సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే
(సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం)
17 సెప్టెంబర్ 1998న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి వారి సమక్షంలోనే సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విమోచన దినం’గా ప్రకటించి ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలను నిర్వహించాలని, ప్రధాన కూడళ్లలో పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్టించాలని డిమాండ్ చేసాం. అది మొదలు, సెప్టెంబర్ 17న విమోచన దినం అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో బిజెపి నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. ఆరోజు ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరేయడం సహా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో వేలాది మంది లాఠీ దెబ్బలు తిన్నారు, గాయాలపాలై మంచానపడ్డారు, ఆసుపత్రుల పాలయ్యారు. ఈ కార్యక్రమాలు ప్రజలను ఆలోచింప చేసాయి, విస్మరించిన చరిత్ర పట్ల అవగాహన కల్పించాయి. దీంతో సెప్టెంబర్ 17 వచ్చిందంటే రెండు మూడూ రోజుల పాటు ఉద్యమ వార్తలే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పతాక శీర్షికలవుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ”హైదరాబాద్ విముక్తి దినం”గా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయిస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చ్ 12న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
గతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండి.. మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిన జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి మహారాష్ట్రలో, 2009 నుంచి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారిక విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకున్నవి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలే కావడం విశేషం. తెలంగాణలో మాత్రం ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా, దెబ్బలు తిన్నా, హింసలకు ఓర్చినా, అరెస్టయినా, జైలు పాలయినా ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించేది లేదని భీష్మించుకు కూచున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరకు ఒక మెట్టు దిగి అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలను ‘విమోచన దినోత్సవం’గా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’, ‘ప్రజా పాలన దినోత్సవం’ అంటూ సంబంధం లేని పేర్లతో సెప్టెంబర్ 17 ఉద్దేశ్యాన్ని నీరుగార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వభావంలో ఫెడరల్‌గా ఉన్నా, ఆత్మ ఒక్కటే (Indian Constitution is federal in nature, unitary in soul) అని సాధారణంగా చెప్పుకుంటాం. అందుకే, రాజ్యాంగంలో ఈ దేశాన్ని ”రాష్ట్రాల సమాఖ్య”గా (Union of States) పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించి సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అధికారిక వేడుకలు నిర్వహిస్తుంటే, దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
1798 సెప్టెంబర్ 1న హైదరాబాద్ నిజాం (అసఫ్ జాహీ) ఈస్ట్ ఇండియా కంపెనీతో అనుబంధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. తద్వారా హైదరాబాద్ అధికారికంగా బ్రిటిష్ రక్షిత రాజ్యంగా మారిన మొదటి సంస్థానంగా నిలిచింది. ఇది ఆధునిక భారతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. అప్పటి నుండే దేశంలో ఇక్కడి ప్రజలపై అధిక ఆర్థిక భారం మోపడం మొదలైంది. ఈ ఒప్పందంపై ప్రజా పోరాటం పురుడు పోసుకుంది. ఈ పోరాటమే క్రమంగా స్వాతంత్ర్యం, దేశ విభజన వరకు కొనసాగినట్టు చరిత్ర స్పష్టం చేస్తుంది. ప్రథమ స్వాతంత్ర్య పోరాటం, భారత జాతి ఆవిర్భావాన్ని ప్రకటించిన ఉజ్జ్వల ఘట్టానికి హైదరాబాద్ కూడా వేదికగా మారింది. 17వ శతాబ్దంలో ప్రపంచంలో ధనిక దేశంగా ఉన్న భారతదేశం.. ఆంగ్లేయులు, వారి సామంత రాజుల దోపిడీతో విలవిల్లాడిపోయింది. ఆంగ్లేయులు రాబంధుల్లా ప్రజలను పీక్కుతిన్నారు, అత్యాచారాలకు తెగబడి జీవన విధానాన్ని విచ్ఛిన్నం చేశారు. సామ్రాజ్యవాదులు, మతవాదులను వీరోచితంగా ఎదుర్కొంటున్న వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మహనీయులెందరో ప్రాణత్యాగం చేశారు. బ్రిటిష్ వారు అండమాన్ నికోబార్‌లో సెల్యులర్ జైలును నిర్మిస్తే, హైదరాబాద్ సంస్థానంలో నిజాం మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించిన ‘కాలాపాని’ నిర్బంధాలకు మన్ననూరు నల్లమల అభయారణ్యం సాక్షిగా నిలిచింది. సిపాయిల తిరుగుబాటు సమాచారం మీరట్ నుండి హైదరాబాద్ వరకు విస్తరించింది. తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్ నేతృత్వంలో 500 మంది రోహిల్లాలు కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. వీరి గొప్ప లక్ష్యం కోసం జై గోపాల్ దాస్, మరికొందరు తమ ఇళ్లను ఖాళీ చేసి ఆనాటి పోరాటానికి ఆశ్రయమిచ్చారు. బ్రిటిషర్ల కాల్పుల్లో ఎంతో మంది మరణించారు, తీవ్ర గాయాలపాలయ్యారు. తుర్రెబాజ్ ఖాన్‌ను అరెస్టు చేసి, తుప్రాన్ వద్ద కాల్చి చంపారు. ఆయన గురువు అల్లాఉద్దీన్‌ను అండమాన్ జైలులో బంధించారు. ఆయన అక్కడే మృతి చెందారు.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి హైదరాబాద్ సంస్థానం దేశంలోని సంస్థానాల్లో చాలా పెద్దది. బ్రిటిష్ అండదండలతో అరాచకాలు సాగిస్తున్న నిజాం నవాబుపై తెలంగాణ ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేశారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పెద్దలకు, వీరులకు, విద్యావంతులకు ఆశ్రయమిచ్చింది హైదరాబాద్. ఒప్పందం ప్రకారం నిరంకుశ నిజాం బ్రిటిష్ సైన్యాన్ని పోషించాలి కాబట్టి విచక్షణారహితంగా రాబందుల్లా రైతులను, చేతివృత్తుల వారిని దోచుకున్నారు. ఆ కాలంలో వరంగల్‌లో తయారు చేసిన తివాచీలు, దుర్రీలు లండన్ క్రిస్టల్ ప్యాలెస్‌లో జరిగిన ప్రపంచ పోటీల్లో ముందు వరసలో నిలిచాయి. నాందేడ్‌లో తయారయ్యే మక్మల్ బట్టలు- గద్వాల, నారాయణపేటలో నేసిన జరీ చీరలు- ఔరంగాబాదులో తయారైన కాగితం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవిగా చెబుతారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం ద్వారా ఇక్కడి చేతివృత్తుల వారు చేసిన కళాఖండాలను తరలించేవారు. 1930లలో పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు ప్రయాణాలు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనంగా ఉండేది, కానీ నిరంకుశ నిజాం పాలనలో ఈ విమానాశ్రయం సిడ్నీ కాటన్ అనే అక్రమ ఆయుధాల సరఫరాదారు కోసం ఉపయోగపడిందంటే ఈ ప్రాంత ప్రజలను అణచివేయడానికి నిజాం ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థమవుతుంది. రాంజీ గోండ్, అతని అనుచరులను నిర్మల్ పట్టణంలో ఉరితీశారు. కొమురం భీం విరోచిత పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఎత్తిన కలం దించకుండా పోరాటం సాగించిన షోయబుల్లా ఖాన్‌ను 1948 ఆగస్ట్ 22న నిజాం రజాకార్లు దారుణంగా నరికి చంపారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహా రావుతో పాటు ఎంతో మందిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కరిస్తే ఇతర రాష్ట్రాల్లో చదువు కొనసాగించి విద్యావంతులుగా విలసిల్లారు. పరకాల, భైరాన్‌పల్లిలో వెలుగు చూసిన దారుణ రాక్షస కృత్యాలు హైదరాబాద్ సంస్థానంలో అడుగడుగునా జరిగాయి.
తెలంగాణ విమోచన కోసం ఆనాడు ప్రతి గ్రామంలో పోరాటాలు జరిగాయి. అతి సామన్యులైన మహిళలు, పురుషులు దృఢ చిత్తంతో సైనికులై పోరాడిన ఘటనలు కోకొల్లలు. వారి త్యాగాలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. రాబోవు తరాలకు వారి చరిత్ర ప్రేరణదాయకం. ఒళ్లు గగుర్పొడిచే సాహస ఘట్టాలెన్నో ఉద్యమ చరిత్రలో కనిపిస్తాయి. ఆ ప్రజా పోరాటమే పోలీసు చర్యకు మార్గం సుగమం చేసింది. అందుకే 17 సెప్టెంబర్ 1948 హైదరాబాద్ విమోచన పొందిన రోజు తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా అధికారిక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది.
సీ.హెచ్. విద్యాసాగర్ రావు,
మాజీ గవర్నర్

