయత్నం చేయలేదు. దేశం అంతటా పార్టీ నిర్వహణ, ఎన్నికలకు అవసరమైన నిధులకు తెలంగాణ, కర్ణాటకలలోని తమ ప్రభుత్వాలపై ఆధారపడుతున్న ఏఐసీసీ పెద్దలు ఇక్కడి ముఖ్యమంత్రుల వ్యవహారాలు పార్టీని పతనంవైపు నడిపిస్తున్నా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కృష్ణ చైతన్య

