మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం కలిసి పనిచేద్దాం!
ఆగస్ట్ 30న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ఆసక్తికర విషయాలు, సామాజిక చొరవలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల స్ఫూర్తిదాయక కథనాలను పంచుకున్నారు. ఈ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాల సమాహారం:
చరిత్రను సులభతరం చేసిన ‘భారత్ రాజ్య’
ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రి అనే వ్యక్తి చరిత్రను అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడానికి www.bharatrajya.com అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ వెబ్సైట్లో ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకుంటే, ఆ సమయంలో భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా గతం గురించి తెలుసుకోవడానికి ఈ సైట్ ఎంతో ఉపయోగపడుతుంది.
మాదకద్రవ్య రహిత యువత దిశగా..
”వికసిత భారతదేశం కోసం మాదకద్రవ్య రహిత యువత” అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తినే కాదు.. యావత్ కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం మనమంతా కలిసి పనిచేద్దాం. యువ సంగీతకారులు మాదకద్రవ్య రహిత జీవిత సందేశంతో పాటలు రూపొందించండి. విద్యార్థులు, నాటక సమాజాలు మాదకద్రవ్యాల ప్రమాదాలు, వాటిని అధిగమించే మార్గాలను తెలియజేసే నాటికలు ప్రదర్శించండి. కంటెంట్ క్రియేటర్లు వివిధ భాషల్లో సమాజానికి ఉపయోగపడే అవగాహనా కంటెంట్‌ను రూపొందించండి. మీ ప్రయత్నాలను #drugfreeyouth హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. అధికారిక ప్రచారాల కంటే సృజనాత్మక ప్రయత్నాలే కొన్నిసార్లు ఎక్కువ ప్రభావం చూపుతాయి. రండి.. మన దేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే ఈ పవిత్రమైన కార్యక్రమంలో మన వంతు పాత్ర పోషిద్దాం.
ఆగస్టు మాసంలో దేశభక్తి స్పూర్తి
ఆగస్టు నెల జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం, మరియు ‘హర్ ఘర్ తిరంగా’ వంటి విశేష సందర్భాలతో దేశభక్తి వాతావరణాన్ని నింపింది. ‘వందేమాతరం’ 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ ఏడాది ప్రత్యేకత. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఫిజీలో తొలి సూర్యకిరణంతో మొదలై, ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మిషన్లలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
’పీఎం స్వనిధి’తో మహిళా సాధికారత
వీధి విక్రయదారులు, చిన్న వ్యాపారులకు ఆర్థిక ఊతమిచ్చే ‘పీఎం స్వనిధి’ పథకం మహిళా సాధికారతకు ప్రధాన సాధనంగా మారింది. ఈ పథకం లబ్ధిదారులలో 46 శాతం మంది (సుమారు 35 లక్షల మంది) మహిళలే ఉన్నారు. ఘజియాబాద్‌కు చెందిన బబితా శర్మ (పూజా సామగ్రి వ్యాపారం), బెంగళూరుకు చెందిన టి.ఎస్. నింగమ్మ (టిఫిన్ సెంటర్) పీఎం స్వనిధి ఆర్థిక సాయంతో తమ వ్యాపారాలను పెద్ద షాపులుగా విస్తరించి, ఆర్థికంగా స్థిరపడ్డారు.
పరిశుభ్రతే ఆయుధంగా.. కొత్త వెలుగులు
- క్లీన్-అప్ పట్వాయి: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ గ్రామానికి చెందిన ఆకాష్, రోహన్ అనే యువకులు ‘క్లీన్-అప్ పట్వాయి’ బృందాన్ని ఏర్పరిచి, గంగా ఘాట్లను, చెరువులను శుభ్రం చేస్తూ టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.
- అమర్నాథ్ యాత్రలో బాధ్యతాయుత పర్యాటకం: ఈ ఏడాది యాత్రలో 400 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశారు. 16 వేల మంది యాత్రికులు పరిశుభ్రతా ప్రతిజ్ఞ చేయగా, 10 వేల మందికి ‘Responsible Yatri’ సర్టిఫికెట్లు ఇచ్చారు.
- స్వచ్ఛ జ్యోతి: యాత్రలోని కంచర గాడిదల పేడ నుండి బయోగ్యాస్ తయారుచేసి, ఆ శక్తితో అమర్నాథ్లో ‘స్వచ్ఛ జ్యోతి’ని వెలిగించారు.
అభిరుచే ఉపాధిగా: నాగాలాండ్ వెసాలు పురో
నాగాలాండ్‌లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురో అనే మహిళ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి, పూల పెంపకంపై ఉన్న ఆసక్తితో కెవికె (KVK) ద్వారా శిక్షణ పొందారు. కేవలం పావు ఎకరం భూమిలో గ్లాడియోలస్ సాగు ప్రారంభించి, నేడు దిల్లీ, ముంబై వంటి నగరాలకు పూలను సరఫరా చేసే స్థాయికి ఎదిగారు.
అటవీ సంరక్షణతో ఉపాధి: ఒడిషా మైథిలీ భూయే
ఒడిషాలోని దేబ్రీగఢ్ ఎకో-టూరిజంలో చేరిన మైథిలీ భూయే, అటవీ సంరక్షణనే తన జీవనోపాధిగా మలచుకున్నారు. ఆమెను చూసి ప్రేరణ పొందిన దాదాపు 60 మంది మహిళలు నేడు వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పర్యాటకంలో భాగస్వాములవుతున్నారు.
అంతరిక్ష రంగంలో ఆడపిల్లలు: మిషన్ శక్తిశాట్
ఉపగ్రహ సాంకేతికతలో బాలికలను ప్రోత్సహించడానికి ‘మిషన్ శక్తిశాట్’ (Mission ShaktiSat) ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థినులే స్వయంగా నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్ష్యలోకి పంపడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.
అవకాడో సాగుతో రైతులకు అదనపు ఆదాయం
ప్రస్తుతం విపరీతమైన గిరాకీ ఉన్న అవకాడో పండు పెంపకంతో మన రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వరదరాజ్ యూట్యూబ్ ద్వారా అవకాడో సాగు నేర్చుకుని 4 టన్నుల దిగుబడి సాధించారు. తమిళనాడులోని కొడైకెనాల్కి చెందిన చంద్రశేఖరన్, కర్ణాటకలోని చిక్కమగళూరు కాఫీ తోటల మధ్య అంతర పంటగా అవకాడో సాగు చేస్తూ రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు.
స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత
సెప్టెంబర్‌లో విశ్వకర్మ పూజను జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తులవారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రులను మనం గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి కూడా రాబోతోంది. ఈ పండుగ కాలంలో ‘స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి’ అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. ‘స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి’- ‘వోకల్ ఫర్ లోకల్’ అంటే కేవలం మట్టి దీపాలు కొనడం మాత్రమే కాదు. దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయో లేదో తప్పకుండా చూసుకోవాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడటం ద్వారా మాత్రమే భారతదేశం స్వయంసమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకోగలదు. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయడం మన బాధ్యత. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇతరులను కూడా అలా చేయడానికి ప్రేరేపించాలని కోరుతున్నాను.

