తెలంగాణ విముక్తి చరిత్రలో చిరస్థాయిగా పరకాల పోరాటాలు
పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సెప్టెంబర్ 2న పరకాల అమరధామంలో అమరవీరుల స్తూపం వద్ద రాంచందర్ రావు నివాళులు అర్పించారు. రజాకార్లు, నిజాం పోలీసుల కాల్పుల్లో అమరులైన 22 మంది అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. సరిగ్గా ఎనభై సంవత్సరాల క్రితం నిజాం నిరంకుశ పరిపాలనలో రజాకార్లు పరకాల ప్రజలపై సాగించిన మారణకాండ దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్‌ను తలపించిందని గుర్తుచేశారు. పరకాలలోని చాపలబండ వద్ద 19 మందిని, సమీపంలోని లక్ష్మీపూర్‌లో మరో ముగ్గురిని దారుణంగా ఊచకోత కోశారని, దాదాపు రెండు వందల మందికి పైగా గాయపడ్డారని వివరించారు. నాటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపకుండా స్వతంత్రంగా ఉంచుతామని, పాకిస్తాన్‌తో కలుపుతామని నిజాం ప్రకటించిన వేళ, రజాకార్లు గ్రామాలపై పడి మహిళలను, అన్నదాతలను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్రాంపల్లిలో బావిలో పడేసి వందలాది మందిని చంపిన ఉదంతాలు, బైరాన్‌పల్లిలో గోడకు నిలబెట్టి కాల్చి చంపిన సంఘటనలు నాటి దారుణాలకు నిదర్శనాలని పేర్కొన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం తలవంచడంతో సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైందని గుర్తుచేశారు.
తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరిస్తూ, సి.హెచ్. విద్యాసాగర్ రావు నాయకత్వంలో తెలంగాణ విమోచన సమితి ఆధ్వర్యంలో ఈ పరకాల అమరధామ స్తూపాన్ని నిర్మించారని, ఆ కమిటీలో తాను కూడా సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించడం ఎంతో గర్వకారణమని చెప్పారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మజ్లిస్ పార్టీకి భయపడిన కేసీఆర్ దానిని విస్మరించారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజాం వ్యతిరేక పోరాట చరిత్రను అధికారికంగా గుర్తించడం లేదని మండిపడ్డారు. పాత హైదరాబాద్ సంస్థానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా అధికారికంగా నిర్వహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మజ్లిస్ ఓట్ల కోసం రజాకార్ల వారసులకు కొమ్ముకాస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ తెలంగాణ విముక్తి చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్నాయని, అయితే బిజెపి ఉన్నంతవరకు ఈ పోరాట చరిత్ర సజీవంగా ఉంటుందని తేల్చిచెప్పారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17 విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందిస్తామని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 17న తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి విద్యాసంస్థలో, ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వందేమాతరం, జనగణమన గీతాలను పూర్తిస్థాయిలో ఆలపించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలని ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

