Apoha

ఎస్ఐఆర్: అపోహలు – వాస్తవాలు

అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో స్థానం కల్పించడం, అదే సమయంలో మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, డూప్లికేట్ నమోదులు, విదేశీయులు, ఇతర అనర్హమైన ఎంట్రీలను చట్టబద్ధమైన విధానాల ద్వారా తొలగించడం ఎస్ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రధాన లక్ష్యం. అయితే, ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసి మరింత పారదర్శకంగా, కచ్చితంగా రూపొందించే ప్రక్రియను ఓటు హక్కుల తొలగింపుగా కొన్ని రాజకీయ శక్తులు చిత్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్‌ పై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, వాస్తవాలను సరళంగా తెలుసుకుందాం.

ప్రశ్న:ఎస్ఐఆర్‌లో 13 కోట్ల మంది ఓట్లు తొలగించారా?

జవాబు: లేదు. ఎస్ఐఆర్‌లో 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని చెప్పడం పూర్తిగా తప్పు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదట ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేస్తారు. ఈ ముసాయిదా జాబితాలో సుమారు 13 కోట్ల మంది ఓటర్లను గైర్హాజరు, బదిలీ అయిన, మరణించిన, నకిలీ (ASDD) గా గుర్తించారు. వీరిలో సుమారు 2.8 కోట్ల మంది చనిపోయారు, 3 కోట్ల మంది గైర్హాజరు/గుర్తించనివారు, 6.3 కోట్ల మంది శాశ్వతంగా బదిలీ అయ్యారు. సుమారు 1 కోటి మంది ఎక్కువ ప్రదేశాలలో నమోదు చేసుకున్నారు. అంటే నకిలీ అన్నమాట. ఈ ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు, సుమారు 20 లక్షల అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) అందచేస్తారు, తద్వారా వారు ఈ ఎంట్రీలను ధృవీకరించవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఓటరుకు క్లెయింలు, అభ్యంతరాలను దాఖలు చేసే హక్కు ఉంటుంది. కాబట్టి, ముసాయిదా జాబితాలో ఒక పేరును గుర్తించడం, తుది ఓటర్ల జాబితా నుండి తొలగించడం రెండు వేర్వేరు విషయాలు. ఎస్ఐఆర్ లక్ష్యం అర్హులైన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో చేర్చడం, ఓటర్ల జాబితా నుండి లోపాలను తొలగించడం, కానీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించడం కాదు.

ప్రశ్న2: ఫారం6లో మార్పులు చేశారా? 

జవాబు : ఫారం6లో ఎటువంటి మార్పు చేయలేదు. ఎస్ఐఆర్ సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ఉత్తర్వును జారీ చేసింది. దీనికి డిక్లరేషన్ ఫారం కూడా ఉంది. ఓటర్ల సౌలభ్యం కోసం ఫారం 6, డిక్లరేషన్ ఫారంను జతచేశారు. తద్వారా వారు వేర్వేరు ప్రక్రియల ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు. ఓటీపీ ప్రక్రియను రెండుసార్లు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓటర్లకు సులభం కావడానికే. 27 మే 2026న సుప్రీంకోర్టు ఈ ఎస్ఐఆర్ ఉత్తర్వు చెల్లుబాటును సమర్థించింది. 

ప్రశ్న3: ఓటర్ల జాబితా డేటాబేస్ ను కేంద్రీకృతం చేశారా? 

జవాబు: పూర్తిగా తప్పు. ఓటర్ల జాబితా డేటాబేస్ గతంలోనే వికేంద్రీకృతమైంది, నేటికీ వికేంద్రీకృతంగానే ఉంది. ఓటర్ల జాబితాను సీఈవో పర్యవేక్షణలో ప్రతి రాష్ట్ర ఈఆర్ఓ తయారు చేసి నిర్వహిస్తారు. అందుకే దాని వ్యవస్థ మొదటి నుండి వికేంద్రీకృతమై ఉంది. ఓటర్ల జాబితా డేటాబేస్ ఎప్పుడూ ECINET ERONET మాడ్యూల్ కింద కేంద్రీకృతం చేయలేదనేది వాస్తవం. ప్రతి రాష్ట్రం ఓటర్ల జాబితా డేటాబేస్ ఇప్పటికీ గతంలో మాదిరిగానే వికేంద్రీకృతంగా ఉంది. ఈఆర్ఓల అన్ని చట్టబద్ధమైన, విధానపరమైన అధికారాలు గతంలో మాదిరిగానే ఉన్నాయి. వ్యవస్థ డిజిటలైజేషన్ గా మారింది, కానీ చట్టబద్ధమైన అధికారం, ఓటర్ల జాబితా వికేంద్రీకృత నిర్మాణంలో ఎటువంటి మార్పు లేదు.

ప్రశ్న4: జెన్ జీ ఓట్లను జోడించడంలో ఏదైనా సమస్య ఉందా?

జవాబు: అస్సలు లేదు. వాస్తవానికి ఈ ప్రక్రియ గతం కంటే సులభతరమైంది. 18 ఏళ్లు నిండిన లేదా నిండబోయే యువతీ యువకులు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల ఆధారంగా ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవచ్చు. అర్హత కలిగిన ఓటరు ఎస్ఎస్ఆర్ లేదా ఎస్ఐఆర్ వంటి సవరణల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఫారం 6 నింపడం ద్వారా ఎప్పుడైనా తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చుకోవచ్చు. 24 జూన్ 2025 నుండి అంటే ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుండి సుమారు 2.37 కోట్ల మంది కొత్త జెన్ జీ ఓటర్లు (18-28 సంవత్సరాల వయస్సు) ఇప్పటికే ఓటర్ల జాబితాలో నమోదయ్యారు. వారు ఇంకా చేరుతున్నారు. ఎన్నికల సంఘం జెన్ జీ ఓటర్ల కోసం నిరంతరం ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ల (ELCs) ద్వారా ప్రత్యేక శిబిరాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తద్వారా యువ ఓటర్లు సులభంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చే ప్రక్రియ అందుబాటులోనే ఉంది, సులభతరమైంది. ఓటర్ల జాబితాలో 18-28 సంవత్సరాల వయస్సు గలవారు మొత్తం 17.38 కోట్ల మంది ఉన్నారు. ప్రతి నెలా 16 లక్షల మంది ఓటరు జాబితాలో చేర్చుకుంటున్నారు. అంటే ప్రతి రోజూ 50 వేలకు పైగా ఓటర్లు చేరుతున్నారు.

ప్రశ్న5: ఈసీఐలో రిగ్గింగ్ జరిగిందా? ఎన్నికల కమిషనర్లు ఇద్దరినీ దాటవేసి సీఈసీ ఒంటరిగా ఈసీఐ నిర్ణయాలు తీసుకున్నారా?

జవాబు: ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే కథనం. భారత ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్. ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం, 2023లోని సెక్షన్ 18(1) ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య పని కేటాయింపు విధానాన్ని కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయించవచ్చు. దీని ప్రకారం, ఈసీఐ పేరిట జారీ చేసే లేఖలు, ఉత్తర్వులు ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్, అలాగే కమిషన్ నిర్ణయించిన అధికారాల మేరకు జారీ అవుతాయి. కమిషన్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారులు ఆ నిర్ణయాలను వెల్లడించి, అమలు చేస్తారు. కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంది అంటే ముగ్గురు కమిషనర్ల ఆమోదం ఉన్నట్టే. నిర్ణయం తీసుకునే దశలో కమిషనర్లు ప్రశ్నలు, పరిశీలనలు లేదా సూచనలు ఇవ్వడం అసాధారణమేమీ కాదు. ఇది ఏదైనా సంస్థ సాధారణ చర్చ, పరిపాలనా ప్రక్రియలో భాగం. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడం దీని లక్ష్యం. ప్రతి పరిశీలనను “అసమ్మతి” అని అనడం, ప్రతి ముసాయిదా దశ ప్రశ్నను “నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళడం” అని అనడం సరైనది కాదు. తుది నిర్ణయం, దాని ముందు చర్చ.. రెండూ వేర్వేరు విషయాలు. చట్టపరమైన, విధానపరమైన నిబంధనలకు అనుగుణంగా ఈసీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. కమిషనర్లు, కమిషన్ అధికారులు ఇచ్చిన సూచనలు, పరిశీలనలు నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భాగం. వాటిని తమలో తాము “రిగ్గింగ్” అని పిలవడం లేదా సీఈసీ ఇతర కమిషనర్లను పట్టించుకోలేదని చెప్పడం పూర్తిగా తప్పు. ప్రజలను గందరగోళానికి గురిచేసే పుకార్లను వ్యాప్తి చేయడానికి ఇదొక విఫల యత్నం మాత్రమే.

ప్రశ్న6: “ఓటు చోరి”కి ఎస్ఐఆర్ మార్గమా? బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బిజెపి “ఓటు చోరీ” ద్వారా గెలిచిందా?

జవాబు: “ఓట్ చోరి” అనేది ఎక్కడా లేదు. ఇది తప్పుడు కథనాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించే టూల్ కిట్ పదం. దీనిని అర్థం చేసుకోవాలంటే ఓటర్ల జాబితా తయారీ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవాలి. ఓటర్ల జాబితాను తయారు చేసే ప్రక్రియలో బీఎల్ఓలు క్షేత్రస్థాయి/ఇంటింటి ధృవీకరణను నిర్వహిస్తారు. దీంతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 20 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా ఓటర్ల జాబితా ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తారు. వారు ఆడిటర్ పాత్రను పోషిస్తారు. ముసాయిదా దశలో ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు, గైర్హాజరైన, బదిలీ అయిన, చనిపోయిన, డూప్లికేట్ (ASDD) మార్క్ చేసిన జాబితాలు కూడా రాజకీయ పార్టీలకు, వారి బీఎల్ఏలకు అందుబాటులో ఉంటాయి. వారు వాటిని సొంతంగా ధృవీకరించవచ్చు. ఈ సమాచారం బహిరంగంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. క్లెయింలు, అభ్యంతరాల ప్రక్రియలో అర్హత కలిగిన ఏ ఓటరు అయినా ముసాయిదా జాబితా ఎంట్రీలపై క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేయవచ్చు. ఈ ప్రక్రియలన్నింటి తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రచురితమవుతుంది.

ఈ విషయం ఇక్కడితో ముగియదు. ఈఆర్ఓ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే నిబంధన కూడా ఉంది. ఏకపక్షంగా ఏ ఒక్కరి పేరును తొలగించలేం. ఓటర్ల జాబితా నుండి తొలగింపు నిర్ణీత చట్టపరమైన ప్రక్రియలో జరుగుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం, ధృవీకరణ, నిర్ణీత విధానం ఆధారంగా ఈఆర్ఓ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఓటర్ల జాబితా ప్రక్రియలో ఒకవైపు బీఎల్ఓలు క్షేత్రస్థాయి ధృవీకరణ చేస్తుండగా, మరోవైపు దాదాపు 20 లక్షల మంది రాజకీయ పార్టీల బీఎల్ఏలు ఏకకాలంలో పరిశీలన చేస్తారు. ఇంకా క్లెయింలు, అభ్యంతరాలు, అప్పీళ్ల వ్యవస్థ కూడా ఉంది. ఇంత విస్తృత ధృవీకరణ, ఏకకాలిక ఆడిటింగ్ వ్యవస్థలు ఉన్నప్పుడు, “ఓటు చోరి” ఎలా జరుగుతుంది?

పోలింగ్ రోజు కూడా అభ్యర్థుల రాజకీయ ఏజెంట్ల పరిశీలన కొనసాగుతుంది. అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ స్టేషన్ వద్ద ఉండి పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తారు. ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ అంగీకారంతో చేపడుతున్న 100% పోలింగ్ స్టేషన్ల వెబ్ కాస్టింగ్ పోలింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేస్తుంది. బీహార్, పశ్చిమ బెంగాల్ లో స్వతంత్ర్య భారతంలో తొలిసారి అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది, అత్యధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు హాజరై కౌంటింగ్ ప్రక్రియను గమనిస్తారు. అంటే, ఓటర్ల జాబితా → ధృవీకరణ → క్లెయింలు, అభ్యంతరాలు → తుది జాబితా → పోలింగ్ → లెక్కింపు – ప్రతి ముఖ్యమైన దశలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు హాజరై పరిశీలన చేస్తారు. ఓటర్ల జాబితాను తయారు చేయడం నాలుగ్గోడల మధ్య జరిగే ప్రక్రియ కాదన్నది సుస్పష్టం. అందులో ఏకకాలంలో బీఎల్ఓలచే ఫీల్డ్ వెరిఫికేషన్, సుమారు 20 లక్షల బిఎల్ఏల ద్వారా పరిశీలన ఉంది, ప్రతి దశలో రక్షణలు ఉన్నాయి. భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విస్తృతంగా పరిశీలించే ప్రజాస్వామ్య ప్రక్రియలలో ఒకటి. దీనిని అర్థం చేసుకోవాలంటే మొత్తం ప్రక్రియను చూడాలి.

ప్రశ్న 7: ‘ఓటు చోరీ’ కోసమే బిజెపి సీఈసీ సెలక్షన్ ప్యానెల్ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారా?

జవాబు: ఈ ఆరోపణ పూర్తిగా అబద్ధం, నిరాధారం. 2023 చట్టానికి ముందు కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించారు. దీనికి సంబంధించి ఎటువంటి చట్టం అందుబాటులో లేదు. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి చట్టం ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తితో కమిటీ ఏర్పాటు చేయడానికి తాత్కాలిక నిబంధన రూపొందించారు. కొద్ది నెలల్లోనే పార్లమెంటు ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిలో ప్రధానమంత్రి, ప్రధాన మంత్రి నియమించిన ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడితో కూడిన కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. గత ప్రక్రియతో పోలిస్తే ఇది మెరుగైన, కమిటీ ఆధారిత ప్రక్రియ. ఇంతకుముందు ప్రభుత్వం ఇష్టప్రకారం మాత్రమే నియామకం జరిగింది; ఇప్పుడు ఒక కమిటీ ఉంది, అందులో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిని కూడా చేర్చారు. ఇది మెరుగైన వ్యవస్థ.

ప్రశ్న8: ECINET యాప్ వినియోగంపై ఫీల్డ్ అధికారులకు ఆంక్షలు విధించారా? 

జవాబు: అస్సలు లేదు. నిజం ఏమిటంటే చట్టబద్ధమైన అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు దీనిని యాక్సెస్ చేసేందుకు ఎటువంటి పరిమితి విధించలేదు. అలా చేస్తే అది వారి చట్టబద్ధమైన విధుల నిర్వహణకు అడ్డంకి అవుతుంది. ఎస్ఐఆర్ ప్రకటించినప్పటి నుండి ECINET, దాని వివిధ మాడ్యూల్స్ పై ఫీల్డ్ ఆఫీసర్లకు దాదాపు 110 శిక్షణా సెషన్లు నిర్వహించారు, ఈ శిక్షణ ఇంకా కొనసాగుతోంది. ఈ సెషన్లలో ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు, డీఈఓలు, సీఈఓలు పాల్గొన్నారు. ఈ శిక్షణా సెషన్ల సమయంలో ఈ యాప్ యాక్సెస్ చేసేందుకు పరిమితులు ఉన్నాయంటూ వారి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు లేదా ఆందోళన వ్యక్తం కాలేదు.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 కింద ECINET అనేది వికేంద్రీకృత వేదిక. ఈసీఐ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలకు అనుగుణంగా పనిచేస్తుంది. బీఎల్ఓలు, ఏఐఆర్ఓలు, ఈఆర్ఓలు, డిఈఓలు, సీఈఓలు తమ ప్రత్యేక ఐడీ, పాస్వర్డ్ ద్వారా ECINET లో తమ నిర్దేశిత చట్టబద్ధమైన విధులను నిర్వహించవచ్చు. అలాగే, అనధికారిక యాక్సెస్, ట్యాంపరింగ్ లేదా తారుమారు చేయడాన్ని నిరోధించడానికి ECINET లో కఠినమైన డేటా-సెక్యూరిటీ ప్రోటోకాల్స్, ఐటీ సెక్యూరిటీ చెక్స్, ఆడిట్ కంట్రోల్స్ అమలులో ఉన్నాయి. ఇది యాక్సెస్ ను ఆపే వ్యవస్థ కాదు, కానీ డేటా భద్రత, జవాబుదారీతనాన్ని నిర్ధారించేటప్పుడు ఫీల్డ్ ఆఫీసర్లకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించే వ్యవస్థ. తద్వారా వారు తమ చట్టబద్ధమైన బాధ్యతలన్నింటినీ సజావుగా నిర్వర్తించగలరు. “ఫీల్డ్ ఆఫీసర్లు యాక్సెస్ చేయకుండా నిలిపివేశారు” అని చెప్పడం పూర్తిగా తప్పు. క్షేత్రస్థాయి అధికారులు ECINET ప్లాట్ ఫామ్ ద్వారా తమ నిర్దేశిత పాత్రలు మరియు చట్టబద్ధమైన బాధ్యతలను సజావుగా నిర్వర్తిస్తున్నారు. 

ప్రశ్న9: గోవాలో 97 మంది ఓటర్ల విషయంలో మాదిరిగానే ECINET యాప్ / సాఫ్ట్ వేర్ నిజమైన ఓటర్లను తిరస్కరించిందా?

జవాబు: పూర్తిగా తప్పు. ECINET యాప్/సాఫ్ట్ వేర్ ఉద్దేశ్యం అర్హులైన ఓటర్ల నమోదు, చేరికను సులభతరం చేయడం కానీ, ఓటర్లను తిరస్కరించడం కాదు. ఓటరు నమోదు, ఓటర్ల జాబితా నిర్వహణను సులభతరం చేయడం దీని ప్రధాన విధులలో ఒకటి. ECINETలో ఓటరు జాబితా తుది ప్రచురణకు ముందు చట్టం, ఈసీఐ సూచనల ప్రకారం ఓటర్లను జాబితాలో చేర్చడం లేదా తొలగించడం కోసం గుర్తించే వెసులుబాటు ఈఆర్‌ఓలకు (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు) కల్పించారు. 97 గోవా కేసులలో ఈఆర్ఓల వైపు నుండి కొన్ని అనుకోకుండా తప్పులు జరిగాయి. ఇది నిజమైన ఓటర్లను తిరస్కరించిన కేసు కాదు. ఫిబ్రవరి 2026లో ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో చేర్చని ఈ 97 కేసులను విడిగా చేపట్టారు. ఫారం 6 పూర్తి చేయడానికి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లారు. ఈ ఓటర్లలో చాలా మంది ఇప్పుడు ఓటర్ల జాబితాలో నమోదయ్యారు, మిగిలిన కేసులు నిర్ణీత విధానం ప్రకారం ప్రాసెస్ అవుతున్నాయి. నిజమైన ఓటరును ECINET ఎప్పుడూ తిరస్కరించదు. ఇది ఓటర్ల జాబితా నిర్వహణ మరియు ఓటరు నమోదును సులభతరం చేసే సురక్షితమైన డిజిటల్ ప్లాట్ ఫారమ్. నిర్దేశించిన చట్టం, విధానం ప్రకారం ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సహాయపడుతుంది. చట్టాలు, ఎన్నికల నియమాలు, ఈసీఐ సూచనలకు అనుగుణంగానే ECINET యాప్ రూపొందించారు.