Woman Skill Worker

నైపుణ్యాల్లోనూ ముందున్న మహిళలు

‘ఎ పొస్సే అడ్ ఎస్సే’ (సంభావ్యత నుంచి సాకారం వైపు అడుగులు వేయడం) అనే లాటిన్ నానుడి, సమాజాలు మానవ వనరులను ఏ విధంగా తీర్చిదిద్దుతాయో స్పష్టంగా తెలియజేస్తుంది. మూస పద్ధతిలో సాగే పాఠశాల లేదా కళాశాల విద్య ఒక స్పష్టమైన, సంస్థాగత రహదారి లాంటిది. కానీ, నైపుణ్య శిక్షణ ఒక వ్యక్తి జీవిత గమనాన్ని మహోన్నత శిఖరాల వైపు నడిపించేందుకు స్వచ్ఛందంగా ఎంచుకునే సాధికారిత మార్గం. ఈ  ఏడాది ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవ (జులై 15) ఇతివృత్తం ‘ఉమ్మడి భవిష్యత్తుకు నైపుణ్యాలు’. స్త్రీపురుష, ప్రాంతీయ, సామాజిక-ఆర్థిక వ్యత్యాసాలను అధిగమించి ప్రతీ యువకుడూ, యువతీ భారత్ ప్రగతి ప్రస్థానంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో భాగస్వాములు కావాలని ఇది పిలుపునిస్తోంది. అయితే, ఈ దిశగా ముందుకెళ్లే క్రమంలో మనం కొన్ని వ్యవస్థాగత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది.

ఏదైనా ఒక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) తరగతి గదిలోకి అడుగుపెడితే, ఈ సవాలు తీవ్రత ఎంత ప్రతికూలంగా ఉందో స్పష్టమవుతుంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఐటీఐలలో చేరిన దాదాపు 45 లక్షల మంది యువతలో మహిళల భాగస్వామ్యం కేవలం 12 శాతం మాత్రమే. భౌతిక ప్రపంచాన్ని నిర్మించే సాంకేతిక నైపుణ్య విభాగాల్లోకి వస్తే ఈ వ్యత్యాసం మరీ దారుణంగా ఉంది. నీతి ఆయోగ్ ఇటీవలి విశ్లేషణ ప్రకారం ఎలక్ట్రీషియన్ విభాగంలో మహిళల నమోదు 4.8 శాతం కాగా, వెల్డర్ విభాగంలో 3.5 శాతం, మోటార్ వాహనాల మెకానిక్ కోర్సుల్లో కేవలం 2.7 శాతంగా నమోదైంది. స్థూల ఆర్థిక రంగంలో కార్మిక శక్తి గణాంకాలు కూడా తీవ్ర అసమానతను ప్రతిబింబిస్తున్నాయి. తాజా కార్మిక శక్తి సర్వే సమాచారం ప్రకారం మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 40 శాతంగా ఉంది. మూడేళ్ల క్రితం ఉన్న 33.9 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన పురోగతి అయినా నైపుణ్యాలు లేదా ఆకాంక్షల లేమి వల్ల కాక కేవలం వ్యవస్థాగత అడ్డంకుల వల్లే మహిళల్లోని అపారమైన సామర్థ్యం నేటికీ వినియోగంలోకి రావడం లేదని స్పష్టమవుతోంది. అధ్యయనాల ప్రకారం మహిళల భాగస్వామ్య రేటును 54 శాతానికి పెంచగలిగితే, భారత్ తన జీడీపీకి ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని జోడించడంతో పాటు సమ్మిళిత వృద్ధిని సాధించగలదు.

వయోభారంతో కుంగిపోతున్న  ప్రపంచ దేశాల మధ్య అత్యంత పిన్న వయస్కులైన జనాభా కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. ఈ తరుణంలో ఇటువంటి అసమానతలను సరిదిద్దడం కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు, అత్యవసర ఆర్థిక వ్యూహం కూడా. పాశ్చాత్య దేశాలలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రమవుతోంది. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)తో పాటు నూతన అంతర్జాతీయ చలనశీలత (మొబిలిటీ) భాగస్వామ్యాలు మన నైపుణ్య కార్మికులకు అంతర్జాతీయ మార్కెట్లలో అధికారికమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే మన మొత్తం శ్రామిక శక్తిలో కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే వినియోగించుకుంటూ భారత్ ఈ అంతర్జాతీయ అవకాశాలను సంపూర్ణంగా చేజిక్కించుకోలేదు. నవభారత్ ఆకాంక్ష నెరవేరాలంటే మహిళలను కేవలం జీవనోపాధి పొందే స్థాయి నుంచి ఆర్థిక సాధికారత, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే స్థాయికి తీసుకెళ్లే దిశగా మార్పు రావాలి. దశాబ్దాలుగా మహిళల నైపుణ్య శిక్షణ జౌళి, సౌందర్య పోషణ, ఆరోగ్య సంరక్షణ వంటి గృహ వాతావరణానికి సరిపోయే సాంప్రదాయ రంగాలకే పరిమితమైంది. ఈ రంగాలు ఇప్పటికీ ఆర్థికంగా నిలకడైనవే అయినప్పటికీ, నేటి ఆధునిక పారిశ్రామిక రంగం ఆటోమేషన్, కృత్రిమ మేధ (ఏఐ), విద్యుత్ వాహనాలు, హరిత ఇంధన విప్లవం ద్వారా శరవేగంగా రూపాంతరం చెందుతోంది. వ్యవస్థాగత వ్యత్యాసాలను అధిగమించడానికి సమూలమైన సంస్కరణలు అవసరమని నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ స్పష్టంగా గుర్తించింది. 

‘అభివృద్ధి కాంక్షించే జిల్లాల్లోని’  యుక్తవయసు బాలికలకు డ్రోన్ అసెంబ్లింగ్, సైబర్ భద్రత, గ్రీన్ (స్వచ్ఛ ఇంధన) సాంకేతికత వంటి రంగాల్లో ప్రత్యక్ష శిక్షణనిచ్చే ‘నవ్య’  వంటి కార్యక్రమాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఉపాధికి సంబంధించి  మౌలిక వసతులు కల్పిస్తే మహిళల నుంచి అపారమైన స్పందన వస్తుందని ఇది నిరూపించింది. అలాగే ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0’ కింద సర్టిఫికెట్ పొందిన అభ్యర్థుల్లో మహిళలు 56 శాతానికి పైగా ఉండటం సాంకేతిక నైపుణ్య సాధనలో వారి ఆకాంక్షలు ఎంతటి ఉన్నతమైనవో స్పష్టం చేస్తోంది. ఉపాధికి దూరంగా ఉన్న మహిళల్లో 44.4 శాతం మంది కుటుంబ సంరక్షణ బాధ్యతల వల్లే ఇంట్లోనే ఉంటున్నామని చెబుతున్నారు. అందుకే సురక్షితమైన రవాణా, శిశు సంరక్షణకు సంస్థాగతంగా వసతులు, సురక్షితమైన పని వాతావరణంతో కూడిన లింగ-సమ్మిళిత అప్రెంటిస్‌షిప్ వ్యవస్థను మనం నిర్మించాల్సి ఉంది. తాత్కాలిక విరామం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశానికి నిర్మాణాత్మక మద్దతు లభించాలి. రిఫ్రెషర్ శిక్షణ, రీ-ఎంట్రీ కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మహిళలు తీసుకునే తాత్కాలిక విరామం వారి కెరీర్‌కు శాశ్వత ముగింపు కాకుండా మనం నిరోధించవచ్చు. గణాంకాలు వల్లెవేయడం సులభం, కానీ వాటి వెనుక ఉన్న కష్టాన్ని గ్రహించడం కష్టం. ఆ గణాంకాలకు ఒక వాస్తవ దృష్టాంతం తోడైనప్పుడే పరిస్థితి అర్ధమవుతుంది.  పూనమ్ కుమారి ప్రయాణం అటువంటిదే. జార్ఖండ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి మలేషియాలో నైపుణ్య శిక్షణ పొందే వరకు ఆమె సాగించిన ప్రయాణం సులువుగా ఏమీ సాగలేదు, కానీ అది సాధించిన ఫలితం ఎంతో విలువైనది. జులై 5న, గుజరాత్‌లోని సనంద్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సెమీకండక్టర్ ఫ్యాక్టరీలో ఆమె నిర్వహిస్తున్న ఉత్పత్తి విభాగాన్ని పూనమ్ కుమారి స్వయంగా ప్రధాన మంత్రికి వివరించారు. మన ప్రణాళికలు ఆచరణలో విజయం సాధిస్తాయనడానికి ఆమె జీవితమే సజీవ సాక్ష్యం. ఇప్పుడు పూనమ్ కుమారి లాంటి మహిళల విజయం అరుదైనదిగా కాకుండా, ప్రతీ ఒక్కరికీ సాధారణ విషయంగా మారడమే మన ముందున్న అసలైన లక్ష్యం.

నైపుణ్యాభివృద్ధి అంతిమ లక్ష్యం కేవలం తక్షణ, తాత్కాలిక  ఉద్యోగం లేదా ఉపాధి కల్పన మాత్రమే కాదు; నిరంతర అభ్యసన శీలతను అలవర్చడం కూడా అని మనం గుర్తించాలి. నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం, నవీకరించుకోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడాన్ని నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థ డిమాండ్ చేస్తోంది. నేడు శ్రామిక శక్తిలోకి ప్రవేశించే యువత వేగంగా మారే నైపుణ్యాలకు అలవాటు పడాలి, అదే సమయంలో 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి కూడా డిజిటల్ బ్యాంకింగ్, ఏఐ వంటి నూతన సాంకేతికతలలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది. మనుషుల జీవితమంతా ఒక నిరంతర సూత్రంగా నైపుణ్యం ముడిపడి ఉంది. ఈ అవిచ్ఛిన్న అభ్యాస ప్రక్రియను స్వీకరించి, ప్రతీ ఒక్కరినీ ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా ఏ ఒక్కరూ వెనుకబడిపోకుండా చూసుకోవచ్చు. తద్వారా ఉమ్మడి భవిష్యత్తు అనే వాగ్దానాన్ని మన నిత్య జీవిత వాస్తవంగా మలచుకోవచ్చు.

జయంత్ చౌదరి,
కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి