Bhupendra Yadav

గెలిస్తే వారి గొప్ప, ఓడితే ఈవీఎంలు, ‘సర్’పై నిందలా?

Bhupendra Yadavకేంద్ర మంత్రి, బిజెపి సీనియర్‌ నాయకుడు భూపేందర్‌ యాదవ్‌ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడం వెనుక ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సరిదిద్దాలన్న ఉద్దేశం లేదని, భారత ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరచడమే ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకు ఓటమి పాలైందన్న అంశంతో పాటు పలు రాజకీయ పరిణామాలపై ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

ప్ర: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) నిర్వహణలో ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలపై ప్రభుత్వ స్పందన ఏమిటి?

జ: వరుసగా వివిధ రాష్ట్రాల్లో పరాజయాలు ఎదురవుతుండటంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. తాను ప్రవేశపెట్టిన ఈవీఎంలపైనే కాంగ్రెస్‌కు విశ్వాసం లేదు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే పార్లమెంటును, సుప్రీంకోర్టును కూడా విశ్వసించదు. ఎన్నికల ఫలితాలు నచ్చకపోతే ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుపడుతోంది. అయితే, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చెల్లనిదిగా నిరూపించడంలో కాంగ్రెస్‌ ఇప్పటివరకు విజయవంతం కాలేదు. కేరళలో కాంగ్రెస్‌ గెలిచింది. తమిళనాడులో విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు మద్దతు తెలిపింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అంతటి తప్పులు ఉంటే, ఆ ప్రక్రియ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎలా గెలిచిందో వివరించాలి. ప్రక్రియలో లోపాలున్నాయని చెబుతున్నప్పుడు, దాని ద్వారా వచ్చిన ఫలితాలను, విజయాలను ఎలా అంగీకరిస్తారు? గెలిస్తే ఫలితాలను స్వాగతిస్తారు. ఓడిపోతే మాత్రం ఎన్నికల సంఘాన్ని, బిజెపిని నిందిస్తారు.

ప్ర: ఎస్‌ఐఆర్‌ నిర్వహణ తీరుపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి కదా?

జ: వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థిస్తూ, దాని చట్టబద్ధతను ఉద్ఘాటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ప్రక్రియ తొలిసారిగా జరుగుతున్నది కాదు. 1951 నుంచి 2004 మధ్య ఎనిమిదిసార్లు ఎస్‌ఐఆర్‌ నిర్వహించారు. 2025లో ప్రారంభమైన ప్రస్తుత ప్రక్రియ తొమ్మిదోది. ఈ ఎనిమిది పర్యాయాల్లోనూ, అలాగే ప్రస్తుత ప్రక్రియలో కొంత భాగం కూడా వారి పాలనా కాలంలోనే జరిగింది. ఓటర్ల నమోదు నిబంధనల్లోని రూల్‌ 25(2) ప్రకారం, ఎస్‌ఐఆర్‌ సమయంలో ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించాలి. జాబితాలోని తప్పులను సరిదిద్దడం, ఓటర్ల వివరాలను నవీకరించడం దీని ప్రధాన ఉద్దేశం. కాంగ్రెస్‌ వైఖరి ఏమిటంటే, ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోకుండా వెళ్లిపోవడం. ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు సంతకంతో కూడిన అఫిడవిట్‌ సమర్పించాలని ఎన్నికల సంఘం కోరింది. కానీ రాహుల్‌ గాంధీగానీ, కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లుగానీ అఫిడవిట్‌ దాఖలు చేయలేదు. ఆధారాలు సమర్పించాలని రాష్ట్రపతి కూడా కోరారు. అయినప్పటికీ, ఇప్పటివరకు వారు ఆధారాలు ఇవ్వలేదు. కాంగ్రెస్‌లోని వారసత్వ రాజకీయ నాయకులు తమకే అధికారం చేపట్టే హక్కు ఉందని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేకపోతున్నందున, సంస్థల ప్రతిష్ఠను దిగజార్చి, ప్రభుత్వ మార్పు కోసం ప్రజలను వీధుల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే, భారత ప్రజాస్వామ్యం చాలా బలమైనది. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలకు ప్రజలు బలయ్యేంత అమాయకులు కాదు.

ప్ర: పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ఎన్నికల బాధ్యతలు మీరు నిర్వహించారు. తొలిసారిగా అక్కడ బిజెపి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే, రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని, దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయని ఆరోపణలున్నాయి. ఈ ప్రక్రియను హడావుడిగా, పారదర్శకత లేకుండా నిర్వహించారని, మైనారిటీలు, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి?

జ: ఓటర్ల జాబితాల్లో లోపాలున్నాయంటూ ఎస్‌ఐఆర్‌ నిర్వహించాలని కోరింది ప్రతిపక్షాల ఇండియా కూటమి. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ప్రక్రియను ప్రారంభించింది. కొన్ని రాష్ట్రాల్లో వారు గెలిచారు. చాలా రాష్ట్రాల్లో మేం విజయం సాధించాం. ఈ ఫలితాలను జీర్ణించుకోలేకే అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. తొలుత ఈవీఎంలను తప్పుబట్టారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ నిర్వహించగా, సుప్రీంకోర్టు పర్యవేక్షించింది. అత్యధిక సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించిన 13 నియోజకవర్గాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)నే గెలిచింది. మమతా బెనర్జీ ఓటమికి ప్రధాన కారణం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. సుపరిపాలన అందించగలరన్న నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడింది.

ప్ర: వివరాల్లో తేడాలు ఉన్నాయంటూ ఎన్నికల సంఘం గుర్తించిన కారణంగా ఓటు వేయడానికి అనుమతి పొందలేకపోయిన ఓటర్ల పరిస్థితి ఏమిటి?

జ: ఎస్‌ఐఆర్‌ సమయంలో ఎన్నికల సంఘం తొలుత ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది. జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగిస్తే, వారికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. మరణం, వలస వెళ్లడం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు కావడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి కారణాలతో పేర్లు తొలగిస్తారు. ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైనవారు దాఖలు చేసిన అప్పీళ్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. సంబంధిత పత్రాలను సమర్పించేందుకు బాధితులు ముందుకొస్తే, ఎన్నికల సంఘం అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌పై ఆర్థికవేత్త సుర్జిత్‌ భల్లా చేసిన విశ్లేషణ ప్రకారం, 2004 ఓటర్ల జాబితాలో అంచనా వేసిన వయోజన జనాభా కంటే 2.8 కోట్ల పేర్లు అధికంగా ఉన్నాయి. ఇది 4.4 శాతం అదనపు నమోదుకు సమానం. 2014లోనూ ఓటర్ల జాబితాలో వయోజన జనాభా కంటే 3.1 శాతం ఎక్కువ పేర్లు ఉన్నాయి. అయినప్పటికీ, మేం ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆరోపించలేదు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించలేదు.

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో టీఎంసీ బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించింది. ప్రభుత్వ యంత్రాంగం కూడా వారి చేతుల్లోనే ఉంది. అయినా వారు ఫిర్యాదులు చేయడం ఏమిటి? ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. తమకు అనుకూలంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకున్నారు. బలప్రయోగానికీ పాల్పడ్డారు. అయినప్పటికీ ఓడిపోవడంతో ఎన్నికల సంఘాన్ని, ఎస్‌ఐఆర్‌ను నిందిస్తున్నారు. ఓటర్ల జాబితాల నుంచి మైనారిటీలను మాత్రమే తొలగించారనడం సరికాదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల ప్రకారం రక్షణ పొందాల్సిన అనేక మంది హిందువుల పేర్లు కూడా మమతా బెనర్జీ నిర్లక్ష్యం కారణంగా జాబితాలో లేకుండా పోయాయి. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు వేసే అవకాశం ఉండాలన్నదే బిజెపి అభిప్రాయం. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం ఎన్నికల సంఘం బాధ్యత. మన రాజ్యాంగ సంస్థలు తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించేలా వాటిని బలోపేతం చేయాలి. తమకు నచ్చిన ఫలితాలు రాలేదని వాటి విశ్వసనీయతను దెబ్బతీయడం సరికాదు.

ప్ర: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమికి ప్రధాన కారణాలేమిటి?

జ: మమతా బెనర్జీ అహంకారం, ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, సామాజిక అశాంతి, బుజ్జగింపు రాజకీయాలు ఆమె ఓటమికి కారణమయ్యాయి. దుష్పరిపాలన కారణంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే, కల్పిత కారణాలను చూపిస్తూ తప్పించుకోలేరు. ముఖ్యంగా రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేయకూడదు.

ప్ర: మరో విడత అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బిజెపికి కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఓటు చోరీ, అయోధ్యలో విరాళాల చోరీ, ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయమేమిటి?

జ: బిజెపి క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పనిచేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆదేశాల మేరకు సంస్థాగత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మెరుగుపడిన శాంతిభద్రతల పరిస్థితి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విశ్వసనీయత, ప్రధాని మోదీ నాయకత్వం ప్రజలందరికీ కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన రాజకీయ కథనాన్ని సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ప్రభావం చూపడం లేదు. గత 12 ఏళ్లలో పాలన ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఎలా మారిందన్నదే ముఖ్యం. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఛత్తీస్‌గఢ్‌లో జేఎంఎం వంటి పార్టీలు సామాజిక సంక్షేమ పథకాలను ప్రకటించినప్పటికీ, అవినీతి కారణంగా వాటి ప్రయోజనాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరలేదు. మరోవైపు, పేదల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకాలను అమలు చేయడంలో ఎన్డీయే విజయవంతమైంది. గత 12 ఏళ్లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక విధానాలను ప్రకటించడమే కాకుండా సమర్థంగా అమలు చేసింది. రెండో విడత పాలనలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు, దివాలా పరిష్కార చట్టం, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి కీలక సంస్కరణలను చట్టపరమైన చర్యల ద్వారా ముందుకు తీసుకెళ్లింది. మూడో విడత పాలనలో సంస్కరణల వేగాన్ని మరింత పెంచింది. ప్రధాని మోదీ దీనిని ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌’గా అభివర్ణించారు. ప్రస్తుతం భారత రాజకీయాల్లో పాలన, సంస్కరణలే కీలక అంశాలుగా మారాయి. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే.