తారా స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్ల కుమ్మక్కు డ్రామాలు
గత వారం రోజులుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న నీచ నికృష్ట కుమ్మక్కు డ్రామాలు గౌరవప్రదమైన అసెంబ్లీని, సభాపతిని, అవమానించేవిధంగా, కాంగ్రెస్ వాగ్దానాలను, ప్రభుత్వ వైఫల్యాలను బొంద పెట్టేవిధంగా నడుస్తున్నాయి. పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరంతరం సభలో చర్చలు జరగకుండా, మోదీ ప్రభుత్వ విజయాలు, దేశంలో అక్కడక్కడ ఉన్న సమస్యలు, ప్రతిపక్షాల కుట్రలు బహిర్గతం కాకుండా దుర్మర్గంగా వ్యవహరిస్తున్నాయి. చట్టాలన్నా, సభా నియమాలన్నా కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీలకు ఇసుమంత గౌరవం లేదు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభలో కానీ, వెలుపల కానీ ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, కనీసం ఒక సభ్యుడిగా కూడా విషయాలను చర్చించలేని దుస్థితిలో ఉన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, తమ ఓటుబ్యాంకును రక్షించుకునేందుకు రాహుల్ గాంధీ ఎప్పుడూ హిందువుల మీద, హిందూ సంస్థల మీద, మహోన్నత నాయకుల మీద నీచ పదాలతో విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడం గమనిస్తూనే ఉన్నాం.
చట్టసభల నియమావళి ప్రకారం సభ్యుల వస్త్రధారణ ఎలాంటి రాజకీయ, ఇతర సంకేతాలు ఇవ్వకుండా ఉండాలి. అయినప్పటికీ పార్లమెంటులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రెచ్చగొట్టే ఫోటోలను, పేర్లను, నినాదాలను ధరిస్తూ, సభా సంప్రదాయాలను అగౌరవపరచడాన్ని మోదీ ప్రభుత్వం, లోక్ సభ, రాజ్యసభల సభాపతులు భరిస్తూ, హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ అవలంబించిన వైఖరినే బీఆర్ఎస్ అనుసరిస్తూ వస్తోంది. ఇటీవలి వర్షాకాల శాసనసభ సమావేశాల ఆరంభం రోజున సెప్టెంబర్ 7న అసెంబ్లీ గేటు దగ్గర జరిగిన ఘర్షణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అత్యంత హేయమైన పదాలతో సభాపతిని దూషించడం, కేటీఆర్‌తో కలిసి పోలీసుల మీద దాడి చేయడం, గల్లాలు పట్టడం, సొంత మహిళా ఎమ్మెల్యేలను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడం, హరీష్ రావు అర్ధనగ్న ప్రదర్శన లాంటి హేయమైన ఘటనలు, పోలీసుల ఓవరాక్షన్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియోల ద్వారా స్పష్టమవుతుంది.
సెప్టెంబర్ 7 నాటి దుస్సంఘటనల తర్వాత అధికార కాంగ్రెస్, రేవంత్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి తమ దుశ్చర్యల మరింత కొనసాగింపుగా అనిపించాయి. ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ, కోట్ల రూపాయలు దిగమింగుతూ, వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖర్చుకు కారణమవుతున్న కేసీఆర్ సభకు రాకుండా ప్రజల ఆగ్రహానికి గురవుతున్నప్పుడు రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆయన ఫాంహౌజ్‌పై దాడి, చావుడప్పులు, కేసీఆర్‌కు మైలేజీ ఇప్పించే కుట్రగానే అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఫాంహౌజ్ దాడి తర్వాత పుసుపు నీళ్లతో శుద్ధి చేసి, మొదటి నుంచి దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్లకు గల దళితుల పట్ల తీవ్ర హీనభావవను స్పష్టంగా మరోసారి బయటపెట్టుకుంది.
అసెంబ్లీలో, కౌన్సిల్లో 7న జరిగిన ఘోర తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం బీఆర్ఎస్ నేతలకు లభించినప్పటికీ, ఆ ప్రయత్నం ఏమాత్రం చేయకుండా, ఎదురుదాడికి దిగడం వారి దురహంకార, ప్రజావ్యతిరేక, అణగారిన వర్గాలపై ఉన్న చులకన భావనకు నిదర్శనం. ఈ రెండు పార్టీల కుమ్మక్కు డ్రామాల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బహిష్కరించింది అని అందరికీ అర్థమవుతుంది.
ప్రస్తుత రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, గత కేసీఆర్ పాలన దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకు ఈ రెండు పార్టీల దుర్మార్గపు కుమ్మక్కు డ్రామాలు పరాకాష్టకు చేరిన విపత్కర పరిస్థితుల్లో బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా హుందాగా, నిబద్ధతతో సభల్లో ప్రజా సమస్యలపై చర్చలకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ప్రభుత్వం ఓవరాక్షన్ డ్రామాలతో 22ఏ, రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, జీవో 97 లను చర్చించడానికి బిజెపి సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల దుర్మార్గ వైఖరిని, బిజెపి నిబద్ధత, నిజాయితీని తేటతెల్లం చేశాయని పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వానికి వెయ్యి రోజుల పాలన పూర్తయినప్పటికీ, 100 రోజుల్లో చేస్తామన్న హామీల్లో 50 శాతం కూడా చేయకపోవడం, దానిపై బిజెపి, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లోపల, బయటా చేస్తున్న కృషికి మీడియాలో అంతో ఇంతో వస్తోన్న కవరేజీ, సోషల్ మీడియాలో లభిస్తున్న ప్రచారం ద్వారా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ల దుర్మార్గాన్ని, బిజెపి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్లను వదిలించుకుంటే కానీ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు, తెలంగాణ ప్రజలు సమస్యల సుడిగుండాల నుంచి బయటపలేరు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తారాస్థాయికి చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు హైడ్రామాలను తెలంగాణ ప్రజానీకం అసహ్యించుకుంటోంది.

