Election commission of India

ప్రజాస్వామ్యంలో ‘రిఫరీ’పై దాడులు అన్యాయం

బాంకీపూర్ (బీహార్) ఉపఎన్నికల ఫలితాలతో ఒక ఓటరుగా, ఒక రాజకీయ కార్యకర్తగా తీవ్ర నిరాశకు గురయ్యాను. ఎన్నో ఏళ్లుగా మా పార్టీ ఆధిక్యంలో ఉన్న బాంకీపూర్ నియోజకవర్గం, ఆ ఎన్నికల్లో మాకు పూర్తి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఆ తర్వాతి రోజుల్లో మా పార్టీ వ్యవహరించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నికల సంఘం (ఈసీఐ) పైన గానీ, ఓటర్ల జాబితాపై గానీ, ఈవీఎంల పైన గానీ మా నాయకులు ఎవరూ నిందలు వేయలేదు. ఓటర్లు తమ తీర్పును ప్రకటించారు. ప్రతి రాజకీయ కార్యకర్త కోరుకునే ఫలితాన్ని ఇవ్వడానికి ప్రజాస్వామ్యం హామీ ఇవ్వదు; ఓటరు స్వేచ్ఛగా నిర్ణయించుకునే ఒక ప్రక్రియను మాత్రమే అది అందుబాటులో ఉంచుతుంది.

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిపై కాంగ్రెస్ వరుసగా ప్రశ్నలు గుప్పిస్తున్న ఈ తరుణంలో, నాటి నా అనుభవం మళ్లీ నా మదిలో మెదిలింది. పరిణతి చెందిన ఒక ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో ఎదురయ్యే నిరాశకు, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నించడానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. మొదటిది రాజకీయ పోటీలో సర్వసాధారణమైన పరిణామం కాగా, రెండోది అత్యంత తీవ్రమైన రాజ్యాంగపరమైన ఆరోపణ. దానికి తగిన ఆధారాలు తప్పనిసరి. ప్రస్తుతం ఈసీఐ నిష్పాక్షికతపై కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, ఆ పార్టీ గతాన్ని పరిశీలిస్తే విచిత్రంగా కనిపిస్తాయి. ఎమర్జెన్సీ నాటి అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ జేసీ షా కమిషన్, నాటి దిల్లీ సీనియర్ అధికారి నవీన్ చావ్లా ప్రవర్తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ 2005లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చావ్లాను ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. ఆ తర్వాత 2009లో ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (సీఈసీ) బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎన్నికల కమిషనర్ల పదవీ విరమణానంతర పరిణామాలను పరిశీలించినా వ్యవస్థాగత స్థిరత్వం అవసరం అర్థమవుతుంది. 1996 నుండి 2001 వరకు సీఈసీగా సేవలందించిన ఎం.ఎస్. గిల్ తదనంతర కాలంలో కాంగ్రెస్ తరఫున పార్లమెంటులో అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎన్నికల సంఘం అధికారాల ప్రాముఖ్యతను ప్రజలకు చాటిచెప్పిన టీ.ఎన్. శేషన్ కూడా ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సంఘటనల ఆధారంగా వారు పదవిలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని ప్రత్యక్షంగా నిరూపించలేకపోవచ్చు. అయితే, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిపై చర్చించేటప్పుడు ఈ చరిత్రను విస్మరించడం సాధ్యం కాదు.

ఎమర్జెన్సీ కాలం మనకు మరింత లోతైన పాఠాన్ని నేర్పింది. ఇందిరా గాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసినప్పుడు, నాటి నాయకత్వం ఓటర్ల తీర్పును స్వీకరించడానికి సిద్ధపడలేదు. ఫలితంగా దేశంపై ఎమర్జెన్సీ విరుచుకుపడింది; రాజకీయ ప్రత్యర్థులను జైళ్లలో బంధించారు, పౌర హక్కులను కాలరాశారు, సాధారణ ప్రజాస్వామ్య ప్రక్రియను భగ్నం చేశారు. అలాంటి చరిత్ర కలిగిన ఒక పార్టీ, పౌరులు తమ పరమాధికారాన్ని ఉపయోగించుకునే రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నించేటప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ఎన్నికల సంఘం విమర్శలకు అతీతమైనదని ఇక్కడ ఎవరూ అనడం లేదు. ఓటర్ల జాబితా సవరణలు, ఎన్నికల షెడ్యూల్, ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు, పరిపాలనాపరమైన నిర్ణయాలు ఎప్పుడూ సమీక్షకు లోబడి ఉండాల్సిందే. అటువంటి సమీక్షల కోసం రాజ్యాంగం కొన్ని స్పష్టమైన మార్గాలను నిర్దేశించింది. కమిషన్ ముందు విజ్ఞప్తులు సమర్పించడం, డిజిటల్ లేదా న్యాయ సమీక్ష కోరడం, చట్టబద్ధమైన పరిహారాలను ఆశ్రయించడం. ఈసీఐకి కల్పించిన అత్యున్నత రాజ్యాంగ బాధ్యతను అత్యున్నత న్యాయస్థానం కూడా గుర్తించింది. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌‌ఐఆర్) వివాదం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మే 2026 నాటి తీర్పులో సుప్రీంకోర్టు ఎస్‌ఐఆర్ చట్టబద్ధతను సమర్థించడమే కాకుండా, ఓటర్ల జాబితా విషయంలో ఈసీఐకి ఉన్న రాజ్యాంగ, చట్టబద్ధ అధికారాలను పునరుద్ఘాటించింది. విచారణ సందర్భంగా జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఓటర్ల జాబితాలోని లోపాలను సరిదిద్దడం ఎంత ముఖ్యమో స్పష్టం చేశాయి. ఈ అంశానికి అంతర్జాతీయ కోణం కూడా ఉంది. భారత ఎన్నికల సంఘం కేవలం దేశీయ పరిపాలనా వ్యవస్థకే పరిమితం కాలేదు. ప్రపంచ ఎన్నికల నిర్వహణ సంస్థల కూటమిలో అది కీలక పాత్ర పోషిస్తోంది. ‘ప్రపంచ ఎన్నికల సంఘాల సంఘం’ స్థాపక సభ్యురాలిగానే కాకుండా, పూర్వ అధ్యక్షురాలిగా ప్రపంచవ్యాప్త ఎన్నికల శ్రేణుల్లో భాగస్వామిగా ఉంది. దీని పరిధిలోని ‘భారత ప్రజాస్వామ్య, ఎన్నికల నిర్వహణ సంస్థ’ వందల దేశాల ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చింది. భారత్ నిర్వహించే ఎన్నికల పరిశీలన, పరిశీలకుల శిక్షణ కార్యక్రమాల్లో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందినంత మాత్రాన పొరపాట్లే జరగవని కాదు, కానీ భారత ఎన్నికల నిర్వహణకు బలమైన వ్యవస్థాగత సామర్థ్యం ఉందనడానికి ఇదొక తార్కాణం.

ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రస్తుతం ఉన్న చట్టబద్ధమైన ప్రక్రియలో ప్రతిపక్ష నాయకుడికి అధికారిక భాగస్వామ్యం ఉంది. ‘అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు జోక్యం, ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదించిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం, 2023’ ఆధారంగా ఈ మార్పు వచ్చింది. ఈ చట్టం రూపకల్పనపై చర్చలు జరగవచ్చు, దానిలోని కొన్ని అంశాలు ఇప్పటికీ న్యాయ సమీక్షలో ఉండవచ్చు. అయితే, ఇక్కడ ప్రధాన సూత్రం ముఖ్యం. రాజ్యాంగ వ్యవస్థల నిర్మాణంలో ప్రతిపక్షానికి తగిన స్థానం లభించినప్పుడే వాటి విశ్వసనీయత మరింత పెరుగుతుంది. ఇది కాంగ్రెస్‌ను విమర్శించడం కోసం చెబుతున్నది కాదు, స్వాగతిస్తూ అంటున్న మాట. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు అవ్వండి. ఆధారాలు ఉన్న చోట నిర్ణయాలను సవాలు చేయండి. చట్టబద్ధమైన ఫిర్యాదులను కమిషన్, న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లండి. అంతే తప్ప ప్రతీ ఎన్నికల ఓటమిని ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయతపై వివాదంగా మార్చవద్దు.

మా పార్టీ కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. కొన్ని ఓటములు ఎంతో బాధను మిగిల్చాయి. బాంకీపూర్ కూడా అలాంటిదే. అయితే ఓటమికి స్పందనగా ప్రతీసారి వ్యవస్థలపై నిందలు వేయడం సరికాదు. కొన్నిసార్లు దానికి సమాధానం ఎంతో సరళంగా, అదే సమయంలో ఆత్మపరిశీలన చేసుకునేలా ఉంటుంది: “బహుశా ఓటరు మరొకరిని కోరుకొని ఉండవచ్చు.” ఆ పాఠాన్ని నేను బాంకీపూర్‌లో నేర్చుకున్నాను. మన రాజకీయ వేదికలు కూడా ఆ సత్యాన్ని మళ్లీ గ్రహించాల్సిన అవసరం ఉంది.

గురు ప్రకాష్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి