దివ్యాంగులకు మోదీ వరం: పెరిగిన పెన్షన్.. తగ్గిన వైకల్యం
దేశంలోని పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించి, ‘ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన’గా 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు రూ.53,428 కోట్ల వ్యయంతో కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పథకం అండగా నిలుస్తుంది. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడం, సహాయ మొత్తాన్ని పెంచడం, మరింత మందిని పథకం పరిధిలోకి తీసుకురావడం.. సామాజిక భద్రతను విస్తరించే దిశగా మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం. దీంతో ప్రస్తుతం 3 కోట్లున్న వివిధ సామాజిక పథకాల లబ్ధిదారుల సంఖ్య.. ఇప్పుడు 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు పెరగనుంది.
దివ్యాంగుల హక్కుల చట్టం-2016కు అనుగుణంగా పెన్షన్ అర్హతలను విస్తరించారు. ఇప్పటివరకు కనీసం 80 శాతం వైకల్యం ఉన్నవారికి వర్తించిన పెన్షన్‌ను, ఇకపై 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి కూడా వర్తించేలా మార్పులు జరిగాయి. దీంతో పాటు దివ్యాంగుల పెన్షన్ 25 శాతం పెంచారు. పెన్షన్ కోసం 18 ఏళ్లు వచ్చే వరకు వేచి ఉండాల్సిన నిబంధనను తొలగించారు. పుట్టినప్పటి నుంచే సహాయం అందించేలా మార్పు తీసుకొచ్చారు. చిన్నారికి 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సహాయం తల్లిదండ్రుల ద్వారా అందుతుంది. వచ్చే మూడు నెలల్లో దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించిన కొత్త అర్హతలు, పెరిగిన లబ్ధిదారుల పరిమితి, పెంచిన సహాయ మొత్తాలను అమల్లోకి తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. ప్రస్తుతం 8.33గా ఉన్న దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 27.48 లక్షలకు పెరగనుంది. అంటే దాదాపు 3.3 రెట్లు. దీనివల్ల ప్రస్తుతం రూ.290 కోట్ల వార్షిక వ్యయం అవుతుండగా ఇకపై ఇది రూ.1,268 కోట్లకు పెరగనుంది.
నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) పేరును ‘ప్రధానమంత్రి సామాజిక్ సహాయతా యోజన’గా.. జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకాన్ని ‘ప్రధానమంత్రి విధవస్త పెన్షన్ యోజన’గా జాతీయ వితంతు పెన్షన్ పథకాన్ని ‘ప్రధానమంత్రి విధవా పెన్షన్ యోజన’గా, జాతీయ దివ్యాంగుల పెన్షన్ పథకాన్ని.. ‘ప్రధానమంత్రి దివ్యాంగ్జన్ పెన్షన్ యోజన’గా జాతీయ కుటుంబ సహాయ పథకం (NFBS)ను ‘ప్రధానమంత్రి పరివార్ లాభ్ యోజన’ గా మార్చడంపైనా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, కుటుంబ సహాయ పథకాల పేర్లు మారినప్పటికీ, వాటి అర్హతలు, కేంద్ర సహాయ మొత్తాలు, లబ్ధిదారుల పరిమితుల్లో మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వం అందించే సహాయానికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత నిధులతో అందించే వేరుగా ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.10,685.60 కోట్ల చొప్పున మొత్తం రూ.53,428 కోట్లను వచ్చే ఐదేళ్లలో ఈ అంశాలపై ఖర్చుచేయనున్నారు. తెలంగాణలోనూ ప్రస్తుతం కేంద్రప్రభుత్వ సామాజిక భద్రత పథకాల లబ్ధిదారుల సంఖ్య 7.28 లక్షలు కాగా.. తాజా మార్పులతో ఇది మరింతగా పెరగనుంది. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా. రూ.2,132 కోట్లను ఆయా పథకాల లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా బదిలీ చేసింది.

