Ram Madhav

‘దిమాగీ నక్సల్’ కు అర్థం అందరికీ తెలుసు

ప్రత్యర్థులకు కీలెరిగి వాత పెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉందనడంలో సందేహం లేదు. స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి చేసిన ప్రసంగంలో ఆయన — తమ ప్రభుత్వం ఆయుధాలు పట్టిన నక్సలైట్లను ఏరివేసే విషయంలో విజయవంతమైనప్పటికీ, “మనం ఈ ‘దిమాగీ నక్సల్స్’ (మానసిక/మేధో నక్సలైట్లు)ను గుర్తించి, వారిని సమాజం నుంచి వేరుచేసి, అభివృద్ధి చెందిన భారత్ కోసం యువతను ఏకం చేయాల్సిన అవసరం ఉంది,” అని వ్యాఖ్యానించారు. ఆయన ప్రయోగించిన ఈ ‘దిమాగీ నక్సల్స్’ అనే పదం రాజకీయ వర్గాల్లో పెను సంక్షోభాన్ని సృష్టించింది. కొన్ని వర్గాల్లో ఇది తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ మద్దతుదారులు చేసిన మితిమీరిన వ్యాఖ్యలు వారి అసహనాన్ని మరింత పెంచాయి. కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం అందరికంటే ముందే ఈ అసహనాన్ని బయటపెట్టారు. “నేను ‘దిమాగీ నక్సల్’ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అని ఎక్స్ (X) వేదికగా ప్రకటించి, కాంగ్రెస్ పార్టీయే దిమాగీ నక్సల్స్ పార్టీ అంటూ ఎద్దేవాలకు, విమర్శలకు గురయ్యారు. కొందరు విలేకరులను దిమాగీ నక్సల్స్‌గా చిత్రీకరిస్తున్నారంటూ ఎడిటర్స్ గిల్డ్ కూడా రంగంలోకి దిగి ఆందోళన వ్యక్తం చేసింది. ఏది ఏమైనా, ప్రధాని వాడిన ఈ ఒక్క పదం ల్యుటెన్స్ (ఉన్నత వర్గాల) దిల్లీలోని ఒక వర్గపు ప్రముఖులను తీవ్రంగా కలవరపెట్టినట్లు కనిపిస్తోంది.

రాజకీయ వాదోపవాదాలు కొనసాగడానికి దోహదపడే కొంత అనిశ్చితి, అస్పష్టత హానికరం కాకపోగా కొంత వినోదాన్ని కూడా ఇస్తుంది. గతంలో కూడా ‘అర్బన్ నక్సల్స్’, ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్’ వంటి పదబంధాలను ఉపయోగించినప్పుడు తీవ్రమైన చర్చలు నడిచాయి. ఆ వ్యాఖ్యలకు స్పష్టమైన నిర్వచనం ఏంటో ఎవరూ చెప్పనప్పటికీ, మేధావులు తమకు తోచిన నిర్ధారణలు వచ్చేశారు. ఇక్కడ ప్రధాని అంతరార్థాన్ని వివరించడం నా ఉద్దేశం కాదు, కానీ దానికి సంబంధించిన నేపథ్యాన్ని అందించడమే నా ప్రయత్నం. మావోయిజం లేదా నక్సలిజం కేవలం ఒక సాయుధ పోరాట కార్యక్రమం మాత్రమే కాదు. అది అనేక దేశాల్లో రకరకాల ఉద్యమాలకు జన్మనిచ్చిన ఒక సిద్ధాంతం. చైనాలో స్వయంగా మావో దీనికి ప్రాతినిధ్యం వహించగా, 1950లు, 60లలో చైనా-సోవియట్ రష్యా మధ్య వచ్చిన సిద్ధాంతపరమైన విభేదాలు ఒక పెద్ద సైద్ధాంతిక విప్లవానికి దారితీశాయి. తదనంతరం విప్లవ సిద్ధాంతకర్తలు, కవులు, తత్వవేత్తలు, చివరకు తిరుగుబాటు వర్గాలు దీనిని అందిపుచ్చుకున్నాయి.  క్యూబాలో చే గువేరా ఈ మావోయిస్టు గెరిల్లా యుద్ధ సిద్ధాంతానికి నాయకత్వం వహించగా, పెరూలో చైర్మన్ గొంజాల్లో, ఫిలిప్పీన్స్‌లో హోసే  మారియా సిసన్ వంటి నాయకులు తమ తమ దేశాల్లో దీనికి నాయకత్వం వహించారు. మన పొరుగున ఉన్న నేపాల్‌లోనే పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ సుదీర్ఘ ప్రజాయుద్ధాన్ని నగర ప్రాంతాల్లోని ప్రజా ఉద్యమాలతో మేళవించి ‘ప్రచండ పథం’ పేరిట మావోయిస్టు యుద్ధాన్ని నడిపారు.

భారతదేశంలో కూడా చారు మజుందార్, కనై ఛటర్జీ, కానూ సన్యాల్ వంటి సిద్ధాంతకర్తలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీరు నక్సలిజాన్ని కేవలం గెరిల్లా ఉద్యమంగా మాత్రమే కాక, ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక ప్రత్యామ్నాయంగా నిర్మించారు. స్వతంత్ర భారతంలో నక్సల్ ఉద్యమం ప్రభుత్వ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరమైన సవాలుగా పరిణమించింది. కొన్ని దశాబ్దాలుగా ఇది విద్యావేత్తలు, పాత్రికేయులు, రచయితలు, ఇతర మేధావుల సహాయంతో నగరాల్లో బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో విజయం సాధించింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సాయుధ నక్సలైట్లు దారుణమైన, విచక్షణారహిత హింసకు పాల్పడుతుంటే, నగరాల్లోని పౌర మద్దతు వ్యవస్థ వారి చర్యలకు సైద్ధాంతిక రక్షణ కవచంగా నిలిచింది. 2013లో ‘కిషోర్ సమ్రీతే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో యుపిఎ  ప్రభుత్వానికి చెందిన కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్  ఏమి చెప్పిందో గుర్తుచేసుకోవడం ఇక్కడ సందర్భోచితం. “పట్టణాలు, నగరాల్లో ఉన్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ సిద్ధాంతకర్తలు, మద్దతుదారులు దుష్ప్రచారం ద్వారా వ్యవస్థపై బురదజల్లేందుకు ఒక పథకం ప్రకారం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు,”  అని పేర్కొంటూ, “ఈ సిద్ధాంతకర్తలు అనేక విధాలుగా ‘పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ’ సభ్యుల కంటే చాలా ప్రమాదకరమైనవారు,” అని స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా మావోయిస్టుల వ్యూహం “వివిధ ‘ప్రజా సంఘాల’ ద్వారా నగర జనాభాతో పాటు కొన్ని నిర్దిష్ట వర్గాలను సమీకరించడమే” అని కూడా ఆ అఫిడవిట్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రజా సంఘాలు “మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థల ముసుగులో పనిచేస్తాయి. వీటిని సాధారణంగా విద్యావేత్తలు, కార్యకర్తలతో కూడిన సిద్ధాంతకర్తలే నడుపుతుంటారు,” అని నాటి ప్రభుత్వం స్పష్టం చేసింది.

మోదీ ప్రభుత్వం ‘దిమాగీ నక్సల్స్’ అంటే ఎవరో నిర్వచించిందో లేదో గానీ, నాటి యుపిఎ ప్రభుత్వం మాత్రం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్ లో దిమాగీ నక్సల్ అనే భావనకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ఈ శక్తులు అవలంబించే సైద్ధాంతిక విధానం “సాయుధ తిరుగుబాటు, సమాజంలోని కొన్ని వర్గాల సమీకరణ, వ్యూహాత్మక భాగస్వామ్యాల కలయిక ద్వారా భారత్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థను కూల్చివేయడమే,” అని స్పష్టంగా వివరించింది. నేడు మన చుట్టూ చూస్తే నేపాల్‌లోని జెన్-జీ  తిరుగుబాటు తర్వాత మన దేశంలోని ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు చేసిన పరోక్ష వ్యాఖ్యలు లేదా భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ఒక మేధావి చేసిన వ్యాఖ్యలు— ఇలా ఈ మానసిక ధోరణి నేటికీ రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూనే ఉందని అర్థమవుతుంది. ఇక ‘దిమాగీ నక్సల్స్’ అనే పదానికి కొత్తగా నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఇక ఎక్కడుంది?

రామ్ మాధవ్,
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు